- స్కైబాబా

ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం గురించి సర్వత్రా చర్చ నెలకొని ఉంది. ముస్లింవాదం అంటే అస్సలు గిట్టనివారు సైతం ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని ఈమధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల బయటే కాక లోపలా కొన్ని ప్రశ్నలూ కొంత అయోమయం నెలకొంది.

ముస్లింవాదం నిలదొక్కుకోవడానికి కృషి చేసినవారి పైనే నిందారోపణలూ నేరారోపణలూ జరుగుతున్నాయి. ముస్లింవాదం గురించి ఇన్నాళ్ళూ ఎక్కడా ఏమీ మాట్లాడని, రాయని, పని చేయని వ్యక్తులు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ‘అలావా’ కవితా సంకలనానికి ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ముందుమాట, అందులోని ఉషా ఎస్. డానీ అభిప్రాయాలు ఇందుకొక నిదర్శనం. అందులో వారి ఆరోపణలూ, అసంబద్ధ తఖ్రీర్‌ల గురించి చర్చించే ముందు ముస్లింవాదం గమనాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం.

ముస్లింవాద సాహిత్యం తొలి నుంచీ అనేక ప్రశ్నల్ని ఎదుర్కొంటూ వస్తున్నది. వాటన్నింటికీ జవాబులు ముస్లింలే కాక ముస్లింవాదానికి మద్దతుగా నిలిచిన ముస్లిమేతరులూ చెబుతూ వచ్చారు. తొలుత ‘పుట్టుమచ్చ’, ‘జీహాద్’ పుస్తకాల తర్వాత వచ్చిన ‘జల్‌జలా’ కవితా సంకలనంతో ‘ముస్లింవాదం’ స్థిరీకరణ ప్రారంభమైంది. అంతర్ బాహిర్ పోరాటాల వ్యక్తీకరణగా వచ్చిన ‘జల్‌జలా’ తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా ఎన్నో చర్చల్ని రేకెత్తించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఫత్వా’ సంకలనం మీద జరగవలసినంత చర్చ జరగలేదు. అయినప్పటికీ ముస్లింవాద రచనల వల్ల, సభలూ సమావేశాల వల్ల ముస్లింల దృక్కోణం నుంచి సమాజాన్ని చూసే చైతన్యాన్ని అందించడంలో ముస్లింవాదం సఫలీకృతం కావడం మొదలైంది. ‘సుల్తానా’ కథ వివాదంతో చైతన్యవంతులందరి లోనూ, ఆఖరికి ముస్లింలలోనూ హిందూత్వ/మెజారిటీ భావజాలం ఉంటుందనీ, కాకపోతే దాని పర్సంటేజీలో తేడా ఉంటుందనీ ‘హర్యాలీ’ రచయితలంతా నిర్ధారించారు.

గుజరాత్ ముస్లిం జాతిమేధంపై ‘అజాఁ’ పేరుతో సంకలనం వచ్చాక సాహిత్యంలోనూ, పత్రికల్లోనూ ముస్లింవాదం పట్ల వివక్ష గురించి ‘వివిధ’లోనే చర్చ జరిగింది. 2004లో 40 మంది కథకులతో ముస్లిం కథల సంకలనం ‘వతన్’ రావడంతో తెలుగు సాహితీలోకం ఉలిక్కిపడింది. తమ మధ్యే నివసిస్తున్న మరొక ప్రపంచం గురించి చదివి ఆశ్చర్యపోయింది. అస్తిత్వ ఉద్యమాల నుంచి ఒక కథా సంకలనం రావడం అదే మొదలు. ప్రముఖ విమర్శకులు సైతం తప్పనిసరై ముస్లింవాదాన్ని ప్రస్తావించక తప్పని స్థితిని ‘వతన్’ కల్పించింది. ‘వతన్’తో పాటు వచ్చిన ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక మరింత దోహదం చేసింది. దాదాపు 100 మంది రచనల్తో వచ్చిన ‘ముల్కి’ని హెచ్‌బిటి పుస్తకంగా తేవడం మరొక చేర్పు. దాంతో ముస్లింవాదం చర్చ ఊపందుకుంది. తర్వాత ‘నఖాబ్’, ‘జగ్‌నేకీ రాత్’ పుస్తకాలు మరింత చర్చను లేవనెత్తాయి. ‘గవాయి’ దానికి సాక్ష్యమిచ్చింది. దాంతో ముస్లింవాదం పరిపుష్టమైనట్లు అనిపించింది. కాని ఆ తర్వాత 71 మంది కవులతో వచ్చిన ముస్లిం సంస్కృతి కవితా సంకలనం ‘అలావా’ మరెన్నో కొత్త అంశాల్ని చర్చకు పెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా ఈ చర్చ విస్తృతిని పెంచుకుంటూనే ఉండడం బహుశా చాలామందికి మింగుడు పడని విషయం కావచ్చు. కాని ఇండియన్ ముస్లిం సంస్కృతిని గుర్తించి చర్చకు పెట్టడం ‘అలావా’ సాధించిన ఘనత.

