- త్రిపురనేని మధుసూదనరావు

సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని గురించి బాధపడేవాళ్ళు చాలామంది వున్నారు. ప్రకృతి మీదా, సమాజం మీదా శాస్త్రీయమైన అవగాహన కలిగించవలసిన సాహిత్యం మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేయటం అన్యాయమే. కులాల్నీ, మతాల్నీ సమర్థించడం, దేవుళ్ళనీ, దెయ్యాల్నీ ఆవాహన చేయటం, స్త్రీని కించపరచటం వంటి పనుల్ని సాహిత్యం ద్వారా చెయ్యటం సామాజిక ద్రోహమే. ప్రగతిశీలవాదుల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం వుండటం కూడా సంతోషించదగ్గ విషయమే.

గురజాడ వంటి సంస్కరణవాదుల కంటే పూర్వం వున్న కవులందరూ సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని చెప్పినవాళ్ళే. మనిషి కంటే మతానికీ, కులానికీ, మనిషి ఇంద్రియాల కంటే ఆత్మకీ ప్రాధాన్యం ఇచ్చినవాళ్ళే. ఈ ప్రపంచం కంటే పరప్రపంచం గొప్పదని చెప్పినవాళ్ళే. ఈ లోకంలో జీవించటంలో పరమార్థం ఈ లోకంలో జీవించటం కాదు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించటానికి అర్హతని సంపాదించుకోవటమే ఈ లోకంలో జీవించటానికి పరమార్థం. ‘విశ్వశ్రేయః కావ్యం’ అంటే కూడా విశ్వశ్రేయస్సు అంటే పుణ్యలోక ప్రాప్తి అనే అర్థం. కాబట్టి సాహిత్యానికి మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేసిన చరిత్ర సుదీర్ఘ చరిత్రే. ఆనందం, బ్రహ్మానందం, చిదానందం, రసానందం వంటి దేనికీ పనికిరాని సంఘవ్యతిరేక ప్రయోజనాల్ని సాహిత్యప్రయోజనాలుగా చిత్రీకరించి మానవతని అవమానించారు.

తెలుగువాళ్ళకి ప్రాచీన లిఖితసాహిత్యం లేదు. నన్నయ్య నుంచీ ప్రారంభం అయిందని చెప్పబడుతున్న సాహిత్యం మధ్యయుగాల సాహిత్యమే. రాచరికంతో సురక్షితం చేయబడిన భూస్వామ్యవ్యవస్థ భావజాలాన్ని ప్రతిబింబించిన సాహిత్యాన్ని మధ్యయుగాల సాహిత్యం అంటారు. వ్యాసుని సంస్కృత భారతంలో వున్నంత ‘ప్రాచీనతా’ గుణం కూడా నన్నయ భారతంలో లేదు. రాచరిక - భూస్వామ్యవ్యవస్థ చట్రంలోకి భారతాన్ని అనువదించటం జరిగింది. అంటే భారత అనువాదం సామాజిక అనువాదమే తప్ప పండిత పరిశోధకులు ప్రచారం చేస్తున్నట్లు సాహిత్య అనువాదం కాదు. కేవలం సాహిత్యానువాదం వర్గసమాజంలో జరగదు. వర్గప్రయోజనాలకి అనుగుణ్యంగానే అనువాదాలు జరుగుతాయి. అంటే సామాజిక ప్రయోజనాల కోసం వర్గపరిధిలోనే నన్నయ్య నుంచీ జరిగిన అనువాదక్రమాన్ని మనం పరిశీలించాలి. కమ్యూనిస్టు మానిఫెస్టోనీ, మావో మిలిటరీ రచనల్నీ, వైరుధ్య, ఆచరణల్నీ వాటి కోసమే ఎవడూ అనువాదం చెయ్యడు. కార్మిక వర్గప్రయోజనాల కోసం, వర్గ పోరాటం కోసం, వర్గ యుద్ధస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం అనువాదం చేయటం జరుగుతుంది. అనువాదాల మూలకారణాల్ని అనువాదకుడు ప్రకటించిన ఉద్దేశాల్తోనే తెలుసుకోలేం. చారిత్రక, సామాజిక దృష్టితో పరిశీలించినప్పుడే అనువాదాల సామాజిక పాత్రని అర్థంచేసుకోగలుగుతాం.

