నేను తాళం తీసుకొని లోపలికి వెళ్ళి గ్లాసు చల్లటి మంచినీళ్ళు తాగి సోఫాలో చతికిలపడ్డాను. ఇంతలో రివ్వుమంటూ నా పదేళ్ళ కొడుకు నందూ పరిగెత్తుకొచ్చాడు.
“అమ్మా! డాడీ రెండు నెలల్లో కారు కొనేస్తారుట. ప్రపంచంలోని అన్ని దేశాలకు మధ్యనున్న గేట్లు తెరిచేశారుట. కార్లు ‘చర్’మంటూ మనదేశంలోకి దూసుకు వచ్చేస్తున్నాయటే! చాలా చీప్‌గా కొనుక్కోవచ్చని పొద్దుట అంకుల్‌తో చెప్తున్నాడు నాన్న. అమ్మా! అమ్మా! మనం కార్లో ముందు సాయిబాబా గుడికి వెళ్దామమ్మా! ప్లీజ్! తోవలో శ్రీధర్ వాళ్ళకి మన కారు చూపించొచ్చే!'’ అంటూ కారు గుమ్మంలో ఉన్నట్టే బతిమాలేస్తున్నాడు వెధవ!
ఐదు సంవత్సరాల నుండి మా ఆయనకి ఈ కారు యావ పట్టుకొంది. చిన్నప్పటి నుండి కష్ట జీవితం. తన రెక్కల శక్తితో తన వాళ్ళందర్నీ ఒక స్థాయికి తీసుకువచ్చి ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ఇల్లు కట్టుకొని ఊపిరి పీల్చుకొంటున్నారు. ఆయనతోపాటు జాయిన్ అయిన ఆయన కొలీగ్స్ చాలామంది కార్లు కొనేశారు. అప్పుడప్పుడు దర్జాగా కాలేజీకి కార్లో దిగుతూ ఉంటారట. ఇదంతా చూస్తూ ఈయన కూడా కనీసం మధ్యతరగతి వాళ్ళ కలలోకి కూడా రావడానికి వీల్లేని కారు ఊహల్లో తేలిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళంటే అదృష్టవంతులు. వాళ్ళు నేర్చిన చదువుకు నేటి విద్యా వ్యాపారశాలల్లో మంచి గిరాకీ ఉంది. వాళ్ళు కేష్ చేసుకొంటున్నారు వాళ్ళ చదువును. ఈయనా కష్టపడి చదివి గోల్డ్‌మెడల్ సంపాదించుకొన్నారు. ఆయన రాసిన థిసీస్‌కి ఈమధ్య అవార్డు కూడా ఇచ్చారు.
పాపం! ఈయన కొనుక్కోలేకపోయారు. ఏదో ఎరియర్స్ వస్తాయి, వాటితో కారు తప్పక కొనేస్తానని తెగ కలవరించారు. కానీ వచ్చే డబ్బు కాస్తా దఫదఫాలుగా ఇస్తాననడంతో ఆ ఆశా నీరుకారిపోయింది. ఇక ఈ సందర్భం మళ్ళీ మా ఆయన ఆశకు నీరు చిలకరిస్తోందన్నమాట. అమాయకులు పాపం! ‘కార్ల దిగుమతిపై సుంకం’ అన్న ఈరోజు వార్త చూశారో, లేదో! ఏ సందర్భాలైనా బడుగు ప్రజల వృత్తులపైన, కోళ్ళ పెంపకం, నేత పరిశ్రమలాంటి వాటిపై ప్రభావం చూపించి వాళ్ళ జీవితాలను మింగెయ్యడానికి ఉపయోగపడతాయి తప్ప మనలాంటివాళ్ళ అతి పెద్ద ఆశలను తీర్చడానికి కాదు. అసలే నా మనసు మావుళ్ళమ్మ పరిస్థితి చూసి చలించిపోయి ఉంది. ఈ మాటలతో మరింత రగులుకొంది.
