నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా నాన్నగారిని, ఏ వ్యాపకము లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోగా చూసినట్లు గుర్తు లేదు. నిద్రపోయినప్పుడు తప్ప తక్కిన సమయంలో చదవడమో, రాయడమో, తోటపనో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మనస్సుకూ, దేహానికీ సోమరితనం అనేది లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం అనుకుంటాను.
ప్రసిద్ధ వ్యక్తులు తమ ఆంతరంగిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని సామాన్యంగా అందరికీ కుతూహలంగా ఉంటుంది. మా నాన్నగారి విషయంలో ఈ సంగతి చెప్పడం చాలా సులభం. రచయితగా ఆయనకు ఏ అభిప్రాయాలు ఉండేవో, వ్యక్తిగా కూడా అవే భావాలు ఉండేవి. ఈ విషయంలో ఆయన నిజాయితీ నూటికి నూరుపాళ్ళని చెప్పగలను. ప్రపంచంలో ఆయనకు ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉండేవి. దాదాపుగా వాటన్నిటి గురించీ ఆయన అసంఖ్యాకమైన తన లేఖల్లోనో, వ్యాసాల్లోనో ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఉత్తరాలకు ఆలస్యంచెయ్యకుండా శ్రద్ధగా జవాబు రాయడం ఆయనకు అలవాటు కనుక ఈ సంగతి చాలామందికి తెలిసినదే.
తక్కిన విషయాలలో కూడా ఆయన నమ్మకాలూ, అభిరుచులూ ఖచ్చితంగానే ఉండేవి. పూజలూ, పునస్కారాలూ మా ఇంటా వంటా ఉండే ఆస్కారం మొదటి నుంచీ లేదు. ఒకసారి మద్రాసులో మా పొరుగువాళ్ళు ‘రాధా కల్యాణం’ నిమిత్తమై చందాలు వసూలు చేద్దామని వస్తే మా నాన్న వాళ్ళని రాధ ఎవరనీ, ఆమె కల్యాణం తమరెందుకు చేయాలనీ అడిగారు. వచ్చినవాళ్ళు తెల్లబోయి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. మద్రాసు వంటి ఆస్తిక నగరంలో ఈ రకం గొడవలు మామూలే అయినా, ఆ రోజు నుంచి మా కాలనీ వాళ్ళు ఇటువంటి విషయాలలో మా ఇంటి జోలికి రావడం మానేశారు.
ఇన్సూరెన్స్ దరఖాస్తులు వగైరా నింపేటప్పుడు ‘మతం’ ప్రస్తావన వస్తే నాన్నగారికి చాలా చిరాకుగా ఉండేది. చివరి రోజులలో సోషల్ ఆంత్రోపాలజీ వంటి వాటిలో ఆసక్తి పెరిగి మూఢాచారాల మూలకారణాలు అర్థం చేసుకున్నాక, ఆయనకి ఈ భజన సమాజాల వాళ్ళని చూస్తే మరీ విసుగ్గా ఉండేది.
పెళ్ళి వగైరాల గురించిన ఆయన అభిప్రాయాల దృష్ట్యా, మా ఇంట జరిగిన రిజిస్టర్డ్ పెళ్ళిళ్ళూ, కట్నాలు పుచ్చుకోవడాలూ పెద్ద విశేషంగా కాకపోయినా అవి ఆయన వ్యక్తిత్వంలోని భాగాలే.
మా నాన్నగారి శాస్త్రీయ దృక్పథం నిజంగానే సైంటిఫిక్‌గా ఉండేది. ప్రతీది శాస్త్రీయ పద్ధతిలో చదివి అవహగాన చేసుకుంటే తప్ప ఆయనకు తృప్తి ఉండేది కాదు. క్లిష్టమైన వాటి గురించి చదివినప్పుడు వివరంగా నోట్సు రాసుకోవడం ఆయనకు అలవాటు. సైన్సులో ఆయనకు ఆసక్తి ఎక్కువ. తనకు ఉన్న వ్యవధిలో ప్రపంచంలో జరుగుతున్న పరిశోధనల వివరాలన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. ఆయనకు ప్రతిదీ తాను నేర్చుకుని ఇతరులకు చెప్పడం అలవాటు. ఆయన వ్యాసాలలో అది స్పష్టంగా కనిపిస్తుంది.
మా నాన్న ముఖ్యమైన వ్యాపకాలలో తోటపని ఒకటి. 1957లో కోడంబాకంలోని స్వంత ఇంటిలో ప్రవేశించినప్పటి నుంచి చివరి రోజుల దాకా తోటలో తిరిగి మొక్కలు పాతి, నీళ్ళు పోసి ఆ పనులలో మునిగితేలడం ఆయన రోజువారీ కార్యక్రమం. జబ్బు పడ్డాక విశ్రాంతి కోసమని డాక్టర్లు చెప్పగా, వ్యాయామం ఉండాలని తోటలో తిరిగి చిన్న చెంబుతోనైనా మొక్కలకు నీళ్ళు పోసేవారు.