‘జల్‌జలా, అజాఁ, వతన్, ముల్కి, అలావా’ సంకలనాలకు స్కైబాబా సంపాదకుడు కావడం గమనించాలి. ఒక్కో సంకలనం వెనక ఎంత సమయం, ఎంత ఆలోచన వెచ్చింపబడుతుందో సంకలనాలు వేసినవారికే తెలుస్తుంది. ఊరికే అక్కడా ఇక్కడా అచ్చయినవి సేకరించి వేసినవారికి పై సంకలనాల వెనక ఎంత శ్రమ ఉంటుందో అర్థం కాదు. స్కైబాబా చేస్తున్న పని సరైందని భావించిన ముస్లింవాద మిత్రులు, ముస్లిమేతర సాహితీమిత్రులు అందించిన సహకారం ఎంతో గొప్పది. పై సంకలనాల వల్ల, ఇంకా పుట్టుమచ్చ, ఫత్వా, ముఖౌటా, బా, హరేక్‌మాల్, పాన్‌మరక, వెండిమేఘం, ముస్లింవాద తాత్త్వికత లాంటి పుస్తకాల వల్ల ముస్లింవాదం ఇవాళ గట్టి పునాదిని ఏర్పర్చుకొంది. విస్తృతిని సాధించింది. అందుకు సరిహద్దు రేఖ, వలస, ఇక ఊరు నిద్రపోదు, బ్లాక్ వాయిస్, ఆరోవర్ణం, కర్బలా లాంటి సంకలనాలలోని కొన్ని ముస్లింవాద కవితలూ ఉపకరించాయి. ఆ విషయాలన్నింటినీ విస్మరించి ఖాదర్ మొహియుద్దీన్ ‘అలావా’ ముందుమాటలో కొన్ని విషయాలు గందరగోళంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. (1) ఐడెంటిటీ ఉద్యమాలు సంక్షోభంలో పడిపోయిన సందర్భం ఇది. (2) ముస్లింవాదం రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్వచనానికి నోచుకోలేదు. (3) హిందూ మతం మీద విమర్శలు గుప్పించడంలో దళిత, బహుజన కవులతో పోటీపడడం ఖచ్చితంగాఅవాంఛనీయమైన ధోరణి. (4) స్వంత ఐడెంటిటినీ అధిగమించి ఇతర ఐడెంటిటీల నుంచి ప్రవచించడం కూడా ముస్లింవాద కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఒక లోపం.

ఇలా చాలా అభ్యంతరకరమైన, అవాస్తవ ఆరోపణలు చేశారు. ఆ చర్చలలోకి వెళ్ళకుండా ఆ స్టేట్‌మెంట్స్‌ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అంతకన్నా ముఖ్యమైన చర్చలోకి వెళదాం. అంతకుముందు రికార్డు కావలసిన ఉపచర్చ ఒకటి-
ఈమధ్య మౌఖికంగా స్కైబాబాపై ఖాదర్, డానీ, ఖదీర్‌బాబు చేసిన దాడిలో వారి వెనుకబాటుతనాలు కొన్ని బయటపడ్డాయి. ఖదీర్ అంటాడు- ముస్లిం కథల సంకలనం ‘వతన్’లో ముస్లింలను స్కైబాబ ప్రాంతాలవారీగా విభజించాడని! డానీ అంటాడు- ముస్లింలలో స్కైబాబ డీవియేషన్ (దూదేకుల తదితర ఉపజాతుల రచనల్ని రికార్డు చేసి) తీసుకొచ్చాడని! ఖాదర్ అంటాడు- ముస్లిం సింబల్స్ మీద దాడి చేస్తున్నారని, తెలంగాణ రావడం వల్ల ముస్లింలకు నష్టం ఉందని, స్కైబాబ తెలంగాణ గురించి మాట్లాడొద్దని! (అక్కడే ఉన్న షాజహానా, యాకూబ్ పాషా, వలి హుసేన్, సికిందర్ ఆశ్చర్యపోయారు. ఇక్కడ మా అందరి చైతన్యాల్లో ప్రాంతీయ తేడాలు స్పష్టంగా కనిపించడం ఆలోచింపజేస్తున్నది.) ఖాదర్, డానీ, ఖదీర్ పురుషస్వామ్య, అగ్రకుల, భూస్వామ్య భావజాలాల్లోంచి బయటపడలేదు. మూస ఆలోచనలున్నవారికి, కాలానుగుణంగా మార్పుల్ని ఆహ్వానించలేనివారికి కొత్త విషయాలు అర్థం కావడం కష్టం. భాషలో, జీవన విధానంలో ఉండే తేడాను ‘వతన్’ తేల్చి చెప్పింది. దూదేకులవారి దగ్గర్నుంచి బోరేవాలాల వరకు వారి ప్రత్యేక సమస్యలు, ప్రత్యేక జీవన విధానాలు, వృత్తులు కోల్పోయినతనాలు డానీకి అర్థం కావనుకోవాలా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వల్ల ఇక్కడి ముస్లింలకు లాభమో, నష్టమో కృష్ణా జిల్లావాడైన ఖాదర్ కన్నా తెలంగాణవాడైన స్కైబాబాకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది.

