- వట్టికోట ఆళ్వార్‌స్వామి
(గత సంచిక తరువాయి)
8
కంఠీరవానికి కొమరయ్య తన ధోతి, కండువ, ఒక రూపాయి ఇచ్చి తెల్లవారు జామున సాగనంపాడు. కంఠీరవం నిజామాబాదు దోవపట్టాడు. కొంతదూరం బండ్లబాట నడిచి వెళ్ళాడు. మధ్యన రైలు దారి అడ్డువచ్చింది. రైలు దారి వెంట నడవసాగాడు. పక్క చేలలో కనిపించిన కంకులు, కాయలు తినుకుంటూ బావుల్లో నీళ్ళు తాగుతూ పొద్దుతిరిగే వరకు డిచ్పెల్లికి చేరుకున్నాడు. గడిచినరోజు సరిగా తిండిలేదు; పైగా ఈ రోజు చాలా నడిచాడు కూడా. అలసిపోయి రైలుస్టేషన్‌లో కొంతసేపు పడుకున్నాడు. ఇంతలో హైద్రాబాద్‌కు వెళ్ళే రైలు వచ్చి ఆగింది.
కంఠీరవం లేచి కటకటాలను పట్టుకొని రైలుబండి ఎక్కుతున్న దిగుతున్న ప్రయాణీకులను వింతగా చూస్తూ నిల్చున్నాడు. రైలు వెళ్ళిపోయింది. రైలు పోలీసు ఒక ప్రయాణీకుని తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెట్టి స్టేషన్ మాష్టరు వద్దకు వెళ్ళాడు. కంఠీరవం మెల్లగా ఆ ప్రయాణీకుని దగ్గరికి వెళ్ళాడు. “నీవేం తప్పుచేశావు?'’ అడిగాడు.
” ఏమీ లేదు. టిక్కెట్టు లేకుండా రైలెక్కిన.'’
” ఇప్పుడు నిన్నేమి చేస్తారు?'’
” ఏమో ఏం జేస్తరో?'’
” అయితే నీకు టిక్కెట్టు ఎందుకు దొరకలేదు? ఎక్కడ దొరుకుతాయి?'’
“రైలు ఎక్కేచోటే అమ్ముతారు గాని నాకు పైసలు లేక కొనలేదు.'’
ఇంతలో రైలు పోలీసువాడు వచ్చి ఆ ప్రయాణీకుని స్టేషన్ ఆఫీసులోకి తీసికెళ్ళాడు! కొద్దిసేపైన తర్వాత వదిలి పెట్టారు.
ప్రయాణీకుడు దూరంగా కనిపిస్తున్న చెట్లగుంపువైపు పోసాగాడు. కంఠీరవం కూడా అతన్ని అనుసరిస్తూ “నిలబడు, నేను కూడా వస్తా'’ నన్నాడు.
ఆ వ్యక్తి వెనుకకు తిరిగి నుంచున్నాడు. “నీ వెక్కడికి పోతావు?'’ ప్రశ్నించాడు.
“టిక్కెట్టు లేనందుకు వాండ్లేమన్నారు?'’ కంఠీరవం ప్రశ్నించాడు.
“వెండి దండకడియం తీసుకున్నారు. ఇవ్వనంటే జేలుకు పంపిస్తామని భయపెట్టారు. నేను మా తమ్ముడిని చూడపోతున్నాను'’ ప్రయాణీకుడన్నాడు.
” ఎక్కడ ఉంటాడు మీ తమ్ముడు? టిక్కెట్టు పైకం కింద సొమ్ములు కూడా తీసుకుంటారా?'’ అమాయకంగా కంఠీరవం అడిగాడు.
“వాండ్ల చేతిలో చిక్కాం, వాండ్లేమంటే అదే సాగుతది.'’ దూరంగా కనిపిస్తున్న చెట్లవైపు చేయిచూపి ” ఆగో! అక్కడ ఉంటాడు. మందు తింటున్నాడు. కుష్టు రోగానికి, అక్కడ దవాఖానాలో కుష్టు రోగులకే మందిస్తారు. తెల్లదొరలు మా మతంవాండ్లకు డబ్బు లేకుండానే మందులిస్తారు'’ ప్రయాణీకుడు అన్నాడు.