* * *
నిన్న పొద్దుట అమ్మని, నాన్నని చూసి వద్దామని ప్రయాణమై వెళ్ళాను. వాళ్ళిద్దరూ తరచూ ప్రయాణం చేసి ఎక్కడికీ రాలేరు. పిల్లల్ని చూడాలని ఉంటుంది వాళ్ళకి. ఉన్న నలుగుర్లో నేనే కొంచెం దగ్గర్లో ఉన్నాను. అందుకే పదిరోజులకొకసారైనా చూసి వస్తాను. ఈసారే పిల్లవాడికి పరీక్ష అనీ, ఆయనకు ఇన్విజిలేషన్ ఉందని ఆలస్యం చేశాను. పిల్లలం మేం నలుగురం మా పొట్ట మేం పోసుకొంటూ ప్రశాంతంగానే ఉన్నాం. ఎవరి దగ్గరైనా వచ్చి ఉండవచ్చు కానీ, నాన్నగారు రారు. ఆయనకు ఆ పేట కన్నతల్లి. అక్కడ వాళ్ళందరూ ఆయన పిల్లలే! వాళ్ళందరి బాధలు ఆయనవే! ఆ చిన్నపేట మంచీచెడూ చూడడం, దానితో మమేకమవడం ఆయనకిష్టం. ఎవరి ఇష్టంలో వారికి శాంతి దొరుకుతుంది. అందుకే మేం ఎవరం బలవంతం పెట్టలేదు. అమ్మకి ఆయన మంచీ చెడూ చూడడంతోనే శాంతి. ఇంక ఏం చెప్తాం?
ఆ పేటలో మొదట పునాదిరాయి ఆయనే పాతారు. మల్లయ్య అని ఒక పెద్ద మనసుగలాయన తన వారందరికీ అక్కడ స్థలాలన్నీ ఊరికే ఇచ్చారు. అందుకే ఆ పేటలో చాలావరకు నేత పనివాళ్ళే ఉండేవారు. వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్లకు కూడా కొంత స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టుకోమన్నాడు. అలా నాన్నగారికీ వచ్చింది ఆ స్థలం. అప్పటి నుండి ఎంతోమంది అధికార్లకు అప్లికేషన్లు పెట్టించి నాన్నగారే తిరిగి కుళాయిలు, కరెంటు, రోడ్డు అన్నీ ఒకటీ ఒకటీ తీసుకు వచ్చారు. ఇప్పుడది ఒక పెద్ద పేటగా మారిపోయింది. ఆ కాలంనాటి పెద్దల నుండి, మా పిల్లల తరం వరకు అందరికీ నాన్నగారు నాన్నగారే! అలాగే పిలుస్తారు కూడా. ఆ ఊరిలో అడుగుపెట్టేటప్పటికి నేను ఎనిమిదేళ్ళ పిల్లని. మాస్టారమ్మాయని ఎవరూ నన్ను కింద నడవనిచ్చేవారు కాదు. ఊరిలో చాలాభాగం నేత పనివాళ్ళే. తెల్లవారుఝామున మెలకువ వచ్చి బయటకు వస్తే, వెన్నెల్లో చుక్కలు కోలాటం ఆడుకొంటున్నట్టు లయబద్ధంగా మగ్గాల చప్పుడు వినిపించడం నేను ఎప్పుడూ మరిచిపోలేని ఓ జ్ఞాపకం. ఆ ఉదయసంధ్యలో నిద్ర మగతలో ఆ చప్పుడు చాలా సమ్మోహనంగా ఉండేది. వెలుగు వచ్చాక పనమ్మాయి నారాయణమ్మ పెట్టే ముగ్గు చూడడానికి వీధిలోకి చేరేవాళ్ళం నేనూ, తమ్ముడూ! ఎందుకంటే నాలుగు వేళ్ళ మధ్యలోంచి ముగ్గు జారవిడుస్తూ రోజుకో రకం పక్షుల్ని గుమ్మం ముందు నిలబెట్టేది. ఇంకా ఈ వింతలోంచి తేరుకోకుండానే అంతకంటే విచిత్రమైన దృశ్యం రోడ్డు మీద కనబడేది!
