- శ్యామల
చెర గురించి నన్ను రెండు మాటలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడను. మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. బాధగా ఉంది. ఆయన రాసిన కవిత్వం, పాటలు చాలా సహజంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో, ముఖ్యంగా కష్టజీవుల గురించి, కార్మికుల గురించి రాసేవాడు. తాను ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లో ఉన్నా, బయట వున్నా, బస్సులో వున్నా, సైకిలు మీదున్నా, ఎక్కడ వున్నా కూడ ఆయనకు అదే ఆలోచన. అట్లా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఒకసారి లారీ యాక్సిడెంట్ అయింది.
ఆయన రాసిన మాటలు, పాటలు మనందరినీ కదిలిస్తాయి. అట్లాగే ఒక పాట, “ఇంటింట చీకటే రపతి కంట కన్నీరె రాజ్యమెవరికి వచ్చెనో, సుఖము లెవరికి దక్కెనో…'’ అనే ఈ పాట పేదవాళ్ళ కన్నీళ్ళ గురించి, ఇంటింట ఉండే చీకటి గురించి రాశారాయన. మరి ఇంటింటిక చీకటిని తొలగించాలంటే మనమంతా కృషి చేయాలి. మన ఇంట్లో దీపం మనమే వెలిగించుకోవాలి. దానికి మనం పాటుపడాలి. యదార్థంగా చెర నడిచిన బాటలో మనమంతా నడుస్తాం. పేదవాళ్ళ గురించి, పేదవాళ్ళ కష్టాల గురించి ఆయన బాటలో నడుస్తూ మునుముందుకే పోతామని ఆశిస్తాను.
చెర సంవత్సరకాలం హాస్పిటల్‌లో వుండి నానా అవస్థలు పడ్డాడు. అదీ మాటల్లో చెప్పలేను నేను. పెద్దవాళ్ళంటారే, ‘పిట్టఘోష అనుభవించాడు,’ అని. పిట్టఘోష అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు గాని, నేను మాత్రం కళ్ళారా చూశాను. చాలా బాధతో నెట్టుకొచ్చాడు సంవత్సరం పాటు. అయినా ఏరోజుకా రోజు చెర మాట్లాడుతాడు, చెర నన్ను పిలుస్తాడు అని ఆశించేదాన్ని. కాని ఏరోజుకారోజు తాను దిగజారిపోతూ ఏమీ చెప్పకుండా, మాట్లాడలేకుండా, మాట చెప్పలేకుండా కళ్ళల్లోంచి నీళ్ళు కారేవి. కొంతకాలం తరువాత నీళ్ళు కారి కారి కళ్ళలోంచి చీము రక్తం కారటం మొదలయింది. తను ఎప్పుడయితే ఎర్రజెండా కోసం పోరాడాడో ఆ ఎరుపే కళ్ళలోకి రావటం మొదలయింది. తను ఏమీ చేయలేని స్థితిలో ఉండి కూడా కళ్ళల్లో తన నెత్తురిని చూపించాడు. అంటే ఆ ఎరుపు బాటలో నడవండి… ఆ ఎర్రజెండాను ఎగరేయండి. నా శక్తి వున్నంత వరకు నేను చేశాను. ఆ తరువాత మీరే…'’ అని మనసులో ఉందన్నమాట.
ఇన్ డైరెక్టుగా చెరబండరాజుని ఈ ప్రభుత్వం హత్య చేసింది. జబ్బు కొంచెమే ఉన్నా చాలామటుకు ఆలోచనలతో, చదువుతో, తలనొప్పితో, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ కుష్ఠువ్యవస్థ మా చెరను చంపింది కాబట్టి, మా చెరను హాస్పిటల్లో ముక్కలు ముక్కలుగా కోశారు కాబట్టి, మనమంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆయన ఆశయాల కోసం మనమంతా పోరాడుదామని మనమంతా ఐక్యంగా ఉంటామని… మీ అందరిలో నా చెరను చూసుకుంటాను. మన చెర రాసిన పాటలు పాడుకుందాం… ఆయన పాటలతో పాడుదాం. ఆయన ఆటలతో ఆడుదాం.
నా చెర, మన చెర ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనల్ని వెన్నంటే ఉంటాడు. మనల్ని తడుపుతూనే ఉంటాడు. అది మాత్రం మరచిపోగూడదు.
మా పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. మా పాప పదేళ్ళుంటుంది. మా బాబుకి ఐదేళ్ళుంటాయి. పిల్లలంటే చెరకు పంచప్రాణాలు. చాలాకాలం దాకా పిల్లలు కలుగలేదు మాకు. కలిగిన తరువాత వాళ్ళ ముద్దుముచ్చట ఏమీ చూసుకోకుండా, ఆడకుండా, పాడకుండా వెళ్ళిపోయాడు.
ఈరోజు ఉదయం, ‘నాన్న మీటింగు జరుగుతోందిరా, అక్కడి కెళ్దాం,’ అన్నాను బాబుతో. అప్పుడు, ‘నాన్న అక్కడికి వస్తాడా అమ్మా,’ అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలి. వస్తాడని చెప్పనా, రాడని చెప్పనా. ఏమీ చెప్పలేకపోయాను. కష్టజీవుల గురించి, కార్మికుల గురించి, కన్నీళ్ళ గురించి కొండలు పగలేసినం పాట తను రాశాడు. ఆంధ్రదేశం అంతటా ఆ పాట పాడుకొంటున్నారు. అట్లాగే మా పాప ఆ పాటకు, వాళ్ళ నాన్న రాసిన పాటకు డాన్స్ చేస్తుంది. చూడండి- నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను.
( జంటనగరాల రాడికల్ విద్యార్తి యువజన సంఘాలు జులై 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన చెర ప్రథమవర్థంతి సభలలో బహిరంగసభకు అధ్యక్షత వహిస్తూ చేసిన ప్రసంగం. )