మొన్న మక్కా మసీదు, నేడు లుంబినీపార్క్ గోకుల్ ఛాట్ లలో బాంబుదాడులు
మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం!
మనోనిబ్బరాన్ని ప్రదర్శించి, టెర్రరిజం ఓడిపోతుందని చాటిన ప్రజలకు బాసటగా నిలుద్దాం !

హైదరాబాదు లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్‌లలో 25.08.2007 సాయంత్రం 7.40కి దుష్ట శక్తులు అత్యంత శక్తివంతమైన బాంబులు పేల్చారు. 44 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి చర్యల్ని ఆంధ్రదేశం, ప్రపంచమంతా ఖండించింది. క్షతగాత్రులకు, బాధిత ప్రజలకు అందగా నిలుస్తూ ఉంది. ఇలాంటి సమయాలలో అన్ని వర్గాల ప్రజలు ఇంకా ఎక్కువ సహకారాన్నివ్వాల్సి ఉంది. మామూలుగా మధ్యతరగతి మేధావుల చేత ఎగాదిగా చూపులకు గురయ్యే ఆటో కార్మికులు, ఆర్‌టిసి కార్మికులు, సామాన్య ప్రజలు, ఆపద సమయంలో ఎలాంటి తెగువ, చొరవ ప్రదర్శించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. వారిని మనసారా అభినందించాలి. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పే 108లు, ఫైర్ సర్వీసులు అడ్రస్ లేవని బాధితులు, ప్రజలు ప్రశ్నించడం మనం చూశాం. ప్రభుత్వం, పాలకపక్షాలు వ్యవహరిస్తున్న తీరుని చాలామంది ప్రజలు అసహ్యించుకున్నారు. దేశంలోకి, మన రాష్ట్రంలోకి విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు దిగుమతి అవుతున్నా ఆపలేనట్లుగా నటిస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసినప్పుడల్లా కటప ప్రేమ నటిస్తున్నారు. కమీషన్లని, విచారణలని కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

ప్రజలు నిరంతరం తమ సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు వారి పైన లాఠీలు, తూటాలు కురిపించేందుకు ప్రభుత్వాలు లక్షలాదిమంది పోలీసుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించడానికేనని చెబుతుంటారు. అదంతా అబద్ధమని తేలిపోయింది. సరైన రాజకీయ విధానాలు అన్ని వర్గాల, ప్రజల చైతన్యమే ప్రజల్ని రక్షిస్తుంది కానీ, దేశంలో ఉన్న యువకులందరినీ సైనికులుగా మార్చినా, లేక బార్డర్‌లో ఉన్న సైనికులందరినీ దేశమంతా నింపేసినా ప్రజలకు రక్షణ అసాధ్యం. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థగా చెప్పుకునే దేశంలో ఏ మతం ద్వారా గుర్తించబడినవారికైనా, ఏ విశ్వాసాలు కలిగి ఉన్నవారికైనా, మతం- కులరహితంగా బ్రతకాలనుకునేవారికైనా స్వేచ్ఛ ఉండాలి. మతమౌఢ్యాన్ని పెంచేందుకు ప్రోత్సహించకూడదు. కానీ నిరంతరం ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ప్రజల మధ్య ఐక్యత పెరగనీయకుండా ఉన్మాద భావజాలాన్ని పెంచే కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తూనే ఉన్నారు. ఆయా కార్యక్రమాలకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, అధికారులు హాజరౌతూనే ఉన్నారు. సెంటిమెంట్లను, సున్నితమైన విషయాలను రెచ్చగొడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపైకి వారి దృష్టి మళ్ళకుండా నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది బ్రిటీషు వాడి నుంచి వారసత్వ జ్ఞానంగా నేర్చుకున్నారు. నేడు అమెరికా సామ్రాజ్యవాదపు సిఐఎ ఆజ్ఞలను పాటిస్తూ నిరంతరం, తమ విచ్ఛిన్నకర, విధ్వంసకర విధానాలకు రాజకీయ సారధ్యం వహిస్తున్నారు. ఆ దుష్ఫలితాలను నేడు ప్రజలు అనుభవిస్తున్నారు.

