అక్షరాన్ని దిద్దాను
చూపుడు వేలుతో
మూడు వేళ్ళు చూస్తున్నై
నా వైపు శూలంలా!
నల్లమట్టి మీద అక్షరాన్ని
గల్లతొట్టిమీద తోలులా
దిద్ది రుద్దిన ఐదోవేలికి
అంటుకుంది! అక్షరం!
చెరువుకి ఎదురీది
బోధివృక్షం నీడలో
చేపలా పడ్డ అక్షరాల వలలో
నాకు వాడికి మధ్య
‘అక్షరం’
వాడకి ఊరికి మధ్య
దున్న సియ్యలా!
ఊరిబడి చుట్టూ పసుపునీళ్ళతో దిష్టి తీసి
విసిరాడు నిర్భంధ తాళపత్రాల్ని అటుఇటు
వాడికి నాకు మధ్య మళ్ళా
‘అక్షరం’
త్రిశంకుస్వర్గంలా
వాడల్ని ఊరి చెర తప్పించడానికి
మసీదు నీడలో శిలువ ఎక్కాను!
అక్షరం మరింత హత్తుకుంది నన్ను
వదిలింది పూనకం!
అక్షరం అంటుకుంది వాడవాడలా
అంటరానితనంలా!!
మర్రిచెట్టు కింద మోడువారిన
మల్లె తీగలన్ని
దండోర వానలో
తడిసి చిందులేస్తుంటే
అక్షరం
కట్టతెగిన చెరువులా
బద్దలై వాడలవైపు
పెయ్యిదూడలా పరుగు!
ఇప్పుడు
అక్షరం నిరంతర ప్రవాహం
అక్షరం బోధి వృక్షం
అక్షరం సమీకరణం
అక్షరం ఐకమత్యం
అక్షరం పోరాటం, తిరుగుబాటు
అక్షరం చార్వాకుడు, వైజనుడు
అక్షరం శంభూకుడు, ఏకలవ్యుడు, వీరబాహుడు
అక్షరం తాటకి, శబరి, శూర్పణఖ, పోతన
అక్షరం అరుంధతి
అక్షరం ఆది జాంబవంతుడు
అక్షరం నా డప్పు, నా చిందు
అక్షరం మా గూటం, మా ఆరె
అక్షరం మా పనికత్తి, మా కిర్రు చెప్పు
అక్షరం మా అమ్మచేతి మూలిగ, దున్న సియ్య!
అక్షరం మా గుడిసె నిట్టాడి
అక్షరం సామాజిక న్యాయం
అక్షరం A B C D
అది మా వాటా, మా హక్కు
అసలు అక్షరం అంటే ఏమనుకున్నార్రా?
అక్షరమంటే అంబేద్కర్
గుండె లోతుల్లొ దాగి ఉన్న భావాన్ని చక్కని పోలికలతో వ్యక్తీకరించిన
కవి పొనుగోటికి శుభాభినందలు.
రగిలిన గుందెల వేదనను
పదునెక్కిన అక్షరాలతో
అక్షరం విలువను నిర్వచించిన
వీరి కలం నుండి
మరిన్ని మంచి కవితలు
వెలువడాలని మనసారా కోరుకుంటు…
చిర్ర రాజేష్ ఖన్నా
వరంగల్
గుండె లోతుల్లొ దాగి ఉన్న భావాన్ని చక్కని పోలికలతో వ్యక్తీకరించిన
కవి పొనుగోటికి శుభాభినందలు.
రగిలిన గుండెల వేదనను
పదునెక్కిన అక్షరాలతో
అక్షరం విలువను నిర్వచించిన
వీరి కలం నుండి
మరిన్ని మంచి కవితలు
వెలువడాలని మనసారా కోరుకుంటు…
చిర్ర రాజేష్ ఖన్నా
వరంగల్
పొనుగోటి కవిత చాల బాగుంది.అక్షరాన్ని చాల నిర్వచించారు.కవి పొనుగోటికి శుభాభినందలు-చిన్న.కె
అక్షరం అని అన్ని సార్లు పురుక్తం కావడం వల్ల కవిత బలం తగ్గింది.
నేడు దళిత కవులమని ఎవరయితే చెప్పుకుంటు తిరుగుతున్నారో వారు తమ అస్థిత్వాన్ని నిలుపుకోవటం కోసం చూస్తున్నారు. నేడు వారు సామాజిక న్యాయం అని ఏదయితే కోరుకుంటున్నారో దానిని సాధించుకోవాలనే తపన ఈ కవితలో కనబడుతుంది. నిజంగా కవి ఈ కవితలో తరతరాలుగా తన జాతిమీద జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎంతో నేర్పుతో ప్రస్తావించినట్లుగా కనబడుతుంది. ఒక్క పేరుతోనే ఆ సన్నివేశమంతా గుర్తుకొచ్చేవిధంగా అనేకమంది దళిత పురాణ పాత్రలను (పురుష, స్త్రీ) తెలియజేశారు. అలాగే తన కులానికి సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలను కూడా నిశిత పరిశీలనతో పేర్కొన్నారు. ఇలాంటి కవితలు రావలసిన అవసరం ఎంతయినా ఉంది. అదేవిధంగా అంబేద్కర్ యొక్క భావజాలం ఈ కవితలో అణువణువునా కనబడుతుంది. ఈవిధమయిన కవితలు తన సాహితీ జీవితంలో మరిన్ని రావాలని కోరుతూ………
[…] కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మాకొద్దీ మాల దొరతనమూ… - సుదయ్య అక్షరమంటే అంబేద్కర్ - పొనుగోటి రవి కుమార్ దళిత గోవిందం - ఎండ్లూరి సుధాకర్ […]