మరొక విషయం- ముస్లింవాదం ముస్లింల జీవన విధానం, మత విశ్వాసాలు, ఆచారాలు వంటి అంశాలను గ్లోరిఫై చేసే అశాస్త్రీయ, హెడోనిస్టిక్ పద్ధతికి వీడ్కోలు పలికింది. సాహిత్యంలో మాతృమూర్తి పేరుతో స్త్రీల దాస్యాన్ని గ్లోరిఫై చేయడాన్ని స్త్రీవాదులు తిరస్కరించారు. దానికి సాహిత్యంలో సమ్మతి దొరికింది. కాని ముస్లిం రచయితల్లో కొంతమందికి మూఢ విశ్వాసాలు, బుర్ఖా వంటి దురాచారాలు భారత ముస్లింల ప్రత్యేక గుర్తింపుగా ఉన్నతీకరించడం, కీర్తించడం మహా ఇష్టం. అలాగే రెండు సంస్కృతుల సమ్మిశ్రితం నుంచి రూపొందిన భారత ముస్లింల గుర్తింపు పట్ల కూడా హేతుదూరమైన, సత్యదూరమైన అవగాహన ఉంది. ‘…శక్తివంతమైన రెండు సంస్కృతుల మేలుకలయికలోంచి పోతపోసుకున్న మూర్తిత్వం భారత ముస్లింల ఐడెంటిటీ. సగర్వంగా స్వంతం చేసుకోవటమే కాదు, భారత ముస్లింలు దీన్ని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు,’ అన్నారు ఖాదర్ ‘అలావా’ ముందుమాటలో. కాని ఇవాళ ఇది పూర్తి సత్యం కాదు. పదేళ్ళ క్రితం వరకు నిజమే కావచ్చు. ఇవాళ- దర్గాల దగ్గరికి వెళ్ళవద్దు, పీర్ల పండుగ చేయవద్దు, ఫాతెహాలు ఇవ్వవద్దు లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. దాంతో ఒక సందిగ్ధం నెలకొంటున్నది. మొక్కుకోవడాలు అలవాటున్న జాతులు తిరిగి తమ పూర్వపు కులాల్లోకి వెళ్ళిపోయే అవస్థ ఏర్పడుతున్నది. హిందూత్వ వాదులు అణగారిన కులాలవారిని ఎట్లాగైతే హిందువైజ్ చేస్తున్నారో అట్లాగే కొన్ని మతసంస్థలు ముస్లింలను ఇస్లామైజ్ చేస్తున్నాయి. దాంతో ఈ రెండు వర్గాల మధ్య దూరం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలుస్తున్న సాంస్కృతిక సందర్భాలు, స్థలాలు- ఉర్సులు, పీర్లపండుగలు, దర్గాలే. వాటికి కూడా ముస్లింలను దూరం చేస్తే ఇక సహజీవనానికి అర్థమే ఉండదు. పైగా ప్రమాదం కూడా. ఈ సాంస్కృతిక సహజీవనానికి ప్రతీకలను రక్షించుకునేందుకు జరగాల్సిన చర్చలో భాగంగానే ‘అలావా’ ముస్లిం సంస్కృతి కవిత్వం వేశాం. దేశదేశాలకు ఇస్లాం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆయా దేశాల సంస్కృతుల్ని తనలోకి ఇముడ్చుకోవడం, ఇస్లామిక్ (అరేబియన్) సంస్కృతిని ఆయా దేశాలకు వ్యాప్తి చేయడం జరిగింది. జరుగుతున్నది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతటా ముస్లింల సంస్కృతి ఒకే రకం ఉండదని అర్థమవుతుంది. ఆ దిశలోనే మన దేశంలోని, మన రాష్ట్రంలోని ముస్లింల సంస్కృతిని ‘అలావా’ సంకలనం చర్చకు తెస్తున్నది. దేశీ ముస్లిం సంస్కృతిగా దీన్ని మనం చూడవచ్చు.

