- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రకరకాల ఉద్వేగాలూ, ఆవేశాలూ (ఇమోషన్స్‌) మనుషులలో ఉన్నంతగా మరే ప్రాణికీ ఉండవు. జీవపరిణామంలో తక్కిన ప్రత్యేక లక్షణాలతో బాటుగా ఇది కూడా మనుషులకు అలవడిన ఒక గుణం. ఏదో ఒక దశలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనిషి మనుగడకు ఇది అవసరమై ఉండాలి. వీటిలో శరీరలక్షణాలుగా ఏర్పడినవి కొన్ని అయితే మరికొన్ని పరిసరాలవల్ల మన ప్రవర్తనలో కలిగిన మార్పులు.

భావాలనేవి బాహ్యపరిస్థితుల, ప్రేరణలకు స్పందించి వ్యక్తం చేసే ప్రకటనలూ, తత్ఫలితంగా చేపట్టే చర్యలూ. ఇవి అన్ని సంస్కృతుల్లోనూ, కొంతవరకూ జంతువుల్లోనూ, చిన్నపిల్లల్లోనూ ఉంటాయని డార్విన్‌ గుర్తించాడు. వాటిని జీవపరిణామంలో ఏనాడో మొదలైన లక్షణాలుగా ప్రతిపాదించాడు.

మనకున్న స్పందనల్లో అన్నిటికన్నా సులువుగా అర్థం చేసుకోగలిగినది భయం. ఇది అన్ని ప్రాణుల్లోనూ కనబడుతుంది. భయం అంటే ప్రాణభయమే. ఆపద ఎదురైనప్పుడు చావునూ, ఇతర హానినీ తప్పించుకోవడం ప్రాణి మనుగడకు ముఖ్యం కనక ఇది మెదడులోని “వైరింగ్‌”లో తప్పనిసరిగా ఉంటుంది. భయం లేని ప్రాణులు ఎప్పుడో అప్పుడు పుట్టి, సకాలంలో ప్రమాదానికి స్పందించక చచ్చిపోయి ఉంటాయి. వాటి సంతతి అభివృద్ధి అయే అవకాశం లేకపోవడంతో భయం అనే భావనకు తక్కిన శరీర అవయవాల స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడి ఉంటుంది. భయంవల్ల జాగ్రత్తగా మెలగడం, భద్రమైన మార్గాన్ని అనుసరించడం, వీటన్నిటికీ అవసరమైన ముందాలోచనను పెంచుకోవడం ప్రాణులకు లాభించాయి కనక ఇటువంటి భావన మనుగడకు తోడ్పడింది.

ఇది అర్థం అయినట్టే ఉంటుంది కాని కొన్ని చిక్కులున్నాయి. భయం అనేది దేన్ని చూసినప్పుడు కలగాలి? నిప్పు కాలుతుందనీ, పడగ విప్పిన పాము కాటు వెయ్యబోతోందనీ, పొంచి ఉన్న పులి మీద పడబోతోందనీ, గోతిలో జారిపడితే చావు తప్పదనీ మన జన్యువుల ద్వారా తెలుసుకోలేం కదా? అంటే కొన్ని విషయాలు ప్రాణి నిజజీవితంలో నేర్చుకోవలసిందే. లేదా అప్పటికే అనుభవం పొందిన ఇతర ప్రాణుల నుంచి నేర్చుకోవాలి. ఒక ప్రయోగంలో సంవత్సరం నిండని పసిపాపను కొండచిలువ మీద పడుకోబెడితే ఆ శిశువుకు ఎటువంటి భయమూ కలగలేదు. అలాగే జూలో పుట్టి పెరిగిన కోతిపిల్లలు మొదటిసారిగా పామును చూసినప్పుడు బెదరలేదు. అడవుల్లో పెరిగినవి మాత్రం పెద్దకోతులను చూసి పామంటే భయపడడం నేర్చుకున్నాయి. అటువంటి కోతిపిల్లల భయాన్ని వీడియోలో చూసిన తరవాత జూలోని కోతిపిల్లలు కూడా పామంటే భయపడడం నేర్చుకున్నాయట. ఎలక్ట్రిక్‌ షాక్‌వంటిది తగిలినప్పుడు ఉలిక్కిపడడానికి మెదడుదాకా కూడా పోనవసరం లేదు. “అసంకల్పితంగా” వెన్నుపామే స్పందనను కలిగిస్తుంది. అలాగే పెద్ద చప్పుళ్ళూ, వేడిగా తగిలే నిప్పూ, తీవ్రమైన కాంతీ వగైరాలు. భయపడవలసిన ఇతర సందర్భాలను గుర్తించడం మాత్రం జంతువులకు అనుకరణ ద్వారానే అబ్బుతుంది.