“మీ మతమంటే?'’ కంఠీరవం అడిగాడు.
“కిరస్తానీ మతం. అంటే తెల్ల దొరలమతం.'’
కొద్దిసేపు సంభాషణ లేకుండా బాటసాగింది.
కంఠీరవానికి బాల్యమునాటి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది.తురకపంతులు ఉన్న రోజుల్లో అతని ఊరికి ఒక తెల్ల దొరవచ్చి ఊరిబయట మామిళ్ళలో మాల మాదిగలను పిలిపించి, ఒకచోట కూర్చోబెట్టి ఏదో చెప్పాడు. తమాషాగా వేరే కులాలవాండ్లు కూడా వెళ్ళి దూరంగా కూర్చుని వింతగా చూచారు; విన్నారు. నామాలు నాకేస్తారని తెలిసి కంఠీరవం వెళ్ళడానికి మొదట భయపడ్డాడు. కాని పంతులుతో ధైర్యంగా వెళ్లాడు. ఆ తెల్లని శరీరాన్ని, నల్లని గడ్డాన్ని, కింది నుంచి మీది దాక తొడుక్కున్న అంగీని చూచి అంతా వింత పడ్డారు. ” ఏం చెప్తున్నాడు పంతులు?'’ కంఠీరవం ప్రశ్నించాడు.
“అందరూ తన మతములో కలవాలని, అప్పుడు అందరికి చదువు, మందులు దొరుకుతాయని, చచ్చింతర్వాత స్వర్గానికి పోతారని చెప్తున్నాడు.
” మాల మాదిగలకు మన మందులు, బళ్ళు పనికిరావా పంతులు? వాండ్లు కూలి చేసుకుంటరు గదా? మరి ఇంకా కొలువు లెందుకు?'’
“వాండ్ల పిల్లలు మన బళ్ళోకివస్తే ఊళ్లోవాండ్లు ఊరుకోరు. మాల మాదిగలను మీరు ముట్టుకోరుగా? మన వైద్యులు మాదిగ గూడానికి వెళ్ళడం కూడా జరగదు. అందుకని ఆ తెల్లవాళ్ళు ఆ ఏర్పాటు చేస్తామంటున్నారు'’ పంతులు వివరించాడు.
“మన ఊళ్ళోవాండ్లంత తెల్లగా ఎందుకుండరు పంతులు?'’
“వీండ్లు మనదేశంలో పుట్టినవాండ్లుకారు. వాళ్ళది వేరే దేశం. మనకు చాలా దూరంగా సముద్రాలని పెద్దపెద్ద చెరువులుంటాయి. వాటి అవతల వాండ్ల దేశం.'’
అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి మాల మాదిగలకు బళ్ళు పెట్టి మందులు ఇస్తున్నారన్నమాట.'’
“వాండ్లదే పనిమీద రాలేదు. సర్కారు నడుపుతున్నది కూడా వాండ్లే'’
కంఠీరవం ఆశ్చర్యంగా పంతులును చూచి - “సర్కారును వారే నడుపుతున్నారా పంతులు? మరి మన ఆలాహజ్రత్ ఉన్నాడు గద పంతులు?'’ అన్నాడు.
“మన ఆలాహజ్రత్ మన హైద్రాబాద్ రాజ్యానికి పెద్ద. కాని ఈ తెల్లవాండ్లు ఢిల్లీలో కూర్చొని మొత్తం భారతదేశాన్ని రాజ్యం చేస్తున్నారు.'’
కంఠీరవానికి, తన పంతులుకు ఈ విధంగా జరిగిన సభాషణ జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తి వెంట వెళ్ళుతున్నాడు.
