తను చేస్తున్న పని యొక్క స్థూల ప్రయోజనాన్ని ఏ కళాకారుడూ సంపూర్ణంగా తోసివెయ్యరాదు… కవి తన రచన యొక్క ఆశయాన్ని తృణీకరించరాదు. భోజనం దగ్గర ఎంత నాజూకూ, అభిరుచీ ఉన్నా అభ్యంతరం లేదు- భోజనం చెయ్యటం యొక్క ఉద్దేశాన్ని ఏమరకుండా ఉంటే సరి.
-కొ.కు., 1940
సమాజం గురించి నిర్దిష్టమైన అభిప్రాయలు ఉండి, సమాజానికి తాము అందివ్వవలసిన సందేశం ఉన్నదనుకొన్నప్పుడు లేదా, సమాజంలో నిర్వహించ వలసిన తక్షణ, అనివార్య కర్తవ్యం ఉన్నదనుకొన్నప్పుడు- రచయితలు ఎక్కువకాలం కాల్పనిక కళారూపాలకే అంటిపెట్టుకొని ఉండడం సాధ్యంకాదు.
రచయితలు ఆలోచనాపరులూ- తాత్వికులూ అయేకొద్దీ లేదా, రచయితలుగా కన్న తమ పాత్ర ప్రచారకులుగా గురుతరమైందని గుర్తించేక్దొ, వాళ్ళ దృష్టిలో కల్పన కన్నా కర్తవ్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ కర్తవ్యం విశ్వనాథ సత్యనారాయణకు ‘హిందూ ధర్మ పునరుత్థానం’ కావచ్చు, చలానికి ‘ఈశ్వరాన్వేషణ’ కావచ్చు, కొడవటిగంటికుటుంబరావుకు సామ్యవాద చైతన్య ఆవిష్కరణ కావచ్చు. ఎవరైనా తాము నమ్మిన రచనా ప్రయోజనం కోసం కల్పన అనే కుబుసాన్ని విడువక తప్పలేదు.
సుంకర ‘మాభూమి’ నాటకాన్ని మెచ్చి, గిడుగును పొగడి, శ్రీశ్రీని యుగకర్తగా కొనియాడిన విశ్వనాథ- తన ‘కిన్నెరసాని పాటలు’, ‘కోకిలమ్మ పెళ్ళి’ వంటి పాటలను, ‘వీరవల్లడు,’ ‘పరీక్ష’ వంటి నవలలను, ఇంకెన్నెన్నో సాహిత్య ప్రక్రియలను వదిలి ‘పురాణ వైర గ్రంథమాల’లో తనను తాను తెలుసుకున్నాడు. ఎక్కడ రాయడం ప్రారంభించినా, తాత్కాలికంగా ఏ జీవితసత్యాలకు స్పందించినా ఒకానొక ఆవేశపూర్వ ఘట్టంలో, ఏ జాతీయోద్యమంతోనో, వాడుక భాషావాదంతోనో కొట్టుకపోయినా, చివరకు ‘అరసం’ సభలకు అధ్యక్షత వహించినా, తాను సంరక్షించవలసింది ఏ వర్ణ, ఏ వర్గ ప్రయోజనాన్నో గ్రహించిన తర్వాత రచనకు సంబంధించిన నాజూకుతనం ఇంక ఆయనకు పట్టలేదు.
ఎప్పుడూ అనుభవించింది పలకరించడమే తన పనిగా చెప్పుకొని కథలు, నవలలు, నాటికలు, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ వంటి ఎన్నెన్నో సాహిత్య ప్రక్రియలను ప్రయత్నించిన చలం, తన అన్వేషణలోని- నిజాయితీలోని- తపనలోని శక్తివల్ల రచనకు బలమైన శైలి అబ్బిందని తేల్చిచెప్పిన చలం, ‘ఈశ్వరార్వాదాలు ఇహ లోకానికి’ అందించడమే తన కర్తవ్యంగా తేల్చుకున్న తర్వాత రాసినవి ‘వంటింట్లో భగవాన్’, బైబిల్, భగవద్గీత అనువాదాలు, ‘శ్వరాశీర్వాదాలతో’ ఉత్తరాలు.
