హమ్మయ్య!
మోడీకొక సోదరుడు దొరికాడు
దాచిన అస్థిపంజరం ఇన్నాళ్టికి బయటపడింది
ఊహ నుంచి హంతకులే శవాలకు అంత్యక్రియలు చేస్తారు
కిరాయి హంతకులే సంతాపాన్ని వ్యక్తం చేస్తారు
ఎప్పటిలాగే నిరంకుశత్వం
పేదల మెస్సియ్యగా ప్రకటించుకుంటుంది.
ఆ తియాన్‌మెన్‌స్క్వేర్‌లో
ఏ సముద్రాధిష్ఠాన దేవత కడగలేని రక్తవర్షం కురిసిందక్కడ
‘రివల్యూషనరీ ప్రాలిటేరియట్ల’ నిర్వచనంలోంచి
పీడితుల జాబితాను తొలగిస్తూ
కార్ల్‌మార్క్‌కు ఫుల్‌మార్క్‌లిచ్చారక్కడ-
ఎర్రరంగుకు
ఏ మహాసముద్రాలూ శుభ్రం చేయలేని రక్తపు మరకలంటాయక్కడ
జోసెఫ్ స్టాలిన్‌లూ
మావోసేటుంగులూ
ఒక్క భారతీయుణ్ణైనా నాయకుడిగా ఒప్పుకోలేనివాళ్ళు
ఒక్క అంబేడ్కర్ పోరాటాన్నైనా గుర్తించలేని వాళ్ళూ
ఆచరణాత్మకం కాని వాక్యాల వెనుక పొంచి
అరువు సిద్ధాంతాల విదేశీతండ్రుల్నీ
‘రివిజనిజాల’ విదేశీ తంత్రుల్నీ మీటుతున్నారక్కడ…
హుఁ… ఈ దేశానికింకా
సోషలిస్టు హేంగోవర్ పోయినట్లు లేదు
‘ఎస్ ఈ జడ్ ఎస్టీజడ్’ల లెక్కల్లో రక్తం పారుతున్నా
ప్రజల్ని లెక్కజేసిన చరిత్రా లేదూ…
ప్రజల ఆస్తులకూ విలువ ఉందన్న ముచ్చటా లేదూ…
భూమికోసం- భుక్తికోసం- విముక్తి కోసం
గంజి మీద ప్రపంచీకరణ గద్దల్ని తరిమే పోరాటాల్నీ
పచ్చటి పొలాల మీద కెమికల్ హబ్బుల దిబ్బలపై
జనంచేసే ఉద్యమాల్ని ఒప్పుకోవాలనీ లేదూ…
ప్రవచనాలు తెలిసిన ఈ మేక్‌బెత్
చేతులపై రక్తం కడుక్కోలేదనీ తెలుసు…
రోజూ ఠాగోర్ పద్యాలు చదువుతానని చెప్పేవాడూ
బుద్ధుణ్ణి బ్రాండ్‌నేమ్‌గా పెట్టుకున్నవాడూ
జన్యురహస్యం తెలిసిపోయినంత గొప్పగా
శరణార్థుల్ని తరిమేసే కుట్రలో తామే గొప్పంటూ
టోరీ లేబర్ పార్టీలు ప్రకటించుకుంటున్నంత గర్వంగా
ఎంత రక్తపాతానికి ఆదేశాలిచ్చాడు…!
‘లెనిన్’ పడికట్టు పదాల వెదుకులాటలో
మార్క్సిజమే ఒక క్యాన్సరై
వాడే ఒక ట్యూమరై
స్టాలిన్ పోలికల్లో స్పష్టంగా కనబడుతున్నప్పుడు
రోజంతా ధనికుల్ని సృష్టిస్తూ
సాయంత్రానికల్లా
పేదా గొప్ప తారతమ్యాలపై
వాడే ఆందోళన నటిస్తున్నప్పుడు
మెదళ్ళలో చేరే ‘తుపాకులు’
జలియన్‌శాలాబాగ్‌లై తిరిగొస్తుంటాయి…
నీళ్ళు లేక ‘తెలుగునేల’ లాస్‌వెగాస్ ఐనప్పుడు
బుల్లెట్లు కురిసిన ‘కరెంట్ కొరతల ఉద్యమాలపై’
సర్కారును ఉప్పుపాతర వేసినోళ్ళే
నందిగ్రామ్ వెనుక తీవ్రవాదులున్నారంటున్నారు గానీ
ప్రతీ పోరాటం వెనుక
ప్రజల మనోభావాలున్నాయని
ఎప్పటికి తెలుసుకుంటారు గనక!