ఆ వ్యక్తి వెనకకు తిరిగి చూచి ” ఏ ఊరుకు పోవలె?'’ ప్రశ్నించాడు.
కంఠీరవం వెంటనే సమాధానమివ్వలేక పోయాడు. “నిజామాబాదుకు పోవాలని ఇంటి నుండి బయలుదేరాను. నీవు కనబడ్తే నీ వెంట వస్తున్నాను.'’ మెల్లగా అన్నాడు.
ఆ వ్యక్తి నడకనాపి, “నిజామాబాదు అక్కడ ఉంటుంది. మరిటెందుకు వస్తున్నావు?'’ అడిగాడు.
” ఈ రోజు ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను. కాని నాకు ఎవరూ గుర్తులేదు'’ విచారంగా కంఠీరవం సమాధాన మిచ్చాడు.
“కొత్త చోట ఎక్కడ ఉంటావు? సానా కష్టమైతది. ఇప్పుడు వచ్చిన తోవన రైలు టేషన్‌కు పో. నిజామాబాదుకు పోయే రైలు వస్తది. దాంటో పోరాదు?'’ ఆ వ్యక్తి అన్నాడు.
రైలుకు ఎన్ని పైస లైతవో! నా రూపాయి చాలునో, లేదో కంఠీరవం తనకుతానే అనుకున్నాడు. “నా దగ్గర ఒక్క రూపాయ ఉంది. నిజామాబాదుకు చాల్తదా?'’ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు.
“నీ తాన రూపాయ ఉందా? నీ కాలు మొక్త. దాంట్లో నీ టిక్కెటు పైసలు పోంగ, ఏమైన మిగులొచ్చు. అవిచ్చి నా దండె కడియం ఇడిపిచ్చుకుంట. నీకు పుణ్య ముంటది. బీదోడ్ని. అన్నాంగా ఉన్నొక దండె కడియం లేకుండైంది'’ అంటూ ఆ వ్యక్తి వెనుకకు తిరిగి స్టేషన్ వైపు దోవ తీశాడు. కంఠీరవం ఆ వ్యక్తిని అనుసరించాడు. రూపాయ పూర్తిగా ఒకేసారి ఆ విధంగా ఖర్చు కావడం కంఠీరవానికి కష్టమనిపించింది. కాని పైకి తన భావాన్ని ప్రకటించలేదు.
ఆ వ్యక్తి స్టేషన్ మాస్టరు వద్దకు వెళ్ళి రూపాయ ఇచ్చాడు. నిజామాబాదు టిక్కెటుకు పైసలు ముదరా బెట్టుకొని, మిగతా పైసలు తన టిక్కెటు కింద తీసికొని దండె కడియం ఇమ్మన్నాడు.
స్టేషను మాస్టరు క్రోధంతో ఆ వ్యక్తిని చూశాడు. రూపాయను టంగ్‌మని కొట్టి మోగించాడు. నిజామాబాదుకు టిక్కెటు ఇచ్చాడు. దబాలున కిటికి మూశాడు. కంఠీరవం, ఆ వ్యక్తి తిగులబడి ఒకరినొకరు చూచుకున్నారు. స్టేషన్ మాస్టరు ఆఫీసు గది నుండి బయటికి వచ్చి కోపంగా ఆ వ్యక్తిని చూచాడు. “బుద్ధి కలిగి ఇక్కడ నుంచి పోతావా, పోలీసుకు పట్టివ్వాల్నా?'’ గొంతు చించుకుని అన్నాడు. కంఠీరవం ఆశ్చర్యపడ్డాడు. అయోమయంగా తోచింది. ఆ రైలు వ్యవహారాలు ఆ విధంగా ఉంటాయేమో అనుకున్నాడు. ఆ వ్యక్తి భయంతో వెనుకకు తిరిగి చూడకుండానే, తన మొదటి తోవన వెళ్ళిపోయాడు.
కంఠీరవం మెల్లగా స్టేషన్ మాస్టరు వద్దకు వెళ్ళి, “నా రూపాయ సరిగ్గా సరిపోయిందా!'’ వినయంగా అడిగాడు.
