- జె.సి.

అదనపు విలువ దోపిడీని నిరంతరంగా కొనసాగించడానికి అనువుగా వర్గ సమాజం సృష్టించిన మార్మికత (mystification) ను సరుకులమాయ (commodity ferishism) ను అధిగమించి కవిత్వాన్ని తిరిగి నిజమైన విప్లవాచరణగా మార్చిన కొద్దిమంది కవుల్లో చెరబండరాజు అగ్రగణ్యుడు. దిగంబరకవిగా మొదలయి విప్లవ కవిగా ఆయనలో వచ్చిన మార్పు క్రమం విప్లవ గతితర్కానికి అనుగుణమైంది. ఈ మార్పు చెరబండరాజు విప్లవ కవుల్లో అగ్రగణ్యుడు కావడానికి ఎలా తోడ్పడిందో ఈ వ్యాసంలో చర్చిద్దాం.

సామాజిక చైతన్యరూపమైన కవిత్వం గతి తార్కిక చారిత్రక భౌతికవాదం ప్రకారం జ్ఞానసిద్ధాంతంతో ముడిపడి ఉంది. కవిత్వానికి భౌతికపునాది సమాజం. దాని మాథ్యమం సామాజిక భౌతికోత్పత్తి అయిన భాష. దాని సారం సమాజంలోని ఉత్పత్తి సంబంధాల చేత ప్రభావితమైన విలువల్ని సూచించే ప్రతీకలు. కాని దాని ప్రాణం మాత్రం కవిలో ఊహగా రూపొందిన అతని సామాజిక చైతన్యం. ఆ సామాజిక చైతన్యం ఎంత విప్లవాత్మకమైతే అంత గొప్పగా ఉంటుంది అతని కవిత్వం.

ఈ శతాబ్దంలోని అన్ని భాషల్లోని బూర్జువా కవుల కవిత్వంలో మాదిరిగా సమాకాలీన సామాజిక సంబంధాలకు అద్దంపట్టేది మాత్రమే అయితే ఆ కవిత్వం యధాతథవాదంలో భాగమే. అంటే వర్గసమాజపు కుట్రలో భాగమన్నమాట. అలా కాకుండా వర్గసమాజపు మార్మికతను (సరుకుల మాయ కూడా ఆ మార్మికతకు మారు రూపమే.) అంటే అదనపు విలువను దాని ఉత్పత్తిదారుని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, మాయతో దోపిడీ చేయడానికి సృష్టించిన సామాజిక పరిస్థితిని బట్టబయలు చేసేదే నిజమైన కవిత్వం. ఉదాహరణఖు వేమన పద్యాలు. అయితే ఈ రకమైన కవిత్వం ఎలా ఆవిర్భవిస్తుంది.

భౌతిక ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని మనిషి గతితార్కిక పద్ధతి ద్వారా సంపాదిస్తాడు. బాహ్యప్రపంచాన్ని, దానిలో జరిగే భౌతిక మార్పుల్ని తన ఇంద్రియాల ద్వారా గ్రహించి మనిషి, ఆ అనుభవాన్ని ఒద్దికగా అమర్చుకొని, క్రోడీకరించి తద్వారా భావాల్ని, ఉద్దేశాల్ని ఏర్పరుచుకొని విజ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఆ జ్ఞానంతో ప్రపంచాన్ని తిరిగి చూస్తాడు. ఈసారి అతడు తన ఇంద్రియాల (కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి) ద్వారా గ్రహించే జ్ఞానం ఉత్తమంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు తప్పుల్ని సవరించుకొంటూ విజ్ఞానాన్ని పెంచుకొంటూ పోతాడు అతడు. కవి తన కవిత్వ విషయంలో అనుసరించే పద్ధతి కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. అయితే అతని భౌతికపునాది సమాజం, బాహ్య ప్రకృతి గురించి రాసినా, అతని వస్తువు సమాజమే.

