- చ. రా.

మా నాన్న భౌతిక ప్రపంచంలో మాకు దూరమై అప్పటికి నాలుగు రోజులైంది. చిత్తడి జల్లులాగ గాలికి అశ్రువులు కురుస్తున్నాయి. వాతావరణమే తేమగా వుంది.

ఇంటిముందు వరండాలో పడక కుర్చీలో కూర్చొనివున్నాను. అఖిల ప్రపంచాన్ని ఆవరించి వున్న కాఱుచీకటి కంటికెదురుగా కనబడుతూవుంది. అంత కంటే గాఢంగా కమ్ముకుంది హృదయంలో చీకటి. వీనికైక్యం కలిగించడానికి కళ్ళు మూసుకున్నా. అవ్యక్తమైన ఆలోచనలెన్నో బుఱ్ఱలో గిఱ్ఱున తిరుగుతున్నయి. దగ్గరగా మంచం మీద మా రాజ్యలక్ష్మి కూర్చుని వుంది కుమారునితో. ఆ కృష్ణుడు గోడకు తగిల్చిన దీపాన్ని చూస్తూ, నవ్వులు వెదజల్లుతూ ఉన్నాడు.

చిన్నపిల్లలేవో పుస్తకాలు ముందు వేసుకుని చాపమీద చదవడం కంటె ఆర్భాటం ఎక్కువ చేస్తున్నారు. మా అమ్మ ముసుగుతో తలవంచుకుని గోడవార కూర్చుని వుంది. పనిపాట్లల్లో మునిగి వున్నారు లోపల మిగిలినవారంతా. మేము నిశ్శబ్దంగా వుండడంచూచి పిల్లలు కూడా క్రమక్రమంగా తమ చదువును కాగితాలు తిప్పడం కిందకు మాత్రమే మార్చారు. ఆలొచనలేమీ లేకున్నా ఆలోచిస్తున్న వారిలాగ అదో రకంగా నెమ్మదిగా వున్నాం.

‘అమ్మా! చిన్నబాబుగారున్నారా?’ అనే ప్రశ్న చెవుల్లో దూరింది. కళ్ళ తలుపులు తెరుచుకున్నవి.
‘అదో కుర్చీలో పడుకొని’ అంది నెమ్మదిగా మా అమ్మ.
‘ఏమిరా వెంకన్నా?’ అన్నాను.
మెడ మీద వున్న దుప్పటిదీసి క్రిందపడవేస్తూ వరండా మెట్ల మీద నిల్చున్నాడు మాదిగ వెంకన్న.

‘బాబూ ఇలా దయచెయ్యండి ఓ మారు’ అన్నాడు చేతులు కట్టుకొని
‘ఏమిటో చెప్పు ఇక్కడే వున్నానుగా. నాకు లేవడానికి బద్దకం’
‘ఒక్క అడుగు ఇక్కడికిదయచేయండి’ అన్నాడు వెంకన్న చేతులు వెనక్కి పెట్టుకుంటూ
మాటలను విని లోపల నుండి వచ్చి తలుపుకానుకొని నిల్చున్న మారెండో అమ్మాయి సుమతి అంది’ నాకు తెలుసులేరా ఈ వేళ ఆదివారమన్నయ్యా సంత దినం’
అమ్మాయికి తెలుసునేమోగానీ నాకుతెలిసినట్టెక్కడా సాక్ష్యం లేదు
‘వెళ్ళన్నయ్యా కానుకలిస్తాడు’ అంది మరీ సుమతి
‘ఏమీ లేదండీ బాబూ! ఇదో ఇక్కడికి ఓ మారు’ అన్నాడు వెంకన్న
‘సరే’ నంటూ లేచి మెట్లవద్దకు వెళ్ళాను
రెండు చేతుల్లో వున్న తెల్లని కాగితాల పొట్లాలు ముందుంచి నమస్కారం చేసి ‘తీసుకోండి’ అన్నాడు వెంకన్న
‘ఏమిటవి’ అశ్చర్యపడ్డాను.

‘నేం చెప్పలేదా? ప్రతి ఆదివారమూ వెంకన్న ఈ వేళకు సరిగా పంచదారా పటికబెల్లమూ పొట్లాన నాన్నగారికి తెచ్చి ఇచ్చి నమస్కారం చేసేవాడు. నాన్నగారు వాని భక్తికి ఎంతో పొంగిపొయేవారు ఆ తరువాత వారు అర్ధరాత్రి వఱకు మాట్లాడేవారు నాన్నగారికి బదులు ఈ వేళ మీకయింది ముందే అన్నాను గదూ?’ అంది అంతా ముందే చెప్పినట్టుగా సుమతి.