మా బాబాయి కృష్ణమూర్తిగారికీ, మా నాన్నకూ చాలాకాలంగా హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండేది. ఫోటోగ్రఫీలో కూడా ఆయనకు చాలా దశాబ్దాలుగా ఆసక్తి ఉండేది. మనవరాళ్ళూ, మనమలూ పుట్టినాకా కూడా ఉత్సాహంతో స్వయంగా ఫోటోలు తీస్తూనే ఉండేవారు. ‘కినిమా’ మాసపత్రిక నడిపినన్నాళ్ళూ సినిమాటోగ్రఫీ, ట్రిక్ ఫోటోగ్రఫీ వగైరాలను గురించి పాఠకులకు ఆసక్తి కలిగించే వ్యాసాలు ప్రచురించారు. మా నాన్నగారి అతి ముఖ్యమైన మరొక వ్యాపకం సంగీతం.
రచయితగా ఆయన గురించి నేను ప్రత్యేకంగా రాయగలిగిందేమీ లేకపోయినా, రాయడంలో ఆయన పద్ధతి అపూర్వమైనదిగా నాకనిపిస్తుంది. తెలుగులో అంత ‘ఫ్రొఫెషనల్’ రచయిత మరెవరూ లేరేమో. ఏ విషయం గురించి అయినా సులభమైన భాషలో, వ్యర్థమైన పదాలు లేకుండా రచనలు చెయ్యగలగడమే కాక, రాసినదానికి చిత్తుప్రతి అనేది కూడా తయారుచేసుకోకపోవడం విశేషమని నేననుకుంటాను. ఏది రాసినా ఒకసారే రాసేవారు. రాసినదాన్ని దిద్దటం కాని, తిరిగి రాయటం కాని చేసేవారుకాదు. అలాంటి అవసరమూ ఉండేది కాదు. ‘ఇది ఎలా సాధ్యం’ అని నేనడిగితే- రాసే వేగమూ, ఆలోచించే వేగమూ సమానంగా ఉండాలనీ, ఏది ఎక్కువైనా కష్టమేననీ అన్నారు. ఇది తాను అభ్యాసంలో సాధించిన ప్రజ్ఞ. ఆయన ఉత్తరాలు కూడా స్పష్టంగా సూటిగా ఉండేవి. ఆయన రాసిన ‘చందమామ’ కథలన్నింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. ఏదైనా రాసేటప్పుడు మంచం మీద బోర్లా పడుకుని రాసేవారు. సిగరెట్లు కాల్చే రోజులలో చేతిలో సిగరెట్టుండేది.
మానసికంగా మా నాన్నగారికి ‘ముసలి’ లక్షణాలుండేవి కాదు. వయస్సు వల్ల తన శరీరం పట్టు తప్పుతున్నదని గమనించి ఆయన ఆశ్చర్యపడేవారు. 1979లో బాగా జబ్బు పడ్డప్పుడు బ్రెయిన్ స్పెషలిస్టు ఒకరు ఆయన రోగ లక్షణాలను వివరిస్తూ ‘ఎప్పటికైనా పోవలసిందేకదా’ అన్న ధోరణిలో మాట్లాడితే అతన్ని కోప్పడి, అది కర్మవాదం (Fatalism) అవుతుందనీ, వైద్యం కాదని అన్నారు. చివరిదాకా ఎప్పుడూ పెద్ద జబ్బులతో తీసుకోకుండా జీవించగలగడం ఆయన వ్యక్తిత్వానికి సరిపోయిందని అనుకుంటాను. జబ్బు పడటమన్నా, సేవలు చేయించుకోవటమన్నా ఆయనకు విసుగుగా ఉండేది. వైరాగ్యం, వేదాంత ధోరణి ఉండేవి కావు.
మా నాన్న తన జీవితంలోని ప్రతి దశలోనూ తన బుద్ధినీ, మనస్సునూ వికసింపచేసి ముందుకు తీసుకువెళ్ళే విషయాలపైనే మొగ్గు చూపారు. ఆయన సమకాలికులనూ, తర్వాతి తరాలవారినీ చూసినప్పుడు, ఆయన ఏ స్థితికి దిగజారి ఉండగలడో అర్థం అవుతుంది. నిరాశావాదంగానీ, పలాయన మిథ్యావాదాలు గానీ ఎప్పుడూ ఆయనకు అంటలేదు. నిత్య జీవితంలో అల్పమైనవి అని ఆయన అనుకున్న విషయాలలో జోక్యం కలిగించుకునేవారు కాదు. పిల్లలుగా మేము ఆయన దగ్గిర ప్రత్యేకంగా చెప్పుకున్నది ఏమీ లేకపోయినా, ఇంటి వాతావరణంలో పరోక్షంగా ఆయన శక్తి పనిచేస్తూనే ఉండేది. రచయితగా కూడా ఆయన తన కథలలో ఇది అవలంబించినట్టు కనిపిస్తుంది.
రోహిణీ ప్రసాదుగారూ - మంచి వివరాలు అందించినందుకు కృతజ్ఞతలు. ఈనాటి యువతరంలో చాలామందికి ఆయన సాహిత్యం, వ్యాసాలు తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం, జీవన విధానం తెలియదు. ఆయన సాహిత్యాన్ని, వ్యాసాలనీ భధ్రపరిచి భావితరాలకు అందిస్తున్నట్లే ఆయన జ్ఞాపకాలనూ, ఫోటోలనూ, ఉత్తరాలనూ, నివశించిన ఇంటినీ జాగ్రత్తగా కాపాడాలి. ఇది విజ్ఞులైన సాహితీజీవుల బాధ్యత.