అప్పట్లో మా లెక్కకు అందనంత పొడవైన వివిధ వర్ణాల దారాలు ఈ చివర నుండి ఆ చివరకు కర్రలకు ముళ్ళువేసి ఉండేవి. చిన్న తుండుగుడ్డలు కట్టుకొని ఇద్దరు మగవాళ్ళు ఆ దారాలకు, అదోరకంగా ఉండే కండెలాంటి చీపుళ్ళతో గంజి రాస్తూ అటూ, ఇటూ నడుస్తూ ఉండేవారు. వాళ్ళతో పాటు ఆ రంగుల దారాల్ని చూస్తూ, వాటిని ముట్టుకోవాలన్న కోరికను మనసుతో పెనవేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళం, అమ్మ పిలిచేవరకు.
స్కూలు నుండి రావడమేమిటి, నేను మావుళ్ళమ్మ అరుగెక్కి కూర్చునేదాన్ని. మా ఇంటి ఎదురుగానే ఉండేది వాళ్ళ ఇల్లు. ఆదివారమైతే ఒంటిగంటకు వెళ్ళిపోయేదాన్ని. నాకోసం వేరుశెనగపప్పు ఉండలు, జీళ్ళు దాచి ఉంచేది. మధ్యాహ్నమప్పుడు ఎప్పుడూ రాట్నం తిప్పుతూ ఉండేది. నన్న చూడగానే లేచి, పప్పుండ నా చేతిలో పెట్టి పక్కనే కూర్చోపెట్టుకొనేది. ఒక చేత్తో కండి పట్టుకొని ఒక చేత్తో తిప్పుతూ దారమంతా చిలవలు చిలవలుగా మార్చేసేది. నేనూ సరదాపడి ఒక్కసారి తిప్పుతే దారం పుట్టుక్కుమనేది. అప్పుడు నాకు మావుళ్ళమ్మ మంత్రగత్తెలా అనిపించేది. తెగిపోయిన దారాలన్నీ నాకిచ్చేది. ఆ రంగురంగుల దారాలతో బొమ్మలకు జడలు వేసి ఆడుకొనేవాళ్ళం. మావుళ్ళమకు పిల్లలు లేరు. ఏ పండగొచ్చినా నన్ను తీసుకెళ్ళి రెండు జడల నిండా పెరట్లో పూసిన కనకాంబరాల మాల వత్తుగా పెట్టి పంపించేది. తన దగ్గర మా అమ్మ దగ్గర కంటే బాగుండేది. చదువుకోమనదు ఎంతసేపైనా అని.
ఒకసారి దీపావళికి మేమతా కాకరపువ్వొత్తులు, మతాబులు కాల్చుకొంటూ ఉన్నాం. ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక తారాజువ్వ జుయ్‌మని దూసుకొంటూ మావుళ్ళమ్మ పాకలోకి వెళ్ళిపోయింది. వెళ్ళడం, వెళ్ళడం వాళ్ళాయన తొడ లోపలికి దిగిపోయింది. ఆ సమయంలో అతను గోచీ పెట్టుకొని మగ్గం మీద కూర్చుని చీర నేస్తున్నాడట. అప్పుడు ఎవరూ సాయం లేక చాలా ఇబ్బంది పడింది పాపం! నాన్నగారు రోజూ సైకిల్ మీద కూర్చోపెట్టుకొని గవర్నమెంటు హాస్పిటల్‌ఖి తీసుకెళ్ళి కట్టు కట్టించేవారు. చాలారోజులకు గాయం మానింది. కానీ మామూలు మనిషి కాలేకపోయాడు. మావుళ్ళమ్మే పనంతా తన రెండు చేతుల్తోనూ సమర్థించుకొనేది.