‘అతను అలా చేయడం మామూలే’ అని మా అమ్మ కూడ అనడం పొట్లాలు తీసుకున్నాను
తరువాత వెంకన్న అన్నాడు ‘బాబుగారూ’ నాన్నగారి జోడు - నేను స్వయంగా కుట్టి యిచ్చినది - ఎక్కడొ ఇంట్లో వుంటది అది మాత్రం నాకిప్పించ్చండి. నా గుడిసెలో వేలాడకట్టుకుంటాను పెద్దబాబుగారిని తలచుకుంటూ’
‘ఇదేమిట్రా జోడు కావలంటున్నావు. ఇంతకంతే వేరే యేమీ నీకు తోచలేదా? పటమా, భాగ్యమా, ఇంకొకటా?’ అన్నాను.
‘అదేనాకిష్టమైనది వేరే యేమీవద్దండి. నా కింక కావలసింది ఏమీ లేదు’ బాబు గారు పోయారు. నా బతుకు పాడయింది; ఇంకా అవుతుంది. నేంగూడా బతకను. బతకనివ్వరుకూడా’ అంటూ కాళ్ళ మీద పడి భోరున ఏడవటం మొదలుపెట్టాదు వెంకన్న.

నాకూ దుఃఖం వచ్చింది నాలుగుదినాల క్రిందట ఏ బా యెఱుగని మా నాన్న హటాత్తుగా ‘ఇదిగో, ఇంక నేనులే’ నంటూ అనంతవిశ్వంలో లీనమైనది మరల ఒక్కమారు మనొవీధిలో మెరిసిపోయింది మరల గాలివీచింది అశ్రువులు వర్షించాయి.

దుఃఖమాపుకున్నాను వెంకన్నను లేవనెత్తాను శాంతపరచాను.

మా నాన్నగారికి మావూరి మాలమాదిగలంటే ఎంతో దయా సానుభూతీ వారి కుర్రాళ్ళకు వూరివాళ్ళందరిని ధిక్కరించి చదువు చెప్పారు. వారి వ్యవహరాలు తన చేతి మీదుగా నడిచేవి. వారికేవయినా రోగాలు వస్తే రాత్రింబవళ్ళూ మేలుకొని వారికి సేవ చేసేవారు. వారికేం కావలసి వచ్చినా అచ్యుతరావుగారి సలహా గావాలి. వారు చేయగలిగినన్నివిధాలా వారికి సాయం చేసేవారు. వారందరిలో వెంకన్నకు మా నాన్నగారిపైన భక్తిప్రేమలెక్కువ

ఇదంతా నాకు తెలుసును. అయినా ఎపుడో గాని నాలుగురోజులు ఇంట్లో వుండనందున నాకా జోడు మాహాత్యం తెలిసింది కాదు. వెంకన్న అలా మాట్లాడటానికి కారణం అవగాహం అయింది కాదు
‘వెంకన్నా! ఏమిటి విశేషం. నాన్నగారి మృతి మాకే కాకుండా మీ అందరికీ కూడా నష్టకారణమయింది దానికి నా హృదయవేదన మితిమీరుతూ వుంది’
‘జోడు సంగతి జెప్పవలనంటే ఓ పెద్ద కథవుతుంది బాబూ! అది అమ్మగారికి తెలుసు ఇంట్లొ అందరికి తెలుసు’ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ
‘ఔనురా నాయనా! నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది, జోడు సంగతి మీనాన్న వుండగా నీకది తెలిసివుంటే నీవు నిజంగా సంతొషపడేవాడివి ఇప్పుడు వింటే నీకది మరింత వేదన కలిగిస్తుంది’ అంది మా అమ్మ నెమ్మదిగా

నేను ముందొకమారు వచ్చాను అప్పుడు అబ్బాయి నెత్తుకొని నాన్న ‘నీకు కూడా జోడు కావాలా, వెంకన్న కుట్టిస్తాడు’ అంటూ ఆడించేవారు అప్పుడు నేనడిగితే దాని సంగతంతా నాకు చెప్పి ‘అన్నయ్యకిది తెలియనీయవద్దు. వాడు కోప్పడతాడు అన్నారు నిన్ను డబ్బు అడగలేక నీకు కస్టం అవుతుందేమో అని ఇలాంటి బాధల పడ్డ తండ్రి’ - తరువాత మాట్లాడలేక పోయింది రాజ్యలక్ష్మి
సుమతి కథంతా చెప్పింది మధ్యమధ్య మా అమ్మా రాజ్యలక్ష్మీ కొన్ని విషయాలు చేరుస్తూ వచ్చారు

