నక్సలైట్ ఉద్యమాల మీద గత 35 ఏళ్ళుగా జరుగుతున్న చట్టాతీత బలప్రయోగాన్ని ఏ కారణంచేత సమర్థించినా, అంగీకరించినా ఆ విచ్చలవిడి బలప్రయోగాన్ని సమాజంలోని ఏ ఉద్యమంమీదైనా, ఏ రాజకీయ వర్గం మీదైనా ఉపయోగించే ప్రమాదం ఉన్నదని హక్కుల సంఘాలు పదేపదే చెబుతూ వస్తున్నాయి.
చట్టవ్యతిరేక రాజ్య బలప్రయోగం ఎవ్వరిమీద జరిగినా దాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామిక స్పృహ కొరవడితే ఆ బలప్రయోగమే అధికారంలో ఉన్నవారిని ఎవరిని ప్రశ్నించినా, విభేదించినా ఆ అణచివేత ప్రశ్నించేవారి దాకా వస్తుందని హక్కుల ఉద్యమాలు నిరంతరంగా చెబుతూనే ఉన్నాయి. ఈ వాస్తవమే ముదిగొండలో స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. ముదిగొండ కాల్పులపై తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో ఆ ఘటనలో నక్సలైట్లు ఉన్నారని ప్రధానమంత్రికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పారంటే చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య విలువలు ఎంత దిగజారాయో అర్థమౌతుంది.
నక్సలైట్లు ఉంటే రాజ్యం ఏమైనా చేయవచ్చా? చేస్తే అది సమర్థనీయ మేనా? పరిపాలన ఇలాంటి సాకుల మీద కొనసాగవచ్చా? కొనసాగగలదా అన్నది ప్రశ్న. ఏ ఉద్యమాన్నైనా రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి చట్టబద్ధ నియమానుసారంగానే ఎదుర్కోవలసి ఉంటుందని, రాజకీయ ఉద్యమాలని రాజకీయంగానే పరిష్కరించవలసి ఉంటుందని హక్కుల సంఘాలు భావిస్తాయి. ప్రభుత్వ దృష్టిలో చట్టవ్యతిరేక శక్తులనే వాళ్ళకు కూడా చట్టపరమైన హక్కులుంటాయని అదే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అర్థం చేసుకోవాలి. ‘చట్టవ్యతిరేకశక్తుల’ నెదుర్కొనే క్రమంలో రాజ్యం కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, చట్ట వ్యతిరేక శక్తులకు- చట్టాన్ని కాపాడే శక్తులకు మధ్య సరిహద్దు చెదిరిపోతే ఇక మిగిలేది బలాబలాలే.
అలా పరిపాలించడం నాగరిక పరిపాలన కాజాలదన్నది హక్కుల ఉద్యమం కీలక అవగాహన. ముదిగొండ ఘటన నేపథ్యమేమిటి? ప్రధాన రాజకీయ స్రవంతిలో భాగమైన వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ, సిపిఎంలు, వాటి అనుబంధ సంఘాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరాశ్రయులైన పేదవారికి కనీసం గుడిసె వేసుకొనడానికైనా కొంతస్థలం ఇవ్వాలని, ఇప్పటికే గుడిసెలు వేసుకొన్నవారి స్థలాలకు చట్టబద్ధత కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు పంచాలనే డిమాండ్లతో గత నాలుగు నెలలుగా ప్రజలను సమీకరిస్తున్నాయి. ఇవి ఎంతమానవీయమైన కనీస హక్కులో వేరే చెప్పనవసరంలేదు. ఇలాంటి జీవన్మరణ సమస్యలకు ప్రజలు ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. అవి ఎలాంటి రాజకీయ శక్తులైనా కావచ్చు. ఇందిరాగాంధీ, ఎన్ టిఆర్ పేదల సమస్యల గురించి కొంచెం ఎక్కువుగా మాట్లాడినందుకు ఇప్పటికీ తెలుగు ప్రజలు వాళ్ల జ్ఞాపకాన్ని గౌరవిస్తున్నారు.