‘బీదలకు భూమి నేరమే,’నంటూనే
‘భూమిని దున్నడం,’ బూతుమాటంటూనే
సింగూరు సబ్సిడీలు దొబ్బిన టాటాలే
ప్రైవేటులో రిజర్వేషన్లపై పెదవి విరుస్తున్నప్పుడు
కార్పొరేట్ జార్లూ- మార్కెట్ స్వింగర్లూ…
దేశానికి లాభాలపాలు బ్రహ్మాండంగా పితికిస్తూనే
బక్క జనాలను తొక్కి చంపాలని
ధునిక డయ్యర్లయి ఉచిత సలహా పారేస్తూనే ఉంటారు.
ఇల్లు కాలుతుంటే
బొగ్గు లేరుకుందామనే ప్రపంచీకరణ నేపథ్యంలో
నందీగ్రామ్ ఒక వార్‌జోన్‌గా మారుతోంటే
అత్యున్నత న్యాయమూర్తులే నీరోలై
జలజలా కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు
దేశం రక్తభూమిగా మారక తప్పదు…
“ప్రపంచ కార్మికులారా…!'’
రైతుల్ని వదిలేసి ఏకం కండి…
నందిగ్రాం మారణకాండ అందరూ వ్యతిరేకించేదే. ఎవరిమీదో కోపం ఇంకెవరిమీదో చూపే మతిలేని హంగొవర ఎవరికీ కనిపించదా. లెనిన వడికట్టు పదాలు ఆయన సౄష్టించుకున్నవి కావు. చరిత్రని అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోడానికి అటువంటి పదజాలం ఏర్పడింది. వడికట్టుపదాలు ఈయన కవితలో లేవని ఎవరైనా చెప్పగలరా. ఆ వడికట్టుపదాలను ఈయన ఎక్కడనుండి అరువుతెచ్చుకున్నాడో. ఇంతకీ ఈయన పేరులో భారతీయత ఉందా. అది అరువుతెచ్చుకున్నది కాదా. దానికి కారణం ఏమిటీ. ప్రతిపోరాటం వెనుక ప్రజల మనోభావాలు ఉంటాయి నిజమే. పోరాటాలను నీరుగార్చే ఇటువంటి సాహిత్యం ఎవరికోసం?
ప్రపంచీకరణ లో భాగంగా పేదరైతులనుండి వ్యవసాయభూమి బలవంతంగా స్వాధీనం చేసుకోవడమే “స్పెషల్ ఎకానమిక్ జోన్స్” లక్ష్యం. కళింగనగర్ , సింగూర్ ,నందిగ్రామ్ లలో ప్రజాఉద్యమాలలో సిపిఐ(యమ్.ఎల్) మావోయిస్టు పార్టీ పాల్గొంటూ, ప్రభుత్వ విధానాలపైన పోరాడుతోంది. రివిజనిస్టు సి.పి.యం పార్టీ దుర్మార్గాలకు ఎందరో నాయకులను, ఉద్యమ కార్యకర్తలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. నందిగ్రామ్ ఉద్యమంలో సిపిఐ(యమ్. ఎల్ )మాధవ్ ముఖర్జి, సిపిఐ(యమ్.ఎల్) లిబరేషన్ పార్టీలు మరియు భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీ పాల్గొంటున్నాయి. ఈ వాస్తవాలను నిరాకరిస్తూ విల్సన్ సుధాకర్ కవిత రాసారు. తన అభిప్రాయాల, అవగాహనలకు అనుగుణంగా కొన్ని వితండవాదనలను, వక్రీకరణలను ప్రస్తావించారు. ఎవరికి వుండే రాజకీయాలు వాళ్ళకుంటాయనుకోండి.