*****

వెంకన్నది పెద్ద కుటుంబము ‘పిల్లా జెల్లా కలిసి పదిమందుంటారు. వ్యవసాయంలో తొడ్పడే తమ్ముళ్ళిద్దరున్నా గ్రుహభారమంతా తనమీదనే వుంది భూమిబుట్రలు కొద్దిగా వుండేవి అవయినా మెరకభూములు అప్పుడప్పుడూ వానదెవుడు ‘శీతకన్ను’ వేస్తూ వచ్చాడు ఇంతలో అర్ధికమాంద్యం బరువెక్కువైంది అందుచేత సంసారానికయే బడ్జెటు తీర్మానాలు తల్లకిందు లౌతువచ్చాయి కాబట్టి అప్పులైనవి రాగలిగినంతా లాగి తుదకు భూములు లాగేశారు ఋణదాతలు. చాలినన్ని భూములు లేనందుచేత ఇంకా కొన్ని అప్పులలాగే నిల్చిపోయినవి. అలాంటిదే పిండు భీమయ్యగారి అప్పుకూడా

ఆ నిరుడు వెంకన్నకు పొలాల్లో తినడానికి సరిపడే గింజలు కూడా రాలేదు మళ్ళీ పొలాలు విత్తవలసిన కాలం వచ్చింది దానికి పైకంతో అవసరం వచ్చింది అప్పటికే కావలసినన్ని అపులున్నై అయినా భీమయ్య వద్దకు వెళ్ళాడు వెంకన్న నూరు రూపాయలు అడిగాడు ఆ యేడే తప్పకుండా పంటకాలంలో వున్న ధరకే తాను పండింపబోయే వేరుశనగ అసలుకు వడ్డీకి తనకే యిస్తానన్నాడు పదింటికి పావలా వడ్డీకంగీకరించాడు. భీమయ్య డబ్బు యిచ్చాడు. ఆ యేడు వున్న భూమినంతా వెరుసెనగ వేస్తే కొంత అప్పు తీర్చుకొని నాలుగు డబ్బులు చేతిలో వుంచుకోవచ్చుననుకున్నాడు వెంకన్న అయితే ఆ యేడు వానదేవుడు యష్టం వచ్చిన చోటనే వర్షానికి ఆర్డరిచ్చాడు వెంకన్న పైరు పాడయిపోయింది అతనికేమీ దిక్కుతొచిందికాదు ఆ తరువాత అప్పులవాళ్ళందరు భూములు లాక్కొవటం, సంసారం చీలిపోవటం, తనపాలికివచ్చిన భీమయ్య అప్పు పెరిగిపోవడం, కూలినాలి చేత జీవనం జరపడం వెంకన్న సంసారంలో జరిగిన మార్పులు

‘అప్పులు వసూలు చేయడంలో ఇంటి పేరు సార్ధకం చేసే పిండుభీమయ్య అప్పు తీర్చడమెలాగ?’ ఈ సమస్య వెంకన్నను బాధపెట్టడం ఎక్కువయింది ఎక్కడో ఒక లేగదూడను సంపాదించాడు వెంకన్న సంవత్సరమున్నర కంటవత్తిడుకుని పెంచాడు. ఆఖరుకది నూరు రూపాయలు చెసేకోడెగా తయారైంది. వెంకన్నకు ధైర్యం వచ్చింది.

ఒకనాడు వెంకన్న కోడెను తీసుకొని భీమయ్య వద్దకు వెళ్ళాడు ‘కోడెకు నూరు రూపాయలు ధర కట్టారు. దాన్ని తీసుకొని వడ్డీని లెక్కించకుండా పత్రాన్ని ఇచ్చి రక్షించండి ఆకొడె తప్పా వేరుమార్గం లేదు అప్పు తీర్చడానికి అని ఎంతో దీనంగా చెప్పుకున్నాడు.