ఇక ముఖ్యమైన చర్చకు వస్తే- ‘ఈ ఇద్దరు కవుల (ఖాజా, స్కైబాబ) రచనలు సృష్టించిన స్పేస్‌లోంచే ఇస్లాంవాదం ముందుకు వచ్చిందనటం ముమ్మాటికీ నిజం,’ అంటున్నారు ఖాదర్. సాహిత్యవాదంగా ఇస్లాంను తేవడం మంచి పరిమాణం కాదంటూనే అందుకు కొందర్ని బాధ్యుల్ని చేయడం దారుణమైన నేరారోపణ? ఏ రచనలు కారణమో, అందులోని ఏ భావం స్పేస్ కల్పించిందో ఆయనే నిరూపించాల్సి ఉంది. ‘… స్వంత సమాజం మీద పెట్టే విమర్శ ద్వారా బయటి ప్రపంచాన్ని ఆకట్టుకోవటానికి ప్రయత్నించడం క్షమార్హం కాని దుర్మార్గం,’ అంటూ ఖాదర్ తనలోని ముల్లాతనాన్ని బయటపెట్టుకున్నారు. అంత అగుడుపట్టి ఎవరూ లేరన్న విషయం ఆయన గ్రహించాలి.

ముస్లింవాదం ఇవాళ మాట్లాడుతున్న విషయాల మీద ఖాదర్‌కు స్పష్టత లేదు. గందరగోళంలో ఉన్నారు. ఈ అర్థం చేసుకోలేని, అర్థంకానితనం ఖాదర్‌కే కాక ఆయన మిత్రుడు డానీకి కూడా ఉంది. ముస్లిమేతరుల్ని పెళ్ళాడి ముస్లిమీయతకు దూరమైన వీళ్ళు ఇవాళ ముస్లింవాదం వెలుగులో, ఆ చైతన్యంతో సొంత పేర్లు వెతుక్కోవడం, సొంత ఐడెంటిటీని తడుముకోవడం, సొంత సంస్కృతికి భాష్యాలు చెప్పే ప్రయత్నం చేయడంలో పడ్డారు. అది ఎంతదాకా వెళ్ళిందంటే ముల్లాల్లా మాట్లాడేదాకా వెళ్ళింది. గడ్డాలొక్కటే తక్కువ. ఖాదర్ ముందుమాటలో డానీ(!) అంటాడు- ‘ఇస్లాం అనేది ఒక మతం. ఇస్లాం మతాన్ని ఆచరించే వాళ్ళు ముస్లింలు. ఇస్లాం అనేది ధార్మిక అంశం. ముస్లిం అనేది సామాజిక ప్రత్యయం. అవి రెండూ అవిభాజ్యాలు. దేనికైనా సందర్భం ఏమిటనేదే ముఖ్యం.’ ఇక్కడే డానీ ఇస్లాం మత ప్రచారకుడిలా మాట్లాడుతున్నారు. ఇస్లాం లేకుండా ముస్లిం అనేది లేదు కాబట్టి ముస్లింవాదం అనడం ఏమిటి అన్నవారూ మాకు తారసపడ్డారు. అది మతం చెప్పే నిర్వచనం. సామాజికంగా మతం ప్రస్తావన లేకుండానే ముస్లిం సమూహాన్ని ముస్లింలు అని వ్యవహరిస్తున్నాం. ఉదాహరణకు మాదిగలు, బీసీలు అనేది కొన్ని సమూహాల్ని ఎలాగైతే సూచిస్తుందో ముస్లిం అనేది కూడా ఒక సామాజిక సమూహాన్ని సూచిస్తున్నది. మాదిగవాదం, బీసీవాదం లాగా ముస్లింవాదం అంటున్నాం. కాబట్టి, ‘అవిభాజ్యాలు’ అనడం మత పరిభాష అవుతుంది. (ఇస్లాంవాదం అనడం మతానికి ప్రాధాన్యత నిచ్చినట్లు, ముస్లింవాదం అంటే సామాజిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చినట్లు అవుతుందనేది సులభంగా అర్థమయ్యే అంశం.) ఇంకా డానీ- ‘…సాంస్కృతిక జాతీయవాదపు బూటకాన్ని ఎదుర్కోవలసిన చారిత్రక సంధి సమయంలో కొందరు ఇస్లాంను సంస్కరించడానికి పూనుకున్నారు… సాంస్కృతిక జాతీయవాదులు ముస్లింలపై బయటి నుంచి చేస్తున్న దాడినే సంస్కరణవాదులు లోపలి నుండి సాగించారు. ఆ మేరకు చారిత్రక అపచారానికి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రచయితలు తమ తమ సమూహాలను సంస్కరించటానికి పూనుకున్న దాఖలాలు లేవు. స్వీయ సంస్కరణవాదులు ముస్లింలకే ప్రత్యేకం కాబోలు!’ అంటూ డానీ తనలోని ముల్లాతనం బయటేసుకున్నారు. ఇదే భావజాలం ఖాదర్‌ది కూడా. ఇక్కడే మొదటినుండీ మేము ఇలాంటివారితో విభేదిస్తున్నాం.

