- డా॥ ఎస్.వి. రామరాజు
మాకు దసరా సెలవులిచ్చి పది రోజులయింది. ఇంటి ముందే సుధతో వేపచెట్టు కింద గోళీలాడుకుంటున్నాను. సాములు, బంగారయ్యా మటోడొచ్చి లింగయ్యగారి చెరువుకట్టమీద నేరేడుగాయలు కోసుకొద్దామన్నా వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాతొస్తా మీరెళ్ళండని చెప్పి వసారా దగ్గరగా పొగ వస్తున్న వేపు ఒకసారెళ్ళాను. తీపి, నేతి వాసనతో చుట్టుపక్కలంతా ఘుమఘుమలాడిపోతోంది. నా నోరు నీటితో నిండిపోతోంది. గోళీలాట మీద మనసు నిలవడం లేదు. నాకు పనుందని సుధని పంపేశాను.
కర్ర టకటకలాడిస్తూ వచ్చిన నత్తల గురవయ్య తాత వేపచెట్టు కింద నులకమంచం వాల్చి కూర్చుంటూ చుట్టముక్క చూపిస్తూ అగ్గికోసం సైగ చేశాడు నన్ను. లోనికెళ్ళడానికేమీ వంక దొరకని నాకు నిప్పు కణిక వంకతో లోనికెళ్ళాను. స్వీటు ఏ దశలో ఉందో చూడొచ్చన్న ఆశతో. అప్పుడే బాదంకాయి స్టీలు ప్లేటులో సర్దుతోంది మా అమ్మ పసుపురంగులో ఉన్న స్వీటుని.
“గురవయ్య తాతొచ్చాడు నాన్న,'’ అన్జెప్పి మండుతున్న చింతపుల్లను తీసుకెళ్ళాను.
తాత చుట్ట ముట్టించుకొని గుప్పుగుప్పున పొగ వదుల్తుంటే చూడ్డం నాకో సరదా!
గురువయ్య తాతది కూరెటిపాలెం. గొడ్ల వైద్యం చేసేవోడు. ఒక చేత్తో చుట్ట ఇంకో చేత్తో బాణాకర్ర పట్టుకొని ఠీవిగా నడుస్తుంటే సినిమాల్లో ఎస్వీ రంగారావులా ఉండేవాడు. ఎపడూ నవ్వుతూ ఎదుటోళ్ళకి ఏదో చెప్పి నవ్వించేవాడు. గురవయ్య తాత నాన్న, వాళ్ళ తాత కూడా గొడ్ల వైద్యం చేసేవాళ్ళంట! చుట్టుపక్కల ఊళ్ళే కాక, తెనాలి దాకా ఇటు పొన్నూరు నుంచి అటు రేపల్లె దాకా తాత అందరికీ తెల్సు. తాత జిల్లేపల్లి దాసుల్ల దగ్గర ఐదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాడంట! ఎక్కాలు ఇరవై దాకా కింద నుంచి పైకి, పై నుంచి కిందకు గుక్క తిప్పుకోకుండా చెప్పేవాడు. ఆయన చెబుతుంటే మేమంతా గుడ్లెల్లబెట్టి వినేవాళ్ళం. తాతని అందరూ గురువయ్యగారనే పిలిచేవారు. ఎక్కడ గేదె ఈనలేకపోయినా, ఎవరిదైనా ఎద్దు కాలిరిగినా తాత వెళ్ళాల్సిందే! గూడవల్లిలో పశువుల ఆస్పతి వచ్చినా ఆ ఊరి కమ్మవారంతా తాతనే పిలిచేవారు, ఏ గొడ్డుకు ఏ ఇబ్బంది వచ్చినా! తాత రామాయణం, భాగవతం చెబుతుంటే వింటానికి రెండు చెవులూ చాలేవి కావు.
ఎప్పుడైనా వైద్యం చేయడానికి మా ఊరొస్తే మా ఇంటికి తప్పకుండా వచ్చేవాడు తాత. ఒకవేళ మా నాన్న ఇంట్లో లేకపోతే నక్క సూరినారాయణ బాబాయి దగ్గరకెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి బళ్ళారి జైలులో ఆరునెలలపైగా జైలుశిక్ష అనుభవించారట! చుట్టుపక్కల ఊర్ల జనం వీళ్ళిద్దర్నీ పెద్ద హీరోల్లా చూసేవాళ్ళు.
