- జాన్ హైడ్ కనుమూరి

అదొక మహమ్మారి
అనేకనేక బాహువుల్తో
ప్రతి గుండెల్లో
ఊడల్ని దింపాలని చూస్తున్న మర్రి
విధ్వంశాన్ని కల కనే వెర్రి
విస్పోటనం కావాలి
భయానక క్షణాలు లెక్కించాలి
రక్తంతో పైశాచిక చిత్రాలు రచించాలి
భయపెట్టాలి
పది మందిచేరే
ద్వజ స్థంబం ప్రక్కకో
మోకరించే స్థలానికో
రెహాల్ వైపుచూసే జానిమాజ్ చోటుకో చేర్తుంది


అంతే
విస్పోటనం ఖకావికలు చేస్తుంది
కొన్ని పావురాలు నేలరాల్తాయి
రెక్కతెగి అల్లలాడ్తాయి మరికొన్ని
భీతిల్లిన గుండె చప్పుళ్ళతో
బిక్కుబిక్కు మంటూ ఒదిగిపోతాయి
జీవకారుణ్యానికి తూట్లు పడతాయి
నిశ్శబ్దం ఆవరించిన వీధులవెనుక
భయం దాగి వుంటుంది.
వీధుల్లో తెలియని సమాచారం
విదేశాలలో తెలుస్తుంది
రెక్కలు కట్టికున్నట్టు
నేతలు వాల్తారు
ఎడెక్కిన వేదికలౌతారు
దోషులకోసం గాలింపులు మొదలైతే
పాలక అసమర్ధ్తతల సందుల్లోంచి
చిచ్చు రగిల్చినవాడు
మన దుస్తుల్లోనే మన మద్యే తిరుగుతూ
చల్లగా జారుకుంటే
ఎరను మింగిన చేప గేలాన్కి చిక్కినట్టు
అమాయకులెవరో చిక్కుతారు.
విప్పలేని చిక్కుముడుల మద్య
కాలం దొర్లిపోతుంది.
గుండెను తాకినగాయం
నెగడై మండుతూనే వుంటుంది.

మరెక్కడో విస్పొటనం కోసం
కొత్త రచన జరుగుతూనే వుంటుంది
అదొక మహమ్మారి
అనేకనేక బాహువుల్తో
ప్రతి గుండెల్లో
ఊడల్ని దింపాలని చూస్తున్న మర్రి
విద్వంశాన్ని కల కనే వెర్రి
————————————-

హైద్రాబాదు మక్కమసీదు బాంబు పేలుళ్ళకు స్పందిస్తూ

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)