కొడవటిగంటికి సాహిత్య ప్రయోజనం గురించి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. సాహిత్యానికి విశ్వజనీనమైన, సార్వకాలీనమైన విలువలు ఉంటాయని ఆయన ఏనాడూ భ్రమపడలేదు. తన రచనలు శాశ్వతంగా నిలవాలని తాను కోరుకోవటం లేదని ఆయన చెప్పింది వినయం ( modesty ) వల్ల కాదు, విజ్ఞత ( wisdom ) వల్ల. ఎందుకంటే ఆయన పదార్థానికున్న మార్పు స్వభావాన్ని ఒంటబట్టించుకున్నాడు. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా నిరంతర చలనంలో ఉండి మార్పుకు గురి అవుతూంటే సాహిత్యం ఒక్కటే సర్వకాలీనతను ఎట్లా సంతరించుకుంటుందనేది సైంటిస్టుగా ఆయనకు కలిగిన సందేహం. ఈ సందేహంతో ఆయన భారత, రామాయణాలనే కాదు, వేదాలను, ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేశాడు. వేదకాలం నాటి సమాజాన్ని అధ్యయనం చేశాడు. అప్పటికీ, ఇప్పటికీ సామాజిక విలువల్లో పోల్చుకోవడానికి వీల్లేనంతగా మార్పులు వచ్చాయి. వేదకాలపు సమాజం ‘నిర్వేదమై’ పోయిన స్థితిలో వేదాలు ఈనాటికీ ‘వేదవాకుక’గా మనకెట్లా దిక్కవుతాయి! ఆనాటి విలువలు ఎంతో రూపాంతరం చెంది కొత్త కొత్త రూపాల్లో ఈనాటి సామాజిక శక్తులకు వారి వారి ప్రయోజనాలకు వినియోగపడవచ్చు. అందుకే ఆయన వాల్మీకి రామాయణం మీద కాదు ‘రామాయణ కల్పవృక్షం’ మీద దాడి చేయమన్నాడు. వాల్మీకి రామాయణంలోని విలువలు ‘కల్పవృక్షం’లాగా నేటికీ వినియోగపడతాయని చెప్పే గతవాదాన్ని ఖండించమన్నాడు. ‘చేసిన స్నానమే మరల చేసినట్లు, తిన్న అన్నమే మరల తిన్నట్లు’ అనే పరమ యాంత్రిక భౌతికవాద తర్కంతో గతాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న కుట్రమీద దాడి చేయమన్నాడు. కన్‌ఫ్యూషియస్‌ను పెట్టుబడిదారీ పునరుద్ధరణఖు వాడుకోజూపిన రివిజనిజాన్ని ఎండగట్టడానికి చైనాలో మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వచ్చినట్లుగా మన సమాజంలోని మార్పులను నిరోధించడానికి గతాన్ని ఆశ్రయించిన వారిని, గతాన్ని పునరావిష్కరించదలచిన వారిని ఎదుర్కోవాలన్నది ఆయన ఆకాంక్ష.
సాహిత్య ప్రయోజనం గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నట్టే, సాహిత్య ప్రక్రియల గురించి కూడా కుటుంబరావుకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. సమాజానికి ఎటువంటి సాహిత్యం కావాలి, సమాజానికి కావలసిన సాహిత్యంలో తాను ఏ మేరకు ఏ కర్తవ్యాన్ని నిర్వహించగలడనే విషయంలో కూడ ఆయనకు తన రచనా పరిమితులు తెలుసు. అలాగే సాహిత్యానికున్న పరిమితులు తెలుసు, అపరిమిత ప్రయోజనమూ తెలుసు. తనకున్న సామర్థ్యము, దాన్ని పూరాగా వినియోగించగల రంగమూ తెలుసు.
