- చెరబండరాజు

మృత్యువునే
పరిహసిస్తు
శత్రువునూ
ఎదిరిస్తా

బాహాబాహి
యుద్ధంలో
ప్రజాబలం
నిరూపిస్తా

పాలకులా
ప్రతిపక్షుల
ఉభయవర్గ
శత్రువునే

సమీకృత
సాయుధవ్యవస్థను
ప్రజాయుద్ధమే
జయించు

ప్రతిపక్షం
సీటుగాదు
రాజ్యాంగం
వలయునాకు

అనారోగ్య
బాధితుణ్ణే
అయితేనేం
యోధుణ్ణే

కలంగళం
ప్రాణప్రదం
ప్రజకి నేను
అంకితం

పోరాటం
డైరెక్షన్
పాట నాకు
ఆక్సిజన్

కన్నీటికి
కరుగుతాను
ఏటివాలు
పడిపోను

ముంజేతిని
ఖండించిన
నా పిడికిటి
కత్తివదల

ఉరి తాటికి
పాట నేర్పి
పల్లవినే
పాడిస్తా

ప్రజలు వేలు
మృతులైనా
పోరాటం
జయిస్తుంది

రేపటిపై
ఆశలున్న
వాడేనోయ్
మానవుడు

ఈ చీకటి
కుంపటారి
ప్రభాతాలు
పరిమళించు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)