- సాజీగోపాల్
తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన ఆ చీకటిరాత్రి
తుటాలవాన కురిసింది
కౄరత్వం బయటపడిన ఆ కాళరాత్రి
ఒక అమాయక ప్రాణం నేలకొరిగింది
ఉలిక్కిపడి నిద్రలేచిన ఆ నగ్నరాత్రి
ఒక ఊపిరి ఆగిపోయింది
నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న యువకునిగా
తన ప్రియురాలి ఇద్దరి పిల్లలకు తండ్రిగా
మరునాడు పెళ్ళికావలసిన పెండ్లికొడుకుగా
న్యూయార్క్ నగరంలో కలలు కనేవాడు “షాన్ బెల్”
పెళ్ళికి ముందురాత్రి
మిత్రులతో ఇంత ఆనందం పంచుకుందామనుకున్న వేళ
స్వప్నలోకం లో విహరిద్దామనుకున్న వేళ
బైర్లు కమ్మిన ఖాకీవిస్కీ కళ్లకు
విచక్షణ కోల్పోయిన పోలీసు తుపాకులకు బలైపోయినాడు
పౌరహక్కుల కోసం ఉద్యమించిన
మార్టిన్ లూధర్ కింగ్ ను చంపిన దేశంలో
నల్లజాతి హక్కులకోసం పోరాడిన
మాల్కంఎక్స్ ను నరికిపోగులు పెట్టిన దేశంలో
మిలిటెంట్ పోరాటాలకు పిలుపునిచ్చిన
బ్లాక్ పాంధర్స్ ను వేటాడి చంపిన దేశంలో
నలభై ఒక్క బులెట్లతో
“అమదో దియాలో” ను చంపిన పోలీసులను
అమాయకులని తేల్చిన న్యాయస్థానాలున్న దేశంలో
నల్లవారయితేచాలు ఊచకోత కోసిన ప్రదేశంలో
ముమియా అబూజమాల్ ను ఉరికంబం పై నిలబెట్టిన సమయంలో
మానవహక్కులే ప్రశ్న
పోరాటమే మార్గం.
(న్యూయార్క్ నగరంలో పోలీసు దురాగతాలకు బలిపోయిన అమదో దియాలో, 23 సంవత్సరాల షాన్ బెల్ లాంటి ఎందరో అమాయకులను గుర్తుచేసుకుంటూ …)