“పెద్దపెద్ద పొడుగైన చీరలు నేస్తాడు? చిన్న గోచీ పెట్టుకుంటాడేమిటి బసవయ్య,'’ అని తమ్ముడు అడిగితే, “అయన్నీ నీ పెళ్ళానికి బాబూ! మాకు ఈ గోచీ మిగిలితే చాలు,'’ అని నవ్వించేసేది. ఎప్పుడూ సవయ్య లోతుగా ఉన్న గోతిలో కాళ్ళు పెట్టి, ఒక చెయ్యి ఇటూ, ఒక చెయ్యి అటూ ఆడిస్తూ మిషను తొక్కుతున్నట్లు తొక్కుతూ ఉండేవాడు. ( సమయంలో) దీక్షగా, డాన్స్ చేస్తున్న కళాకారుడు గుర్తుకొస్తాడు ఇప్పుడు తల్చుకొంటే! ఆ దారాలన్నీ కలిసి బట్టగా మారిపోతుంటే బలే తమాషాగా ఉండేది. ఇంక అతను ఈ లోకంలో ఏ పనైనా చేసెయ్యగలడనిపించేది. పలక బీటవారితే ‘బసవయ్య అతికిస్తాడేమో! నాన్నగారు తిట్టకుండా,’ అని తమ్ముడు, నేను ఆశపడేవాళ్ళం. వాళ్ళ కష్టం, ఆ కష్టానికుండే విలువా ఈ వ్యాపార ప్రపంచంలో చాలా స్వల్పమని తెలియదప్పుడు నాకు. ఈ యాంత్రిక యుగంలో అతని జీవితాన్ని అతడు దట్టంగా నేసుకోలేని అప్రయోజకుడిగా మిగిలిపోతాడని ఊహకందని వయస్సు మాది. నా పెళ్ళి వరకూ కూడా అలా నేస్తూనే నా జీవితంతో పెనవేసుకొని ఉన్నారు. నా పెళ్ళప్పుడు ఒక ఎర్రంచు కోరా చీర తెచ్చి ఇచ్చింది మావుళ్ళమ్మ. ఆ చీర నా చిన్నప్పటి కలలనేతగా నేను దాచుకొన్నాను. ‘ఆ చీరకి సంఘంలో చాలారోజులు డబ్బుకట్టింది మావుళ్ళమ్మ,’ అని అమ్మ బాధపడినప్పుడు- నాకు ఆ చీర మరింత విలువయినదయింది.
నా పెళ్ళయిన సంవత్సరమే మావుళ్ళమ్మ వాళ్ళ ఆడపడుచు కూతుర్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకొంది. అప్పటికి ఆ పిల్లకి పధ్నాలుగేళ్ళు ఉంటాయి. మావుళ్ళమ్మకి అన్ని నుల్లోనూ సాయం ఉండేది ఆ పిల్ల. ఆ అమ్మాయి అమ్మా, నాన్న కరీంనగర్ దగ్గర ఒక చిన్న పల్లెటూర్లో ఉంటారుట. అక్కడ చేనేత పనివాళ్ళకి మంచి అవకాశాలున్నాయని ఇటు నుండి అక్కడకు వెళ్ళి స్థిరపడిపోయారు. అక్కడ నేసిన తువ్వాళ్ళకి పంచలకీ మంచి గిరాకీ ఉండేదట.
ఆ పిల్లని తెచ్చుకొన్న మూడేళ్ళకే పెళ్ళి చేసేసింది మావుళ్ళమ్మ. గౌరిని తెచ్చుకొన్నప్పుడు ఇక్కడ కుట్టుపని నేర్చుకొని సంపాదిస్తున్న తన తమ్ముడికిచ్చి పెళ్ళి చేసి తన దగ్గరగా ఉంచుకొందామని అనుకొంది. కానీ గౌరి తల్లీదండ్రీ ఆ పిల్ల పుట్టినప్పుడే వాళ్ళ మేనత్త కొడుక్కి ఇవ్వాలని అనుకొన్నారుట. అతనికి మంచి మగ్గం ఉంది. చేతిలో మంచి నేర్పు ఉంది ఆ పిల్లాడికి. ఏ లోటూ ఉండదని మావుళ్ళమ్మని ఒప్పించి పెళ్ళి చేశారు. వీళ్ళను కూడా గౌరి అక్కడికే తీసుకెళ్ళిపోయింది. ఆ తరువాత అప్పుడప్పుడు తమ్ముడు ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న ఇల్లూ అవీ చూసుకొని వెడుతూ ఉండేవారు. ఆ తరువాత అక్కడ మరో మగ్గం మీద కొంత పెట్టుబడి పెడితే ఇంకా పరిస్థితి బాగుంటుందని వాళ్ళు సలహా ఇవ్వడంతో- ఇక్కడున్న ఇల్లూవాకిలీ అమ్మేసుకొని వెళ్ళిపోయింది. తరువాత తనని నేను చూడలేదు.
