- త్రిపురనేని మధుసూదనరావు
“ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యమూ ప్రాచీన సాహిత్య పరిచయమూ అవసరం లేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కానీ వారికి ప్రపంచజ్ఞానమూ జీవితానుభవమూ, సామాజిక దృక్పథమూ కూడా అవసరం లేదన్నది రానురాను రుజు వవుతున్నది, ఇతివృత్తాలలోగాని, పాత్రపోషణలోగాని, సన్నివేశాలలోగాని ఎలాటి వాస్తవికతా అవసరం లేదు” (కొ.కు.)
అని వ్యంగ్యంగా అన్నాడు. భాషాజ్ఞానం, పాండిత్యం, ప్రాచీన సాహిత్య పరిచయం ఈనాటి కవులకి అవసరం అనేది కొ.కు. అభిప్రాయం. వీటికంటే ముఖ్యం ప్రపంచజ్ఞానం, జీవితానుభవం, సామాజిక దృక్పథం వాస్తవిక రచనలు చేయటానికి, అంటే సాహిత్యంలో జీవిత విశ్లేషణని స్పష్టం చేయటానికి చాలా అవసరమనేది కొ.కు. అభిప్రాయం. ఈ విశ్లేషణా దృష్టి గల కథల్నీ, నవలల్నీ చదవటం మన పాఠకులకి అలవాటు లేదు. జీవితాన్ని స్పష్టం చేయకుండా వీలైనంత గందరగోళపరిచి, సాహిత్యాన్ని విశ్లేషణా ఫలితమైన ఆలోచనకన్నా వర్ణనా ఫలితమైన ఆవేశం పాలు ఎక్కువ వున్న సాహిత్యాన్ని మాత్రమే మన పాఠకులు చదవగలరు. ఈ విస్పష్టమైన జీవిత విశ్లేషణా అంశం అధికంగా వుండటం వల్లనే కొ.కు. కథలకీ, నవలలకీ అనన్య ప్రచారం రాలేదు. అయితే కాలగమనంలో తెలుగు పాఠకులు కొ.కు. సాహిత్యాన్ని సమీపిస్తారు. అధ్యయన పద్ధతిలో మనం ఎదిగామా లేదా అనేదానికి కొ.కు. నవలలల్నీ, కథల్నీ ఆసక్తితో చదవగలుగుతున్నామా లేదా అనేది కొలబద్దగా వుండే దశ తప్పకుండా వస్తుంది. మనం అటువేపే నడుస్తున్నాం. జీవిత విశ్లేషణ వివరణ శాస్త్రాల లక్ష్యమనీ, వర్ణన ఆవేశం సాహిత్య లక్షణమనీ చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉంది. ఎక్కువ చదివితే సృజనాత్మక రచనలు చెయ్యలేమని ప్రకటించిన చాలామంది బాలరచయితలు మనకి అసంఖ్యాకంగా ఉన్నారు. ఏమీ చదవకుండా, ఏమీ తెలియకుండా వీళ్ళు ఏమిటి, ఎలా రాయదల్చుకున్నారో మనకి తెలీదు. చదివినదాన్నీ, తెలుసుకున్నదాన్నీ రచనకి ఎరువులుగా ఉపయోగించుకోవటం చాతగాక అసలు చదువే వద్దు, తెలుసుకోనే వద్దు అనడం అర్థరహితం.
“ప్రజల అనుభవాన్ని స్పృశించలేని కళ సిద్ధాంతరీత్యా ఎంతో ఉదాత్తమైనది అయినప్పటికీ అది ప్రజలలో వాంఛనీయమైన అభిరుచులను పెంపొందించలేదు”. (కొ.కు.)
రచనలో జీవితాన్ని విశ్లేషించటం అంటే జీవితానికి సిద్ధాంతాన్ని ప్రత్యామ్నాయం చెయ్యటం కాదు. జీవిత విశ్లేషణకీ, జీవిత చిత్రణకీ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవటం. కళలో విశ్లేషణ ద్వారా విస్పష్టం చేయదలుచుకున్న జీవితాన్ని ప్రజల అనుభవాన్ని స్పృశించే విధంగా చేయగలిగినప్పుడే అది మంచి రచన అనిపించుకుంటుంది. కథలోనో, నవలలోనో బిందువు నుంచి కదిలిన జీవిత విశ్లేషణా రేఖని మధ్యలో ఆపి సిద్ధాంత ఉపన్యాసం ఇస్తే దాని రేఖాస్వరూపం చెడిపోతుంది. ఇలాంటి రచయితలవల్ల సాహిత్యానికీ, జీవితానికీ కూడా నష్టమే.
సాహిత్య విమర్శ - పోనీ విమర్శ సాహిత్యంలో, సంస్కృతిలో ఒక భాగం. కాస్త శాస్త్రాల్లోనూ, శాస్త్రచర్చల్లోనూ పరిచయం ఉన్నవాళ్ళకి విమర్శ స్వరూపం ఇంకా లోతుగా తెలుసు. విమర్శ, వాదోపవాదాలు, చర్చాంశ ప్రతిదాంట్లోనూ అనివార్యంగా ఉంటుంది. వాదోపవాదాలూ, విమర్శ లేకుండా శాస్త్రం కానీ, సంస్కృతి కానీ పురోగమించవు. వాదోపవాదాలకి దూరంగా శాస్త్రజ్ఞుడు పరిశోధనలో నిమగ్నం కావచ్చు. కానీ ఆ పరిశోధనని రాసేటప్పుడు దానిలో అంతర్లీనంగా అయినా వాదోపవాద అంశం ఉంటుంది. కుటుంబరావుకి వాదోపవాదాలన్నా, చర్చ అన్నా చాలా ఆసక్తి. ఆయన సృజనాత్మక రచనల్లో కూడా విమర్శ ఉంటుంది. అందుకని కుటుంబరావు విమర్శని కేవలం రూఢి అర్థంలో ప్రచారంలో ఉన్న విమర్శగా భావించకూడదు. ఆధునిక విజ్ఞానశాస్త్రాల నుంచి మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల రచనా పద్ధతి నుంచి రూపొందిన గతితర్క విమర్శ, విమర్శనాంశం లేకుండా కొ.కు. చేసిన రచన అంటూ లేదు.
“సాహిత్యంలో సంఘర్షణలు సిద్ధాంత సంఘర్షణలే. ఇది గిడుగుమీద విమర్శల్తో ప్రారంభం అయింది. విరసం మీద విమర్శతో కొనసాగుతోంది.” (కొ.కు.)
సాహిత్యంలో సంఘర్షణలు కేవలం వాదవినోదులైన రచయితల మధ్య సంఘర్షణలు కావు. అవి సిద్ధాంతపరమైన సంఘర్షణలు. మధ్య యుగాల సాహిత్యంలో సంఘర్షణలు జరగకపోలేదు. కానీ అవి సిద్ధాంత సంఘర్షణలు కావు. వాటి ఆకారంలో భేదమే కాని సారాంశంలో అవి అన్నీ భావవాదాలే. గిడుగు వ్యవహారిక భాషా ఉద్యమం బూర్జువా వర్గ ఉద్యమం. భాష విషయంలో తరతరాలుగా వస్తున్న ఫ్యూడల్ భావజాలంమీద గిడుగు యుద్ధం చేశాడు. వ్యవహారిక భాషావాదంవరకూ గిడుగు భౌతికవాద పరిధిలోనే చేశాడు. గ్రాంథిక భాషావాదులు ఆ వాదాన్ని ఆధ్యాత్మికవాద పునాదినుంచి చేశారు. అందుకనే గిడుగుమీద విమర్శలు సిద్ధాంతసంఘర్షణలు. విరసం మీద విమర్శలు స్పష్టంగానే సిద్ధాంత సంఘర్షణలు. గతితార్కిక భౌతికవాదులకీ, నానారకాల భావవాదులకీ మధ్య సంఘర్షణయే విరసం మీద వస్తున్న విమర్శలకి పునాది. కొ.కు. విరసం మీద వచ్చిన విమర్శల్ని సిద్ధాంత సంఘర్షణలుగా భావించే వాదోపవాదాలు చేశాడు. విరసాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళ సిద్ధాంత పునాదిని ఎత్తిచూపించాడు.
“విమర్శ అనేది ఒక రకం ప్రచారం.” (కొ.కు.)
ప్రచారం అంటే ఒక విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఆ విషయం మీద సుముఖం చేయటానికి ప్రయత్నం చేయటం. ఏ రంగంలో అయినా విమర్శ వ్యాపారం ఇదే. సాహిత్యంలోనూ, శాస్త్రంలోనూ కూడా ప్రచారాంశం ఉండినా వాటి ప్రధాన వ్యాపారం అది కాదు. శాస్త్ర విషయాన్ని కానీ, సాహిత్య విషయాన్ని కానీ అశాస్త్రీయ, భ్రమాజనిత సిద్ధాంతాల నుంచి విముక్తం చేస్తూ ప్రజల్లో సరియైన అవగాహనని కలిగించటం విమర్శ లక్ష్యం. సాహిత్య కళారంగంలో కంటే, శాస్త్రంలో కంటే విమర్శలో వర్గస్వభావం ఎక్కువగా ఉంటుంది. సాహిత్యంలో వ్యక్తం అవుతున్న వర్గపునాదిని విశ్లేషిస్తూ ప్రగతిశీల పోరాటం వైపు సాహిత్యాన్ని మళ్ళించే కార్యక్రమాన్ని విమర్శ నిర్వహిస్తుంది. శాస్త్రపరిశోధనలకి వస్తుతః వర్గస్వభావం లేకపోయినా జీవితానికి అన్వయించటంలో, ఉత్పత్తి రంగంలో ఉపయోగించటంలో వర్గస్వభావం ఉంటుంది. ఆ వర్గస్వభావాన్ని వివరిస్తూ శాస్త్రపరిశోధనల్ని ప్రజాపరం చేయటానికి విమర్శ ఆయుధంగా ప్రయోగించబడుతుంది. కళా సాహిత్యరంగాల్లో కంటే కూడా సామాజిక, విజ్ఞానశాస్త్ర రంగాల్లో విమర్శ నిశిత ప్రచారసాధనంగా పనిచేస్తుంది. కొ.కు. తన విమర్శని ఈ విస్తృతార్థంలోనే ప్రచారసాధనంగా ఉపయోగించాడు. ప్రచారసాధనంగా విమర్శ ఎలా ఉండాలి?
“విమర్శలో కూడా నిజానికి కొన్ని లోపాలుండే అవకాశం ఉన్నది. ఆ సంగతి గుర్తించటం అవసరం. అందులో ఒకటి తెలిసినవాడికే తెలియచెప్పటం. జీవితం తాలూకు అనేక రంగాలలో ఇలాంటివి చూస్తాం. మతం వారిని మాత్రమే మెప్పించే మతప్రచారం, కమ్యూనిస్టు భావాలను ఆమోదించినవారిని మాత్రమే ఆనందపరిచే కమ్యూనిస్టు ప్రచారం, మార్క్సిస్టు దృక్పథం గలవారికి మాత్రమే అర్థమయే కళావిమర్శ.” (కొ.కు.)
ఒక ప్రచారంగా విమర్శ ఉద్దేశం ఏమిటి? తాను ప్రచారం చేయదలుచుకున్న విషయం తెలియనివాళ్ళకి తెలియచేయటం. తాను ప్రచారం చేయదలుచుకున్న విషయాన్ని ఆమోదించనివాళ్ళు కూడా ఆమోదించే పద్ధతిలో చెప్పటానికి ప్రయత్నించటం. ఇది కమ్యూనిస్టులు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. మార్క్సిస్టులకే మార్క్సిజాన్ని చెపుతూ కూర్చోవటం, మార్క్సిస్టులకే అర్థమయే విధంగా మార్క్సిస్టు దృక్పథాన్ని గురించి రాయటం వల్ల ఏమి ప్రయోజనం ఉంది? ఎంతవరకు ప్రయోజనం ఉంది? బతుకంతా మార్క్సిస్టులకే పాఠశాలలు పెట్టి, మార్క్సిజాన్ని చెప్పటం పనికివచ్చే పనేనా? కొ.కు. రచనా పద్ధతి మార్క్సిస్టులు కానివాళ్ళకి మార్క్సిజాన్ని చెప్పటానికి వీలుగా ఉంటుంది. మార్క్సిస్టులు కానివాళ్ళు మార్క్సిజాన్ని ఆమోదించే తార్కిక పద్ధతిలో ఉంటుంది.
“మానవ సమాజంలో రెండు తాత్త్విక దృక్పథాలున్నాయి. ఒకటి భౌతికవాదం. రెండు ఆధ్యాత్మికవాదం. ఈ రెంటి మధ్యా వైరుధ్యం ఉన్నది.” (కొ.కు.)
కుటుంబరావు భౌతికవాది. భౌతికవాద కోణం నుంచి జీవితాన్నీ, సాహిత్యాన్నీ, చరిత్రనీ, విజ్ఞాన శాస్త్రాన్నీ పరిశీలించాడు. ప్రధానంగా కుటుంబరావు భౌతికవాదానికి విజ్ఞానశాస్త్రాలు పునాది, విజ్ఞానశాస్త్రాలు భౌతికవాదానికి ప్రమాణాలు అయినప్పటికీ చాలామంది శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మిక వాదులుగా ఉండిన విషయం అందరికీ తెల్సిందే. సామాజిక సమస్యలకి విజ్ఞానశాస్త్ర పరిశోధనల్ని అన్వయించుకోలేక చాలామంది శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మికవాద సుడిగుండంలో పడిపోయారు. కుటుంబరావు ఆదినుంచీ భౌతికవాది. ఆదినుంచీ అంటే సాహిత్యరచన ప్రారంభించినప్పటి నుంచీ. 1940 ప్రాంతంలోనే కుటుంబరావు మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు. సమాజానికీ సాహిత్యానికీ ఉన్న సంబంధాన్ని విజ్ఞానశాస్త్రాల నుంచి గ్రహించి మార్క్సిస్టు దృక్పథంతో సుసంపన్నం చేసుకున్నాడు. నవలల్లో, కథల్లో ఒక సంఘటనని చిత్రించేటప్పుడు దానికి కారణమైన యంత్రాంగాన్ని వర్ణించటం, మానవసంబంధాల్ని హేతుబద్ధంగా వర్ణించటం కుటుంబరావు శాస్త్రీయ దృక్పథానికి ప్రమాణాలు. కార్యకారణ యంత్రాంగాన్ని ప్రదర్శించకుండా రాసే అలవాటు కుటుంబరావుకి లేదు. పదార్థం అంటే మనిషి మనస్సుకి బాహ్యంగా, స్వతంత్రంగా ఉండేది మాత్రమే అని అర్థం కాదు. మనిషి ఇంద్రియాల మీద పనిచేస్తూ, ఆ ఇంద్రియాల నుంచి ఇంద్రియ జ్ఞానాన్ని పుట్టించే బాహ్య వాస్తవికత అని అర్థం. ఇలా నిర్వచించుకోలేకపోతే పదార్థానికీ, మనుషులకీ సంబంధం ఉందని చెప్పలేం. పాత్రల చలనాలూ, సన్నివేశాలూ స్పష్టంగా పాఠకుని హేతువుని కదిలించేవిగా చిత్రించటం కుటుంబరావు సాహిత్యతత్త్వం. అభ్యూదయ సాహిత్య ఉద్యమంలో ఉన్నప్పటి నుంచీ సాహిత్యానికుండే విప్లవకరశక్తిని వివరిస్తూనే వచ్చాడు. 1970లో విరసంలో కలిసినప్పటి నుంచీ భౌతికవాదాన్ని, విప్లవాన్ని సాహిత్యానికి రెండు కళ్ళుగా చెపుతూ వచ్చాడు. మార్క్సిజాన్ని ఆమోదించనివాడు, మార్క్సిస్టు కానివాడు విప్లవ రచయిత కాజాలడని ప్రకటించాడు.
“విప్లవం అనేది భౌతికవాదం నుంచి తప్ప పుట్టజాలదు. విప్లవం అంటే విరుచుకుపడిపోయి నోట నురుగులు కక్కేవాళ్ళు అజ్ఞానులు. ఎందుకంటే ఎన్నో విప్లవదశలు గడవకుండా మనం ఇక్కడిదాకా రాలేదు. గత సమాజంలోని విప్లవాల సత్ఫలితాలన్నిటినీ పుష్కలంగా అనుభవిస్తున్నవాళ్ళే భావి విప్లవాల గురించి దడదడలాడుతున్నారు. మనం ఇవాళ అత్యున్నతమైన సామాజికదశకు వచ్చామనుకునే మూర్ఖులు. ఈ వ్యవస్థలో సుఖజీవనం గడుపుతున్నా మనుకునేవాళ్ళు తప్ప ఎవరూ విప్లవపరిణామాలు రాకూడదని అనుకోరు.” (కొ.కు.)
భౌతికవాది కానివాడు విప్లవాన్ని సాధించలేడు. విప్లవాన్ని ఆమోదించలేడు. సామాజిక విప్లవాన్ని వ్యతిరేకించటానికి నిజానికి ఎవరికీ ఏమీ కారణం లేదు. అయితే ఈ వ్యవస్థలో సుఖజీవితం గడుపుతున్నామనుకునేవాళ్ళు ఈ వ్యవస్థతో బాటు తమ సుఖజీవితం కూడా పోతుందని విప్లవాన్ని నిరాకరిస్తున్నారు. నిజానికి విప్లవం వల్ల అందరూ ఇంకా సుఖజీవితం పొందవచ్చు.
“జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవసాహిత్యం. ఇందుకు అంగీకరించనివారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి; చెయ్యలేరు.” (కొ.కు.)
విప్లవంలో సాహిత్యం విప్లవకారుల చేతుల్లో ఆయుధంగా ఉండాలి అనే స్పష్టమైన వైఖరి కొ.కు. విరసం దశాబ్దంలోనే తీసుకున్నారు. కొ.కు. సాహిత్య విమర్శలో 1970 ముందూ, తర్వాతా చాలా మార్పు ఉంది. విరసానికి పూర్వం కొ.కు. సాహిత్య విమర్శ కొ.కు. సాహిత్యానికి విమర్శ వంటిదే. విరసం దశాబ్దిలో కొ.కు. సాహిత్య విమర్శ మార్క్సిస్టు సాహిత్య విమర్శగా స్పష్టంగా ఉంది. విరసం తెలుగు సాహిత్య విమర్శలో సాధించిన మార్గదర్శక సూత్రాల్ని నిర్మించింది కుటుంబరావే…
భావవిప్లవకారుడు కొడవటిగంటి
సాహిత్యసమాలోచన ప్రగతి సాహితి,
జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ,
న్యూ ఢిల్లీ సంపాదకుడు: అశోక్ టంకసాల,
జూన్ 1982
[…] కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2 […]
[…] కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2 […]
విప్లవాలకూ భౌతికవాదానికీ సంబంధమే లేదు. ఆధ్యాత్మికవాదుల విప్లవాల్ని విప్లవాలుగా గుర్తించడానికి మార్క్సిస్టులు నిరాకరించి విప్లవాన్ని తమ ………… మాట్లాడ్డం మొదలుపెట్టారు. విప్లవానికున్న నిర్వచనాల్నే వక్రీకరించారు. ఈనాడు మార్క్సిస్టుల విప్లవపంథా ఒక చెల్లని కాసు. ఒక అరిగిపోయిన రికార్డు. నిజమైన విప్లవాలు సాంకేతిక ప్రగతి ద్వారా తప్ప మరోవిధంగా అసాధ్యమని చరిత్ర నిరూపించింది.
గమనిక:
ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ సంపాదకవర్గం
విప్లవం ఒక భౌతిక పరిణామం. ఫ్రస్తుత సమాజం, మానవుడు అనేక విప్లవాల పరిణామం. ఒక ఆధ్యాత్మిక వాది కూడా, ప్రతి రోజూ, ఫ్రొద్దున్నేలేచి, భోజనం ఇతర భౌతిక అవసరాలూ తీర్చుకొనేవాడే. అయితే ఎత్తుగడల రీత్యా ఈ వాస్తవాల్ని నిరాకరిస్తాడు. ఆధ్యాత్మికవాదులు చాలా రకాలు. నేనే దేవుణ్ణనే వాడొకడు. అంతా దైవేఛ్ఛ అనేవాడు మరొకడు, వగైరా, వగైరా. మనుగడ రీత్యా పాలక వర్గాలకి ఈ ఆలోచనలు కీలకం. విశాల ప్రజానీకం, దైవేఛ్ఛ, వగైరా ఆలోచనలకు కట్టుబడి ఉంటే పాలక వర్గాలకి శ్రేయస్కరం. ప్రపంచ వ్యాప్తంగా ఎగసి పడుతున్న ప్రజా ఉద్యమాలు, ప్రజలు తప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనల్ని, ధోరణుల్ని అధిగమించి, భౌతిక వాదంవైపు మొగ్గుతున్నారనడానికి రుజువు.
ఎప్పుడు ఏ రకమైన మార్పు విప్లవమో అనేది చెప్పినది మార్క్సిస్టులే. మరొకవంక డయలెక్టికల్ మెటీరియలిజం (గతితార్కిక భౌతికవాదం) అనేదొకటుందని తెలియనివారు కూడా ప్రతిదాన్ని గురించీ చెప్పేస్తూ ఉంటారు. మతం ఒకప్పుడు విప్లవాత్మకమే. ఇప్పుడు మటుకు కాదు. కళ్ళూ ముక్కూ మూసుకోకుండా ఉంటే అన్నీ తెలుస్తాయి. కళ్ళు చాలని పరిస్థితిలో హబ్ల్ టెలిస్కోప్ ఉపయోగపడుతోంది.
మార్క్సిజం ఒక సైంటిఫిక థియరి. ఆదిమయుగం నుంచి మార్క్సిజం ప్రకారమే ప్రపంచ గమనం ఉంది. చివరికి బాలసుబ్రమణ్యం గారు “ఇది చెల్లని కాసు” అనడంలో కూడా మార్క్సిజం ఉంది. అంటే చెల్లేకాసే ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. విప్లవపంథా ముగిసిపోవడమంటూ ఉండదు - మానవత్వం నశిస్తే తప్ప. ఒకవేళ ముగిసిందని భావిస్తే / లేక ముగిసిందని భావించినవారు మార్కెట్ అనే రాక్షసి చేతిలో బానిసలకిందే లెక్క.