~
“జోసెఫ్ స్టాలిన్‌లూ
మావోసేటుంగులూ “
~
వెటకారపు వర్ణనలు కవితలో అక్కడక్కడా వున్నాయి. రివిజనిస్టు సి.పి.ఎం పార్టీ మావోయిస్టు భావజాలాన్ని ప్రాతిపదికగా తీసుకున్న దాఖాలాలు ఎక్కడా లేవు. సుధాకర్ గారి దృష్టిలో హత్యాకాండకు పాల్పడిన సి.పి.ఎం పార్టీకి, ఆ హత్యకాండను ఖండిస్తూ పోరాడుతున్న మార్క్సిస్టు – లెనినిస్టు పార్టీలకు తేడా లేదు. విప్లవ పార్టీలను ఎలాగ బదనామ్ చేయాలనే ఆలోచన. “కలిపి తిట్టురా కావేటి రంగా” అన్నట్టుగా వున్నది.
~
“ ఒక్క భారతీయుణ్ణైనా నాయకుడిగా ఒప్పుకోలేనివాళ్ళు”
~
విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించిన చారుమంజుందార్, కనాయి చట్టర్జీ, వెంపంటి సత్యం, పంచాద్రి కృష్ణమూర్తి, సాకేత్ రాజు ( కర్ణాటక ) , చంద్రశేఖర్ ప్రసాద్ ( జె.ఎన్.యు), జార్జిరెడ్డి తోపాటు నాలుగు వేలమంది అంతా భారతీయులే అన్న సంగతి తెలుసుకోవాలి.
~
“అరువు సిద్ధాంతాల విదేశీతండ్రుల్నీ
‘రివిజనిజాల’ విదేశీ తంత్రుల్నీ మీటుతున్నారక్కడ…
హుఁ… ఈ దేశానికింకా
సోషలిస్టు హేంగోవర్ పోయినట్లు లేదు”
~
చాలా విచారకరంగా విల్సన్ సుధాకర్ వితండవాదనలు చేస్తున్నారు. ప్రపంచంలో మంచి ఎక్కడున్నా నేర్చుకోవటం తప్పులేదు. వాస్తవానికి మహారాష్ట్రలో “దళిత పాంథర్స్“ ఉద్యమం ఉత్తర అమెరికాలో ని “బ్లాక్ పాంథర్స్” ఉద్యమం స్పూర్తితో వచ్చిందనే వాస్తవాన్ని గ్రహించాలి. మీ లాజిక్ ప్రకారం మీరు “దళిత పాంథర్స్“ ఉద్యమాన్ని కూడా తిరస్కరిస్తారా? రివిజనిష్టులు , విప్లవ పార్టీల మధ్య తేడాను అర్థం చేసుకోకవడం చాలా విచారకరం. హేతుబద్ధమైన చర్చకి కొంత అధ్యయనం అవసరం. “హేంగోవర్” అనే తాగుబోతుల భాషను ప్రయోగించటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలి. కుట్ర,హత్యాకాండలు పాల్పడుతున్న పాలకవర్గాలు, రివిజనిస్టు పార్టీలపై పోరాడకుండా, విప్లవ పార్టీలను దుమ్మెత్తిపోయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దళితులను తప్పుదోవ పట్టించే రచనలు చేయటం చాలా విచారకరం.
పై ఇద్దరికి ఒక సమాధానం
కవిత ఎవరి గురించిరాసిందో, ఏ సందర్భంలో రాసిందో అర్థంచేసుకున్నప్పుడు దాని తీవ్రతను పదునును అర్థం చేసుకోగలుగుతాం.నిన్ను నువ్వు ఎర్ర జెండా పట్టుకున్న రెండో వాడిగా తప్ప బుల్లెట్ దెబ్బ తిన్న గాయపడ్డ పేద నందిగ్రాం రైతుగా ఎందుకు అనుకోలేక పోతున్నావు..నువ్వు దెబ్బతిన్నవారి శిబిరంలో వున్నావా/దెబ్బ కొట్టిన వారి శిబిరంలో వున్నావా లేదా ఇద్దరిమీదా దుమ్మెత్తిపోసే మూడో శిబిరమా?
–
ఇంతకీ ఈయన పేరులో భారతీయత ఉందా.
–
కవిత్వంలో ఫోర్సు అర్థంకాక మాట్లాడుతున్నట్లుగా వుంది. ఇంతకీ మీఅర్ధంలో భారతీయత అంటే ఏంటి? దేన్ని మీరు భారతీయత అని నమ్ము తున్నారు ? హిందూ పేరు పెట్టుకుంటే భారతీయత వున్నట్లు లేకుంటే , లేనట్లు ఇదేనా మీకు మీ సిధధ్ధాంం నేర్పించింది. అంటే ఇక్కడ,ఈ దేశంలో విప్లవ సిధ్ధాంత అంతస్సూత్రం హిందూ ఫ్రేం వర్క్ లోనుంచి విప్లవాన్ని సాధించడం అని మీరు నిర్వచిస్తున్నారా?
–
వాస్తవాలను నిరాకరిస్తూ విల్సన్ సుధాకర్ కవిత రాసారు
–
కవి స్పష్టంగానే వున్నాడు, పాఠకులకు ఇది బెంగాల్ సిపియం పార్టీ దాష్టీకాన్ని ఎండగడుతూ రాసిన కవిత అని ఈజీగానే అర్ధమవుతుంది. మీరు అనవసరంగా భుజాలు తడుముకొని దృశ్యంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
–
విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించిన చారుమంజుందార్ …..తోపాటు నాలుగు వేలమంది అంతా భారతీయులే అన్న సంగతి తెలుసుకోవాలి.
–
మీ దృష్టొలో నాయకులంటే విప్లవోద్యమంలో పనిచేసినవారు. అందుకే మీలిస్టు దళిత బహుజన ముస్లిం స్త్రీ వాదులను దూరం చేసుకుంది. ఇంత చర్చ తరువాత కూడా మీలిస్టులో నాయకులు వీళ్లెవ్వరికీ చెందని వారు వున్నారు, వీరి మనోభావాలను ఆశలను ప్రతిబింబించలేని వారు వున్నారు. మీరు చెప్పే నాలుగువేలమందే నాయకులని జీర్ణించుకుపోయిన లేదా మీకు అలా నేర్పించిన సిధ్ధాంతం అందరూ నమ్మాలని లేదుగా? ఇంతకీ మీరు ఒప్పున్న నాయకులు ఎవరికి ప్రతినిధులని మీరునమ్ముతున్నారొ… వారికి వేరే నాయకులు గుండె లోతుల్లో వున్నారేమో చూసారా?
–
మహారాష్ట్రలో “దళిత పాంథర్స్“ ఉద్యమం ఉత్తర అమెరికాలో ని “బ్లాక్ పాంథర్స్” ఉద్యమం స్పూర్తితో వచ్చిందనే వాస్తవాన్ని గ్రహించాలి.
–
స్పూర్తితో వుద్యమాలు రావడం మంచిదనే కదా అంటున్నారు! కాని రెప్లికేట్ చేయాలనుకొనే ఆలోచనే తప్పంటున్నది..వర్ణం అనేపదానికి అక్కడకు ఇక్కడకు తేడా వుందని దళిత పాంథర్స్ వుద్యమం నమ్మింది కాబట్టే వారి స్పూర్తిని తీసుకుని ఇక్కడ కులవివక్షమీద పోరాడింది. కాని ఎర్ర జెండాల ఎజెండాలో కులం ఏ పాత్ర పోషిస్తుందో?
–
హేతుబద్ధమైన చర్చకి కొంత అధ్యయనం అవసరం.
–
నిజమే హేతుబద్ధమైన చర్చకి కొంత అధ్యయనం అవసరం. మీరు చదవాలి. ముఖ్యంగా రాదుగా ప్రచురణలు మాత్రమే కాక కాస్త వాడజీవితాలను చదవాలి. గల్లీ బతుకుల్ని చదవాలి. కులగీతలకు, మతాఅధిపత్యాలకు, పురుషాధిపత్యాలకు నిత్యం తలొగ్గి, బిక్కు బిక్కున బతుకీద్చే వారి గాయపడిన ఆత్మగౌరవాన్ని చదవాలి. దాన్ని కన్నీళ్లతో పాటు ఆలోచనను, ఆవేశాన్ని, తాత్వికతను కలగలిపి రచించిన అంబేద్కర్ ను చదవాలి. నిజమే అదంతా చేయకుండా చర్చలేమిటి…
–
దళితులను తప్పుదోవ పట్టించే రచనలు చేయటం చాలా విచారకరం.
–
నిజమే చివరి వాక్యంలో దళితులు గుర్తుకు రావడం విచారకరమే…
ఈ రచనలో కవిత్వం లేదు, చరిత్ర తప్ప.
చర్చలో కూడా పస లేదు….ఆరోపణలు తప్ప
కానివ్వండి………………….
నేను ఎవరి తరపున ఉన్నానో అర్థం కాకపోవడం విచిత్రం. హిందూఫ్రేంవర్క విప్లవం కూడా ఇక్కడ అసందర్భం. బహుశా తన పేరులోని భుజాలను తడుముకుంటున్నట్లుగా ఉంది. కవిత్వం చదవకుండా (ఒకవేళ అందులో కవిత్వం ఉంటే) ఊరికే సమర్థించాలని చేసే పసలేని విమర్శ ఇది. నిజమే కవి స్పష్తంగానే ఉన్నాడు - తిట్టేది ఒకరిని. శత్రువు మరొకడు. అసలు విషయాన్ని వదిలేసి ఎవరినో తిట్టడం కోసం ఇది రాసినట్లుగా ఉంది. దీనివల్ల ఎవరికి మేలు. మిమ్మల్ని మీరు సమర్థించుకోడానికి అవతలివారిని హిందూ మతోన్మాదులుగా భావించడమ అన్యాయం - ఇక్కడ అసందర్భం. భారతీయత ఏసందర్భంలో వచ్చిందో గమనించాలని మరోసారి మనవి.
-మీలిస్టు దళిత బహుజన ముస్లిం స్త్రీ వాదులను దూరం చేసుకుంది - అని మీరు చెప్తే సరిపోతుందా. మీ లిస్టు ఏమిటి. మా లిస్టు ఎంత. చివరికి ఎవరిలిస్టు ఎంత. - ఇదంతా ఏమిటి.
గల్లీబతుకులు చూసినవాడు, కులగీతలకు, మతాఅధిపత్యాలకు, పురుషాధిపత్యాలకు నిత్యం తలొగ్గి, బిక్కు బిక్కున బతుకీద్చే వారి గాయపడిన ఆత్మగౌరవాన్ని చదవాలి. దాన్ని కన్నీళ్లతో పాటు ఆలోచనను, ఆవేశాన్ని, తాత్వికతను కలగలిపి - చివరికేం చేయాలి. ఉన్నదున్నట్లుగా వర్ణించి మంచి పేరు తెచ్చుకోవాలి - అంతేనా?
విపుల్ మీ ఆన్సర్ అర్థం కాలేదు.
అసందర్భంగా మాట్లాడి సమాధానం దాటవేసి, ఆరోపణలతో తప్పించుకోజూస్తున్నారు.
–
నేను ఎవరి తరపున ఉన్నానో అర్థం కాకపోవడం విచిత్రం. హిందూఫ్రేంవర్క విప్లవం కూడా ఇక్కడ అసందర్భం. బహుశా తన పేరులోని భుజాలను తడుము కుంటున్నట్లుగా ఉంది
–
నేను సాయిబుని. నాకు సందేహాలు, భుజాలు తడుముకోడాలూ లేవు. కానీ భారతీయత గురించి ప్రస్థావించింది మీరు. విల్సన్ సుధాకర్ పేరులో భారతీయత గురించి ప్రష్నించింది మీరు. ఇప్పుడు బుకాయిస్తున్నారు. లేదా సమాధానం దొరక్క ఇబ్బంది పడి తప్పుగా మాట్లాడుతున్నారు. నాపేరును ప్రస్థావించి మరొక తప్పు చేస్తున్నారు.
–
-మీలిస్టు దళిత బహుజన ముస్లిం స్త్రీ వాదులను దూరం చేసుకుంది - అని మీరు చెప్తే సరిపోతుందా. మీ లిస్టు ఏమిటి. మా లిస్టు ఎంత. చివరికి ఎవరిలిస్టు ఎంత. - ఇదంతా ఏమిటి.
–
ఇది సమాధానమా/సమర్ధనా/తప్పించుకునే దోరణా కావాలంటే ఈ లిస్టు చదివి మళ్ళీ ఆలోచించి మాట్లాడు..
“విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించిన చారుమంజుందార్, కనాయి చట్టర్జీ, వెంపంటి సత్యం, పంచాద్రి కృష్ణమూర్తి, సాకేత్ రాజు ( కర్ణాటక ) , చంద్రశేఖర్ ప్రసాద్ ( జె.ఎన్.యు), జార్జిరెడ్డి తోపాటు నాలుగు వేలమంది అంతా భారతీయులే అన్న సంగతి తెలుసుకోవాలి. -మహేష్”
***
భారతీయులంటే హిందువులు, వీరులంటే విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించినవారు లాంటి మూస(స్టీరియోటైప్స్)నుంచి బయటపడి ఆలోచించడం మంచిది.
–
భారతీయత ఏసందర్భంలో వచ్చిందో గమనించాలని మరోసారి మనవి.
–
రచనకు సందర్భాలుంటాయని మీరు నమ్మితే పై కవితకు కూడా ఒక సందర్భం వుందని తెలియాలి.
భారతదేశం లో దళితులు లేనిదే విప్లవద్యోమం లేదు. అలాగే విప్లవోద్యమం దళితులకు ఆత్మగౌరవానిచ్చింది. అన్యాయంపై తిరగబడి పోరాడడానికి రాజకీయ ప్రత్యామ్నాయాన్నిచ్చింది. ఆ పేర్లు రాసినప్పుడు వారి కులాలు, మతాలు గమనించలేదు. గదర్, ఉద్యమంలో శివసాగర్ , ముగ్ధూం, తెలంగాణ సాయుధ రైతాంగపోరాటంలో షోయబుల్లా ఖాన్, కొమరం భీమ్ , బాబాసాహెబ్ అంబేద్కర్ , అంటరాని వసంతం రాసిన కళ్యాణరావు, ఎండ్లూరి సుధాకర్ , మరాఠీ దళితసాహిత్యం లో దయాపవర్, దండకారణ్య మావోయిస్టు నాయకుడు కోసా , స్వర్ణక్క అందరూ ప్రజా ఉద్యమాలలో పాల్గొనవాళ్ళే. పేర్లతో లాజికల్ ఆర్గుమెంట్లు వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి. దళితుల విముక్తి కోసం, అలాగే శ్రామికవర్గాల విముక్తి కోసం పోరాడటమే మన ప్రధాన కర్తవ్యం కావాలి. మనలో మనం కాట్లాడుకుంటే దోపిడిగాళ్ళు, పాలకవర్గాలు పండగచేస్తుకుంటరు. దళితులు అంటే అణచబడినవాళ్ళు అన్న విషయం గ్రహించాలని మనవి. మనమంతా ఐక్యంగా వుండాలే.
తమకు అర్థంకాని లేక నచ్చని భావజాలాన్ని వడికట్టుపదజాలంగానో, తమకు మింగుడుపడని విమర్శ అవతలివారు అసలువిషయం దాటవేస్తున్నట్లుగానో అనిపించడం విచారకరం.
నేను సాయబుని… అని సినిమా ఫక్కీలో చెప్పుకోవడంలో మీతిమీరిన అత్మాభిమానం, అహంకారం తప్ప మరేం లేదేమో విజ్ఞులు ఆలోచించాలి. ఇది ఏ చవకరకం తెలుగుసిన్మా స్టీరియోటైపు. భారతీయులంటే హిందువులని మీకు ఏ విప్లవకారుడు చెప్పాడో నాకు తెలియదు. కమ్యూనిస్టులు అలా అనుకుంటారని నాకు తెలియదు. వాళ్ళలా అనుకుంటున్నారని మీఅంతట మీరు భావిస్తే దానికి ఎవరేం చేస్తారు.
సుధాకర్ పేరులోని భారతీయతని ఏసందర్భంలో ప్రస్తావించవలసి వచ్చిందో ఒకసారి పైకవిత (అది కవిత్వం అయితే) చదివితే సరిపోతుంది. ఇక దిగుమతి విషయానికి వస్తే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన సద్దాం హుస్సైన గురించి తెలుగులో గొప్ప కవిత్వం వచ్చింది. సంకలనం కూడా వచ్చింది. అదంతా దిగుమతిచేసుకున్న సామ్రాజ్యవాదవ్యతిరేకత అందామా.
ఇక్కడ లిస్టులతో పనిలేదు. నమ్మకం ఉన్నవాడు ఒక్కడు చాలు. ఆమాటకొస్తే మొదటినుంచీ ఏటికి ఎదురీదే వాళ్ళంతా ఎవరు. ప్రజలకోసం ప్రాణాలిచ్చినవారెవరు. లిస్టులోని పేర్లతో ఎక్కువతక్కువలు చూపించాలనుకోవడం తమవర్గాలకు తామే ప్రతినిధులనుకోవటం అమాయకత్వం.అజ్ఞానం. గల్లీజీవితాలు, వాడబతుకులు చూసినవాడు గల్లీరాజకీయాలు చేయరాదు. సంకుచిత గల్లీకవిత్వం రాయకూడదు. తమ బతుకులకు కారణమెవరో, ముందునుంచీ తమతరపున ఎవరు నుంచున్నారో తెలుసుకోవాలి. అసలు దొంగని విడిచిపెట్టి వాడినితరిమేవాడిని పట్టుకుని తిట్టడంలోని ఔచిత్యం ప్రశ్నించినందుకు ఇంత చర్చ కావాల్సి వచ్చింది. విషయమేమంటే అవతలివారు చెప్పేది వినే ఓపికలేదు. విన్నా లోపల సంకుచిత ఆలోచనలున్నాయి. అవి ఉన్నంతవరకూ మన చెవులు చెవిటి చెవులే.
కొందరు రాళ్ళేసేవారు తయారయ్యారు. వాళ్ళు ఎటువైపు రాళ్ళు విసురుతున్నారో ఎందుకువేస్తున్నారో వారికే తెలియదు. వాళ్ళ అక్షరజ్ఞానం ఏమిటో వారి ఏరకం ప్రగతిశీలవాదులో ఎవరికీ అర్థం కాదు. వాళ్ళకు కావలసిందంతా ఎటోకటు రాళ్ళు విసరటమే. ఎటోకటు. చివరకు తమనెత్తిమీద పడినా సరే. అటువంటివాళ్ళకు ఎవరేం చెప్పగలరు.. దూరంగా ఉండి చర్చలోంచి నిష్క్రమించడం తప్ప…
విపుల్
భారతీయతకు మీరిచ్చే అర్థం లేదా నిర్వచనం ఏంటో చెప్పండి చాలు. తర్వాత తిడుదురుగాని.
భారతీయులంటే హిందువులని నాకు విపుల్ పైన మొదటి కామెంట్ ద్వారా తెల్సిసింది. విల్సన్ సుధాకర్, ఖాజా లాంటి హిందువేతర పేర్ల పట్ల తన ద్వేషాన్ని ప్రకటించాడు. (రెండొ కామెంట్ లో కూడా)
తప్పించు కోవద్దు ..అన్లేదని నిరూపించ లేక పొరపాటని ఒప్పుకోలెక ఏదేదో మాట్లాడుతున్నావని తెలిసిపోతుంది.
ఏంచెప్పాలో తెలీక నన్ను తిట్టడానికి విపుల్ ప్రయోగించిన పదాలు…
–
సినిమా ఫక్కీలో
మీతిమీరిన అత్మాభిమానం, అహంకారం
చవకరకం
స్టీరియోటైపు
అమాయకత్వం.అజ్ఞానం
సంకుచిత గల్లీకవిత్వం రాయకూడదు.
సంకుచిత ఆలోచనలున్నాయి.
చెవిటి చెవులే.
అక్షరజ్ఞానం ఏమిటో
ఏరకం ప్రగతిశీలవాదులో
–
ఇది మీ సంస్కారం. ఇది మీగ్నానం, ఇది మీ చర్చ..
దాడి చేసింది మీరే … సమర్థించుకున్నది మీరే.. సమాధానం దాటవేసింది మీరే..
చివరగా చర్చ నుంచి నిష్క్రమిస్తున్నానని చెబుతున్నది మీరే..ఇది ఇవళ కొత్తకాదు. ఇలాచేస్తున్నది మీరొక్కరే కాదు..
ఇది చరిత్ర చెప్పిన సత్యం.
మీదగ్గర సమాధానాలు లేవు కాబట్టి..
హాయిగా నిష్క్రమించండి.. చరిత్రను , సిధ్ధాంతాలను వక్రీకరిస్తూవుండండి.