- కొడవటిగంటి కుటుంబరావు

సార్వభౌమరావుగారి దగ్గర ఒక కుక్క ఉండేది. అది అన్నప్పుడల్లా మొరిగేదికాదు. నేరస్థులనూ, జైలుకు పోయివచ్చినవాళ్ళనూ చూస్తే మాత్రమే మొరిగేది. చివరకు, ఈ విషయం ఎన్ని డజన్ల సార్లు రుజువయిందంటే, అది ఎవర్ని చూసి మొరిగితే వాళ్ళు నేరస్థులయి ఉండాలని అందరూ నమ్మే స్థితికి వచ్చారు.

‘అది దైవాంశగల కుక్కేమోనండీ, సార్వభౌమరావుగారూ?’ అన్నారు కొందరు. ‘ఏమో చెప్పలేం’ అన్నారు మనస్తత్వంవాళ్ళు.

సార్వభౌమరావు అంత దూరం వెళ్ళలేదు గాని, ‘శాస్త్రజ్ఞానానికి అందని విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి’ అన్నాడు.
సార్వభౌమరావుగారంటే పదవి లేని ప్రభువు, మకుటం లేని మహారాజు. మంత్రులు కూడా ఆయనతో రాచకార్యాలు జరిపేవారు.
ఒక రోజు ఒక మంత్రి అంతటివాడు సార్వభౌమరావు గారింటికి వచ్చాడు. కుక్కకు ఆయన ముఖం, లేక వాసన, కొత్తకాదు. కాని ఎందుకో ఈసారి కుక్క ఆయన్ను చూడగానే మొరిగింది.
మంత్రిగారి ముఖం ముందు తెల్లగా అయి, తరవాత ఎర్రగా అయింది.
‘ఏమిటిది? ఇదేమిటి?’ అన్నాడాయన.
‘దాని సంగతి నేను చూస్తాను. మీరు పట్టించుకోకండి. మీకు క్షమాపణలు చెప్పుకుంటాను’ అని సార్వభౌమరావు కుక్కను ఆ రాత్రి పిస్తోలుతో కాల్చి చంపాడు.

ఇటీవల బయటపడింది. ఆ మంత్రిగారు సార్వభౌమరావింటికి వచ్చే ముందు వారం రోజుల క్రితం తన నౌకరు కుర్రాణ్ణి చంపి, పోలీసులచేత నక్సలైట్ శవాల మధ్య పారేయించి, ‘ఈ నక్సలైట్లు ఇక్కడ ఉండరూ అని చెప్పలేం గదా’ అని అందరితోనూ అన్నాడు.
ఏమైనా అలా దుర్మార్గాన్ని పసిగట్టగల కుక్కలు - మనుషులు కూడా - పోతేనే మంచిదని ఉన్నతవర్గాలవారి అభిప్రాయం.

- తొలి ముద్రణ ‘యువ’

4 అభిప్రాయాలు

  1. PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు: 19 ఆగస్టు 2007 , 10:02 pm

    […] గల్పిక: జ్ఞానంగల కుక్క - కొడవటిగంటి కుటుంబరావు […]

  2. Dr.P.Murali Mohana Rao. 05 సెప్టెంబర్ 2007 , 6:35 am

    కుక్కకున్న పాటి ఇంగితజ్ఞానం మనిషికి లేదని చెప్పే చక్కని కథ!ఈ కథ నేను గతంలొఅ చదవలేదంటే అది నాదురదృష్టం.-రాంరళి

  3. jayanth 31 జులై 2008 , 12:14 am

    చాలా బాగా వున్నది.

  4. Audi sesha reddy Kaipu 12 సెప్టెంబర్ 2008 , 9:25 pm

    వాస్తవాలు చెప్పేవారికి ఈ లోకంలో మనుగడ లేదు. అది కుక్క అయినా మనిషి అయినా …; కొడవగంటి గారి కథ బాగుంది.

    కైపు ఆదిశేషా రెడ్డి. రచయిత.
    23-1-1256 ,
    అరవిండ నగర,
    నెల్లూరు-524 003 ( ఎ.పి )

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)