చాలారోజులకు ఇదిగో- నిన్న వెళ్ళినప్పుడు చూశాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నాన్నగారు ఇంట్లో లేరు. ఎక్కడకు వెళ్ళారని అమ్మని అడిగితే- మావుళ్ళమ్మ ఊళ్ళోకి వచ్చింది. చూసి పలకరించి వస్తానని వెళ్ళారని చెప్పింది. వాళ్ళ తమ్ముడు మాకు చిన్నప్పటి నుండీ బట్టలు కుడతాడు. నాన్నగారికయితే చాలా ఇష్టంగా చొక్కాలు కుట్టి తెచ్చేవాడు. అతను నాన్నగారికి మంచి స్నేహితుడు. నాన్నగారి స్నేహాల్లో ఆర్థికపరమైన, కులపరమైన బేధాలుండేవి కాదు. సంస్కారపరమైన బేధాన్ని మాత్రం పాటిస్తారు ఇప్పటికీ. అందుచేత రాజు ఇంటికి వెళ్ళడం నాన్నగారికి అలవాటే! అలాగే వెళ్ళారని అనుకొన్నాను.
ఇంటికి రావడమే నాన్నగారు చాలా డిస్ట్రబ్డ్‌గా వచ్చారు. నన్ను చూసి కూడా ఏమీ ఉత్సాహాన్ని చూపించలేదు. మామూలుగా అయితే, నన్ను చూడగానే ఆ పేటలోని విశేషాలన్నీ- అందరి కష్టసుఖాలతో సహా నాకు చెప్పకగానీ లోపలికి వెళ్ళనివ్వరు. మా అమ్మ దాన్ని లోపలికి రానివ్వండి అని అన్నా వినిపించుకోరు.
అమ్మని అడిగితే నెమ్మదిగా చెప్పింది. “మావుళ్ళమ్మ కూతురు, అల్లుడు ఆత్మహత్య చేసుకొన్నారుట. చూసి వచ్చారు కదా! అందుకని అలా ఉండి ఉంటారు,'’ అంది.
నాకు ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. చాలా ధైర్యస్థురాలే మావుళ్ళమ్మ. కానీ ఆ పిల్ల మీదే పంచప్రాణాలు పెట్టుకొని ఉన్న ఊరునీ, కష్టపడి అమర్చుకొన్న ఇంటినీ వదులుకొని వెళ్ళింది. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలదు పాపం!
నాన్నగారి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాను. నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు.
“వీళ్ళిద్దరూ మనవరాల్ని తీసుకొని పెళ్ళికి వెళ్ళారుట. చాలారోజులుగా మగ్గాలపై నేసినవి అలా ఉండిపోవడం చేత గవర్నమెంటు దగ్గర నుండి డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారట. చాలాచోట్ల అప్పులు తెచ్చార్ట పది రూపాయల వడ్డీకి. దాంతో కాస్తో, కూస్తో ఉన్న బంగారం కాస్తా అమ్మేశారుట. తిండికి కూడా కష్టమయిపోయిందట. ‘ఈ ఖర్చులో పెళ్ళికి వెళ్ళమే అమ్మీ!’ అంటే వినకుండా పంపించారట. ఇంట్లో వాళ్ళిద్దరే మిగిలారుట. వచ్చేటప్పటికి ఇద్దరూ పురుగుల మందు తాగేసి పడి ఉన్నారట. ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకపోయిందట. పాపను మాత్రం మావుళ్ళమ్మ మిగుల్చుకొంది. ఇంక అక్కడ నిలబడలేక, ఆ ఊరితో రుణం తీరిపోయిందని పిల్లని తీసుకొని ముసలాళ్ళిద్దరూ వచ్చేశారు. ముసలాణ్ణి అసలు చూడలేకపోతున్నాం అమ్మాయి! ఒక మూల చిన్న తుండుగుడ్డ పరుచుకొని పడుకొన్నాడు. ఉలుకూ పలుకూ లేదు. చిన్నపిల్ల మావుళ్ళమ్మ దగ్గర మాలిమి కావును. బాగానే ఆడుకుంటోంది.'’