“ఇంకా వేరే చెప్పాలా? వచ్చేదుంటే మేము యివ్వం? ఎన్నడు రైలెక్కిన ముఖం కానట్టుందే?'’ అంటూ స్టేషన్ మాస్టరు రైలు ప్లాటుఫారం మీదికి వెళ్ళి నిలుచుండి అటు ఇటు చూచాడు.
కంఠీరవం ఉక్కిరిబిక్కిరైపోయాడు. విచారంగా వెళ్ళి ప్లాటుఫారం మీద నిలుచున్నాడు.
కంఠీరవం వెనుకభాగంలో కటకటాల నానుకొని ఇద్దరు వ్యక్తులు స్టేషన్ మాస్టరు గురించి మాట్లాడుకుంటున్నారు.
“వీడి దశేందో గాని భలే సాగించుకుంటున్నడే, ఏమైనాగాని.'’
“ఇంక నీకు ఆశ్చర్యమేస్తున్నదా? ఇటువంటోండ్లు అంతటా ఉన్నరు. కొంచెం పై చేయి, కింది చేయి అనుకో. ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది,'’ అంటూ యింకొక్కడు బీడీ ముట్టించాడు.
రైలు రాగానే కంఠీరవం ఎక్కి నిజామాబాదు చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాల్సింది తోచలేదు. అంత గ్రామాన్ని, ఆ విధంగా దుకాణాలు, దీపాలు, ప్రజల సంచలనం చూడటం కూడా అతనికి మొదటిసారి. వింతగా రెండువైపుల దుకాణాలను చూస్తూ మెల్లగా రోడ్డు వెంట నడుస్తున్నాడు.
నామాలు పెట్టుకొని బట్టల దుకాణములో మెత్త కానుకొని కూర్చున్న ఒక వర్తకుని వద్దకు వెళ్ళి నిలుచున్నాడు. లక్ష్మీనారాయణ పేరు గల ఆ వర్తకుడు కంఠీరవాన్ని ఎగాదిగా చూచాడు. లైటు వెలుతురుకు కంఠీరవం నొష్టపై నామాల మచ్చలు స్పష్టంగా కనిపించాయి. వైష్ణవ భక్తుడైన ఆ వర్తకుడు చాలా బాధపడ్డాడు. ఒక వైష్ణవుడు ఆవేళ వరకు ముఖాన బొట్టులేక ఉండటం భరించరాని అన్యాయమని ఆశ్చర్యపడ్డాడు.
“మీరు స్వాములా?'’చేతిలోని బీడీని నలిపి దూరంగా పారవేసి లక్ష్మీనారాయణ అడిగాడు. “ఏం? ప్రొద్దటి నుండి సాపాటుచేయలేదా? రాండి, అట్లా కూర్చోండి,'’ అన్నాడు.
కంఠీరవం విచారంగా తల నేలకు వేసి నిలుచున్నాడు.
“అయ్యో! నిలబడితిరి? కూర్చోండి! ఏ వూరు స్వామి మనది? ఎక్కడికొచ్చారు? ఇక్కడెవరైనా బంధువులున్నారా?'’ లక్ష్మీనారాయణ ప్రశ్నలు కురిపించాడు.
“నాకీ వూరు క్రొత్త. నాకిక్కడ ఎవరూ గుర్తు లేదు,'’ కంఠీరవం దీనంగా జవాబు చెప్పాడు.
“ఊరేది స్వామి?'’
“దిమ్మెగూడెం. వేదాల రఘునాథాచార్యులు మా నాయనగారు. మా నాయనగారు కాలం చేశారు. మా నాయనగారు మీకెరికేనా?'’ కంఠీరవం సమాధానంగా తిరుగు ప్రశ్నలు వేశాడు.