ఈ రెండు చిహ్నాల (సింబల్స్)ను వాడుకుంటున్న రాజకీయులు ప్రజల కనీస అవసరాలకు స్పం దించలేరా? ఇది ఒట్టిరాజకీయ హిపోక్రసి. ప్రజల అవసరాలని గుర్తించి, వామపక్ష పార్టీలుపేదల ఆకాంక్షలను కొంచెం ముందుకు తీసుకుపోయే ప్రయత్నమే గత నాలుగు నెలల ఉద్యమాల సారాంశం. వాటికి స్పందించే సంసిద్ధత లేకపోవడమే అధికారపార్టీ స్వభావం. రాజకీయ పార్టీలన్నీ తమకు తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవలసిన ఒక తరుణం వచ్చింది. ప్రజల సమస్యలకు స్పందించకపోతే ప్రజలు తమ సహనాన్ని కోల్పోతే వాళ్ళను అదుపుచేయడం ఎవరికీ సాధ్యంకాదు. రాజకీయంగా పరిష్కరించగలిగిన సమస్యలకు కూడా పోలీసులని బలప్రయోగాన్ని నమ్ముకుంటే అది హింసను పెంచుతుందే కాని తగ్గించదు. పోలీసులని అత్యవసర పరిస్థితిలో సర్జరీలాగా ఉపయోగించాలే కాని ప్రతి జబ్బుకి సర్జరీ అంటే చాలా రక్తం వృధాగా కారుతుంది. ముదిగొండ సంఘటన దీనికి ఒక విషాద ఉదాహరణ.
రెండేళ్ళ క్రితం నక్సలైట్లు- ప్రభుత్వం మధ్య చర్చల సంద ర్భంగా మావోయిస్టు నాయకుడు రామకృష్ణను ప్రశ్నించినప్పుడు ‘హింస-ప్రతిహింస’ను నివారించడానికి ఏం మా ర్గాలు లేవంటారా అని అడిగితే ‘చారెడు రక్తం ప్రవహిస్తే తప్ప పేదవాడికి కొంత భూమి దక్కదు’ అని జవాబిచ్చా రు. అది వాళ్ళ అవగాహన. వాళ్ళ విధ్వంసం, ఆచరణ కూడా. కాని ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయాల అవ గాహన ఏమిటి? చర్చలు ఎలాగైనా కొనసాగాలన్న ప్రయత్నం చేస్తున్న చివరి దశలో ‘నక్సలైట్ ఉద్యమాన్ని కేవలం ఆయుధాల సమస్యగా కాక, వాళ్ళ సభలకు లక్షలాది జనం ఎందుకు వస్తున్నారో ఆలోచించండి’ అని ముఖ్యమంత్రితో అంటే ‘భూములున్నవారి దగ్గరినుంచి భూములు లాక్కొని లేనివాళ్ళకు ఇస్తామంటే ఎవ్వరికైనా లక్షల మంది జనం వస్తారని’ జవాబిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించే లా ప్రజాస్వామ్యం పరిణతి చెందకపోతే ఏర్పడే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్న సవాలు మనముందుకు వస్తుంది.
జనం తమ మౌలిక హక్కులకోసం ఉద్యమించినప్పు డు, వారికి బాసటగా నిలబడినవారిని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తే, న్యాయ స్థానాలు కూడా ఇదే భాష మాట్లాడితే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏంచేయాలో కూడా చెప్పవలసివుంటుంది. ప్రజా సంస్థలు నిర్వీర్యంగా లేదా ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం ఎలా ఎర్పడుతుంది? భూ సంస్కరణలకు సంబంధించిన కేసులు దశాబ్దం తరబడి కోర్టుల్లో పడివున్నవి. న్యాయస్థానాలు వాటిని యుద్ధ ప్రాతి పదికన పరిష్కరించవచ్చు కదా? ప్రజల సమీకరణను ప్రతి పక్షంలో ఉన్నప్పుడు సమర్థించి అధికారంలోకి రాగానే దాన్ని రెచ్చగొట్టలేదంటే ఎలా? రెచ్చగొడితే రెచ్చిపోవడా నికి ప్రజలు అంత అమాయకులు కారు. రెచ్చగొడితే రెచ్చి పోతారన్నది పేద ప్రజలను తక్కువ అంచనా వేయడమే కాక, వాళ్ళ చైతన్యాన్ని అవహేళన చేయడమే.