మా నాన్న వచ్చి తాత ఎదురుగ్గా నవారు మంచం వాల్చి కూర్చుంటుంటే, “ఏంటి అల్లుడూ! ఈపూట ఘుమఘుమలాడిపోతుంది వాతావరణం! చూడబోతె దంతాలకు పని తగిలేలా ఉందే!'’ అంటూ చుట్టముక్కను ఆర్పేసి దూరంగా పడేశాడు.
“రవ్వకేశరని కొత్తరకం స్వీటు, భట్టిప్రోలు కోటయ్య చెబితే చేయించా! తిని చెప్పాలి ఎలా ఉందో,'’ అంటుండగానే, మా అమ్మ రెండు ప్లేట్లలో స్వీటు తీసుకొచ్చింది. నేను ముక్కాలిపీట, ఇత్తడి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి ఇద్దరి మంచాల మధ్యన పెట్టి అమ్మ వెంట లోనికెళ్ళాను స్వీటు తింటానికి.
నేను బయటికొచ్చేసరికి తోకల లక్ష్మయ్య, సలగాల దుర్గయ్య, పర్రె బసవయ్య, నక్క సూరినారాయణ బాబాయి తాత చుట్టూ కూర్చుని ఉన్నారు. తాత కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగిన సంగతులు చెబుతుండగా భట్టిప్రోలు పెంటు సాయిబు ‘సేమియా’ అంటూ వచ్చి చెట్టు కిందున్న తాటిమట్ట మీద కూర్చున్నాడు. ఆయన ఎదురుగా కాళ్ళ దగ్గర తట్టలో సేమియా డేగిశా పెట్టుకున్నాడు. కండువాతో ముఖం తుడుచుకుని తాత చెప్పే మాటలు ఆలకించసాగాడు.
“ఇంతకీ రవ్వకేసరి ఎట్టా ఉందో చెప్పలేదు,'’ అన్నాడు మా నాన్న తాత చెప్పే మాటలకడ్డు తగుల్తూ. తాత చెప్పడం కొంచెంసేపాపాడు.
“మీలో గంజెవరన్నా తాగారా?'’ అన్నాడు తేరిపారా అందరివంక చూస్తూ.
కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అందరూ ఒక్కసారిగా ఘుెల్లున నవ్వారు.
“నా మాట నవ్వులాటలా ఉందా?'’ అన్నాడు సలగాల దుర్గయ్య వంక చూస్తూ.
“కాకపోతే మరేంది బాబాయ్! గంజిలో పుట్టి గంజిలో మెతుకులా పెరిగి ఆ గంజినే తులసినీళ్ళలా తాగి చచ్చేటోల్లం. గంజి తాగారా మీరెప్పుడన్నా అంటే నవ్వకేంజేత్తారు?'’ అన్నాడు వేదాంతిలాగా.
అయితే నే తాగిన గంజి సంగతి చెబుతా! అలాంటిదెవరైనా తాగారో లేదో చెప్పండంటూ చుట్ట ముట్టించి రెండు దమ్ములు లాగి గుప్పుగుప్పుమనిపించి చెప్పసాగాడు.
“మూడేళ్ళ క్రితం కొత్తపాట సందుమాట! అప్పుడే దసరా పండగెళ్ళి వారంరోజులైంది. అద్దేపల్లి కరణం గారింట పుట్టిన కోడెదూడ ముందుకుడికాలు గిట్టకు దెబ్బ తగిలిందంట, బుర్రతూము దగ్గర. నే వెళ్ళేసరికి మద్దుల లాలలజపతిరాయ్‌గారి బావి పక్కనున్న గొడ్లసావిట్లో ఉందది. కాలు గిట్ట పూర్తిగా చీలిపోయింది. నేల మీద నిలవలేక కాలెత్తి నుంచుంది. దానికి వసర కట్టేసి నిలబెట్టేసరికి సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. పొద్దుననంగ తినెళ్ళిన చద్దనం ఎటుపోయిందో కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. తొందరగా ఇంటికి జేరదామని కనగాల పెద్ద వంతెన మీదుగా వెళ్తుంటే పద్మావతి టాకీసు దగ్గరొక ఆడమనిషి నా కాళ్ళకడ్డం పడింది. చింపిరి తల, చిరిగిన రవిక, మాసిక లేసిన పాతచీర. ఆమె అవతారం చూసి అడుక్కునేదేమోననుకున్నా.
