- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమష్టిగా రోజువారీ జీవితాల్లో ఎదురయే కష్టాలను ఎదుర్కుంటూ, ప్రకృతిని గురించి నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని పోగుచెయ్యడం, దాన్ని విశ్లేషించి సత్యాలను రూఢిగా తెలుసుకోవడం మొదలైన ప్రయత్నాలు తొలి మానవసమాజాలన్నీ చేస్తూనే వచ్చాయి. ఇలా పోగుపడిన సమాచారమే రాబోయే తరాలు కనిపెట్టిన విషయాలకు పునాది అయింది. ఈ విషయాలన్నిటికీ ఎడతెగని సంబంధం ఉండేది. విజ్ఞానమంటే సక్రమంగా వ్యవస్థీకరించబడిన సమాచారమే గనక మొదట్లో అస్పష్టంగా గోచరించిన విషయాలే ఎన్నో తరాలపాటు పరిశీలనలు జరిపిన మీదట జీవితసత్యాలుగా నిర్ధారణ అయాయి.

ప్రకృతిలోని చెట్లూ, చేమల మధ్య తిరిగే జంతుజాలంలో ఒకటిగా ఆవిర్భవించిన మానవజాతి వానరదశను దాటి ఎంతో ఎదిగింది. క్రమంగా మనుషులకూ తక్కిన జంతువులకూ మధ్య పూడ్చలేని ఎడం ఏర్పడసాగింది. చిన్న గుంపులుగా, సముదాయాలుగా, సమాజజీవితం మొదలుపెట్టి, గుహల్లో తలదాచుకుంటూ, సంచారజీవితాలు గడిపిన తొలి మానవులకు సైన్స్‌తో సంబంధం ఏమిటనిపిస్తుంది కాని, ఆటవిక, బర్బరదశలలోనే మనుష్యులు నిత్యమూ ప్రకృతిని పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. తాము తెలుసుకున్న విషయాలను సాటివారితో పంచుకున్నారు. తక్కిన జంతువులన్నీ తమ తమ శరీర లక్షణాలను బట్టి ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయాయి కాని మనుషులు మాత్రం ధైర్యంగా నివాసయోగ్యం కావనిపించిన ప్రాంతాలకు కూడా వెళ్ళి స్థిరపడగలిగారంటే అందుకు కారణం వారి పరిశీలనాశక్తీ, తెలివితేటలూ పనికొచ్చాయి గనకనే. నిప్పు చేసినా, రాతి పనిముట్లు చేసుకున్నా, చలి ప్రాంతాల్లో జంతువుల చర్మాలు కప్పుకోవడం నేర్చినా, ఇవన్నీ మనుషులకు అలవడిన ప్రత్యేక లక్షణాలు. ప్రాణాలు దక్కించుకునేందుకూ, తమ సాటివారికి కూడా పనికొచ్చేందుకూ ఈ విద్యలన్నీ అతి ప్రాథమిక స్థాయిలో తొలి మానవులకు ఉపయోగపడ్డాయి. ఏ దశలో మొదలైందో సరిగ్గా తెలియదు గాని, తమ కన్నా చాలా పెద్దవైన మేమత్‌ ఏనుగువంటి జంతువులను కలిసికట్టుగా వేటాడడంలో మాటలు మాట్లాడగలగడం మనుషులకు ఎంతో సహాయపడింది. ఇక ఆ తరవాత సామూహికంగా పోగైన సమాచారాన్నంతా జ్ఞాన విజ్ఞాన రూపాల్లో మనుషులు తమ సంతతికి అందించగలిగారు. చావు తప్పించుకునే మార్గం ఎటువంటిదైనా అది వారి పాలిటికి విజ్ఞానమే.

రాతి పనిముట్ల తయారీ ఒక్కటే మానవజాతిని చాలా ముందుకు నెట్టింది. ఏ రకం రాయి ఎటువంటి ఆయుధానికి పనికొస్తుందో, అలాంటివెక్కడ దొరుకుతాయో, దాన్ని ఒడుపుగా ఎలా చెక్కాలో వగైరాలన్నీఆ నాటి ఉన్నత శాస్త్రాలై ఉంటాయి. నిప్పుకు ఎంతటి క్రూర జంతువైనా జడుస్తుందనీ, ఏ బురద గుంటలోకో ఉపాయంగా నెట్టగలిగితే ఎంతటి మృగమైనా నిస్సహాయస్థితిలో తమకు ఆహారం కాగలదనీ గ్రహించడం వారికి మేలు చేసింది. తాము వేటాడే జంతువులను ఆయువుపట్టు మీద కొట్టడం, చర్మాన్ని ఒలవడం, మాంసాన్ని నిప్పుల మీదనో, ఉప్పుతోనో నిలవ ఉంచడం, సాటివారి గాయాలకు ప్రాథమిక చికిత్స చెయ్యడం, ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు ఎటువంటి జంతువులూ, తినదగినవీ, తినదగనివీ దుంపలూ, ఫలాలూ దొరుకుతాయో తెలుసుకోవడం, రుతువులను బట్టి ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళడం శ్రేయస్కరమో గమనించడం ఇలాంటి వివరాలన్నీ నలుగురూ పంచుకునేవారని ఊహించవచ్చు. ఇది విజయవంతంగా జరిగిందనడానికి సాక్ష్యం మనమే. మానవుల జనాభా ఇటువంటి విజ్ఞానం సహాయంతోనే ఇంతగా పెరగగలిగంది.