మొన్న మక్కా మసీదులో బాంబులు పెట్టింది ఎవరైనా అవి చంపింది సామాన్య ముస్లింలనే. ఆ తర్వాత కాల్చి చంపబడిందీ వారే. ఆనాడు మరింత విధ్వంసం జరగాలని కుట్ర పన్నిన వారి ఎత్తుగడలు సఫలం కాలేదు. అందుకే మరికొన్ని ప్రాంతాలను ఎన్నుకొన్నారు. అవే కోఠి, లుంబినీ పార్క్ దాడులు. ఈ దాడుల్లో పారిన నెత్తురు ముస్లింలదా, హిందువులదా అని వేరు చేయలేనంతగా కలిసిపోయింది. ఉన్మాదికి, టెర్రరిజాన్ని ఆశ్రయించినవారికి ఏ విశ్వాసాలు ఉండవని ఈ దాడులు రుజువు చేస్తున్నాయి. వాళ్ళకు ప్రజల నిజమైన సమస్యల పరిష్కారం, వాటిపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం, ఎన్నో కష్టాలకు, త్యాగాలకు ఓర్చి సంఘటితపర్చాల్సిన అవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిర్మించడం వారి పని కాదు. ధ్వంసం చేయడమే వారి లక్ష్యం. ఈ రకంగా ప్రజల మనోభావాలలో పెరిగే అభద్రతే పాలకులకు పెట్టుబడి అవుతుంది. వీరు అంతిమంగా దోపిడీ శక్తులకే మేలు చేస్తారు. అనేక విషయాల నుంచి దృష్టి మళ్ళించిన ఈ దాడులే ఈ విషయాన్ని ఋజువు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లాంటి మహానగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ దాదాగిరి, మాఫియా సంస్కృతి దేనిని సూచిస్తుంది? బహుళజాతి కంపెవనీలకు ఏజెంట్‌గిరీ చేసి ప్రభుత్వ భూముల్ని అమ్మిపెట్టి కోట్లు గడిస్తున్న శక్తులెవరు? రాజకీయ చొక్కాల మాటున రకరకాల పథకాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్ళించే శక్తులెవరు? నకిలీ పాస్‌పోర్టులు, నకిలీ స్టాంప్ పేపర్‌లు, నకిలీ కరెన్సీ, నకిలీ ప్రశ్నాపత్రాలు, నకిలీ డిగ్రీ పట్టాలు, చివరికి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఎవరు తయారుచేస్తున్నారు? ఎవరు సరఫరా చేస్తున్నారు? ఏ ప్రభుత్వాలకూ తెలియదా? మహిళల్ని విదేశాలకు, రెడ్‌లైట్ ఏరియాలకు అమ్మేవాళ్ళు, పిల్లల్ని ఎగుమతి చేసేవాళ్ళు, వందలకోట్ల రూపాయల సొమ్ము దిగమింగి బోర్డులు తిప్పేసేవాళ్ళు- వీళ్ళంతా ఏ రాజకీయశక్తుల, అధికార్ల అండ లేకుండానే తప్పించుకోగలుగుతున్నారా?

వేలకోట్ల రూపాయలు కొద్దిమంది చేతుల్లో పోగుపడుతున్న ఈ హైదరాబాద్ నగరం మాఫియాల అడ్డాగా మారుతుండడం కొత్త పరిణామం కాదు. కొందరు వ్యక్తులు ఇంత పెద్ద మారణకాండ చేయగులుగుతున్నారంటే ప్రజల నుంచి ప్రభుత్వాలు ఎంతగా వేరుపడిపోయాయో వేరే చెప్పనక్కర్లేదు. ఈ మాఫియా లక్షణాలు పెరగడం రోగలక్షణం మాత్రమే. రోగం దోపిడీ వ్యవస్థలో ఉంది.

అమెరికా అయినా, భారతదేశమైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ లైనా ప్రభుత్వాలు టెర్రరిస్టు శక్తులు, మాఫియా శక్తులు ఉండాలనే కోరుకుంటారు. అలా కాకుండా వ్యవస్థపట్ల సరైన అంచనాతో సమాజం పట్ల బాధ్యతతో ఉండేవారు ప్రభుత్వ విధానాలపై నిర్దిష్టంగా ఆలోచించి యువతలో చైతన్యం రగిలించే వాళ్ళు పెరిగితే వీరు గడగడ వణుకుతారు. పెరుగుతున్న నిరుద్యోగం, ఆకలి అంతరాలు ఇవన్నీ ఇంకా వందల సంవత్సరాలు కొనసాగించుకోవడానికి దుష్టశక్తుల్ని సృష్టించి వారిని శిక్షించేందుకు పరిపాలకులుగా మేమున్నామని ముందుకొస్తూ నాటకాలాడుతున్నారు. ప్రజలకు తమ నిజ జీవితంలో కార్యాచరణలో ఈ విషయాలు అర్థమవుతున్నాయి.

సెజ్‌ల పేరుతో దేశంలోని సకల సంపదలన్నీ లూటీ అయిపోతున్న సందర్భంలో, బహుళజాతి కంపెనీల దోపిడీ విచ్చలవిడిగా పెరుగుతున్న దశలో, ఈ జాతినంతటినీ నిర్వీర్యంచేసే విష సాంస్కృతిక దాడులు కొనసాగుతున్న తరుణంలో నిజమైన దేశభక్తి ఎలా ఉండాలో యువత ఆలోచించుకోవాలి. ‘సమాజం గురించి మీకెందు’కని, ‘ఎవరి బాగు వారు చూసుకోమ’ని చెబుతున్న పాలకుల, కుటిల మేధావుల వాదనలు సరికావని హైదరాబాద్‌లో జరిగిన దాడులు మరొక్కసారి రుజువు చేశాయి.

ప్రజలందరి ఉమ్మడి ఆస్తులైన ప్రభుత్వ రంగాల్ని ప్రైవేటీకరించడం వల్ల ఆపదలొచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఉస్మానియాలో సౌకర్యాలు లేక నేలపై పడేసిన మాంసపు ముద్దలు హెచ్చరిస్తున్నాయి. కనుక యువత ఈ సమాజ మార్పు కొరకు ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంవైపు ఆలోచించాలి. ప్రజల పక్షాన నిలవాల్సిన గొంతులు నిరంతరం ప్రజలకు అండగా ఉండాలి. దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేయాలి. ఈ దాడుల్లో నష్టపోయినవారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేయాలి. మనవంతు బాధ్యతగా బాధితులకు అండగా నిలుద్దామని అన్ని వర్గాల ప్రజలు కోరుకోవాలి.

- నవయువ సమాఖ్య

పూర్తి కరపత్రం చదవండి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)