ఆయన అన్నగారైన వెంకటసుబ్బయ్యగారు బతికుండగా తన ఇంట్లో ‘సాహితీ సమితి’ సమావేశాలయిన రోజుల్లో శివశంకరస్వామినో, నోరి నరసింహ శాస్త్రినో చూసి నోరూరినపుడు కవిత్వం రాసి పత్రికలకు పంపాడేమోగాని, ‘అదృష్టవశాత్తూ’ అవి తిరిగివచ్చి, పద్యమంటే ఛందస్సా, అభ్యాసమా, మరోకటా అని వెతుక్కుంటున్న రోజుల్లోనే- కవిత్వమంటే ‘మరో ప్రపంచాన్ని’ ఆవిష్కరించే కొత్త చూపు, కొత్త ఊపు అని శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ గేయం ద్వారా కొ.కు. గ్రహించగలిగాడు. ‘కదిలేదీ కదిలించేదీ పెను నిద్దుర వదిలించేదీ మునుముందుకు నడిపించేదీ’ అయిన కవిత్వం శ్రీశ్రీ కలం నుంచి అప్పటికే వస్తున్నది. అట్టి స్థితిలో, తన సృజనాత్మక శక్తిని సామాజిక ప్రయోజనం కొరకు వినియోగించే ఉద్దేశంతో, ఆధునిక యుగ స్వభావానికి ఆలోచనారంగంలో అవసరమైన వచన రచనా ప్రక్రియలను తాను చేపట్టి శ్రీశ్రీకి బాసటగా, దోహదంగా ఉండాలనుకున్నాడు ఆయన. కవిత్వంలో ఆ పని తనకన్న సమర్థవంతంగా శ్రీశ్రీ చేశాడని చాటడమే కొ.కు. కవిత్వం రాయకపోవడం.
కథ, నవలను తన సాహిత్య ప్రక్రియలుగా 1930 ప్రాంతంలో ఎంచుకున్న తర్వాత వాటి ద్వారా ఆయన శక్తివంతంగా చెప్పగలిగింది వలస పరిపాలనా దుష్ఫరిణామాలను మార్కెట్, సరుకు, డబ్బు, ఆర్థికమాంద్యం, వలస విద్యావిధానం తెలుగు గ్రామీణవ్యవస్థపై, జీవన విధానంపై వేసిన ప్రభావాన్నీ, అలాగే విజ్ఞానశాస్త్ర విజయాలు అప్పటికున్న విశ్వాసాల కూకటివేళ్ళను సడలించిన సరళినీ, ఆయన తానింకా మద్రాసు జీవితంలో స్థిరపడక పూర్వం చిత్రించాడు. తర్వాత 1950కి కొద్ది ముందు మద్రాసులో మొదలైన జీవితం, కుటుంబరావుకు అప్పటికున్న జీవితానుభవానికి, లోకజ్ఞతకూ పదును పెట్టుకునే విశాలమైన అధ్యయన ఆకాశాలను అందించింది. అయితే, మరొకవైపు, ఆయనకు అప్పటికే పరిచయమున్న గ్రామాల్లోని మాగాణుల్లోని భూమిని క్రమంగా దూరం చేసింది.
వలసపాలన వెళ్ళిపోతూ ఈ దేశంలోని బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గంతో చేసిన స్నేహాన్నీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటపు ఉప్పెనకు తట్టుకోలేక ‘స్వతంత్ర భారతం’ తెచ్చిన ‘భూసంస్కరణల’నూ సన్నిహితంగా అర్థం చేసుకోవాలంటే పల్లెపట్టును అర్థం చేసుకోవాలి. 1947 తర్వాత తెలుగుదేశంలోని గ్రామాల స్వరూపాలు ఎట్లా మారుతూ వచ్చాయో, ప్రణాళికల పేరుతో ఎంత పెద్ద ఆర్థిక, రాజకీయ కుట్ర జరుగుతున్నదో కాళీపట్నం రామారావు కథలు ‘యజ్ఞం’, ‘కుట్ర’లలో చదివి ఆశ్చర్యపోయాడు కొ.కు. ఇక్కడ ఆయనకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు రెండు. తాను ‘చదువు’ నవల రచించిన కాలంలో అవగాహన చేసుకున్నంత లోతుగా, ఈ శతాబ్దపు ఆరు, ఏడు దశాబ్దాలలోని ఉత్పత్తి సంబంధాలను కా.రా. అర్థంచేసుకున్నాడు. ఈ అర్థం చేసుకోవడం కా.రా. స్పృహతో చేయలేదు. ప్రజాజీవితంలో ఉన్నందున, ఎంగెల్స్ చెప్పినట్టు, అసంకల్పిత కళాకారుడుగానే ఆ జీవితాన్ని తన కథల్లో చిత్రించాడు.
కళాకారుడు కవిత్వంలోనో, కల్పనలోనో జీవిత వాస్తవాలను అసంకల్పితంగా చెప్పినంతకాలం కల్పనా సాహిత్యాన్ని రచించగలడు. తాను చెపుతున్న జీవిత వాస్తవాల విశ్లేషణ ఆవేశపూరితం కానప్పుడు, పూర్తిగా వైజ్ఞానిక దృష్టితో శాస్త్రీయమైనప్పుడు ఇక అతని సాహిత్య ప్రక్రియ మారక తప్పదు.