ఇదంతా ఖచ్చితంగా ఎలా జరిగిందనడానికి సాక్ష్యాలేవీ లేవుగాని ఫ్రాన్స్‌ దక్షిణ ప్రాంతంలోని కొన్ని గుహల్లో 32 నుంచి 11 వేల ఏళ్ళ క్రితం గీసిన కుడ్య చిత్రాలను గురించి 1860 ప్రాంతాల్లో తెలిసింది. అద్భుతమైన ఈ చిత్రకళ ద్వారా అప్పటివారి గురించి కొంత తెలుస్తోంది. తాము వేటాడుతున్న జంతువులపట్ల కృతజ్ఞతా భావంతోనో, భక్తిభావంతోనో ఈ బొమ్మలు గీసి ఉంటారని పరిశోధకులు ఊహిస్తున్నారు. బొమ్మలకు వారు జరిపే తంతులన్నీ నిజజీవితంలో అవి ఎదురైనప్పుడు ఫలితాల నిస్తాయని అమాయకంగా నమ్మేవారేమో కూడా. ప్రవేశించడమే కష్టమనిపించే ఇటువంటి చీకటి గుహల్లో సామాన్యంగా శబ్దాలు బాగా ప్రతిధ్వనిస్తాయని గుర్తించాక ఈ బొమ్మలకు మంత్రతంత్రాల ఉచ్చారణతోనూ, ఆదిమ పూజలతోనూ సంబంధం ఉండి ఉంటుందనే ప్రతిపాదనలూ వచ్చాయి. ప్రాచీన ఆరాధనా స్థలాలుగా అనిపిస్తున్న గుహల్లోనూ, ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్‌వంటి నిర్మాణాల్లోనూ శబ్దాలు బాగా మారుమోగుతాయనేది ఆధునిక పరిశోధనల్లో వెల్లడౌతోంది. అప్పట్లో ప్రతిదీ మనుషులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించేది గనక మారుమోగే చప్పుళ్ళకు కూడా ప్రాచీనులు అతీతశక్తులని ఆపాదించి ఉండవచ్చు. గారడీకీ, మంత్రాలకూ భేదం లేని ఆ రోజుల్లో ఒకే శ్రుతిలో గణాచారి చేసే శబ్దాలన్నీ ఇలాంటి గుహల్లో రెసొనెన్స్‌ ద్వారా బలపడి గట్టిగా వినిపించి ఉంటాయి. (మంత్రాల ఉచ్చారణకు ఇప్పటికీ మన దేశంలో ఎంతో శక్తిని ఆపాదించడం చూస్తూనే ఉన్నాం) దినదిన గండంగా బితుకుబితుకుమంటూ బతికిన అప్పటి ప్రజలను ఇటువంటి సామూహిక ప్రార్థనలూ, సమావేశాలూ ఏకం చేసి ఉంటాయి. వారి ఐకమత్యం పరస్పర సహకారాన్ని పెంపొందించి, జీవితకాలాన్ని పొడిగించి ఉంటుంది కనక ఇటువంటి ప్రాంతాలని కనిపెట్టడం కూడా ఒక సైన్సే.
ఆ కాలంలో మనుషులను బాగా ప్రభావితం చేసిన మరొక విషయం స్త్రీల సంతానోత్పత్తి. తమ తెగలను జంతువుల, ప్రకృతిశక్తుల బారిన పడి అంతరించిపోకుండా కాపాడగలిగినది సంఖ్యాబలమేనని వారు గుర్తించారు. సంతానోత్పత్తి సామర్య్థానికి ప్రతీకలైన ఆ యుగపు “అమ్మతల్లి” బొమ్మలు చాలా దొరికాయి. నాలుగైదు అంగుళాల నిడివి కలిగిన ఈ బొమ్మలను చేత పట్టుకుని ఏవో తంతులు జరిపేవారని పరిశోధకులు ఊహిస్తున్నారు. మన దేశంలోనూ తవ్వకాల్లో లభించిన ఇటువంటి బొమ్మలు మాతృస్వామ్య భావనకు సంకేతాలుగా కనిపించాయి. సంతానోత్పత్తికి స్పష్టమైన మరొక సంకేతం మనదేశంలో అనాదిగా పూజించబడుతున్న లింగరూపం. ఇదంతా సైన్స్‌ అంటే హాస్యాస్పదంగా అనిపించవచ్చు గాని తమ మనుగడకు మేలు జరుగుతుందని నమ్మిన అప్పటి ప్రజలు ఈ తంతులన్నీవిధిగా సమాజశ్రేయస్సు కోసమే జరిపారు. మతం పేరుతో అల్పసంఖ్యాకులు ఇతరులను మభ్యపెట్టే దశ అప్పటికింకా ప్రారంభం కాలేదు.

అలంకారార్థం మెడలో ధరించిన పూసలూ, ఎముకలే కాక, కొన్ని మేమత్‌ ఏనుగు దంతాల మీదా, ఎముకల మీదా చెక్కిన, లేదా గీసిన కొన్నిబొమ్మల్లో చంద్రుడి కళలూ, నక్షత్రాల విశేషాలూ కనిపించాయి. ఇవి అప్పటి ఖగోళశాస్త్ర వివరాలు అయి ఉంటాయి. ఆకాశాన్ని నిశితంగా పరిశీలించి, రుతువులను బట్టి జరిగే మార్పులను నమోదు చేశారనడానికి ఇది సాక్ష్యం. పనిగట్టుకుని ఈ పని చేశారంటే ఆ వివరాలు వారి నిత్యజీవితాలకు ఉపయోగపడినవే అయి ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి వల్ల వేడిమీ, వెలుతురూ కలుగుతాయనీ, చంద్రుడి వల్ల వెలుతురు మాత్రమే లభిస్తుందనీ, ఇవన్నీ తూర్పున ఉదయించి, పడమట అస్తమిస్తాయనీ వారు గమనించారు. మబ్బులూ, ఉరుములూ, మెరుపులూ, వానా, మంచూ, వడగళ్ళూ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కురుస్తాయో తెలుసుకోవడం వారికి చాలా అవసరమయింది. చీకట్లో దారి తప్పినవారికి కొన్ని నక్షత్రాలు తోడ్పడతాయని వారు గ్రహించారు. ఈటెలూ, రాళ్ళూ విసిరినప్పుడు ఎంతెంత దూరం పోతాయో, విల్లమ్ముల సైన్స్‌ ఎటువంటిదో వారికి చాలా విషయాలు నేర్పి ఉంటాయి. అలాగే నీటి లక్షణాలూ, అందులో మునిగేవీ, తేలేవీ వివిధ వస్తువుల గుణాలూ, జలచరాల విశేషాలూ వగైరాలన్నీ తెలుసుకోవడం అప్పట్లో ఒక గొప్ప శాస్త్రంవంటిదే.

తమ శరీరాలకు తగిలే గాయాలూ, అప్పుడప్పుడూ వచ్చే రోగాలూ, తప్పనిసరిగా వచ్చే ముసలితనమూ, చావూ మొదలైనవన్నీ వారి అవగాహనకు వచ్చి ఉంటాయి. ఆధునిక హోమో సేపియన్స్‌ జాతి ఆవిర్భవించక మునుపే శవాలను ఖననం చేసే ఆచారం మొదలైంది కనక చావు బతుకులను గురించి మనుషులకు ఏనాడో తెలిసి ఉంటుందనుకోవచ్చు. ప్రసూతిలో జాగ్రత్తలూ, పిల్లలని జాగ్రత్తగా పెంచి, పోషించడం మనుషులు నేర్చుకున్నారు. లైంగికపరమైన భావాలూ ,వాటివల్ల కలిగే సామాజిక పరిణామాలూ, మనుషుల మధ్య అప్పుడప్పుడూ తలెత్తే వివాదాలూ మొదలైనవన్నీ తరవాతి యుగంలో ఏర్పడిన స్థిరజీవితాల సామాజిక స్వరూపాన్ని ప్రభావితం చేశాయి. ఇదంతా సైన్స్‌ కాదని ఎవరూ అనలేరు. పుస్తకాలూ, స్కూళ్ళూ లేని ఆ కాలంలో చిన్నతనం నుంచీ చావు బతుకులను నిర్ణయించే రోజువారీ సమాచారాన్ని తెగలోని పెద్దలను చూసి నేర్చుకోవడం ఎంత ముఖ్యంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సైన్స్‌తో పరిచయం లేకుండా మన జీవితాలు వెళ్ళమారిపోగలవేమో కాని ఆదిమ యుగంలో మాత్రం ప్రతివారికీ ఈ విషయాలన్నీ తెలిసి ఉండడం చాలా అవసరమయేదని ఊహించవచ్చు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)