- ఎండ్లూరి సుధాకర్
మా కంఠంలో ప్రాణముండగా
వైకుంఠం వైపు చూడొద్దనుకున్నాం
మా రక్తాన్ని కళ్ళజూసిన
శ్రీరాముని శరణువేడొద్దనుకున్నాం
మా మెడబట్టి గెంటేసిన
ముప్పైమూడుకోట్ల ముఖాల్ని కడిగేద్దామనుకున్నాం.
మూఢారాధనతోనూ
అమాయకత్వంతోనూ
ఎర్రటి ఎండలో జెండాలా నిలబడి
దళిత దాసర్లమై
దయనీయ కైశికీ రాగాలు పాడుకున్నాం
మురికి కాల్వల తీర్థాన్ని కళ్ళకద్దుకుని
మునివాహనులమై మురిసిపోయాం
ఈ ‘కుల’యుగమంతా
దేవాలయాల చుట్టూ
దేవుళ్ళచుట్టూ
పడిగాపులు కాసి
మా కన్నీళ్ళలో మేమే మునకలేశాం
తిట్టిన తిట్లకీ
కొట్టిన దెబ్బలకీ
చెట్లకి శవాలమై వేలాడాం
మీ దేవాలయాల పునాదుల్ని
తవ్వి చూడండి
లంకెబిందెలు కాదు
మా కంకాళాలు దొరుకుతాయి
మీ గుడిగోడలు తడిమి చూడండి
పగిలిన మా గుండె కేకలు
వినబడుతాయి.
మీ గుడిగంటల్ని పలకరించండి
మా ఆర్తనాదాలే అంతటా
ప్రతిధ్వనిస్తాయి.
దేవుడికి నోరుంటే బాగుండేది
మాతో పెదవులిప్పి మాట్లాడేవాడు
దేవుడికి చెవులుంటే బాగుండేది
మా గోడు వినిపించుకునేవాడు
రాతి విగ్రహాలకు
రక్తప్రసరణ ఉంటుందా?
ఈ దేశం దేవుళ్ళ నోళ్ళు నొక్కేసింది
ఈ దేశం దేవుళ్ళ చెవులు మూసేసింది
మా నేలలో మేం కాందీశీకులం
మా తాత ముత్తాతలంతా
భయంభయంగానే బతికారు
మా పూర్వీకులంతా
సిగ్గుతో బిక్క చచ్చిపోయారు
అయినా మాకు సిగ్గురాలేదు
ఛీ పో అని కసిరితే
వీధి కుక్కకూడా ఆ గడప
ముందుకు రాదు
వేల సంవత్సరాలుగా
అసహ్యించుకోబడుతున్నాం
ఒకే ఊళ్ళో ఉంటున్నా అసింటనే
బతుకుతున్నాం
ఇప్పుడు దళితవాడల్లోకి
దేవుడు నడిచిరావడం నమ్మలేని కల
గొడ్డు మాంసం తినే జాతుల మధ్యన
‘గో’విందుడి సహపంక్తి భోజనం ఒక కళ
తీర్థం సేవించినా
గంజినీళ్ళు తాగినా
ప్రసాదం మెక్కినా
పచ్చడిమెతుకులు గతికినా
వెనకనుంచో
ముందునుంచో వెళ్ళిపోయేవే కదా!
మా మలిన దేహాలకు
ఇవన్నీ పవిత్రమని నమ్మడం ఎలా?
పట్టుపాన్పుల నడుమ పవ్వళించే స్వామి
అంటరాని పేటల్లో నిద్రించడం
నిజంగా ఒక కల
ఏడుకొండలవాడు
ఎన్ని మెట్లు దిగాడు మాకోసం
నిన్న తిరువానుకూరు
ఇవాళ తిరుచానూరు
గుడి తలుపులు తెరుస్తారు కానీ
విరిగిన మా గుండె తలుపులు
తెరువగలరా?
మాకు ప్రసాదాలు పెట్టగలరు కానీ
మానని గాయాలకు
మందు కనిపెట్టగలరా?
మీరు మీ దేవుడి అనుమతి
తీసుకున్నారో లేదో కానీ
మేమైతే మా నీలి దేవుడి అనుమతి
తీసుకోవాలి
‘హిందువుగా పుట్టినా
హిందువుగా చావనని’
అంత ఖచ్చితంగా ఎందుకన్నాడో
ఇప్పుడు కొత్తగా ఆరాతీయాలి
మందమతులం
హిందూమత క్షతగాత్రులం
దళిత నిద్రలో కొత్త రాత్రులం
మమ్మల్ని కాస్త ఆలోచించుకోనివ్వండి
పిలవగానే వాలడానికి
పిట్టలం కాదు మేము
చాక్లెట్లు పంచుతుంటే
చేతులు చాపే పిల్లలం కాదు మేము
మమ్మల్ని కాస్త సంఘటితం కానివ్వండి
అంతవరకూ మీ స్వామివారిని
సగౌరవంగా
మా వాడముందే నిలబెట్టండి
ఆ చూపుడు వేలు
ఏ తీర్పు చెబుతుందో విననివ్వండి
[…] దళిత గోవిందం - ఎండ్లూరి సుధాకర్ […]
ఈ కవిత దలితుల ఆతంగౌరవానికి ప్రతిక గా వుంది….ఐనాల