తన చుట్టూ ఉన్న సమాజంలో, వర్గసమాజంలోని మార్మికత (దేముడు, దెయ్యాలు, పురాణాలు, అమూర్తమైన విలువలు) కారణంగా సామాన్యునికి పూర్తిగా అర్థం కాకుండా పోయిన సామాజిక సంబంధాలను, వైరుధ్యాలను కవి గ్రహించగలడు. అసంపూర్ణమే అయినా సామాన్యుని అనుభవం కూడా కవి అనుభవాన్ని సంపూర్ణం, స్పష్టం చేయడానికి పనికి వస్తుంది. తన పరిశీలనా గ్రహణశక్తులు జ్ఞానం ద్వారా సామాన్యుని కంటె ఎక్కువగా సామాజిక చైతన్యాన్ని తనలో పెంపొందించు కొన్న కవి తాను నివసిస్తున్న సమాజంలోని సంబంధాలను, విలువలను తన కందుబాటులో ఉన్న భాష ద్వారా, కళారూపాల ద్వారా తన కవిత్వంలో ప్రదర్శింపగలడు. అయితే, తాను దర్శించిన సామాజిక సంబంధాల మార్మికతలో తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొనకుండా వాటిలోని వైరుధ్యాల్ని గుర్తించి, పాలకవర్గాలకు, పీడితులకు సమాజంలో నిరంతరం జరిగే పోరాటాన్ని (మార్క్సిస్టు దృక్పథంతో కాకపోయినా) చైతన్యవంతంగా ప్రదర్శింపగల్గితేనే గాని అతడు మంచి కవి కాజాలడు. అలాంటి చైతన్యవంతమయిన కవికి తను కలలుగనే ప్రపంచం యొక్క భౌతిక వాస్తవికత, సిద్ధాంత జ్ఞానం ఉంటే అతని కవిత్వంలో నిజమైన ప్రాణం ఉంటుంది. ఈ చివరి కోవకు చెందిన కవే చెరబండరాజు.

కవికి భాష, కవితారూపాలు ప్రతీకలు, ముడిపదార్థాలు. భాష, కవితా రూపాల (పాట, వచనకవిత, ఛందో పద్యం) విషయంలో కవి అంతగా స్వతంత్రించలేడు. అవి సమాజమతనికిచ్చిన భౌతిక రూపాలు. వాటిని కొత్త కొత్త రీతుల్లో వాడినా, కవి ముఖ్యంగా తన వ్యక్తిగత నైపుణ్యాన్ని ప్రతీకల విషయంలోనే ప్రదర్శించుకొంటాడు. ప్రతీకను నిర్మించే తీరులోనే అతని గొప్పతనం కన్పిస్తుంది. అయితే కవి ప్రతీకను నిర్మించే తీరు కూడా గతితార్కికమైందే.