అప్పటికి భీమయ్యకు ఇవ్వవవలసిన మొత్తం మూడేళ్ళకు 190 రూ అసలు తనకు వేరుశనగ ఇవ్వలేదు. ఆఖరుకు తన అప్పుకు భూమి కూడా మిగల్లేదు ఆ కోపం వుంది భీమయ్యకు. మా నాన్నగారు కూడా పత్రాన్ని యిచ్చి బీదవాణ్ణి రక్షించమని చెప్పిచూశారు భీమయ్యకు. వుపయోగం లేకపొయింది పైగా మాదిగకుంకని వెనక వేసుకొనవస్తున్నారని మా నాన్నగారిపైన దురభిప్రాయం కలిగింది

ఏమైందో యేమో వారంరోజుల్లో ఆ కోడె హటాత్తుగా చనిపోయింది. దాంతో వెంకన్నకి మతి పోయింది.

అదివఱకే పత్రానికి అయువుదగ్గరించింది అందుచేత భీమయ్య చెప్పి పంపాడు. వెంకన్న కోడెను తీసుకొనివస్తే యేదో విధంగా పరిష్కారం చేసుకుందామని వెంకన్న మాచెర్లవైపే తిరిగిచూడలేదు. భీమయ్య నయాభయాలు రెండూ వెంకన్నను కదిలించలేదు. అతడు షావుకారికి ముఖం చూపలేదు.

పత్రానికి మేర మీరింది గత్యంతరం లేక ఎవరిచేతనో పత్రానికి చెల్లువ్రాయించుకున్నాడు భీమయ్య. పత్రానికి ప్రాణం వచ్చిందనుకున్నాడు వెంకన్నకి ఆ సంగతి తెలియదు
ఉన్నట్టుండి వెంకన్నకు గుంటూరు డిస్ట్రిక్టు మునిసిఫ్ కొర్టు నుండి సమను వచ్చింది. భీమయ్య పత్రం దాఖలు చేసాడు.

ఎప్పటిలాగే భీమయ్య తన కేసుకు నారాయణాచారిని తన వకీలుగా నియమించాడు. ఆచార్లు ధనవంతుడు, పలుకుబడి గలవాడు; మావూళ్ళో అదిమరింత. అయినా మా నాన్నకు శిష్యుడు ఆయనయెడ గురుభావం గలవాడు. డబ్బుగడించేదాల్లో మాత్రం ఆచార్లు తొక్కని త్రొవే లేదు

వాది వకీలు ‘ఫలానా’ ఏ అని తెలిసిన తరువాత మా నాన్నకొకవిధమైన ధైర్యం కలిగింది. మొదట నుంచీ జరిగిన సంగతీ, అసలు పత్రంలోని దొంగ చెల్లు, వెంకన్న దీనదశా ఆచార్లగారికి తెలియచేస్తే తనపైన వుండే గురుభావంతో భీమయ్యకు చెప్పి వెంకన్నను రక్షిస్తాడని మా నాన్న ఆశయం. అయితే స్నేహితానికి, గురుత్వానికి, సాయానికి వచే డబ్బు పోగొట్టుకొని తన క్లయింట్కు అసంతృప్తి కలిగింపడు వకీలు అది మాత్రం మరచారు మా నాన్న

కష్టపడి నాలుగురూపాయలు సంపాదించుకొన్నాడు వెంకన్న. మా నాన్న వెంకన్నను తీసుకొని గుంటూరు వెళ్ళారు ఆచార్లను దర్శించారు వెంకన్న కనపడుతూనే వకీలు ‘ఏమిరా! మాగిద వదవవు ఇచ్చిన డబ్బు ఎగవేయడమే కాకుండా పిలిపిస్తే కూడా కనపడకుండా తిరుగుతావు?’ అని నాంది మొదలుపెట్టినారు

సావధానంగా వకీలుకు అన్ని విషయాలు చెప్పారు మా నాన్న వెంకన్న దుర్భర పరిస్థితుల్లో వున్నా అప్పు తీర్చడానికి ప్రయత్నించాడనీ భీమయ్య గర్వంతో, ఆశతో అవకాశం పొగొట్టుకున్నాడనీ, పత్రానికి మేరమీరింది గనుక దిక్కు లేని వెంకన్నను బాధించడం వల్ల ఉపయోగం లేదనీ మా నాన్న వాదన

దానికాచార్ల వారి బదులిది ‘ఈ వెధవకింత పొగరా? వీన్ని జైలుకు పంపిస్తాను లేకపొతే జీవితమంతా భీమయ్య వద్ద జీతానికుండి అప్పు తీర్చేటట్టు చేస్తాను అంతేగాని వీరి విషయంలో మీరు జోక్యం చేసుకుంటే నాకు చాలా నొప్పి గలుగుతుంది నన్నైనా చూచి వీనికి మీరు సాయపడగూడదు

ఆచార్లు ఏవేవో చెప్పి వెంకన్న చేతి బొటనవ్రేలి గుర్తు వేయించుకో చూచేడు మా నాన్న అది కానీయకుండా కళ్ళతోనే సైగ చేశారు మా నాన్న పట్టుదల ఆచార్ల అమితాగ్రహానికి కారణమైంది.

