- చెరబండరాజు
ఆకాశం కింద విశాల హృదయంతో
వస్త్ర హీన దేహాలతో
మండే కడుపులతో
రక్తాన్ని ఇంధనంగా మార్చి
పాలకుల రైలు ఇంజన్ని ఊడ్చుకుపోతున్న
కార్మికులం కర్షకులం నిరుపేదలం మనమే
స్నేహానికీ ప్రేమకూ చేతులందిస్తే
రోగాలూ నొప్పులూ ఆప్తులతో గోడుగోడునా చెప్పుకుంటే
మనిషికి మనిషేగా తోడు నీడా అంటే
పోరాటం మినహా బతుకూ భవిష్యత్తూ అసలే లేదంటే
కంఠాల నిండా ఇనపముళ్ళు కుక్కే చట్టం
కంటి రెప్ప లెత్తితే కాల్చేస్తామంటోంది
కడలి తప్ప కన్నీటిని బోధపర్చుకునే దెవరు
కడుపు బాధలకు నేల తప్ప
కరుణా ప్రేమలతో చెవియొగ్గే దెవరు
ప్రపంచం నిండా మన చేతుల్లో
ఆకలి ఆక్రందన లెత్తించిన పతాకాలు
ఒకే లక్ష్యసాధనకై
ఒకే ధర్మసాధనకై
మానవతా సంకేతాలై
మంటల్లో పడిలేచీ
వానల్లో నాని ఎండి
తుపానుల్ని అడ్డుకొనీ
భూగోళం గుండెపైన
అవిగవిగో అవిగవిగో అనవరతం ఎగిరేను
మరికొంచెం మరికొంచెం మరికొంచెం
సరిహద్దులు అధిగమించి
శ్రామిక రాజ్య సందేశాన్ని వినిపిస్తున్నాయ్
మనం హరిజనులం గిరిజనులం
అనాగరికులం అడవి మనుషులం
నీగ్రోలం బానిసలం
కాయకష్టంచేసి కనాకష్టంగా బతికే వాళ్ళం
అన్నానికీ ఆనందానికీ
కౌటుంబిక అనుబంధానికీ
సభ్యతకూ సంఘంలో
సమానత్వ హక్కులకూ
అనర్-హులం భయస్థులం
నోరులేని జీవులం
జైళ్ళూ కోర్టులు చట్టాలూ సంకెళ్ళూ పోలీసుల బయనెట్లు
అవునవునూ
మన శాంతికి మన భావికి
మన జీవిత సౌఖ్యానికి
అర్థరాత్రి రేడియో విప్పండి
ఏ ఉదయమైనా వార్తాపత్రిక తిప్పండి
పొలాల్లో అడవుల్లో
ఫ్యాక్టరీల సమ్మెల్లో
చంపబడ్డ రాక్షసులం
రాజద్రోహులం హంతకులం
ఉరికంబం ఎక్కే వాళ్ళం అంతా మనమే
అరో పరకో అటో యిటో
మన నేరాలన్నీ ఒకే సెక్షను కింది కొస్తాయి
అందుకే
దారి తప్పిన సోదరులందరిదీ ఒకేదారి