‘ముస్లిం’లలో సంస్కరణల గురించి మాట్లాడడం చారిత్రక అపచారం కాదు. చారిత్రక అవసరం. ఆ విషయాన్ని ముస్లింవాద కవితలు, కథలు బలంగా వ్యక్తం చేశాయి. కొత్త తరం రచయితలే కాదు, ఖాదర్, డానీ కన్నా పెద్దవారైన స్మైల్, షేక్ హుసేన్, దిలావర్ ఇంకా దాదాహయత్ తదితరులు దాన్ని ఒప్పుకొంటున్నారు. సాంస్కృతిక జాతీయవాదాన్ని ఎదుర్కోవడం అంటే ముస్లిం సమాజాన్ని సంస్కరణలకు దూరంగా మరింత మూఢత్వంలోకి నెట్టమని ఈయన భావం. అంతర్గత సంస్కరణల గురించి సాహిత్యంలోనూ మాట్లాడనివ్వకపోతే వీళ్ళను ముల్లాలనక ఏమనాలి??

నిజానికి ఈ చర్చ స్వాతంత్య్రానికి పూర్వం నుండీ ఉంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్నవారు అంతర్గత సంస్కరణల గురించి పోరాడుతున్న రాజారామ్మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం, రెనడె లాంటివారిపై కూడా ఇలాంటి నిందారోపణలు, విమర్శలు చేశారు. అంబేద్కర్ కుల అణచివేత గురించి జాతీయోద్యమకాలంలో పోరాడుతున్నప్పుడు గాంధీ, కమ్యూనిస్టులు కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ప్రధానం కాని అంతర్గత సమస్య అయిన కులం కాదన్నారు. ఆయన్ని సామ్రాజ్యవాదుల ఏజెంటు అన్నారు. ఇప్పుడు డాని సంస్కరణలు కోరుతున్న ముస్లింవాదులని కోవర్టులు, మెస్సద్ ఏజెంట్లని నిందించినట్టు! కాని వారి పోరాటాలు నేటి దాకా సామాజిక మార్పుకి దోహదం చేస్తున్నాయి. సంస్కరణోద్యమం వల్ల చైతన్యవంతులైనవారు స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనడం జరిగింది. ఇది ముస్లిం సంస్కరణోద్యమానికి వర్తిస్తుంది.
పరలోకమే ప్రధానం, ఇహలోకానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఒక మూర్ఖపు వాదన కారణంగానే అధిక శాతం ముస్లింలు వేగంగా అభివృద్ధి చెందే రంగాల్ని ఎన్నుకోవడం లేదు. ఆధ్యాత్మిక విద్యకు మించినది లేదనుకుంటారు. తద్వారా ఇతర సమాజాలకు, ముస్లిం సమాజానికి ఎడం వేగంగా పెరిగిపోతున్నది. ఉదాహరణకు ఇవాళ సాఫ్ట్‌వేర్ రంగాలలో ముస్లింల శాతాన్ని చూస్తే ఆ విషయం తెలిసొస్తుంది. అంతెందుకు, కాల్‌సెంటర్లలో వేల ఉద్యోగాలు ఇవాళ ముస్లిమేతర అమ్మాయిలు చేస్తున్నారు. వేల రూపాయల జీతముండే ఆ ఉద్యోగాల్ని పూర్తిగా ముస్లిం అమ్మాయిలు కోల్పోయినట్లే కదా! కాబట్టి ఎదుగుతున్న సమాజంతో పాటు ముస్లిం సమాజమూ ఆ వేగంతో ముందుకెళ్ళాలంటే కొన్ని జాడ్యాల్ని, మతమౌఢ్యాల్ని వదులుకోక తప్పదు. ఆ విషయమే ముస్లింవాదం మాట్లాడుతున్నది. ఎక్కడో ఆగిపోయిన డానీలు, ‘పుట్టుమచ్చ’ దగ్గరే తచ్చాడుతున్న ఖాదర్‌లు కొత్తతరం ముస్లింవాదుల్ని అందుకోలేరు. అంత ప్రజాస్వామికత, నిజమైన లౌకిక భావన వీరిలో కొరవడి పాక్షిక ధోరణి పెరిగింది. ఇలాంటివాళ్ళ నుంచి కొత్త తరం ఏం ఆశించగలదు? తమకు తాము ముందుకు వెళ్ళడమే మార్గం. ఆ రకంగా చూస్తే ఖాదర్‌లనూ, డానీలనూ దాటి ముస్లింవాదం చాలా ముందుకు వచ్చేసింది.

