- యెనికపాటి కరుణాకర్
ప్రేమగా ఇంటికి రమ్మని పిలిచిన
మిత్రుడ్ని అడుగుతాను
మీ ఇంటికి ఎన్ని మెట్లుంటాయని
మెట్లంటే మీకు కేవలం
పేర్చిన ఇటుకల వరుసే కావచ్చు
కాకుంటే
ఒక వెచ్చని ఉదయాన కాఫీ తాగుతూ పేపరు చదువుకొనే
ఇష్టమైన చోటు కావచ్చు
రాత్రి ఇల్లాలి ఎదురుచూపులకు తోడు కావచ్చు
కడిగి ముగ్గేసిన కళాఖండం కావచ్చు
అప్పుడే నడుస్తున్న పసివాడికి
పడిలేవడం నేర్పే పాఠశాల కావచ్చు
అతథి పాదాల్ని చల్లగా చేతుల్లోకి తీసుకొనే
ఇంటి ఆత్మ కావచ్చు
చేరాల్సిన గమ్యాన్ని,ఎక్కాల్సిన శిఖరాల్ని
గుర్తు చేసే ప్రతీక కావచ్చు
కానీ నాకు మాత్రం మెట్లు
ఎప్పటికీ అధిరోహించలేని పర్వతాలు
తెరచిన హృదయపు వాకిలి ముందు
ఘనీభవించిన తిరస్కారం లాంటి మెట్ల ముందు
సాధనతో సాధించలేనిది లేదని
పెంచుకుంటూ వస్తున్న నమ్మకం
నిస్సహాయంగా నిలబడుతుంది
శరీరమే లక్ష్యంగా
సకల జీవ శక్తులతో సాగించిన యధ్ధం
రెండు చిన్న మెట్ల ముందు ఓడిపోతుంది
తప్పనిసరై మరొకరి చేతుల మీదుగా చేసే ప్రయాణాన్ని
మనిషికి మనిషి సాయంగా
మనసు సర్దుబాటు చేస్తుంది
తీరని దుఃఖం చిరునవ్వుగానే సర్దుబాటు అవుతుంది.
ఒప్పుకుంటాను
మెట్లు ఇళ్ళముందే కాదు లోపలా ఉన్నాయి
అసలు ప్రపంచమే ఎగుడు దిగుడుగా ఉంది
ఆరోహణ అవరోహణ పరమపద సోపానంలో
తొలిమెట్టు ముందే ముగుస్తున్న జీవితాల ముందు
నా దుఃఖం చిన్నబోతుంది
అంతులేని సంపద, అనంత దారిద్రం
రెండు తలలుగా
పైకో కిందకో తప్ప
ముందులు తీసుకెళ్ళని మెట్లను
పునాదులతో తవ్విపోసి
మరో సమతల ప్రపంచానికి ర్యాంపులుగా మలుస్తున్న కలే
నన్ను నడిఫిస్తోంది.
ఓడిన ప్రతిసారీ ఓదారుస్తోంది.