మనుషులకు ప్రత్యేకమైన మెదడు ఉండడం వల్ల తక్కిన జంతువులకు లేని ముందుచూపూ, అపూర్వమైన ఊహాశక్తీ భయపడడానికి దోహదం చేస్తాయి. అందుకు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూడడమో, పసికట్టడమో జరగనవసరం లేదు. భవిష్యత్తులో ఎదురవబోతున్న ప్రమాదాన్ని ఊహించుకుని గజగజలాడే పరిస్థితి ఎవరికయినా ఎదురుకావచ్చు. భయానికీ, దానికి ప్రతిబింబంవంటి సంతోషానికీ అవసరమైన జీవరసాయన పదార్థాలను మన మెదడులో ఉండే అమిగ్డలా, హిపోకేంపస్‌, హైపోథాలమస్‌ అనే మూడు ముఖ్యమైన భాగాలు సందర్భాన్ని బట్టి విడుదల చేస్తాయి. వాటి ఫలితాలు రకరకాలుగా ఉంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, రోమాలు నిక్కబొడుచుకోవడం, రక్తప్రసరణ ఎక్కువ అవటంతో చర్మం ఎర్రబడటం వగైరాలన్నీ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ జీవపరిణామంలో ప్రాణులకు అబ్బిన లక్షణాలు.

వీటితో సంబంధంలేనివి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు నవ్వగలగటం. కొందరు పరిశోధకుల లెక్కన ఇది మనిషి ఆవిర్భావానికి ముందు నుంచీ ఉన్న లక్షణం. ఉత్సాహంగా ఉన్నప్పుడు కుక్కలు ఊపిరి వదిలే పద్ధతిలో తేడా కనిపిస్తుంది. కొన్నిరకాల చింపాంజీ పిల్లలకు చక్కిలిగింతలు పెడితే వాటి ముఖకవళికల్లో మార్పులూ, నోటివెంట ధ్వనులు రావడమూ గమనించారు. వాటికి కూడా చంకలలోనూ, కడుపు మీదా చక్కిలిగిలి ఎక్కువగా ఉంటుందట. అవి చేసే ధ్వనులు దాదాపుగా ఆ పరిస్థితిలో ఉన్న పసిపాపల కేరింతలలాగే మరింత కీచుగా ఉన్నాయట. ఇవి నరవానరాల సముదాయంలో ఉల్లాసంగా ఉండడానికి సంకేతాలుగా రూపొంది ఉంటాయని ఊహిస్తున్నారు. వీటివల్ల గుంపులుగా జీవిస్తున్న ప్రాణుల మధ్య కొంత సమన్వయం ఏర్పడి ఉండవచ్చు. ఈ లక్షణం చూపూ, వినికిడీ లేని పసిపిల్లల్లో కూడా ఉంటుంది కనక దీనికి మూలం జీవపరిణామదశలోనే ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. జీవపరిణామంలోతక్కిన లక్షణాలలాగే నవ్వడం కూడా మనుషుల మధ్య సహకారాన్ని పెంచి, వారి మనుగడకు తోడ్పడి ఉండాలి. చింపాంజీలలో నవ్వువంటిది స్పర్శ ద్వారానే వస్తుంది. ఒకదాన్నొకటి తరుముకుంటూ, కిందా మీదా పడుతున్నప్పుడే అలా జరుగుతుంది. మనకు ఆ చర్య రొప్పుతున్నట్టుగా ఉంటుంది. మనుషులలో నవ్వూ, హాస్యం అనేవి సామాజిక, వ్యక్తిగత బంధాలను బలపరుస్తాయి. నవ్వు ప్రధానంగా ఆటగోలుతనానికి సంబంధించినది కనక పెద్దవాళ్ళ కన్నా పిల్లలు ఎక్కువగా నవ్వుతారు.