పత్రానికి వ్రాసిన చెల్లు అసలు తప్పని కోర్టులో నిరూపించాలని మా నాన్న పట్టుపట్టారు మిగిలిన మార్గమదొక్కటే ఈ విధంగా న్యాయానికై పొరాడ్డానికి కాలమూ, డబ్బూ సహాయమూ కావాలి దరిద్రులకు మొదటిది పుష్కలంగా వుంటుంది తక్కినవి రెండూ దొరకవు

వారు తిరిగి యింటికి వచ్చారు. ఈసారి వాయిదాకు వెళ్ళాలి కర్చులకు డబ్బూ వాయిదా వారంరోజులుంది మా నాన్న ఆస్తీ, ఆదాయమూ కుటుంబం పొట్టకు సరిపొతుంది కానీ కాని ముడికిరాదు ఏదో విధంగా కొంత డబ్బు సముదాయించుకున్నారు కోర్టు కర్చులకు అయితే రాకపొకలకు?

డబ్బు కొరకు బాధపడ్డంకంటె నడిచి వెళ్ళెదే మంచిదనుకున్నారు. గుంటూరికి మావూరు పాతికమైళ్ళకు పైగా వుంటుంది నడిచే ఓపిక కొంచెమైనా లేకున్నా అంగీకరించారు మానాన్న నడవడానికి వెంకన్నకు కొత్త జోడుపైన తన మిత్రున్ని, సహాయుణ్ణి తీసికొని వెళ్ళాలని మోజు పుట్టింది. వెంటనే పని ప్రారంభించాడు రెండు దినాలు నిద్రాహారాలు మానేసి ముగించాడు క్రొత్తజోడును. ప్రయాణానికి రెండు విమానాలని సిద్ధపరచినంత సంతోషించాడు వెంకన్న. వాని ఉత్సాహమూ కృతజ్ఞతా చూచి మురిసిపోయాడు మా నాన్న దరిద్రులకు కస్టజీవులకు పరస్పర బహుమానాలటువంటివే. ఆ చెప్పులే మా నాన్నను గుంటూరికి తీసికొనివెళ్ళి తీసికొనివచ్చినవి. కోర్టులో ‘అన్సరు’ పెట్టుకుంటామని చెప్పించారు. వారికి సరియైన వకీలును కుదుర్చుకున్నారు తిరిగివచ్చారు.

అప్పటి నుండీ ఆచార్లు , భీమయ్యవారి తాలుకూ మనుష్యులకు మా నాన్న అన్నా, వెంకన్నన్నా అతిచేదై పోయింది బలవంతులకు ప్రాపకం జాస్తి కాబట్టి బీదవాళ్ళ మీద కష్టాలు కురిశాయి, కురిపింపబడ్డాయి. ఎమైనా సరే యీ కేసులో న్యాయం కలగడానికి దేనితోనైనా పోరాడాలనుకున్నారు స్నేహితులిద్దరూ కానీ స్వల్పకాలంలొనే ఒక్క మరణం తోటి ఒక్కదినమైనా పోరాడలేకపోయారు మా నాన్న

వెంకన్న మొదలు పెట్టాడు ‘విన్నారా బాబూ! ఎన్నో కష్టాల్లో అడుగామడగా నడుస్తున్నా అన్యాయం జరుగుతూ ఉంటే చూళ్ళేక వృద్దాప్యంలో గుంటూరు వఱకూ వచ్చారు నాకోసరము నా జోడును ఎన్నో మార్లు మెచ్చుకున్నారు అంచేత దాన్ని బాబుగారి జ్ఞాపకార్థంగా వుంచుకుంటానన్నాను నాకింకీమీ వద్దు ‘

సత్యంగా ఆ జోడు గొప్పత్యాగాన్ని చూచింది గొప్పపనికి తోడ్పడింది అటువంటిది తప్పకుండా జ్ఞాపకచిహ్నమే వెంకన్నా నీ హృదయం ఎంత ఉత్తమమైంది?

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)