“కాళీపట్నం రామారావు హనుమంతుని వంటివాడు. ఆయన శక్తి ఆయనకు తెలియదు'’ అన్నాడు 1988లో కొ.కు. ఈ సమాజానికి ఈ కాలంలో ఎటువంటి కథలు కావాలని కొ.కు. అనుకున్నాడో అటువంటి కథలు తన శక్తి తనకు తెలియనంత కాలం కా.రా. రాశాడు. ఆయన కన్న ముందే అట్టడుగు వర్గాల జీవితాల గురించి, ఆ జీవితాలపై పోలీసు, కోర్టుల వంటి రాజ్యాంగ యంత్రాంగం చేస్తున్న దోపిడీ గురించి శక్తివంతంగా రాచకొండ విశ్వనాథశాస్త్రి రాశాడు.
ఇప్పుడు రాయవలసిన జీవితం ఇది. ఈ జీవితంతో తనకు ప్రత్యక్ష పరిచయం లేదు. అందువల్లనే కథా సాహిత్యంలో రావిశాస్త్రి, కా.రా.ల ప్రవేశంతో కొ.కు. తాను కథ రాయవలసిన అవసరం తీరిందనుకున్నాడు. తానాశించిన ప్రయోజనాన్ని కథల ద్వారా నెరవేర్చడానికి తనకన్నా ప్రత్యక్షమైన, ఆవేశపూర్వకమైన యువకోత్సాహమైన శక్తితో, శైలితో వాళ్ళు ముందుకొచ్చారు.
ఒకవైపు మద్రాసు జీవితం కుటుంబరావుకు ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని అలవర్చింది. అక్కడి నుండి పత్రికల ద్వారా మాత్రమే ఆయనకు తెలుగుదేశంలోని ప్రజాజీవన ప్రధాన వాహిని ( mainstream ) తో సంబంధం. మనుషులతో ఉన్నా, ఈ మనుషులు చరిత్ర నిర్మాతలు కారు; పరిశీలకులో, వ్యాఖ్యాతలో కావచ్చు. అధ్యయనం, చింతన పెరిగింది. ఆయనే ఒకచోట చెప్పుకున్నట్లు, సామ్యవాదం ఒక సుదూరమైన ఆశగా ఉన్నప్పుడు మార్క్సిజం అనే దీపాన్ని ఎంత మిణుకు మిణుకుమంటున్నా కాపాడుకొని ముందు తరాలకు అందించడమే మార్క్సిస్టు రచయిత బాధ్యత. అనుకూలంకాని పరిస్థితుల్లో కూడా ఆయన తన చైతన్యాన్ని కాపాడుకోవడమే కాదు, పరిశీలన, లోకానుశీలనల ద్వారా పదును పెట్టుకున్నాడు. అయితే ఈ అధ్యయనం, శాస్త్రీయదృష్టి, అవగాహన, విజ్ఞానశాస్త్రంలో ఆయనకున్న గాఢమైన అభినివేశం, కళాకారునిలో లేశమాత్రంగా ఉండవలసిన భ్రాంతి (illusion)ని ఆయన నుంచి తొలగించాయి. కనుక ఇంక ఆయన రాస్తే వాస్తవాలే రాయాలి. ఇవి గతితార్కిక వాస్తాలు. ఈ వాస్తవాలు తొడుగులేనివి, అలంకారం లేనివి.
ఆయన ఇతర సాహిత్య ప్రక్రియలన్నీ వదిలి అందుకే వ్యాసాన్ని ఎంచుకున్నాడు. ఈ వ్యాసంలో మిగిలిన ‘సాహిత్య’ గుణం వ్యంగ్యం ఒక్కటే. ఆ వ్యంగ్యం కూడా లూ శున్ వ్యాసాలలోని వ్యంగ్యంలాగా మనం పోల్చుకోవడానికి వీలులేకుండా మామూలు మాటల్లో కలిసి ఉంటుంది.