“ఏం కావాలమ్మ?'’ అనడిగాను.
“రెండ్రోజుల్నుంచి తన గేదె ఈనలేక బాధపడుతుందని… పిలిత్తే వత్తావో రావోనని పిలవలేదని… ఇంటికీ దారెంట ఎల్తావు కదాని కాచుక్కూర్చున్నానయ్యా. నువ్వే ఈ మూగజీవాన్ని కాపాడి దూడని ఒడ్డున పడెయ్యాలయ్యా,'’ అంటూ ఏడుస్తూ నా కాళ్ళు చుట్టేసిందా ముసలమ్మ.
తాటాకు గుడిసె, దాని మీద దట్టంగా పాకిన సొరపాదు, ఆకుల మధ్యలోంచి అక్కడక్కడ కాయలు కన్పిస్తున్నాయి. గుడిసె మందున్న కట్టగొయ్యకి కట్టేసిన కంత్రిమాళీ గేదె బొంగరంలా తిరుగుతుంది. తొలిచూలులా ఉంది. ఎప్పట్నుంచి తిరుగుతుందో అక్కడంతా గుంటలు పడి రొచ్చురొచ్చుగా తయారైంది.
దూడ అడ్డం తిరిగింది. దాన్ని బయటికి లాగి మాయ తీసి శుభ్రం చేయాలంటే గంటపైగా పడుతుంది. కడుపులో ఎలుకలు గొడవ చేస్తున్నాయి. ఇంటికెళ్ళి ఓ ముద్ద ఎంగిలి పడొస్తానమ్మా అని చెప్పాను.
“నువ్వెళ్ళిపోతే నోరులేని జీవం పాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతాయయ్యా. రెండుసార్లు కట్టి ఊనేసిందయ్యా. మూడో కట్ట నిలబడింది. నాకున్న ఆధారం అదొక్కటే. పాలిడిచిన దగ్గర్నుంచి కన్నబిడ్డలా సాకానయ్యా. దేవుడిలా వచ్చావు. నువ్వే కాపాడాలంటూ,'’ గోలగోలగా అరుస్తుంది.
డమనిషిని చూస్తే జాలేసింది. చేతికర్ర గుడిసె తడిక్కానించి, పంచె పైకి ఎగ్గట్టి పనిలో దిగి దూడను లాగి తీసేసరికి గంటపట్టింది. పెయ్యి దూడని తీసినంతసేపు నా కాళ్ళకడ్డం పడుతూ అక్కడే తిరుగుతుంది. పెయ్యి దూడని కోక చెంగుతో తుడుస్తూ దాని కాలిగోళ్ళు గిల్లుతుంది. నేను కాలువలో కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకొచ్చేసరికి పచ్చగడ్డి మేస్తోంది గేదె. దూడకి పాలు తాగిస్తుందావిడ. నాకు ఆకలి నకనకలాడుతుంది. గుడిసె ముందున్న నక్కేరు చెట్టుకిందున్న కూసం విరిగిన కుక్కి మంచం మీద ఒకపక్క ఒకరి కూర్చున్నా కాళ్ళు, చేతులు కండువాతో తుడుచుకుంటూ. ఆకలితో నీరసంగా ఉంది. ఇంటికెళ్ళే ఓపిక కూడా లేదు. నడుం వాల్చడానికి అనుకూలంగా లేదా మంచం. కొంతసేపటికి ఆవిడ గుడిసె వెనక్కెళ్ళి నవనవలాడే లేత సొరకాయను కోసుకొచ్చింది నాకివ్వడానికన్నట్టు. “నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడివేమీ అక్కరలేదు, తింటానికేమన్నా పెట్టు,'’ అన్నాను.
“అయ్యా! మీబోటోళ్ళు మా ఇళ్ళల్లో తింటారా?'’ అంది అనుమానంగా.
“ఎందుకు తినం? ఏదుంటే అది పెట్టు,'’ అన్నాను.