ప్రకృతి గురించీ, సమాజాన్ని గురించీ సత్యాలుగా రుజువైన విషయాల మీద కూడా పౌరాణిక దృక్పథాన్ని వదలకుండా వుండటాన్ని మూఢవిశ్వాసం అనవచ్చు. ఫ్యూడల్ సమాజంలో మతం ప్రధాన భావజాలంగా వుంటుంది. పరిణామాత్మక మార్పులు కూడా మతం ముసుగులోనే జరుగుతాయి. మతం స్వతంత్రశక్తి కాదు. అంటే మతంగా మతం మంచీ చెయ్యలేదు, చెడూ చెయ్యలేదు. అనిర్దిష్ట మతం కూడా వుండదు. మతం పేరుతో వర్గాలూ, బృందాలూ దోపిడీ చేస్తాయి. యుద్ధాలు చేస్తాయి. రెండు మతాలు యుద్ధం చెయ్యలేవు. రెండు మతాల పేరుతో రెండు వర్గాలో, రెండు జాతులో, రెండు దేశాలో యుద్ధం చేస్తాయి. అందుకని మూఢవిశ్వాసాలన్నీ మతాలకి అంటగట్టి మతవ్యతిరేక యుద్ధ ప్రకటనలు చేయటం ఒక పెద్ద మూఢవిశ్వాసం. మతసంబంధమైన సామాజిక మూలాలు వెతికి వాటికి వ్యతిరేకంగా బాణం ఎక్కుపెట్టాలి. మధ్యయుగాల సాహిత్యంలో మూఢ విశ్వాసాలుగా కనిపించేవి దాదాపుగా అన్నీ పాలకవర్గ భావజాలంలోనూ, యుగభ్రమల్లోనూ భాగాలే. అందుచేత మతాల్నీ, మూఢవిశ్వాసాల్నీ సిద్ధాంతస్థాయిలో ఖండించి, నిరాకరించటమే పెద్ద పోరాటం అని ఇప్పుడు భావించటం నిరర్థకమైన వ్యవహారం. వర్గపోరాటంలో భాగం కాని మతవ్యతిరేక, మూఢవిశ్వాసాల వ్యతిరేక పోరాటం భావవాద స్థాయిలో, ఆదర్శవాదస్థాయిలో వుండిపోతుంది. మతం జీవితానికి తలక్రిందు ప్రతిబింబం. మతాన్ని కాళ్ళ మీద నిలబెడితే మతం ప్రతిబింబించిన జీవితాన్ని విశ్లేషించవచ్చు. అప్పుడు మతం పోయి జీవితం మిగులుతుంది. మనిషి తననుంచే దేవుడ్ని సృష్టించాడు. ఆ దేవుడికి తానే లొంగిపోయాడు. సామాజిక మానవతని సాధిస్తే దేవుడు మరి కనపడడు. మతాన్నీ, మూఢవిశ్వాసాల్నీ శాస్త్రీయదృష్టితో పరిశోధించిన ఆధునిక రచయితల్లో కుటుంబరావుది ప్రత్యేక స్థానం.

“నాకు విశ్వాసం మనిషిలోనే కానీ, దేవుడిలో లేదు” (కొ.కు.)

కొ.కు. జీవితంలో, సాహిత్యంలో ఎన్నడూ దేవుడిని విశ్వసించలేదు. చరిత్రలోనె యే అంశాన్ని పరిశీలనకు తీసుకున్నా కొ.కు. మనిషి నుంచి వివరించటానికే పూనుకున్నాడు. మనిషిని గురించి అవగాహన చేసుకోవటానికి మానవాతీత శక్తుల్ని ప్రమాణంగా గ్రహించే ఆస్తికవాదాన్ని కొ.కు. తొలిదశలో కూడా చేయలేదు. భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గం లాభాల్ని పొంది, ప్రజలు తీవ్రమైన కష్టాలు పడిన ఆర్థిక సంక్షోభపు రోజుల నుంచీ సాయుధ విప్లవమే జాతి విముక్తికి మార్గం అని బోధిస్తున్న నేటి వరకూ కొ.కు. మనిషి మీద విశ్వాసంతోనే రచయితగా జీవించాడు.