‘ఏ ప్రత్యేకతల పునాదులమీదనైతే ముస్లిం ఐడెంటిటీ నిలబడి ఉందో ఆ ప్రత్యేకతల్ని పరిహసించే రీతిలో రచనలు సాగించడం అక్షరాలా ఆత్మహత్యా సదృశ్యం’ అంటున్నారు ఖాదర్. ప్రైవేటు చర్చల్లోనూ ముస్లిం సింబల్స్ మీద దాడి చేస్తున్నారంటూ మా మీద విరుచుకుపడుతున్నారు. వీరి దృష్టిలో ముస్లిం ఐడెంటిటీ అంటే, ముస్లిం సింబల్స్ అంటే బుర్ఖా, పర్దా, ముస్లింల ఛాందసత్వానికి ప్రతీకలైనవెన్నో! అవసరం లేదని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న బుర్ఖా మాత్రమే ముస్లిం సింబల్ ఎందుకు కావాలి? ఇతర సమాజాలు సాంకేతిక విద్యలో పోటీ పడుతుంటే, స్త్రీలు సైతం వ్యోమగాములుగా రికార్డులు సృష్టించే స్థాయికి వెళుతుంటే ముస్లింలు మాత్రం మతవిద్య దగ్గరే తచ్చట్లాడటం, స్త్రీలను బుర్ఖాల ప్రహారీగోడల్లోనే బంధించడం ఎంతవరకు సబబు? ఈ ప్రశ్నలు ముస్లిం సింబల్స్ మీద దాడి చేస్తున్నట్లా? ప్రత్యేకతల గురించి విపరీతమైన ప్రాముఖ్యతనిచ్చిన వలసానంతర వాదం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తిరస్కృతికి గురవుతున్నది. వలసానంతర వాదుల భావనల్ని అరువు తెచ్చుకున్న ఖాదర్‌కు బుర్ఖా ముస్లింల ప్రత్యేక సంస్కృతిగా కనిపించడంలో అసహజమేమీ లేదు. భారతదేశపు ప్రత్యేక లక్షణం కులవ్యవస్థ. కులవ్యవస్థ లేకపోతే భారతదేశానికి ఉనికి లేదని ‘లాస్ట్ బ్రాహ్మిణ్’లో శర్మ అన్నారు. ఖాదర్ ప్రకారం దళితవాదులంతా ఇక కులవ్యవస్థను కాపాడుకోవడానికి పోరాడాల్సి ఉంటుంది. ప్రత్యేకతలు శుద్ధమైనవీ, పవిత్రమైనవీ కాదు. కాలంతోపాటు పరివర్తన చెందాల్సినవి. మార్పుని సమ్మతించని ప్రత్యేకతల్ని ప్రయత్నపూర్వకంగా వదులుకోవాలి.
ముస్లింలలో సగం జనాభా స్త్రీలను చదువుకోనివ్వకుండా, లోకం పోకడలు తెలియనివ్వకుండా, ఉద్యోగాలు చెయ్యనివ్వకుండా, ఎదగనివ్వకుండా చేస్తే… వాళ్ళను బుర్ఖాల్లోనే పర్దాల్లోనే కుదేసి వంటిళ్ళూ పడకిండ్లకే పరిమితం చేస్తే మొత్తం ముస్లిం సమాజం ఎలా బాగుపడుతుంది? ఇల్లు తగలబడుతుంటే ఇంరియల్ డెకొరేషన్ గురించి మాట్లాడుతున్నారంటూ సంస్కరణవాద రచనల గురించి ఖాదర్ ఎద్దేవా చేస్తుంటారు. నిజానికి ఆ పోలిక దేనికీ కుదరదు. కాని ఇల్లు తగలబడుతుంటే బస్తీ గురించి మాట్లాడమంటున్నారు ఖాదర్. అంతర్గత సంస్కరణల గురించి మాట్లాడడం అప్రస్తుతం అనేది ఆయన వాదన. బాహ్య సమస్యలన్నీ తీరినాక అంతర్గత సమస్యల గురించి మాట్లాడదామంటే ఆమధ్యకాలంలో జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ముస్లింలలో సగమైన స్త్రీల కోల్పోయిన జీవితాల్ని ఎవరు తెచ్చిస్తారు? మూర్ఖత్వంలో మునిగే ఛాందసులు నష్టపోయే విలువైన కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?