అని మాట్లాడుతూనే నాన్నగారు మళ్ళీ ఆలోచనల్లోకి జారుకొన్నారు. బహుశా ఆ చిన్నపాప జీవితం ఆయన కళ్ళల్లో కదలాడుతూ ఉండి ఉంటుంది.
మధ్యాహ్నం అమ్మ, నాన్నగారు భోజనం చేసి పడుకొన్నారు. తలుపు చప్పుడు కాకుండా వేసి బయల్దేరాను. మా వెనకవీధిలో ఉంది, మావుళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు రాజు ఇల్లు. ఈ పరిస్థితిలో తన దగ్గరకు వెళ్ళడమంటే చాలా టెన్షన్‌గా ఉంది. ఈ పదిహేను సంవత్సరాలలోనూ ప్రపంచంలో వచ్చిన మార్పుంతా ఆ చిన్ని పేటలోనే కనిపిస్తోంది. నా చిన్నప్పుడు ఉన్న పూరిళ్ళ స్థానంలో చాలావరకు భవంతులు వెలిశాయి. మల్లయ్యగారు దానం చేసిన స్థలాలు రెండు మూడు చేతులు మారిపోయాయి. నేత పనివాళ్ళన్నవారు ఒక్కరూ ఇక్కడ మిగల్లేదు. అందరూ ఫైనాన్స్ వ్యాపారస్తులు, కంట్రాక్టర్లు ఈ పేటలో ఇప్పుడు నివాసమున్నారు. ఏ మార్పూ లేకుండా, ఇచ్చినది- కట్టుకున్నవి కట్టుకున్నట్టు కష్టపడి మిగుల్చుకొన్న బంగాళాపెంకు ఇళ్ళు నాలుగో మూడో ఉన్నాయి. అవి కూడా నెలజీతం తెచ్చుకొనే వాళ్ళవి. అటూ- ఇటూ కూడా కదలక నిలవ ఉండిపోయాయి వాళ్ళ బతుకులు.
రాజుది నాలుగు గదుల బంగాళా పెంకు ఇల్లు. వీధివైపు అంతా ఒక అరుగు కింద వదిలేశాడు. ఒకపక్క అన్నీ కుట్టుమిషన్లు. పిల్లలిద్దరితోపాటు తాను కూడా కష్టపడుతూ బతుకుబండిని ఈడుస్తున్నాడు రాజు. అరుగు మీద రెండోవేపు శూన్యంలోకి చూస్తూ ఒక్కతీ కూర్చుని ఉంది. నన్ను చూసి లేచి వస్తుందని అనుకొన్నాను. కానీ రాలేదు. దగ్గరకంటా వెళ్ళాక కానీ నన్ను గుర్తు పట్టలేదు.
“చిట్టమ్మా! నువ్వా?'’ అంటూ నా చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకొంది. ఏమ్మాట్లాడాలో తెలియడం లేదు. కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి మావుళ్ళకు. నన్ను చూడగానే ఆవిడ దుఃఖం కట్ట తెంచుకొని ప్రవహిస్తోంది. నా రెండు చేతుల్తోనూ ఆవిడను దగ్గరకు తీసుకొన్నాను. దుఃఖంలో మాగిన మృత్యువాసన నా హృదయానికి తాకుతోంది. నా కళ్ళల్లో నుండి కూడా నీళ్ళు. చాలాసేపటి వరకు ఇద్దరూ అలాగే ఉన్నాం.