“దేవుడి పుట్టుకే పాపిష్టిది” (కొ.కు.)

ప్రకృతి శక్తుల మధ్య సంబంధాల్నీ, ప్రకృతిలో సంభవించే సంఘటనల్నీ మానవత్వ, జంతు, దైవత్వ ఆరోపణ చేయటం వర్గేతర సమాజజీవితంలో అనివార్యం. తర్వాత వర్గసమాజంలో ఈ ఆరోపణలకే మతరూపం ఇవ్వడం జరిగింది. వర్గసమాజంలోనే మానవుల మీద అధికారం చెలాయించే దుష్టశక్తిగా దేవుడు పాలకవర్గం పాలు తాగి పెరిగాడు. అందుకే దేవుడి పుట్టుక పాపిష్టిది అన్నాడు కొ.కు.

“సమష్టి దృక్పథం పోయి వ్యష్టి దృక్పథం వచ్చేసరికి దేవుడి అవసరం కలుగుతున్నట్టు కనిపిస్తుంది” (కొ.కు.)

ఆదిమ గణ సమాజాల్లోనే కాదు; వర్గ సమాజాల్లో కూడా సమష్టి దృక్పథం వున్నప్పుడు భక్తులకు కూడా దేవుని గురించిన స్పృహ వుండదు. దేవుడిని పదిమంది కలిసి చూసినట్టు చెప్పటం ఎక్కడా లేదు. ఎవడు చూసినా ఒంటరిగానే చూశాడు. దేవుడు కూడా పక్కవాడికి కూడా కనబడకుండా తన భక్తుడికే కనబడటం జరిగినట్లు ప్రచారంలో వుంది. సమాజాన్ని వదిలిపెట్టినవాళ్ళకీ, జీవించటం మానేసినవాళ్ళకి దేవుడి అవసరం ఎక్కువలా వుంది. అడవుల్లోనూ, కొండల్లోనూ ఏకాంతవాసం చేసేవాళ్ళకి తప్ప దేవుడు ఎవరికీ ప్రత్యక్షంగా కనబడినట్టు లేదు. సమష్టి కార్యాల్లో దేవుడి ప్రసక్తిని తేవడం, ప్రమేయాన్ని నిరూపించడం కష్టం. స్వాతంత్ర్య ఉద్యమానికీ, అక్టోభర్ విప్లవానికీ దేవుడు కారణం అంటే జనం మొఖం మీద వుమ్మేస్తారు. సమష్టి దృక్పథం సమష్టి కార్యాచరణ నుంచి పెరుగుతుంది. సమష్టి కార్యాచరణ పెరిగే పరిణామంలో దేవుడిని గురించిన ఆలోచన కూడా తరుగుతూ వస్తుంది.

“హేతువాదాన్ని నమ్మాలన్న ప్రేరణ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. దాన్ని సక్రమంగా పని చెయ్యకుండా చెయ్యడమే దేవుడి పాత్ర” (కొ.కు.)

దేవుడిని గురించి ప్రచారం చేసేవాళ్ళు పరమ హాస్యాస్పదమైన వ్యక్తులు. పళ్ళపొడిని గురించీ, అమృతాంజనం గురించీ ప్రచారం చెయ్యటంలో అన్నా అర్థం వుంది. దేవుడిని జనం నమ్మటం వల్ల ప్రయోజనాన్ని పొందే స్వార్థపర వర్గాలు వున్నాయి. అందుకని జనం ఎక్కడ మరిచిపోతారో అని ఈ వర్గాలు దేవుడిని గురించి ప్రచారం చేస్తూ వుంటాయి. దేవుడికీ మన నిత్య జీవితానికీ సంబంధం వున్నట్టు ఒక్క ఉదాహరణ కూడా ఇవ్వలేం. హేతువాది కాకుండా మనిషి ఒక్క చిన్నపని కూడా చెయ్యలేడు. ఆశ్చర్యం ఏమంటే హేతువాదం చెయ్యకుండా దేవుడిని గురించిన ప్రచారం కూడా చెయ్యడం సాధ్యం కాదు.
“కష్టసుఖాలు మిథ్య అనుకొని రెండింటికీ అతీతంగా ఉండమని మతబోధకులు చెప్పారు. రెండింటికీ అతీతంగా ఉండదలిస్తే జీవించటం దేనికీ?” (కొ.కు.)