ఒక సామాజిక పత్యాన్ని (అనగా ఒక చారిత్రక సామాజిక సంబంధాన్ని) కవి గ్రహిస్తాడనుకొందాం. ఆ సత్యాన్ని దాదాపుగా సమాజంలోని అందరు వ్యక్తులూ గ్రహించి ఉండవచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పాక్షికంగా కన్పించి ఉండవచ్చు. ఉదాహరణకుః ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు కట్టుకొనేందుకు గుడ్డ, తింటానికి తిండి, ఉండటానికి ఇల్లు లేవన్న సంగతి అందరికీ తెలుసు. అయినా వీరికి, వీరి అసవరాలకు లేని విలువ ఈ దేశపు పాలకవర్గాలు జాతిపై బలవంతంగా రుద్దిన జెండాకుంది. కోట్లాది ప్రజలకు కట్టుకోడానికి సరిపోయేంత గుడ్డ ఇవ్వలేకపోయినా (గాంధీగారి ప్రవచనాల మీది గౌరవంతోనైనా) సంవత్సరానికి రెండుసార్లయినా లక్షలాది తాన్లతో తయారుచేసిన మూడురంగుల జెండా ఎగురవలసిందే. ఎందుకంటే అది జాతి గౌరవానికి సంకేతం. కోట్లాది ప్రజల అవసరాలు తీర్చలేనపుడు జెండాకు అంత గొప్ప విలువ ఇవ్వడం సత్యాన్ని మసిబూసి మారేడుకాయ చెయ్యడమే అవుతుందన్న సాంఘికసత్యం తెలిసినవారు అరుదు. చాలామందికి జెండా నిరాకారమయిన జాతి గౌరవానికి సంకేతమనే తెలుసు. ఇంకా చాలామందికి ఈ దేశంలో కోట్లాదిమంది గుడ్డల్లేకుండా బతుకుతున్నారని తెలుసు. కాని దీనికి కారణం అదనపు విలువ ఎడతెగకుండా ధనికులైన పాలకవర్గాల జేబుల్లోకి పోవడం అని తెలియదు. జెండా నిజానికి పాలకవర్గాల ప్రభుగర్వానికి సంకేతమని తెలియదు. ఈ విధమైన పాక్షిక జ్ఞానం ఉండటానికి ఉత్పత్తి సంబంధాల్లోని మార్మికతే కారణం అన్న నిజాన్ని, కోట్లాదిమంది బట్టల్లేకుండా మగ్గుతున్నపుడు ఇంకా జాతి గౌరవమేమిటి, జెండాయేమిటి అన్న సత్యాన్ని, ‘జెండా గౌరవం’ అన్న భావం వెనుకనున్న ఉత్పత్తి సంబంధాల్లోని వైరుధ్యం గురించిన జ్ఞానం కలిగినవారు బహు కొద్దిమంది. చాలామందికి తెలియని ఈ సామాజిక సత్యాన్ని సూటిగా హృదయాలకు హత్తుకొనేటట్లు ప్రతీకరించి చెప్తాడు ఒక కవిః

ఓ నా ప్రియమైన మాతృదేశమా
………………………………………
………………………………………
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రనై ఊరేగుతున్న ధైర్యం నీది

తల్లి ప్రేమ అందరికీ తెలిసిందే. తన బిడ్డలపై ఉన్న ప్రేమ కారణంగా తన ఒంటిపై గుడ్డలు సరిగా లేకున్నా పిల్లలకు అమర్చిపెట్టజూస్తుంది తల్లి. కాని భారతదేశమనే తల్లి మాత్రం ఒంటి మీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రయి ఊరేగుతున్నది ఎందువల్ల? స్వార్థపరులైన పాలకవర్గాల కుట్ర వల్ల అన్న సమాధానం స్ఫురిస్తుంది వెంటనే. చెరబండరాజు రాసిన ఈ కవితను చదివినవారికి మాతృదేశమంటే మట్టి కాదు ప్రజలు అన్న విషయం విడమర్చి చెప్పనవసరం లేదు.

ఈ ప్రతీకలో కవి చేపట్టిన గతి తార్కిక విధానం ఇదిః చాలామందికి మార్మికత వల్ల పాక్షికంగా మాత్రమే అర్థమయిన సామాజిక సత్యాన్ని ఒక భావంగా చేసి (ఈ పని సామాజిక శాస్త్రవేత్త చేసేది) దాన్ని కవితారూపం చేశాడు కవి. కవితాపరం చేయటంలో కూడా గతితార్కిక విధానాన్నే అనుసరించాడు. ‘మాతృప్రేమ’ అనే తెలిసిన విషయాన్ని అస్పష్టమైన భావానికి ఆపాదించి, చాలామందికి పాక్షికంగా అర్థమైన విషయాన్ని లేక సులభంగా అర్థంకాని విషయాన్ని హృదయానికి హత్తుకొనేటట్లు చెప్పాడు. మార్మికత, సరుకులమాయలో పడి జటిలమైన భావాన్ని, పాలకవర్గాల కుట్రను సులభగ్రాహ్యంగా, సూక్ష్మంగా, స్పష్టంగా బట్టబయలు చేశాడు కవి. దిగంబర కవితాకాలంలో రాసిన ‘వందేమాతరం’ అన్న ఈ కవితలో చెర ముందు చెప్పబడిన మూడవకోవకు చెందిన కవిగానే దర్శనమిస్తారు. మిగతా దిగంబరకవుల మాదిరి కాకుండా, (అప్పటికి అతనికి మార్క్సిస్టు సిద్ధాంతావగాహన సంపూర్ణంగా లేనప్పటికి) సమాజంలోని పీడితవర్గాలతో భావైక్యత పరిపూర్ణంగా ఉంది.