“తల్లీ! నీకు గౌరి అంతగా తెలవదు కానీ అమ్మా బంగారం. నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాక మా అరుగు ఖాళీగా అనిపించేది తల్లీ! ఆ సమయంలోనే మాలచ్మిలా వచ్చింది నా తల్లి. చిన్నతనంలోనే ఎంత నిబ్బరంగా ఉండేదో! దానమ్మా, నాన్నా దూరంగా ఉన్నారన్నమాటే తలపెట్టేది కాదు. నా ఎనకమాలే ఉండేది. ఆ ఎళ్ళి దానికి చావని నేను అనుకోలేదు తల్లీ! దాని బావ చాలా అందగాడు. మంచి పనున్నోడు.
సుఖపడుతుందనుకొన్నానమ్మా! ఆ పిలగాడి ఊరు అదే అవడంతో మమ్మల్నీ దాంతోపాటు అదే బలవంతంగా తీసుకుపోనాడమ్మా! వెళ్ళినప్పటి నుండి ఏ రెండేళ్ళు బాగున్నారో! ఆ తరువాతంతా అప్పులు. ఇదిగో గవర్నమెంటోళ్ళు డబ్బు ఇస్తునానరు, అదిగో ఇస్తున్నారు అని అంటానే ఉన్నారు. వచ్చింది- వచ్చింది అన్నారు. కానీ మావరకూ రానేదమ్మా! అయిపోయిందన్నారు. ఊళ్ళో కట్టాల్సిన వడ్డీల మీద వడ్డీలు. దాంతో ఇద్దరూ డీలాపడిపోనారు. రోజురోజుకీ ఆ పిల్లాడి అందమంతా ఏమయిపోనాదో- పీనిగలా అయిపోయినాడు. మళ్ళీ నెలకే ఇద్దరూ లేరు. ఎలా బతకను తల్లీ! ఈ చిన్నిముండనేం చెయ్యను చిట్టెమ్మా! ఏమీ తెలవక ఆడుకొంటున్న ఈ పిల్లను చూస్తే గుండెలదిరిపోతన్నాయమ్మా!'’ అని ఘుెల్లుమంది. నేను ఏమీ మాట్లాడలేదు. ఏం చెప్పి ఆవిడ దుఃఖానికి ఊరట కల్పించాలో నాకు తెలియలేదు. మళ్ళీ తనే మొదలుపెట్టింది.
* * *
ఫ్రాణాల ముందు, బతుకు భయం ముందు రెక్కల కష్‌టంతో బతకడానికి అలవాటుపడ్డ మావుళ్ళమ్మ ఆలోచనలో కూడా నీతి అవినీతి అన్న లక్షణరేఖలు చెరిగిపోవడం నేను చూశాను. నిన్న అక్కడ ఎలాగైనా గౌరి, మొగుడు బతికి ఉంటే బాగుండునని మావుళ్ళమ్మ తలపోస్తోంది. అది ఏ మార్గమయినా కానీ…
ప్రపంచంలో జరిగే అనేకానేకమైన మార్పులు గురించి తనకేం తెలుసు? ఇక్కడ సంభవించిన ఈ మరణాలకి ఎంతోమంది పెద్దల ఆలోచనా విధానాలు కారణమని తెలుసుకొని మాత్రం ఆమె ఏం చెయ్యగలదు. వాళ్ళ ఆలోచనలు ఇంకా అమలులోకి పూర్తిగా రాలేదు. ఇంతలోనే ఎన్నో వైపరీత్యాలు.