“ఆఁ ఏమన్నారు? దిమ్మెగూడెం రఘునాథాచార్యులు కొడుకులా మీరు? రామానుజ, అన్యాయం. ముఖాన బొట్టు లేకుండా ఎన్నడైన మీ నాయనగారు ఊరు వదలి బయటికి వెళ్ళేవారా? మీ నాయనగారిని ఎవరు ఎరుగరు స్వామీ? వారి ఆచారము, సంప్రదాయము, తెలివి, పాండిత్యము ఎరుగని వారెవరు? ఎంతటి మహానుభావులు, ఎంతటి ఘటము? వారిని చూస్తేనే పంచమహా పాతకాలు పోతాయి… ఒరే! వెంకటయ్య ఇటురా, ఈ అయ్యగారిని వేదాంతాచారిగారి ఇంట్జికి తీసుకపో. వీరు దిమ్మెగూడెం రఘునాథాచార్యుల గారి కుమారులని, ప్రొద్దుట నుంచి సాపాటు చేయలేదని చెప్పు. భోజనానికి ఏర్పాటు చేయించమని చెప్పు,'’ అని లక్ష్మీనారాయణ గుమాస్తాకు చెప్పాడు.
“అయ్యా! మీరు వాడి వెంట పొండి. అపచారము. ప్రొద్దుట నుంచి సాపాటు లేదు. ఎంత మాట,'’ అంటూ లక్ష్మీనారాయణ మెత్త మీద నుంచి లేచి, “దాసుడిని'’ అని దండం పెట్టాడు.
కంఠీరవం గుమాస్తా వెంట బయలుదేరాడు. తన తండ్రిని గురించి లక్ష్మీనారాయణ వెలిబుచ్చిన భావాలకు, తన యెడ అతను కనబరచిన ఆప్యాయతకు లోలోన ఆనందంతో పొంగిపోయాడు. తండ్రిని, ఇంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ గుమాస్తా వెంట వేదాంతాచార్యుల యింటికి వెళ్ళాడు.
కంఠీరవం విషయం గుమాస్తా ద్వారా వివరాలు తెలిసికొన్నది మొదలు వేదాంతాచార్యులు రఘునాథాచార్యుల ప్రతిభను పొగడడం మొదలుపెట్టాడు. రఘునాథాచార్యుల మరణానికి వగచాడు. అటువంటి పరమ భాగవతోత్తముడిని ఇక చూడడం కష్టమని విచారించాడు. అతని పేరు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత కంఠీరవంపై ఉందని హెచ్చరించాడు.
కంఠీరవం స్నానం ముగించుకున్నాడు. వేదాంతాచార్యుల రెండో కొడుకు మోహనాచార్యులు, కంఠీరవం ఉపాహారం ముగించుకుని వివేకవర్థని గ్రంథాలయం వైపు వెళ్ళారు.
వేదాంతాచార్యులు ఆయుర్వేద వైద్యుడుగా ఆ చుట్టుప్రక్కలా, స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించాడు. వైద్యవృత్తికి తోడుగా వ్యవసాయం కూడా ఉంది. వైద్యంలో ఎంత శ్రద్ధతో పనిచేస్తాడో, వ్యవసాయం కూడా అంతే శ్రద్ధతో చేయించుకుంటాడు. పెద్ద కొడుకు కస్తూరి రంగాచార్యులు బడిపంతులుగా పని చేస్తున్నాడు. రెండో కొడుకు మోహనాచార్యులు మెట్రిక్ చదువుతున్నాడు. తర్వాత వకీలు పరీక్షలో కూర్చోవాలని ఆలోచిస్తున్నాడు.
కంఠీరవం, మోహనాచార్యులు గ్రంథాలయానికి వెళ్ళగానే, మోహనాచార్యులు ఒక పత్రికను చేతబట్టి చూడసాగాడు. “మీకు కావలసిన పత్రికేదైనా తీసికొని చదువండి,'’ కంఠీరవంతో అన్నాడు. కంఠీరవానికి ఆ ప్రదేశం కన్నుల కింపుగా తోచింది. అల్మారాలో అందంగా పేర్చబడియున్న పుస్తకాలు, అంతా నిశ్శబ్దంగా కూర్చొని చదువుతూ ఉన్న చదువరులు, అప్పుడే గ్రంథాలయంలోకి ప్రవేశించి ఒకరినొకరు మందహాసంతో నమస్కరించుకోవడం కంఠీరవానికి ఆనందంగా తోచింది. అవన్నీ గమనిస్తూ కంఠీరవం కొంతసేపు కాలం గడిపాడు.