కష్టాల్ని తగ్గించుకుంటూ సుఖాల్ని పెంచుకునే మార్గం చూడాలి కానీ కష్టసుఖాలకి అతీతంగా ఉండటం దేనికి? పోనీ అలా చెప్పినవాళ్లు నిజంగా కష్టసుఖాలకి అతీతంగా ఉన్నారా? పరమ సాధువుగా పేరు తెచ్చుకున్న వినోబా భావే పుష్టికరమైన ఆహారాన్ని సంతృప్తిగా భోంచేస్తూ జనాన్ని కష్టసుఖాలకి అతీతంగా వుండమంటున్నాడు. దీనికి అర్థం మీరు కష్టపడండి, మేం సుఖంగా వుంటాం అని కాక ఇంకా యేముంది?

“మనం మనకి లభ్యమై ఉన్న భౌతికజ్ఞానాన్నీ, సమాజజ్ఞానాన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మానవ జీవితం చాలా బాగుపడుతుంది.” (కొ.కు.)

దేవుడూ, మతం వంటివాటి పుట్టుకనూ, పాత్రనీ విశ్లేషించి భౌతిక, సమాజజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించటం, అతీతశక్తుల లౌకిక పునాదిని ఎత్తిచూపటం కొ.కు. ఆలోచనా పద్ధతిలో ఒక భాగం.
సాహిత్య కళారంగాల మీద కొ.కు. దృష్టి శాస్త్రీయమైనదే కాదు, విప్లవాత్మకమైనది కూడా. కళని గురించీ, సాహిత్యం గురించీ కొ.కు. ఏ రకమైన మూఢవిశ్వాసానికీ తావు ఇవ్వలేదు. చాలామంది అభ్యుదయ దృక్పథం వున్నవాళ్ళకి కూడా సాహిత్యంలో మూఢవిశ్వాసాల మీద స్పష్టమైన వైఖరి వున్నప్పటికీ, సాహిత్య స్వరూపం మీద అనేక మూఢవిశ్వాసాలు వుంటాయి. కొ.కు. సాహిత్య స్వరూపాన్ని భౌతికవాద దృక్పథం నుంచి పరిశీలించాడు.

“మన బూర్జువా సంస్కృతి ఫ్యూడల్ సాంకర్యం కలిగినది. ఫ్యూడల్ సంస్కృతిని నిర్మూలించి పైకి వచ్చినది కాదు. దానితో చేతులు కలిపి రాజీ పడినది.” (కొ.కు.)