అనేకానేకమైన సంస్కరణలు వెల్లువలా దూసుకువచ్చి పడ్డాయి. కాల స్వభావమే మార్పు. దాన్ని అపడం ఎవరి తరమూ కాదేమో! ఆ ప్రవాహాన్ని ఉపయోగించుకొని తలెత్తి చిగిర్చి ఫలవంతమయ్యే మొక్కలు కొన్ని ఉంటాయి. అలా కాలానికి ముందే మేలుకొని కాలస్వభావం చేత వచ్చే మార్పుని తనకు అనుగుణంగా మార్చుకొని జీవన విధానానికి మెరుగు పెట్టుకొనే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. చాలా మొక్కలు వెల్లువకి తలవంచి ఒరిగిపోయేవే ఉంటాయి. అలాటి వాళ్ళు వీళ్ళ. అన్ని రకాలైన మార్పులు వీళ్ళ జీవితాల్ని ఇంకా దిగువస్థాయికి తీసుకువెడుతున్నాయి తప్ప మరే ఉపయోగమూ కనిపించడంలేదు. కాలానుగుణంగా వచ్చే అన్నిటిలోనూ దిగజారుడుతనం మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు దిగులు పడడం మినహా నేనేమి చెయ్యగలను? ఒక్క మానవత్వాన్ని, దాని ధర్మమైన కరుణని విడిచిపెట్టకుండా ఉండడం తప్ప. ఆ కరుణ ఒక్కటే వెల్లువకు కొట్టుకుపోయే వారికి చేయూత నివ్వగలదు.
ఇటుపైన నేను రాజమండ్రి వెళ్ళి చూడవలసిన మనుషుల సంఖ్య రెట్టింపయింది. తరచు వెళ్ళి గౌరి పాప నా ఉనికిని గుర్తించేలా చేయాలన్న నిశ్చయం తప్ప నేను ఇప్పుడు తక్షణం చేయగలిగింది ఏముంది?
చెనెత పని వారి సమస్య , కమ్మరివారి సమస్య , కుమ్మరి వారి సమస్య ఈ విధముగా మనము ప్రతి వొక్కరిని ప్రత్యెకంగ చూదతము తొ సమస్య మరింత జతిలమ అవుతుంది , సునామి లాంతి ప్రమాదాలు సంభవించి నప్పుదు మనము పాత బత్తలు ఇచె బదులు చెనెత వారినుంది తుంద్లు దుప్పత్లు కొని ఇవ్వ వచును గవర్నమెంతు వారు కూద చెనెత వారి నుంది దుస్తులు కొని ఇవ్వ వచును, గవర్నమెంతు లొ వున్న వారికి వ్రుతి పనివారి సమస్య గురించిన ఆలొచన లెకపొవతము దురద్రుషతము , సమస్య వారిది మాత్ర మె కాదు మన అందరిది
మిత్రులారా,
బహుశా, నేను problem space లో లేను కాబట్టి ఇంత easyగా చెప్పగలుగుతున్నానేమో! కానీ, నాకు తెలిసినంతలో ఇది మాత్రం పచ్చి నిజం.
Change is natural and inevitable. ప్రత్యేకించి globalization తర్వాత మనకి ప్రపంచం వెనక పరిగెత్తటం తప్ప వేరే ప్రత్యామ్న్యాయం లేదు. Govt should educate people about the inevitable.
ఇది కేవలం నా అభిప్రాయం. తప్పయితే, క్షమించగలరు.
—శ్రవణ్
మార్పు సహజం అన్న విషయం అందరూ ఒప్పుకుంటారు. కానీ అన్ని మార్పులూ ఒకటికాదు, అన్ని మార్పులూ అందరకీ లేదా అన్ని కులాలకు లేదా దేశాలకు ఒకటికాదు. మార్పు ప్రభావం ఒక్కొక్కరి మీదా ఒక్కో రకంగా వుంతుంది. ఏ మార్పైనా అది మనుషులకి/సమాజానికి మేలు చేసేదిగా వుండాలి, అంతేకాని కొందరికి మేలు కొదరికి కీడు చేసేదిగా వుండకూడదు, ముఖ్యంగా మనిషిని రీ ప్లేస్ చేసేదిగా వుండకూడదు. పైగా మార్పు అనేది కొందరికి లాభసాటిగా అనిపించి కొందరిని తిక్కివేసేదిగా వుండకూడదు ….ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు,,,
అన్నపూర్ణ గారూ,
పచ్చినిజాన్ని ఆవిష్కరించారు. అవునూ…, ఇలా కన్నీళ్ళు తెప్పించే కధలు రాయడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు?