రాజులను పొగిడి, దేవుళ్ళను కీర్తించి భరణాలను పొందిన కవులున్నారు. ప్రభుత్వాలను మెప్పించి అవార్డులు గెలిచిన రచయితలున్నారు. కానీ జనం గుండెల్లో బాధను అర్థం చేసుకొని, అన్యాయంపైన పోరాడి, ప్రజలకు ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించిన కవులు కొందరే. విప్లవకవి చెరబండరాజు వారిలో ఒకరు.
ప్రజాకవి చెరబండరాజు సంస్మరణలో భాగంగా, 25 వ వర్థంతి సందర్భంగా, ప్రజాకళ ఆయన రాసిన కొన్ని రచనలను ప్రచురించింది. ముఖ్యంగా చెర ప్రసిద్ధిగాంచిన “వందేమాతరం” కవిత రాసారు.
“ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలంనీది…
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది …”
చెర కవితాశైలి లో సహజమైన భాష, పల్లె స్వచ్ఛదనం వున్నాయి. హృదయాంతరాలనుండి సూటిగా వచ్చే మాట, జనం గొంతు వినిపించే పాట వున్నాయి. ఆయన రాసిన వచనకవిత్వం, శక్తివంతమైన పాటలు జనం గుండెల్లో ముద్రవేసుకున్నాయి. జనం నాడిని కనిపెట్టి సందేశాన్ని సూటిగా చెప్పిన కవి చెరబండరాజు.
“అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందంనీది
సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది ….
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది “
నేటి సామాజిక పరిస్థితులకు కూడా యీ కవితను అన్వయించుకోవచ్చు. దేశాన్ని తాకట్టు పెట్టడానికి, రైతులనుండి లక్షలాది ఎకరాల వ్యవసాయభూమిని కొల్లగొట్టి కోటీశ్వరులకు ధారాదత్తం చేయడానికి, నేటి ప్రభుత్వాలు ‘స్పెషల్ ఎకానిమిక్ జోన్స్’ పేరుతో వినూత్న పధకాలు తెస్తున్నాయి. రైతులు, రైతుకూలీల జీవనోపాధిపైన దాడిచేస్తున్నాయి. వ్యాపారవర్గాల లాభాలకోసం ‘ప్రపంచీకరణ’ పేరుతో సామ్రాజ్యవాద, పెట్టిబడిదారీ ఎజెండాను జనంపైన రుద్దుతున్నాయి.
దిగంబరకవిత్వం నుండి విప్లవకవిత్వం వరకు జరిగిన సుదీర్ఘప్రయాణంలో చెరబండరాజు సామాజిక వాస్తవాలను, నగ్నసత్యాలను, విప్లవ చైతన్యాన్ని వ్యక్తీకరిస్తూ ఎన్నో రచనలు చేసారు. అణగారిన వర్గాలు, దళితుల కోసం చివరివరకు పోరాడారు. చెరబండరాజుని హింసించి, పోలీసులు కేసులతో వేధించి, టార్చరు చేసి, పరోక్షంగా చంపివేసాయి అప్పటి ప్రభుత్వాలు మరియి పాలకవర్గాలు. తన కంఠంలో ప్రాణం వున్నంతవరకు, ఆఖరి శ్వాసవరకు జనంకోసం పోరాడాడు చెరబండరాజు.
మృత్యువునే
పరిహసిస్తు
శత్రువునూ
ఎదిరిస్తా
ముంజేతిని
ఖండించిన
నా పిడికిటి
కత్తివదల
జులై సంచికలో జె.సీ రాసిన విమర్శనాత్మక వ్యాసం “ చెర కవిత్వం- విప్లవ చైతన్యం” , ప్రజా కవి సామాజిక-రాజకీయ దృక్పధాన్ని తెలియజేస్తుంది. “నెత్తుటి కళ్ళలో ఎత్తిన జెండా” వ్యాసంలో శ్వామల, చెరబండరాజు జీవితసహచరిణిగా తన జ్ఞాపకాలను పంచుకుంటారు. కవితలలో లోచన్ రాసిన “రైటు టు వోట్ కాదు”, రామాచంద్రమౌళి రాసిన “అతనికేం కావాలి” మరియి ఇతర కవితలున్నాయి. డాక్టరు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసిన వ్యాసం “మనుషులు, జంతువులు” , కథలలో చ.రా రాసిన “కొత్తజోడు” , డాక్టరు ఎస్ . వి.రామరాజు రాసిన “చివరి కోరిక” వున్నాయి. తెలంగాణ పల్లె సామాజిక జీవితాన్ని చిత్రిస్తూ విప్లవకవి వరవరరావు రాసిన “పాలపిట్టల పాటలు” సంధ్యక్క, విమల, వేణు, రణం శ్రీను గానం చేసిన పాటలు వినండి.
సాహిత్యాభిమానులు, పాఠకులు, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులు, దళితులు, మైనార్టీలు మరియు విద్యార్ధులు చెరబండరాజు సాహిత్యాన్ని అధ్యయనం చేసి, పాఠాలు నేర్చి నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించవలసినదిగా ప్రజాకళ ఆహ్వానిస్తోంది.
పాఠకులు బాగా చదివే అత్యంత ప్రజాదరణ కలిగిన తెలుగు సాహిత్య పత్రికలలో ఒకటిగా ప్రజాకళ నిర్మాణం జరుగుతోంది ( జూన్ 2007 నెలలో 10,000 విజిట్స్ ). ఎందరో మిత్రుల, శ్రేయాభిలాషుల సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. మనం యీ ప్రగతిని నిలబెట్టుకోవటం, పత్రిక నిర్మాణాన్ని కొనసాగించటం ప్రజల చైతన్యాన్ని పెంపొందించే క్రమంలో అత్యవసరం. సమాజంలో చీకటి బ్రతుకులపైన కవితలు, కథలు రాయండి. ప్రజాకళ నిర్మాణానికి మీ రచనలు పంపించి, వాలంటీర్ కరస్పాండెంటు సేవలందిస్తూ, మీకు వీలైనంత సహాయం చేయండి.
ప్రజాకళ సంపాదకవర్గం
చెరబండ్రాజు ,శ్రీ శ్రీ ,వేమన లాంటి ప్రజాకవులు కావాలి సమాజానికి