గ్రంథాలయం ఆవరణలో నాలుగు వైపుల గోడలకు తగిలించి ఉన్న ఫోటోలను ఒక్కొక్కటి చూస్తూ ఆ ఆవరణంతా తిరిగాడు. గాంధీ, గోఖలే, తిలక్, మోతీలాల్, లజపతిరాయ్, జవహర్‌లాల్, సరోజినీదేవి, విఠల్ భాయి పటేల్, డా॥ అన్సారి, కమలానెహ్రు, స్వరూపరాణి నెహ్రు, కమలాదేవి ఛటోపాధ్యాయ, సుభాష్ చంద్రబోస్ చిత్రాలన్నీ తగిలించబడి ఉన్నాయి. ఆ పటాలలో అచ్చైన పేర్లన్నీ ఇంగ్లీషు భాషలో ఉన్నందువల్ల వారంతా ఎవరో కంఠీరవానికి అర్థం కాలేదు. అన్ని పటాల కంటె పెద్దగా ఉండి, ప్రధానమైన స్థలంలో ఉన్న నిజాం పటమును మాత్రం కంఠీరవం గుర్తుపట్టాడు. వరుసగా బల్లలు, వాటికి రెండువైపులా కుర్చీలు, బల్లలపై దిన, వార, పక్ష, మాస పత్రికలు పెట్టబడి ఉన్నాయి. కంఠీరవం ఒక్కొక్కటి తిరగవేస్తూ వాటిలోని బొమ్మలను, వార్తల శీర్షికలను చదువుతూ కొంతసేపు కాలం గడిపాడు.
మోహనాచార్యులు వచ్చి పిలువగానే కంఠీరవం బయలుదేరాడు. మార్గమధ్యంలో మోహనాచార్యుల నడిగి గ్రంథాలయంలోని చిత్రాల వివరాలను తెలిసికొన్నాడు. ఆ చిత్రాలలోని ఒక్కొక్కరిని గురించి మోహనాచార్యులు తనకు తెలిసినవి, విన్నవి వివరించాడు. వారిపై ఆంగ్లేయ ప్రభుత్వం చేసిన, చేస్తున్న దౌర్జన్యాలు, వారిని జైళ్ళలో హింసిస్తున్న పద్ధతులు తెలిపాడు. ఆ వివరాలు కంఠీరవంపై చాలా ప్రభావం కలిగించాయి. తిరిగి ఆ చిత్రాలను చూడాలనే ఆసక్తి హెచ్చింది.
“డిచ్పెల్లిలో వైద్యసహాయం చేస్తున్న తెల్లవాండ్లే అటువంటి అన్యాయమైన పనులు చేస్తున్నారా?'’ ఆశ్చర్యంతో కంఠీరవం అడిగాడు.
“అవును! ఆ తెల్లజాతివాండ్లే,'’ మోహనాచార్యులు అన్నాడు.
“అంత దయతో రోగులకు చికిత్స చేస్తున్నవాండ్లు అంత కఠినంగా అటువంటి గొప్పగొప్పవాండ్లను ఎందుకు హింసిస్తున్నారు?'’ ఆవేదనతో అడిగాడు కంఠీరవం.
ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం మోహనాచార్యులకు శక్తికి మించిన విషయమైంది. “అదే అర్థం కావడంలేదు. మా మాస్టారు కూడా తెల్లవాండ్ల పట్టుదల, క్రమశిక్షణ, పరిశోధనా పటిమ, విజ్ఞాన ప్రియత్వము, సాహసములను గురించి తెగ పొగడుతుంటాడు. ఈ కాంగ్రెసు వాండ్లెంత కష్టపడ్డా తెల్లవాండ్లతో సరితూగజాలరని కూడా అంటాడు,'’ అన్నాడు.