డెబ్భై సంవత్సరాల జీవితానుభవం, యాభై సంవత్సరాల ఎడతెగని రచన. ఆయనకు హాస్యం, వ్యంగ్యం నిత్యజీవితంలో ఎట్లా స్వభావసిద్ధమైనాయో రచనలో కూడా అలాగే అయ్యాయి. ఆయన చివరి రోజుల్లో ‘యువ’లో రాసిన వ్యాసాల్లో కూడా శిథిలమవుతున్న విలువల పట్ల నిజమూ, నిష్ఠూరమూ, వ్యంగ్యమూ కలగలిసి ఉండటాన్ని గమనించవచ్చు. ప్రజల్ని ఆలోచింపజేయడానికి సులభశైలిని సూటియైన వ్యాసాన్ని ఎంచుకున్న కుటుంబరావు- అధ్యయన పరిణతివల్ల, నిశిత పరిశీలన వల్ల ఒకోసారి, ఆలోచనాపరులను ఆలోచింపజేయడానికి మాత్రమే రాస్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది.
ప్రజాజీవన ప్రధానవాహిని నుంచి, రైతాంగ పోరాటరంగం నుంచి దూరంగా ఉండటం వల్ల కొన్నిసార్లు కొ.కు. గతితర్కం-చారిత్రక భౌతికవాదంపై ఆధారపడటం కాక, కామన్‌సెన్సుపై లేదా, తనకందిన సమాచారంపై ఆధారపడవలసి వచ్చేది. అందుకే ప్రజాపోరాటాల గురించి, ఆ పోరాటాలు సృష్టిస్తున్న సాహిత్యం గురించి తెలుసుకోవడానికి ఆయన ఎంతో శ్రద్ధ చూపాడు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పుడమితల్లి పురిటి నొప్పుల చప్పుడు అల్లం రాజయ్య మాటల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. గద్దర్ పాటలకు మద్రాసు నుంచే చెవి రిక్కించాడు.
ఏ సమయానికి దేనికి కాలం చెల్లిపోయిందో, ఏ దేశకాలాలకు దేని అవసరం ఉందో కొ.కు. ఎప్పుడూ గుర్తించగలగడానికి, వైయక్తికంగా ( subjective ) కాకుండా వస్తుగతంగా ( objective )ఆలోచించే ఆయన శాస్త్రీయ దృక్పథమే కారణం.
చైనా సాంస్కృతిక విప్లవాన్ని ఆయన నవయువకునిగా ఆహ్వానించాడు. అట్లే నిష్కల్మషమైన యువమనస్కతతో దిగంబర కవులకు, తర్వాత కాలంలో విప్లవ సాహిత్య విమర్శకు స్వాగతం చెప్పాడు. వేయి నక్సల్బరీలు వికసించాలని ఆయన చెప్పిన మాటల్లో పొలాలు మేల్కొనాలన్న ఆకాంక్ష ఉన్నది. ‘విరసం’ ఏర్పడటం ఒక చారిత్రక అవసరమని, ‘అరసం’కు కాలం చెల్లిపోయందనీ, నక్సల్బరీ-శ్రీకాకుళాల ప్రభావంతో ఆయన అర్థం చేసుకోవడమే కాదు, ఆనాడు చాలామంది యువ రచయితలకన్నా కూడ ఎంతో ముందుచూపుతో చెప్పేశాడు. అది తెలంగాణ రైతాంగ పోరాటానికే కాదు, తెలంగాణ మాండలికానికి కూడ మంచికాలం అని గుర్తించాడు. జానపద కళారూపాలు ప్రజా కళారూపాలు కాజాలవన్న తన వాదాన్ని గద్దర్ పాటల అనుభవంతో వదులుకున్నాడు. ఈనాడు సాహిత్యం ఏ విప్లవ వర్గాలకు ఉద్దేశింపబడిందో ఆ వర్గాల దగ్గరికి, ఇదివరకెన్నడూ లేనంత బలంగానూ, సూటిగానూ ప్రజా కళారూపాల ద్వారా దూసుకుపోతున్నదని తనకు తెలిసిన మధ్యతరగతి మేధో ప్రపంచానికి విడమరచి చెప్పడానికి ప్రయత్నించాడు. ప్రజల పాటలతో ఒళ్ళు మండుతున్న ‘మేతావులు’ ఆ పాటలకు కొ.కు. సమర్థనతో తేలు కుట్టినట్లయి వాదనకు దిగారు.