ఈ మధ్య కాలంలో వామపక్ష పార్టీ సభల్లో పాల్గొంటున్న మహిళల ఆవేశాన్ని, ఆగ్రహాన్ని చూస్తే కాని వాళ్ళ సంసిద్ధత మనకు అర్థం కాదు. ఉద్యమాలు నిర్వహించడమే తప్పు అంటే ఉద్యమాల అవసరం లేకుండా సమస్యలు పరిష్కరించే దూరదృష్టిగల క్రియాత్మక, సృజనాత్మక రాజకీయాలు కావాలి. శాంతిభద్రతలు సాఫీగా శాంతియుతంగా, భద్రంగా జీవించగలగాలి. అంతేకాని మాట్లాడితే లాఠీచార్జి, అరిస్తే కాల్పులో సమస్యలకు పరిష్కారాలు కావు. ఈ అవగాహన పరిపాలన వ్యవస్థకు ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి, దాన్ని నడుపుతున్న నాయకులకు ఉండాలి. రాజకీయాల వైఫల్యమే శాంతిభద్రతల విచ్ఛిన్నానికి మూల కార ణం. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే బల ప్రయో గాన్ని ఆశ్రయిస్తారు. అయితే బల ప్రయోగాన్ని ఉపయోగించే రాజకీయ వ్యవస్థకు చట్ట వ్యతిరేకంగా సహకరించటం పోలీసులు చేస్తున్న పెద్ద పొరపాటు.
బలప్రయోగం మీద అశక్తతతో ఆధారపడ్డ రాజకీయాల పట్ల, రాజకీయ నాయకత్వం మీద పోలీసులకు గౌరవం లేదు. అందుకే తమ మీద రాజకీయ నియంత్రణ వద్దు అని వాళ్ళు వాదిస్తున్నారు. తమకు రాజకీయ జోక్యంలేని స్వతంత్ర ప్రతిపత్తి కావాలంటున్నారు. ఈ వాదనను న్యాయస్థానాలు కూడా సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముదిగొండ సంఘటనను విశ్లేషిస్తే ముఖ్యమంత్రితో సహా అందరు పోలీసుల చర్యను విమర్శిస్తు న్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ పోలీసులు ప్రమాణాలు పాటించలేదని, మరింత సంయ మనం పాటించవలసివుండాల్సిందని అన్నారు. జిల్లా కలెక్ట రు, జిల్లాజడ్జి తమ నివేదికలలో పోలీసులచర్యలను పూ ర్తిగా సమర్థించలేదు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, మీడియా -అందరూ పోలీసులను తప్పుపట్టారు. సంఘటనకు బా ధ్యులైన అధికారుల మీదచర్య తీసుకుంటే వాళ్ల తరపున ఎవ్వరూ మాట్లాడలేదు. రాజ్య నిర్వహణలోని ఒక విభాగం ఎందుకు ఇంత ఒంటరి అయిపోయింది? దీనికి ఎవరు బాధ్యులు? నిజానికి ముదిగొండలాంటి సంఘటనలకు రాజ్యం సమష్టి బాధ్యత వహించాలి.
ఇది కేవలం పోలీ సుల పొరపాటు అంటే బాధ్యతారాహిత్యమే అవుతుంది. చివరగా శాంతిచర్చల సందర్భంలో నక్సలైట్లు ప్రధానస్ర వంతిలోకి రావాలని ఆయుధాలు లేకుండా ప్రజలను సమీ కరించే వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తున్నదని, ఏ హింసలేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చని ప్రభుత్వ ప్రతినిధులు వాదించారు. అయితే వర్గ సమాజంలో అంత శాంతియుతంగా సమస్యల పరిష్కారం కావన్నది ఉద్యమ అవగాహన. ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగమైన వామ పక్ష పార్టీలు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుగా నిలబ డ్డ పార్టీలు ఉద్యమాలను నడుపుతున్నాయి. దాదాపు 190 ప్రజా సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. నిజానికి ప్రభుత్వం అంతకు ముందు నక్సలైట్లను కోరిన పద్ధతిలోనే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలకు స్పం దించి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు ఏంచేయాలి అని ప్రజాస్వామ్యంలో నమ్మకమున్న ఎవరైనా అడిగితే ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెపు తుంది? ఈ సమాధానంమీదే ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజా ఉద్యమాల భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది.
[…] ఉద్యమాలు నిర్వహించడమే తప్పా? - జి. హరగోపాల్ […]
……… బలం ఉపయోగించడమే నక్సలైట్ల సిద్ధాంతం. ప్రభుత్వానిదీ అదే సిద్ధాంతం. ఎవరిని వెనకేసుకురావాలి ? ఎవరిని విమర్శించాలి ?
గమనిక:
ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ సంపాదకవర్గం
అయ్యా బాఅసుబ్రమణ్యంగారూ.. మీరు నిస్సందేహంగా ప్రభుత్వాన్నే సమర్థించండి. మీకు అదే మంచిది.