“నా అభిప్రాయంలో ఇందులో మనకు తెలియని విషయమేదో దాగి ఉంది. లేకపోతే, అట్లా అంత చదువుకున్నవాండ్లు అర్థం లేకుండా కష్టాల ననుభవిస్తున్నా రంటే, ఒకవైపు దయను చూపుతూ రెండోవైపు మీరు చెప్పిన దౌర్జన్యాలు తెల్లవాండ్రు చేస్తున్నారంటే ఇందులో ఏదో పెద్ద విషయమే దాగి ఉంది,'’ అన్నాడు కంఠీరవం.
“మనమేమీ చెప్పలేం,'’ మోహనాచార్యులు తన నిస్సహాయతను వ్యక్తపరిచాడు.
ఇంటికి చేరుకోగానే మోహనాచార్యులు, కంఠీరవం భోజనం ముగించుకొని ఒకేచోట పక్కలు వేసుకొని పడుకున్నారు.
మోహనాచార్యులు పడుకొని స్కూలు పుస్తకాలు చదువ మొదలుపెట్టాడు.
కంఠీరవం కూడా ఉండలేక కొన్ని పుస్తకాలు తిరగవేశాడు. అందులో ఒకటి ఇంగ్లీషు పుస్తకం, రెండోది లెక్కల పుస్తకం! ఆ రెండు కూడా అతడు చదువురాని వానిగా తేల్చివేశాయి.
ఆ పుస్తకాలు తనకేమీ అర్థంకానందుకు చింతించాడు. అటువంటి చదువులు పల్లెటూరివాండ్లకు చెప్పకపోవడం, బస్తీవాండ్లకు మాత్రం చెప్పడం ఎందుకో తెలిసికోజాలలేదు. “మీ బస్తీ చదువులకు, మా పల్లెటూరి చదువులకు చాలా భేదముంది,'’ పుస్తకాలను మోహనాచార్యులకు చూపి, “ఈ చదువు మాకు చెప్పనేలేదు,'’ అన్నాడు.
అతని అమాయకత్వానికి మోహనాచార్యులు తనలో తాను నవ్వుకున్నాడు. “ఇవన్నీ మీరు నేర్చుకుంటారా?'’ కంఠీరవాన్ని చూస్తూ అన్నాడు.
“నేర్పితే ఎందుకు నేర్చుకోను?'’ ఆశతో కంఠీరవం అన్నాడు.
“సరే! మంచిది. ఆలోచిద్దాం. చాలా అలసిపోయారు. పడుకోండి,'’ అని మోహనాచార్యులు తిరిగి చదువులో లీనమయ్యాడు.
కంఠీరవం తిరిగి ఆలోచనలో పడ్డాడు. తన భవిష్యత్తు ఏం కానున్నదో, తెల్లవారితే ఏం చేయాల్సుందో అయోమయంగా తోచింది. కొత్తగా వచ్చిన తనకు బస్తీలో ఆదరణ కలగడానికి కారణమైన తన తండ్రి ఘనతకు ఉబ్బిపోయాడు. తండ్రి జీవించి ఉన్నప్పుడు తండ్రికి, తనకు జరుగుతుండే వాదనను జ్ఞాపకము చేసుకొని నిట్టూర్పు విడిచాడు. డిచ్చెల్లి రైలు స్టేషనులో స్టేషను మాస్టరు కరుకుతనం, తెల్లవారి ద్వంద్వ నీతిపై ఆలోచించాడు. బట్టల వర్తకుడు లక్ష్మీనారాయణ ఆప్యాయతను తలచుకొన్నాడు. మరునాడు తిరిగి లక్ష్మీనారాయణను కలిసికోవాలని అనుకుంటూ నిద్రలో లీనమైనాడు.
(ఇంకా ఉంది)