ప్రజలకు ఏ కాలంలో ఏ కళారూపాలు కావాలో గ్రహించినట్లే తాను ఏ కాలంలో ప్రజలకేది అందివ్వగలడో కూడా ఆయన నిర్ణయించుకున్నాడు. కార్మికవర్గం గెలుచుకోగల ప్రపంచంలో భావదారిద్య్రం ఉండకూడదు. తాత్విక చింతనా రాహిత్యం చోటు చేసుకోకూడదు. “నూరు పూలు వికసించాలి. వేయి ఆలోచనలు సంఘర్షించాలి.'’ వీటికి తోడు ఈప్రపంచపు ద్వారాలు తడుతున్న నూతన ప్రపంచం, సాంకేతిక విజ్ఞానం సాధించిన ప్రగతీ, జిజ్ఞాసాపరుడైన కొడవటిగంటిలో ఎన్నో ప్రశ్నలను, ఆలోచనలను రేకెత్తించాయి. ఇవన్నీ ప్రజలతో, ప్రజాజీవన ప్రధానవాహినితో ఉన్నవాళ్ళతో పంచుకుంటే తప్ప తీరేవి కావు. తీరడం అలా ఉంచి అవి చలనంలోకి రావాలి. ఘర్షణను పుట్టించాలి. భావాలను వేడెక్కించాలి. అందుకే చివరి రోజుల్లో తాను రాస్తున్న విషయాలు స్థిరమైన అభిప్రాయాలు కావని, బయటికి ఆలోచించడమేనని (loud thinking) ఆయన చెప్పుకున్నాడు. ఇంక వ్యవధి లేదు. జీవిత చరమసంధ్యలో ప్రవేశిస్తున్నాడు. కోశాంబిలో దొరికే సమాధానాలు చరిత్రకు సంబంధించినవి, దృక్పథానికి సంబంధించినవి. తనకు నిర్మాణమవుతున్న చరిత్ర నుంచి సమాధానాలు కావాలి.
కుటుంబరావు ఏనాడూ తనా చెప్పిందంతా ఇతరులు స్వీకరించడానికి చెప్పలేదు, చర్చించడానికి చెప్పాడు. మాటలు భౌతికశక్తిగా మారుతాయన్న మార్క్సిస్టు దృక్పథం ఆయనది. మాటలు ఘర్షణ పడకుండా, ఘర్షణకు కారణం కాకుండా మౌనంగా అంగీకరింపబడితే ఇంక భౌతికశక్తి ఎలా అవుతాయి? అట్లని రెచ్చగొట్టడం కోసమో, షాక్ కోసమో, సెన్సేషన్ కోసమో, తనవైపు చర్చను ఆకర్షించుకోవడానికో ఆయన రాయలేదు. చందమామను చూసిన పసివానికి కలిగిన సందేహాల్లాగా, ఆయనకు కలిగిన సందేహాలన్నీ సైన్సునూ, ప్రపంచాన్నీ, సమాజాన్నీ చూడగా చూడగా చదవగా చదవగా కలిగిన సందేహాలు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ఈ సైన్సునూ, చరిత్ర నిర్మాణంలో పాల్గొని ఈ ప్రపంచాన్నీ, వర్గపోరాటంలో పాల్గొని ఈ సమాజాన్నీ రూపొందిస్తూ, మార్చుతూ, తాము స్వయంగా మారుతున్న ప్రజలు మాత్రమే ఈ సందేహాలను తమకు ఎదురయే ఇతర సందేహాలను నివృత్తి చేయగలరు.
కుటుంబరావు యాభై సంవత్సరాల పాటు ఎన్నో ప్రశ్నలకు జవాబులిచ్చి, మరెన్నో ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు. తను ఇచ్చిన జవాబుల కన్నా, వేసిన ప్రశ్నలపై ఆలోచించడం ద్వారానే తెలుగు సాహిత్యమైనా, తెలుగు సమాజమైనా ఆరోగ్యకరంగా, నిత్యనూతనంగా ఉంటుందని ఆయన ఆశించాడు. ఆయన ప్రశ్నించడం కోసం రభస చేశాడు. జ్ఞాన రహస్యం ప్రశ్నించడంలో ఉందని తెలుసుకున్న చాలా కొద్దిమంది రచయితలలో ఆయన ఒకరు. ఆయన మేధావి. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు రచయిత స్థాయి నుంచి మేధావి స్థాయికి ఎదిగిన అరుదైన ఆలోచనాపరుడు. రచన అంటే భాషణ కాదు సంభాషణ అని పాఠకుని పాత్రను గుర్తింపజేసిన పాఠకుడు.