మారుతున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తమ శారీరక గుణాలను మార్చుకోలేని జీవులు ఈ భూగోళం మీద అంతరించిపోయాయి. ఉదాహరణకు రాక్షస బల్లులు. అట్లే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ జీవనసరళిని మార్చుకోలేని జాతులు/సమూహాలు కూడా వెనకబడిపోతాయి. ఆ వెనుకబాటుతనం ఇప్పటికే ముస్లింలలో కనబడుతున్నది. ఈ కఠిన వాస్తవాన్ని ముస్లింలకు అర్థం చేయించేదెవరు? ముస్లింవాదం ఆ పని చేస్తున్నది. పెరియార్ అన్నట్లు- ‘తమ జీవన గమనానికి (ప్రజల మార్గానికి) అడ్డంకులుగా నిలిచినవేమిటో గ్రహించి వాటిని తొలగించుకోవాలి.’ లేదా సంస్కరించుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల అన్ని ప్రదేశాలూ ఎలాగైతే వెలుగుకు నోచుకుంటున్నాయో అట్లే ముస్లిం సమాజం అంతర్గతంగా తమలోని లోపాలపై దృష్టి సారించి సంస్కరించుకుంటూనే బాహ్య పోరాటం చేయాలి. అలా కాదంటే ఏదో భాగం చీకటిలో మగ్గిపోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు ముస్లిం స్త్రీలు, కేవల మతవాదులు చీకటి భాగాలుగా కనిపిస్తున్నారు. అంటే ముప్పావువంతు ముస్లింలు ఈ చీకట్లో మగ్గుతున్నారు. కాబట్టి ఈ అంతర్గత పోరాటం తప్పనిసరి జరగాల్సిందే. ఈ పోరాటం జరగకపోవడం, లేక ఆ విషయాలపై మాట్లాడే అవకాశాన్ని మతవాదులు ఇవ్వకపోవడం అనేది ముస్లింల వెనుకబాటుకు బలమైన కారణమై కూర్చున్నది. దానికే దోహదపడతాయి ఖాదర్, డానీల వాదనలు.
ముస్లిం సమాజం మీద నిజమైన ప్రేమ ఉన్నవాళ్లు ముస్లింలు అన్ని రకాలుగా ఎదగాలని కోరుకుంటారు. ఆరెస్సెస్‌వాదులు ముస్లింలు ఛాందసంగా, మూర్ఖంగా ఉండడాన్నే కోరుకుంటారు. అందుకే స్వాతంత్య్రానంతరం ఉద్రేకపూరిత విషయాల చుట్టూనే ముస్లింలను పరుగెత్తిస్తూ పురోగతి వైపు దృష్టి పెట్టకుండా ముస్లింల ఎజెండాను ఆరెస్సెస్‌వాదులే నిర్ణయిస్తూ వస్తున్నారు. అదే పని ఇవాళ ఖాదర్, డానీలు కూడా చేస్తున్నారు. ఇటు హిందూత్వవాదుల్ని అటు సామ్రాజ్యవాదుల్ని బూచిగా చూపుతూ అంతర్గత సంస్కరణల గురించి మాట్లాడడం అప్రస్తుతం అంటున్నారు. కాని ఈ తరం ముస్లింవాదులు బాహిర్ పోరాటంతో పాటు అంతర్గత పోరాటం కూడా జరగాల్సిందే అంటున్నారు. అందుకు ‘జల్‌జలా, వతన్, పాచికలు, ఫత్వా, బా, నఖాబ్, జగ్‌నేకీ రాత్’ సంకలనాలే నిదర్శనం. ఎమ్.టి. ఖాన్ దగ్గర్నించి జమీలా నిషాత్ వరకు, జావేద్ అఖ్తర్ నుంచి సారా అబూబకర్ వరకు, యాకూబ్, హనీఫ్, అఫ్సర్ నుంచి యాకూబ్ పాషా వరకు ముస్లింలలో సంస్కరణవాదాన్ని బలపరుస్తున్నవాళ్ళే. దాదాపు యాభైమంది ముస్లిం కవులు, కథకులు ఇదే కోరుకుంటున్నారు. అలాంటప్పుడు 14 ఏళ్ళ నాటి వాదనే ఇవాళ కూడా చేస్తున్న ఖాదర్, డానీలే పునరాలోచించుకోవాలి. ముస్లింల మేలు కోరేవారైతే మూస ఆలోచనల్ని వదిలి మూర్ఖపు వాదనల్ని వదిలి మనసును, మెదడును విశాలం చేసుకోవాలి. సాటి జీవి పైన మతం పేర కట్టుబాట్లు విధించే అనాగరికాన్ని సమర్థించడం మనిషితనం అనిపించుకోదు. ఇక్కడే ముస్లిం కవులు, రచయితలు అన్ని పర్దాల్ని వదుల్చుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇతర మతాలు మొత్తంగానో కొన్ని భాగాల్లోనో ఆధునీకరణం చెందుతుంటే ఒక్క ముస్లింలు మాత్రమే ఇంకా రిజిడ్‌గానే మెలగుతున్నారు. అందువల్ల ఎవరెంత ఆదుకున్నా ముస్లింలు బాగుపడే అవకాశం లేదు. అరబ్ దేశాల్లో పెట్రోలు కనుక లేకపోతే పచ్చి చేపల కంపు కొట్టేది. ఈ స్థితిని చర్చకు పెట్టే అవకాశం ఒక్క భారతదేశ ముస్లింలకే అధికంగా ఉంది. కాబట్టి ముస్లింల జీవన సరళిలో (ఇస్లాంలో అనడం లేదు) సంస్కరణల్ని ఆహ్వానిద్దాం. అందుకు దారులు వెతుకుదాం. అందులోనే ముస్లింల అభ్యున్నతి దాగి ఉంది.