“నిన్నట్నించి గేదె నొప్పులు పడుతుంటే దాని బాధ సూడలేక దాని దగ్గరే ఉన్నానయ్యా! ఏమీ వండుకోలేదంటూ, కాలువగట్టు మీదున్న ఎండిపోయిన పిచ్చి మిరపకాయ మొక్కల్ని పీక్కొచ్చింది. ఒకపక్క పొంత కుండ దానికానుకుని మట్టితో అలికిన పొయ్యి దిమ్మలోని బూడిద బయటికి లాగి మట్టిసట్టిలో నూకలు, నీళ్ళు పోసి మంట రాజేసింది.
ఎండిన పిచ్చిమిరప మొక్కలు సురసుర మండుతుంటే నా కడుపులో పేగులు అంతకన్నా పెద్దగా అరుస్తున్నాయి. దాహం అవుతోంది. తాగుదామన్నా ఆ గుడిసెలో మంచినీళ్ళ కుండ కూడా ఉన్నట్టు లేదు. అన్నం కుతకుత ఉడకసాగింది. సట్టి మీదున్న మట్టిమూకుడు ఆవిరికి ఎగిరెగిరి పడుతుంది. మధ్యమధ్యలో మూకుడిని తీసి తాటిమట్ట తెడ్డుతో అన్నాన్ని కలతిప్పుతుందావిడ. కొంతసేపటికి గంజి అన్నాన్ని సత్తుగిన్నెలో పోసి ఉప్పు కల్లేసి నా చేతికిచ్చింది. పై కండువాతో దాని అంచులు పట్టుకొని ఆత్రంగా ఒక్క గుటకేసేసరికి నాలుక చురుక్కుమంది. అట్టాగే పట్టుకొని చల్లారేదాగా ఆగి ఆత్రంగా తాగడం మొదలెట్టా! గిన్నె ఖాళీ అయిపోగానే మట్టిసట్టలో మిగిలిపోయిన గంజి అన్నం తెచ్చి పోసింది. అది అమృతం తాగినట్టే ఉంది. కానీ గంజిఅన్నం తిన్నట్టు లేదు. నా ఆకలి తీరేసరికి మట్టిసట్ట ఖాళీ అయిపోయింది. అంత రుచిగల అన్నాం నా జీవితంలో తినలేదు. దాని రుచి ముందు తిరుపతి లడ్డుగానీ, హైదరాబాద్ బిర్యానీగాని, మద్రాసు సాంబారైనా, చివరికి ఈ సెంటు సాయి సేమియా పాయసం కూడా బలాదూరే! ఇంక ఈ రవ్వకేశరెంత?! దేవతల దగ్గరుండే అమృతం కూడా దిగదుడుపే!'’ అన్నాడు ఆ గంజి రుచి గుర్తుచేసుకుంటూ! ఆ ముసలమ్మకు… తప్పు తప్పు… ఆ… అన్నపూర్ణమ్మకు మనసారా దణ్ణం పెట్టుకొని ఇంటికి చేరేసరికి దీపాల వేళయింది.
అందరూ నిశ్శబ్దంగా వినసాగారు. వేపచెట్టు మీద కాకి మాత్రం అప్పుడప్పుడు అరుస్తోంది, ఏమీ తోచక! గాలి కదలడం లేదు. ఉక్కపోతగా ఉంది వాతావరణం. పర్రె బసవయ్య పై కండువాతో ముఖం తుడుచుకుంటూ, “నిద్ర సుఖమెరుగదు, ఆకలి రుచెరగదని, మాంచి ఆకలి మీదున్నావుగా అందుకే ఆవిడ పోసిన గంజన్నం అంత రుచిగా ఉందిలే మామా!'’ అన్నాడు.
“కాదల్లుడూ, అంతకన్నా ఆకలిగా ఉన్న రోజులు నాకెన్నో! ఒక్కసారి ఇల్లొదిలి పని మీద బయలుదేరితే రెండు, మూడు రో%
రామరాజు గారూ మీ కథ బాగుంది. మీరు బాగా రాయగలరు. మీకు అభినందనలు
చాలా బగుంది సహజమైన పల్లెవాతావరణం మాఊరిని గుర్తు చెసింది,అభినందనలతొ మరిన్ని మంచి కథలు మీకలంనుంచి రావలనచి ఆశిస్తూ….