దోపిడి వ్యవస్థ కాళ్ళకింద దశాబ్దాలేకాదు
శతబ్దాలు గడిపినా సుఖంరాదు.
ఆకలి శరీరాల్నే తిని
రోగం రక్తాన్నే తాగి
కోర్కెలు తెరమీది బొమ్మల్లా
కనిపిస్తూ మాయమౌతాయి తప్ప, తీరవు.
నీకు నీ తండ్రీ నీ తండ్రికి నీ తాతా అప్పగించిన
బానిసత్వ వారసత్వాన్ని
ముందు తరాలకి పంచకు.
అన్నా! రైతన్నా, కూలన్నా
రిక్షాన్నా, జట్కన్నా
హమాలీ, గుమాస్తా!
ప్రతీరోజు నెత్తురు నీళ్ళు చేసుకొని
కడుపూ, కాళ్ళూ కట్టుకొని
కోర్కెలు చంపుకొని
ఈ అసమాన వ్యవస్థ కాళ్ళకింద జీవిస్తూ
ముందు తరానికి ఏం సంపాదించడానికి
ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నావు
శ్రమజీవీ !
ఒక్కసారి అటుచూడు.
మనవాళ్ళు కళ్ళు తెరిచి
కొండల్లో కోనల్లో అడవుల్లో
ఎర్రని మంటల్ని లేపుతున్నారు.
బానిస భీరుత్వం చలిలో కొంకర్లు పోయిన చేతులు కాపి
ఆకలి దరిద్రం చీకట్లో అంటిన అంధత్వాన్ని తెరిచి
ఒక్కసారి అటుచూడు,
నిన్నుదోచి కనకాభిషేకం చేయించుకుంటున్న
ఈ వ్యవస్థ అంగరక్షకుల్ని బయటికీడ్చి
రక్తాభిషేకం చేసుకొని
గడ్డకట్టిన ఆ నెత్తురుటేరు గుండా
దోపిడి, బానిసత్వం, భయంలేని
రహదారి వేయడానికి
లేచి పరుగెత్తి రావడానికి
ఒక్కసారి అటుచూడు.
( 1970 జూలైలో విప్లవకవులు వెలువరించిన మార్చ్ కవితాసంకలనం నుండి )