‘అలావా’లో ఖాదర్ చెప్పిన మాటలు ఆయనకే వర్తిస్తాయి- ‘ వాదమూ వివాదానికి అతీతంగా ఉండదు. వాదవివాదాలు అనివార్య పరిణామాలు. పిడివాదాలకూ, మడివాదాలకూ పోకుండా సంవాదాని (డైలాగ్)కి స్థానం కల్పించాలి. తాము అనుకుంటున్నదీ, తమకు అనుకూలంగా ఉన్నదే అసలు సిసలు సత్యం అని విశ్వసించటం ఆత్మవంచనకు తప్ప మరి దేనికీ ఉపయోగపడదు.’

2 అభిప్రాయాలు

  1. Rohiniprasad 07 సెప్టెంబర్ 2007 , 12:12 pm

    కుల మతాలకు అతీతమైన పద్ధతిలో ప్రపంచాన్నీ, సమాజాన్నీ, జీవితాన్నీ గురించిన సరైన అవగాహన ప్రజల్లో కల్పించడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నాలు చెయ్యకుండా ఇంకేది చెయ్యబోయినా అది వృథాయే అవుతుంది. ఈ అడ్డుగోడలన్నీ ఎప్పుడు, ఎందుకు, ఎలా సృష్టించబడ్డాయో సామాన్య ప్రజలందరూ గుర్తించాలి. ప్రకృతిని గురించీ, ప్రాణుల గురించీ, సమాజ పరిణామాల గురించీ సరిగ్గా అర్థం చేసుకోకుండా వారున్నంతకాలం సాహిత్యపరంగా గాని, సామాజిక పరివర్తనాపరంగా గాని ఎటువంటి ప్రయత్నమూ ఫలించదని నా ఉద్దేశం. జ్ఞానాన్ని సంపాదించుకున్న ప్రజలు ఎటువంటి విప్లవాత్మక మార్పులు అవసరమో గ్రహించగలుగుతారు. ఆ తరవాత అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఇందులో మొదటి మెట్టు అవగాహనే. ఇది అసమగ్రంగా ఉన్నంతకాలమూ అస్పష్టత తలెత్తుతూనే ఉంటుంది.

  2. రహంతుల్లా 11 ఆగస్టు 2008 , 3:30 am

    భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
    కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
    మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

    న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

    ‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

    పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)