“కోపంతో, ఉద్రేకంతో తిరగబడి మత, రక్తబాంధవ్యాల ముళ్ళపొదలపై, శిథాలవ్యవస్థపై, జడత్వంపై సంచలనాన్ని లేవదీసి, మరో మహత్తర వ్యవస్థ కోసం తపన పడుతున్న కోపోద్రిక్త యువకుల నడుమ, (దిగంబర శకం లోంచి / సమకాలీన జీవితంపై దిగంబర కవుల దృక్పథం / మేం ఏం కోరుతున్నాం, దిగంబర కవులుః సంపుటిః 2) నిలబడి సమకాలీన వ్యవస్థపై ధ్వజమెత్తినప్పటికీ దిగంబరకవులు పీడితుల తరఫున వర్గపోరాటానికి సిద్ధం కాలేకపోయారు. అందుక్కారణం వారు కూడా వర్గవ్యవస్థ నిర్మించిన మాయాజాలంలో ఇరుక్కుపోయి, ఏ మతాలతోను, ఇజాలతోను నిమిత్తం లేకుండా అసలు విలువల కోసం, కత్తి అంచుపై కూడా మానవత్వాన్ని మరచిపోని నైరూప్య మానవుని కోసం తపించడమే. తత్ఫలితంగానే వారి దిక్‌లలో అవ్లీలం, అక్కసులపాలు ఎక్కువై కేవలం అప్పటి యాంత్రిక అభావ ధోరణి చోటు చేసుకొన్నది. కాని చెరబండరాజు కవితల్ని పరిశీలిస్తే వాటిలో మనకు కనిపించే మానవుడు నైరూప్య మానవుడు కాడు. అతడు క్రోధంతో, ఎగసిపడేది దోపిడీదారునిపైన, సానుభూతి చూపించేది పీడితులపైన. దిగంబర కవిగా కూడా అతనిలో విప్లవాత్మక వర్గచైతన్యం సూచనప్రాయంగానైనా కన్పిస్తుంది. ఆ చైతన్యమే అతణ్ణి విప్లవకవిగా ఎదగడానికి దోహదం చేసింది.

ఆపకండి
వెనక్కి పిలవకండి
మీ మాసిక ఏకాకితనం శిఖరాల మీద
కాంతి పాదాలతో కదం తొక్కుతూ
నడుస్తున్నవాణ్ణి
………………………………………..
………………………………………..
పాలిపోయిన నరనరాన్ని పితికి
జీవనదికి ఊటలు సృష్టించేవాణ్ణి
మీ అస్తిత్వాన్ని ఆశయాల్ని కాలదన్ని
మీ కలల్ని పావులుగా చదరంగం ఆడేవాళ్ళ
ఆట కట్టించేవాణ్ణి
…………………………………………..
…………………………………………..
మోయలేని చట్టాల గులకరాళ్ళ తట్టలు మోయించేవాళ్ళని
వాళ్ళ డబ్బాల్ని వాయించే అపర శిఖండుల్ని
పట్టపగలు బట్టబయలు చేసేవాణ్ణి
ఆపకండి
ఆపకండి
వెనక్కి పిలవకండి
(కాంతి పదాలు, దిక్‌సూచి, పుట 2230)

దిగంబర కవుల రెండవ సంపుటిలో ‘దిక్ ఇరవైతొమ్మిది’ అన్న శీర్షిక గల ఈ కవితలో, తాము సృష్టించిన అదనపు విలువ పరాయీక్రమణ చెందే క్రమంలో, కేవలం సరుకులనుత్పత్తి చేస్తూ, సరుకుల స్థాయికి దిగజార్చబడి, అపరకులమాయ సృష్టించిన ‘మానసిక ఏకాకితనం’లో మగ్గుతున్న శ్రమజీవుల నుద్దేశించే కవి మాట్లాడుతున్నాడన్నది స్పష్టం.