కనుగుడ్ల కదలికకు తోడ్పడే నేత్రజలం చాలా ప్రాణులకు ఉంటుంది. కాని ఏడుపు వచ్చినప్పుడు కన్నీరు కార్చేది మనుషులు మాత్రమే. ఆవలించినప్పుడూ, కళ్ళు మండుతున్నప్పుడూ, బాగా నవ్వినప్పుడూ కూడా కన్నీరుబుకుతుంది. నవ్వులాగే ఏడుపు కూడా ముఖంలో కనబడుతుంది. ముఖానికి సంబంధించిన నాడులు ఈ చర్యలను నియంత్రిస్తాయి. మనిషి తన భావాలను ఇతరులకు స్పష్టమైన సంకేతరూపంలో తెలియజెయ్యడానికి నవ్వునూ, ఏడుపునూ ఉపయోగించి ఉంటాడనీ, సామాజిక పరిణామంలో ఇదొక భాగమనీ శాస్త్రవేత్తల అభిప్రాయం. అలాగే పసిపిల్లలు ఏడ్చి, కేకలు పెట్టి తల్లిదండ్రులను తమ ఇబ్బందిని గురించి తెలియజెయ్యడం జీవపరిణామంలో జరిగిన ఒక ఉపయోగకరమైన మార్పులా కనబడుతుంది. ఇవన్నీజన్యువుల స్థాయిలో స్థిరపడిన వ్యత్యాసాలు. మగనెమలి జతకట్టడానికి నాట్యం చేసి ఆకర్షించినట్టే ఈ భావప్రకటన అంతా కొంత అట్టహాసంగా, అతిశయంగా మొదలై ఉంటుంది.

మనుషులకు ప్రత్యేకంగా అనిపించే తీవ్రమైన భావోద్వేగాలూ, ప్రేమ, అనురాగం, అసూయ, ద్వేషం, అవమానం, సిగ్గు, పశ్చాత్తాపం, విపరీతమైన నిరాశతో కుంగిపోవడమూ వగైరాలన్నీ జీవపరిణామంతో బాటుగా కొనసాగిన సామాజిక పరిణామాల ఫలితమే. యదార్థతకూ, దానికి ప్రతీక అయిన ఆలోచనకూ ఒక్కొక్కప్పుడు తేడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందంటే అది మెదడు యొక్క ఊహాశక్తి వల్లనే. చింతనకూ, వితర్కించుకోవడానికీ పనికొచ్చే మానసిక చైతన్యం మనకు ఉంటుంది. దీనికి దోహదపడే మెదడు యొక్కముందు భాగంలో జరిగిన అభివృద్ధితో బాటుగా మనుషులకు వేల ఏళ్ళుగా ఉన్న సమాజజీవిత చరిత్ర కూడా మన ఆలోచనా సరళినీ, భావపరమైన స్పందనలనూ రూపొందించిందనే చెప్పాలి. అంతకు మునుపు జరిగిన కొన్ని సంఘటనలకూ, సందర్భాలకూ మెదడులో కొన్ని లంకెలు ఏర్పడతాయి. వీటిలో కొన్నిటికి మనిషి జీవిస్తున్న సమాజపు సంస్కృతీ, సంస్కారమూ కూడా తోడవుతాయి. మనిషిలో కలిగే భావాల స్పందనను ఇవన్నీ కలిసికట్టుగానో, విడివిడిగానో తీర్చిదిద్దుతాయి. ఇందులో అచ్చగా తర్కానికి లోబడినవీ, ఏ మాత్రమూ లోబడనివీ అని విడదీయలేని పరిస్థితి ఉంటుంది. మనుషులకు ప్రత్యేకంగా అనిపించే అనుభవాలూ, సంతానాన్ని కాపాడుకునే స్వభావమూ, నేర్చుకున్న విషయాలూ, యదార్థతను అనుకరించే వివిధ కృత్రిమ ప్రయత్నాలూ మొదలైనవన్నీ తక్కిన ప్రాణులకు లేని సంక్లిష్ట భావజాలాన్ని ఉత్పన్నం చేస్తాయి. కుతూహలమూ, అద్భుతంగా అనిపించడమూ, గందరగోళమూ, ఆందోళనా, ఆశ్చర్యమూ, నిరాశా, నిస్పృహా, ఆత్మవిశ్వాసమూ,కోపమూ, ఆశలూ ఇవన్నీ వీటిలో భాగాలే. వీటిలో కొన్ని నామమాత్రంగా క్షీరదాల్లో మొదలయి ఉండవచ్చు. ఇవన్నీ వాసనకు సంబంధించిన మెదడు భాగంలో దాదాపు 15 కోట్ల సంవత్సరాల క్రితం కలిగిన పరిణామాల ఫలితమని ఊహిస్తున్నారు. ఊహాకల్పన చెయ్యగలిగిన మెదడు భాగాలకు ప్రేరణ అందడంతో కొన్ని గ్రంధులనుంచి జీవరసాయన పదార్థాలు ఉత్పన్నం అయి, సంతోష భావననో, నిరాశనో కలిగిస్తాయి.