ఈ ఒక్క వాక్యంలో కొ.కు. ఆధునిక సామాజిక వ్యవస్థని బహుముఖంగానూ, లోతుగానూ విశ్లేషించాడు. మన సాంస్కృతిక రంగాన్ని అర్థం చేసుకోవటానికి ఈ సూత్రీకరణ ఎంతో వుపయోగపడుతుంది. పారిశ్రామిక పునాది మీద కూడా ఫ్యూడల్ భావజాలపు జెండా ఎగురుతూ వుండటం మన సాంస్కృతిక పోరాటాన్ని సంకీర్ణం చేస్తూ వుంది. మనం దేన్నీ సరళరేఖలో అర్థం చేసుకోలేం. అన్నీ వక్రరేఖలే. కొన్ని సందర్భాల్లో బిందువును గుర్తించడం అసాధ్యం అయిపోతుంది. బూర్జువా సంస్కృతి ఆకారం ఫ్యూడల్ సంస్కృతి సారాంశం. చాలామంది ప్రముఖ ఆధునిక రచయితలు వాస్తవానికి సారాంశంలో ఫ్యూడల్ భావజాలం ఉన్న రచయితలే. అభ్యుదయ రచయితల్లో కూడా ఎంతోమంది భూస్వామ్య ఆలోచనాపద్ధతుల్ని వదిలించుకోలేకపోయారు. వీళ్ళకి తెలిసిన మార్క్సిజాన్ని తమ ఫ్యూడల్ భావజాలచట్రంలో ఇమిడ్చారు. లెనిన్‌ని అవతారపురుషుడుగా వర్ణించిన అభ్యుదయ కవులూ, మార్క్స్‌ని మహర్షి చేసిన అభ్యుదయ కవులూ వున్నారు. హిందూమతాన్ని నిరాకరించి బౌద్ధధర్మాన్నీ, క్రైస్తవమతాన్నీ ప్రస్తుతించిన అభ్యుదయ మేధావులు వున్నారు. యువకుడుగా ఉన్నప్పుడు మార్క్సిస్టు వీరాలాపల్ని చేసి, నడివయస్సు నుంచీ ఎం.ఎన్.రాయ్‌నో, అరవిందుణ్ణో, జిల్లేళ్ళమూడి అమ్మనో ఆశ్రయించినవాళ్ళు ఎంతోమంది వున్నారు. మార్క్సిజానికి ఈ గతి పట్టడానికి కారణం మౌలికంగా ఫ్యూడల్ భావజాలం నుంచి బయట పడకపోవడమే. యౌవనంలో ప్రగతిశీలవాదం చేసి ముసలితనంలో భగవద్గీత పారాయణ చేసే సంకర జాతి వుండటానికి కూడా ఇదే కారణం. ఫ్యూడల్, బూర్జువా సంస్కృతుల సాలెగూడులో పడకుండా తుదివరకూ అభ్యుదయ, విప్లవవాదిగా నిలిచిన రచయిత కొ.కు. ప్రాచీన, ఆధునిక సంస్కృతిని గురించి సామాజిక, వర్గ విశ్లేషణ చేయడంలో కూడా కొ.కు. కి మన ఆధునిక సంస్కృతి మీద వుండిన ఈ అవగాహనే దోహదం చేసింది.

“సాహిత్యంలో జీవిత విశ్లేషణ ఉంటుంది. జీవితం స్పష్టం చెయ్యలేనిదాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది” (కొ.కు.)

జీవిత పరిభాషలోనే సాహిత్యం వుంటుంది. జీవితం నుంచి జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. జీవితం తన తత్త్వాన్ని తానే స్పష్టం చేయలేదు. ఎంత నిశితమైన దృష్టి ఉన్నా ఏ ఇతర సాధనాల సహకారం లేకుండా జీవితాన్ని విశ్లేషించటం సాధ్యం కాదు. సాహిత్యంలో జీవితం ప్రతిబింబిస్తుంది. కాబట్టి జీవితాన్ని గురించి సాహిత్యం నుంచి అవగాహన చేసుకోవడం సాధ్యం అవుతుంది. కొ.కు. సాహిత్యానికి, జీవితానికి ఈ శాస్త్రీయ సంబంధాన్ని అంగీకరించాడు కాబట్టే -

కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2

8 అభిప్రాయాలు

  1. John ravi prakash 05 ఆగస్టు 2007 , 8:55 pm

    గత కొన్ని దశాబ్ధాలుగా రాజకీయ పరిధిలోని తిరోగమనం మూలాన, ప్రజావళిలో, మధ్య తరగతిలో, ప్రగతిపర ఆలోచనలు కొంతవరకు క్షీణించాయి.ఈ స్థితిలో కొడవటిగంటి కుటుంబరావు గారి రచనల్ని మళ్ళీ ప్రచురించడం సమయోచితం. గతితార్కిక సిద్ధాంతాల్ని వారు సాహిత్యాచరణ లో నిబద్దతతో వాడటం జరిగింది. ఈ సిద్ధాంతాలు వాడుక భాషలో అందుబాటులో రావటం ఈ రోజున అవసరం. కుటుంబ రావుగారికి విప్లవ జోహార్లు.

  2. PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు: 19 ఆగస్టు 2007 , 10:04 pm

    […] వ్యాసాలు: కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1 - త్రిపురనేని మధుసూదనరావు […]

  3. T.L .Bala Subrahmanyam 24 ఆగస్టు 2007 , 5:53 am

    మీకు మీరే గొప్పలు. మీకు మీరే కితాబులూ ! భేషు ! మీకు ఆధ్యాత్మికత గురించి తెలియకపోతే ఊరుకోండి ! ఆసక్తి లేకపోతే గమ్మునుండండి. నమ్మకపోతే మానెయ్యండి ! ఈ రాతలు రాసే హక్కు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోను లేదు. మీరిలా మీ యిష్టం వచ్చినట్లు రాస్తే మీ మీద రాసే హక్కూ అవకాశమూ ఆధ్యాత్మిక వాదులకు కూడా వస్తాయి.

  4. Rohiniprasad 24 ఆగస్టు 2007 , 1:51 pm

    బాలసుబ్రహ్మణ్యంగారు ఎవరిని కోప్పడుతున్నారు? కుటుంబరావుగారూ, మధుసూదనరావుగారూ ఎప్పుడో కాలం చేశారు.

    ఆధ్యాత్మిక రచనలు చేసేవారికి నాస్తికుల గురించి రాసే హక్కులుంటాయా? ఆధ్యాత్మిక భావాల గురించి చాలానే పరిశోధనలు జరుగుతున్నాయి. కావాలంటే పరికించండి:
    http://www.nytimes.com/2007/08/24/science/24body.html?_r=1&oref=slogin

    సైంటిస్టులు “గమ్మునుండటం” లేదు మరి.

  5. Vipul 07 సెప్టెంబర్ 2007 , 3:02 am

    బాలసుబ్రమణ్యం గారూ మీరు చెప్పే ఆధ్యాత్మికత దేనిగురించి? ఎవరైనా ప్రజాక్షేమం కోసమే కదా సాహిత్యసౄజన చేసేది. పగతో రాయడం ఉంటుందా. ప్రగతిశీల దృక్పథమే ఉంటుంది - అది ఎటువంటిదైనా సరే. ప్రజా పక్షమూ ప్రగతిశీల దృక్పధమూ లేకపోతే అది ఎటువంటిదైనా చెత్తబుట్టలో పడేయాల్సిందే. మీ అధ్యాత్మికత వ్యక్తి దృక్పధమా లేక సంఘ దృక్పధమా. ఈ రెండింటిలో ఏఒకటీ లేకున్నా రెండూ లేవు. మానవజాతి చరిత్రలో ఈ రెంటికీ కీడుచేసే ఆధ్యాత్మిక/మత (అది ఏమతమైనా)/ చాంధస భావాలను విడిచిపెట్టాలి. కాదనగలరా..

  6. Ranganatha Raju 24 అక్టోబర్ 2007 , 4:02 am

    ఆధ్యాత్మిక భావము లౌకిక భావము వేరనుట తప్పు.జీవితములొ ఆధ్యాత్మిక దృక్పదము ఉంటేనేకదా ప్రగతిశీల వాదనలు సమాజానికి ఒక నైతిక గమ్యమునకు చేర్చుతాయి.ఆధ్యాత్మిక భావము అనవసరమంటె ప్రగతిశీలమే వద్ధనట్టు!!!

  7. Rohiniprasad 24 అక్టోబర్ 2007 , 10:08 am

    ఆధ్యాత్మికభావములు అన్నీ చిత్తభ్రమలే. జీవపరిణామాన్నీ, మెదడు నిర్మాణాన్నీ, అది పనిచేసే తీరునూ అర్థంచేసుకుంటున్న ఇరవయ్యొకటో శతాబ్దంలో మధ్యయుగాల అభిప్రాయాలు వదులుకోవాలి. ఆధ్యాత్మికత పాలపీకలాగా మనసును జోకొట్టగలదేమో కాని అందులో పాలు వస్తాయనుకోవడం తప్పు.

  8. umamaheswara rao c 25 అక్టోబర్ 2007 , 12:22 am

    Apt and wonderful simile Mr. Rohini prasad.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)