‘ఆ శ్రమజీవుల తలల మీది చంద్రుణ్ణి ముక్కలు చేసి, వారికి చీకటి అఖాతాల్ని మిగిల్చి
ఎందుకు ఏమిటి అని
ఎదిరించే హక్కు లేదని వాదించే గాడిదల
నాలుకలు పీకేవాణ్ణి’

అని కూడా అంటున్నాడు. శ్రమజీవుల బతుకు సౌందర్యమే వారి తలల మీది చంద్రుడు. వారి జీవన సరళి వెన్నెల్లాంటిది. వారి నిజమైన ప్రపంచం వాడుక విలువల ప్రపంచం, కాని వారి బతుకు చంద్రుణ్ణి ముక్కలు చేసి, వారి జీవితాల్లో సామాజిక శ్రమ సృష్టించే అన్యోన్యతను, ఐక్యతను, వెలుగుల సరుకుల మార్పిడిమాయతో భగ్నంచేసి మనిషికి మనిషికి మధ్య చీకటి అఖాతాల్ని సృష్టించి ఎదురుతిరిగి ప్రశ్నించే హక్కును కూడా కాలరాయ ప్రయత్నించే ‘గాడిదలు’ పాలకవర్గాలు. వాళ్ళు పన్నిన కుట్ర శ్రమజీవన సౌందర్యాన్ని అభావం చేసింది. ఆ అభావాన్ని అభావం చేసి శ్రమజీవి తలపై తిరిగి చంద్రుణ్ణి నిలబెట్టి వారి జీవితల్లో తిరిగి వెన్నెల వెలిగేట్టు చేయడానికి కవి ఉద్యక్తుడౌతున్నాడు. అనగా తన కవిత్వాన్ని, జీవితాన్ని విప్లవాచరణలో భాగంగా మలచుకోవడానికి తయారౌతున్నాడన్నమాట.

చంద్రుడూ, అఖాతాలు రెండూ పరిచితమైన అంశాలు. తన ప్రతీకల్లో వాటి నాపాదించి శ్రమజీవన సౌందర్యమెలా వర్గదోపిడీలో అభావం చెందిందో, దాని వల్ల మనిషికీ మనిషికీ మధ్య ఎలాంటి సామాజిక అగాధం, చీకటి సృష్టించబడిందో చెర చెప్పిన తీరు కవిత్వంలో గతితార్కికతకు మచ్చుతునక.
ఈ విధంగా దిగంబర కవితాకాలంనాటి చెర కవిత్వం కూడా అదనపు విలువ దోపిడిని నిరాఘాటంగా సాగించడానికై పాలకవర్గాలు ప్రతిష్ఠించిన మాయాజాలాన్ని బట్టబయలు చేయడానికి చేసిన ప్రయత్నమే. కాని, కవిగానే కాక ఒక వ్యక్తిగా దేశంలో నలుమూలలా ఎదిగి వస్తున్న విప్లవ పోరాటంలో భాగంగా విప్లవాచరణకు పూనుకోవడం జులై 1970లో పుట్టిన విరసంతో చెరబండరాజుకు సాధ్యమైంది. విరసం పిలుపందుకొని వచనకవిత్వంతో పాటు పాటలు రాయటం మొదలుపెట్టాడు. కేవలం కవిత్వం ద్వారానే వర్గసమాజపు మాయాజాలాన్ని బట్టబయలు చేయడంగాక మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయ సిద్ధాంతం సహాయంతో తన వ్యక్తిగత జీవితంలో కూడ విప్లవచారణకు పూనుకొన్నాడు. ఇప్పుడు చెర విప్లవయోధుడైన కవి. సాంస్కృతిక విప్లవయోధుడు. విప్లవాచరణకు ఆవశ్యకమైన జాగరూకతతో ఉషస్సులా నిర్మలమైన, మనస్సుల్లా సున్నితమైన శ్రమజీవుల్ని తన పాపలూ, కనుపాపలుగా భావించి, ఎన్నికల మార్మికతా ముసుగులేసుకొని వారిపై దాడి చేసే రాజకీయ డేగల గురించి హెచ్చరిస్తున్నాడు.

మళ్ళీ వస్తున్నాయి మన ఊరికి
చిలుక పలుకుల డేగలు
రక్తం తాగే రాబందుల మూకలు
కలల కరివేపాకు చెట్లూ
కళ్ళ లోగిళ్ళలోని ఆశా ప్రసూనాలు
పాపలూ కనుపాపలూ జాగ్రత్త
రెండు దశాబ్దాల గాయాల నొప్పులతో
విసిగి వేసారిన సూర్యుడు
రాజీలేని ఎర్రని మంటలతో
ఇపుడిపుడే ఇంటింట తలుపు తడుతున్నాడు
మొత్తంగా రెక్కలిప్పి
ఇనుప ముక్కులకూ ఉక్కుగోళ్ళకూ
లే చిగుళ్ళ కవచాలు కప్పి
దేశం ఆకాశం నిండా
దోపిడీ, దేశభక్తి గీతాలు పాడుకుంటూ
పుక్కిటి నిండా పుచ్చు వాగ్దానాల గింజల్ని నములుకుంటూ
………………………………………………….
………………………………………………….
ఊళ్ళో వాటికి గూళ్ళున్నాయి గుళ్ళున్నాయి
అంతశ్శత్రువుల పళ్ళ మధ్య
మన యిండ్లూ నలిగే వున్నాయి
(మళ్ళీ వస్తున్నాయి మన ఊరికి, ముట్టడి, పుటః 41-42)

అయినా భయపడాల్సిన అవసరం లేదు అని చెపుతున్నాడు. ఎందుకంటే,

‘శత్రు శిబిరాల శిఖరాగ్రాల మీదికి
దోపిడీ గుండెల పాదాల మీదికి
పోరాటం బండల్ని దొర్లించి
ఊరూరికి ప్రాకుతున్న
ఎరుపుండగ నెరపేటికి.’

ఇప్పుడిప్పుడే రాజీలేని ఎర్రని మంటలతో ఇంటింటి తలుపు తడుతున్నది విప్లవోదయ సూర్యుడు. అతని వెలుగు ఊరూరికి ప్రాకుతున్నది. విప్లవ పోరాటం ప్రజా జీవితంలో ఒక ఉన్నత దశ. పోరాటం ఎత్తుల నుండి శత్రు శిబిరాల మీదికి, దోపిడీ గుండెల పాదాల మీదికి విప్లవం పోరాటం బండల్ని దొర్లిస్తే అవి నాశనం కాక తప్పవు. అందరికీ పరిచితమై ప్రకృతి సత్యాలనుపయోగించి సిద్ధాంతజ్ఞానాన్ని కల్గించ ప్రయత్నిస్తున్నాడు కవి ఈ ప్రతీకల్లో. అలాగే ‘ఎరుపు’ (విప్లవం) అంటే ‘మన పేదల ఎదల మొదళ్ళలోని ఎరుపు’, ‘ఎదల మొదళ్ళు’ ప్రేమకు, కరుణకు, మానవత్వానికి ఉత్పత్తి స్థానాలని ఎవరికీ చెప్పనవసరం లేదు. ఇలాగే ఇంకా ఎన్నో కవితల్లో చెర విప్లవాన్ని రంగరించి వర్గవ్యవస్థలో శ్రమజీవుల జీవితసత్యాల్ని, సిద్ధాంత జ్ఞానాన్ని చెప్తాడు.

విప్లవాచరణమైన అతని కవిత్వానికి ఇప్పుడు భౌతిక పునాది చైతన్యవంతమైన పోరాటం. అది నక్సల్బరీలో ప్రారంభమైన విప్లవ పోరాటం. పోరాటానికి, కవిత్వానికి మధ్య గతితార్కిక సంబంధంలో అతడు చాలా నేర్చుకుంటాడు. నేర్పిస్తాడు. ‘అంకితం’ (ముట్టడి) అన్న కవితలో చెప్పినట్లుగా ఇవ్వాళ్ళ ప్రపంచం అతనికి ‘మా పల్లెటూరి కన్నా చిన్నది’గా (సంకుచితంగా కాదు, ఆత్మీయతకు, ఐక్యతకు, నిజమైన సహకారానికి అవకాశం కలిగించే శ్రమైక జీవనసరళిగల పల్లెటూరి వలె) కన్పిస్తుంది. అతని షెల్ఫులోని పుస్తకాల్లా చేతి వేళ్ళలా మరీ మరీ దగ్గరై అందుబాట్లో ఉన్నది. అతన్ని ఈ దృష్టికి నడిపించినవారు ఎక్కడో లేరు, ఎవరో కారు.

వాళ్ళు చరిత్ర రహస్యాల్ని ఛేదించిన వీరులు.
నా గురువులు నా వాళ్ళు.’
వాళ్ళు చరిత్రకు యవ్వనం ప్రసాదించిన వైద్యులు.’
పోరాటాలకు పర్యాయపదాలు.
వర్గదృష్టి నిశితం కానిదే కనబడనివాళ్ళు.
అయితే, వాళ్ళు విప్లవ సైద్ధాంతికులా? కారు,
విప్లవకారులైన శ్రమజీవులు.

చివరగా ‘నేనూ నా గీతం వాళ్ళకే అంకితం’ అని తననూ, తన కవిత్వాన్ని శ్రమజీవులకు అంకితం చేసుకుంటాడు చెరబండరాజు. ఈ విధంగా చెరలో వర్గదృష్టి నిశితమయ్యి, పీడితుల పక్షాన వారి బతుకుపోరాటంలో ఐక్యమయ్యి వారి కోసం పాటను తన కవితారూపంగా ఎంచుకున్నాడు చెర.
శ్రమలో పుట్టి శ్రమజీవుల బతుకుల్తో పెవనేసుకొని వర్గసమాజంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాటను విప్లవాచరణలో భాగంగా చేసుకోవడం వర్గ సమాజపు అభావాన్ని అభావం చేసే కార్యక్రమంలో పెద్ద మలుపు చెర కవిత్వంలో విప్లవ పోరాటానికి అంకితమైన విరసం, జననాట్యమండలుల క్కూడా సరుకులమాయ ఫలితంగా శ్రమజీవుల బతుకులో పాట కూడా మృగ్యం అవుతున్న సమయానికి విప్లవాచరణలో భాగంగా పాటను ఎంచుకొని శ్రమజీవన సౌందర్యాన్ని పరిరక్షించడానికి పూనుకొన్న సుబ్బారావు పాణిగ్రాహి, శివసాగర్, గద్దర్‌ల సరసన చెర కూడా అంత ఎత్తుకు ఎదిగాడు.

‘కొలిమంటుకున్నాది’ నుండి ‘కత్తిపాట’ వరకు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఉత్కృష్టమైన విప్లవ కవితాగ్ని శకలం. (ఇటీవలనే విరసం 1971 నుండి 1980 వరకు చెర రాసిన పాటల్ని కత్తిపాటగా ప్రచురించింది.) ‘కొలిమంటుకున్నాది’ పాటలో శ్రమజీవి బతుకుని పోరాటానికి, పోరాటాన్ని శ్రమజీవి దైనందిన జీవితానికి ప్రతీకలుగా చేశాడు కవి. శ్రమజీవి బతుక్కీ పోరాటానికి మధ్య ఉన్న గతితార్కిక సంబంధం నుంచే శ్రామిక జనచైతన్యం పుడుతుంది. ఆ చైతన్యాన్ని ఇంకా ప్రజ్వలింపజేసి వ్యవస్థాపరమైన మార్పుల్ని సాధించాల్సిన అవసరం గురించి చెర వాడిన ‘కొలిమి’ ప్రతీక ఆ చైతన్యంతో పూర్తి ఐక్యత సాధించిన సామాజిక చైతన్యంలోంచి ఉద్భవించిందే.

కొలిమంటుకున్నాది
తిత్తి నిండా గాలి
పొత్తంగ ఉన్నాది
నిప్పారిపోనీకు- రామన్నా
పొద్దెక్కిపోనీకు- లేవన్నా (కొలిమంటుకున్నాది, కత్తిపాట 1-2)

‘ఓటు కెదిగిన బిడ్డ (పెళ్ళి లేకున్నాది)’ అన్న ప్రతీకలోని ధ్వనులు వర్గసమాజపు రాజకీయాల్లోని మార్మికతను, మాయను లేక కుట్రను అభావం చేసి చూపించే కవిత్వకళలో చేయి తిరిగిన చెరలాంటి కవికి గాని సాధ్యపడదని చెప్పవచ్చు. ‘స్వతంత్ర భారతం’, దానితో పాటు ఎదిగివచ్చిన బిడ్డ- ఆ ఇద్దరూ పాలకవర్గం కుట్రకు బలి అయినవారే. ఇక్కడ దేశం బిడ్డ స్థానాన్ని పొందింది. కూలినాలి చేసి శ్రమజీవి దేశమనే బిడ్డకూ, సొంతబిడ్డకూ యుక్తవయస్సులో (దేశంలో ఓట్లు, ఎన్నికలు 1951లో మొదలయినాయి. అంటే భారత రిపబ్లిక్ అనే బిడ్డ వయస్సు ఈ పాట రాసే కాలానికి 20-21 సంవత్సరాలు) చేయవలసిన పెండ్లి చేయలేకపోయాడు. తీర్చవలసిన అచ్చుట్లు-ముచ్చట్లు తీర్చలేకపోయాడు. కారణం తాను ఉత్పత్తి చేసిన సంపదను పాలకవర్గాలు దక్కించుకొనగా తాను బీదరికంలో మ్రగ్గటమే. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటం గతితార్కిక చారిత్రక అవసరం. అందుకు కావలసిన చైతన్యాన్ని శ్రమజీవి తన బతుకులోంచి, శ్రమశక్తిలోంచే పొందగలడు. పోరాటంలో అతని శ్రమశక్తి సాధనాలే ఆయుధాలవుతాయి. కాబట్టే చెరబండరాజు శ్రమజీవిని

కర్రు పార సాన- బెట్టన్నా
బతుకు యుద్ధములోన - నిలువన్నా
అని పిలుస్తాడు.

ఈ పాటల్లో కొన్ని తెలుగుదేశంలో శ్రమజీవుల చైతన్యంతో బాగా పెనవేసుకొన్నాయి. ‘కొండలు పగలేసినం’, ‘జన్మహక్కు’, ‘విప్లవాల యుగం మనది’ మొదలగు పాటలు విప్లవ యువత ఊపిరిలో భాగంగా స్పందిస్తున్నాయి.

కుట్రకేసుల్లో ఇరికించబడ్డా, ఉన్న చిన్న జీవనాధారం ఊడినా, ఈ వ్యవస్థ కాన్సరై శ్రమజీవి, కవి అయిన తనను ఉన్న పళంగా తినేస్తున్నా ఖాతరు చెయ్యక శ్రమజీవుల పక్షాన మొక్కవోని కత్తిలా జీవించి, కత్తిపాట పాడుతూనే విప్లవ చైతన్యంతో సంపూర్ణ ఐక్యతను సాధించాడు చెరబండరాజు.
కవిత్వంలోనే కాదు, తన బతుకులోనూ గతితార్కిక చైతన్యంతో జీవించి కవిత్వానికీ, మానవ జీవితానికీ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినవాడు చెరబండరాజు.

ఒక్క అభిప్రాయం

  1. Rohiniprasad 03 జులై 2007 , 7:27 pm

    సరైన దృక్పథం మాత్రమే కాదు, మనసును కదిలించగల భావాలూ, వాటిని వ్యక్తీకరించగలిగిన అద్భుత నైపుణ్యమూ కూడా ఉండడం వల్లనే చెరబండరాజు ఉత్తమశ్రేణి కవిగా నిలిచాడని నా ఉద్దేశం. తన తరం కవులందరికన్నా అతను నిస్సందేహంగా ప్రతిభావంతుడు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)