ఎవరివల్లనైనా ఒకసారి మోసపోయినప్పుడు వారిమీద దాడి చేస్తే మళ్ళీ అటువంటిది జరగకుండా ఉంటుంది. కాబట్టి ప్రతీకారంగా కయ్యం తలపెట్టడం లాభిస్తుంది. అలాగే ఉదారస్వభావానికి కృతజ్ఞత చూపడం కూడా. దీర్ఘకాలిక ప్రయోజనాలను గమనించి మెలగడం, గతంలో మన ప్రవర్తనను మరిచిపోకుండా ఉండడం మొదలైనవన్నీ నలుగురితో కలిసి జీవిస్తున్నప్పుడు అలవడే లక్షణాలు. ఇటువంటి భావజాలం మీద స్థానిక సంస్కృతుల ప్రభావం కూడా ఉంటుంది. సహచరుల సాంగత్యాన్ని కోరే ప్రేమా, అనురాగమూ, దాని వెంట అసూయా మొదలైన భావాలు కూడా సమాజపరమైనవే.

మనోభావాల పెరుగుదలవల్ల మనుషులు తమ సంతానాన్నిమరింత జాగ్రత్తగా కాపాడుకోగలిగారు. తమ జాతివారితో స్నేహభావన పెంచుకోగలిగారు. రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు సమస్యలను విశ్లేషించుకోగలిగారు. ఇవన్నీ కొంతవరకు జంతువులు కూడా సాధించగలవు. అలా కాకుండా మనుషుల్లో ఇతరుల భావాలను ఊహించుకోగలగడం అనేది తొలి రోజుల్లో వారి మనుగడకు చాలా ఉపయోగపడింది. కేవలం తర్కాన్ని అనుసరించి పరిస్థితులను ఎదుర్కోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కనక భావోద్వేగాల ఆవిర్భావం క్లిష్ట పరిస్థితులకు వీలున్నంత త్వరగా స్పందించడానికి ఉపయోగపడి ఉండవచ్చు.

5 అభిప్రాయాలు

  1. B.Ajay Prasad 15 మే 2007 , 4:56 am

    రోహిణీప్రసాదుగారూ మీ వ్యాసాల పుస్తకము ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు. విశాలాంధ్ర, నవోదయలలో వెతికాను. కనిపించలేదు. దయచేసి వివరాలు ఇవ్వగలరు.

  2. Rohiniprasad 15 మే 2007 , 10:11 am

    అజయ్ ప్రసాద్ గారూ,

    నా వ్యాసాల తొలి సంకలనం త్వరలోనే విడుదల కావచ్చు. కొన్ని వ్యాసాలను పై వెబ్ సైట్ లో చదవగలరు.

  3. Rohiniprasad 15 మే 2007 , 10:15 am

    http://rohiniprasadkscience.blogspot.com

  4. Rohiniprasad 20 జూన్ 2008 , 2:49 am

    అజయ్ ప్రసాద్ గారికి,

    నా పుస్తకం ఇటీవలే విడుదల అయింది. వివరాలు:

    కొడవటిగంటి రోహిణీప్రసాద్ సైన్సు వ్యాససంపుటి
    జీవశాస్త్రవిజ్ఞానం - సమాజం
    1/8 డెమ్మీ సైజులో 208 పుటలు
    వెల 50 రూపాయలు (3 డాలర్లు) AIRMAIL ఖర్చులతో సహా
    ప్రతులకు, వివరాలకు -
    కొత్తపల్లి రవిబాబు,
    మైత్రీ బుక్ హౌస్,
    జలీల్ స్ట్రీట్, కార్ల్ మార్క్స్ రోడ్,
    విజయవాడ 520 002 ఇండియా
    RAVIBABUJS@YAHOO.CO.IN

  5. Rakesh 30 జూన్ 2008 , 7:17 am

    మీ వ్యాసాలు ఆసక్తిగా చదివేవారిలో నేనొకడిని.
    మీకు నా అభినందనలు!!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)