- వట్టికోట ఆళ్వార్‌స్వామి
(గత సంచిక తరువాయి)
‘పాపం మీనాయనగారు పెద్దమనిషి. ఆయన గతించినప్పటి నుండి అన్నీ చిక్కులేనని విన్నాను'’ రామభూపాల్‌రావు మాట్లాడటానికి పిలిపించిన వెంకటాచారితో పరామర్శగా అన్నాడు.
రామభూపాల్‌రావు ఆవిధంగా శాంతంగా, చనువుగా మాట్లాడటం వెంకటాచారికి ఆశ్చర్యం వేసింది. రామభూపాల్‌రావు ఎల్లప్పుడు అధికార ధ్వనిలో మాట్లాడటం అతనికి తెలిసన సంగతి. రామభూపాల్‌రావు అంటే వెంకటాచారికి భయం కూడాను.
“మీకు తెలియందేముంది?'’ వెంకటాచారి నీళ్ళు మింగుతూ అన్నాడు.
“మీ నాయనగారు పాపం చదువుకున్నవాడే. పూజనీయుడే. కాని చదవుకున్నాననే గర్వం మాత్రం బాగావుండేది. అదే ఆయనకు చెరుపు చేసింది. ఉన్న ఆకాస్త భూమిని పోగొట్టుకొని మీ అందరికి కష్టాలు తెచ్చాడు'’ రఘునాథాచార్యులు గురించి తన అభిప్రాయం ప్రకటించాడు రామభూపాల్‌రావు.
ఏమి సమాధానం ఇవ్వాల్సింది వెంకటాచారికి తోచలేదు. తల నేలకు వేసి రామభూపాల్‌రావు అంటున్న దేమిటో ఆలోచించసాగాడు.
“మీ తమ్ముడు నీకు ఎదురు తిరగబడతాడట నిజమేనా? తమ్ముడిని హద్దుల్లో పెట్టుకోలేకపోయావా?'’ ఓరకంటితో వెంకటాచారిని చూస్తూ రామభూపాల్‌రావు అన్నాడు.
“చిన్నప్పటి నుంచి మా అమ్మ గారాబంతో వాడావిధంగా చెడిపోయిండు'’ వెంకటాచారి సమాధానమిచ్చాడు.
“నిన్ను మీ నాయన పోకిరివాణ్ణి చేసిండని ఊరంతా అనుకుంటుంది. నువ్వు మీ అమ్మను కొడతావటగదు! కన్నతల్లిని కొడతారయ్య ఎన్నడన్నా'’ రామభూపాల్‌రావు కొంచెము అధికార ధ్వనిలో అన్నాడు.
“మా తమ్ముడు చెప్పేడా ఆ సంగతి?'’ అంటూ వెంకటాచారి భయంగా చూచాడు.
” ఎవరు చెప్పితేం, సంగతైతే నిజమేగదా? మీ తమ్ముడు పిలిస్తేనే ముఖం తప్పించుకొని తిరుగుతాడు. మీ నాయనకంటే రెండింతలు గర్వం ఎక్కువుంది మీ తమ్ముడికి. సరేగాని ఒక విషయం అడుగుదామని పిలిపించాను. మీ మేలుకే, ఇందులో నా కొచ్చేదేమీ లేదు.'’ గొంతు సవరించుకున్నాడు రామభూపాల్‌రావు.
“మీరనడం, నేను కాదనటమా? ఎప్పుడైనా అట్లా జరిగిందా?'’ వెంకటాచారి వినయంగా అన్నాడు.
“నేను రేపు తహశీలుకు పోతున్నాను. నీవుకూడా వస్తే మీ భూమిని నీ పేరు మీద చేయించి వేస్తా. ఇంకా నీకు పెండ్లి కావలసివుంది. ఈడు ముదిరిపోతున్నది. కౌలుకో, పొత్తుకో భూమి ఇచ్చావంటే దిగులు లేకుండా జరిగిపోతుంది. మీ అమ్మ పెద్దమనిషై పోయింది. నీకు రెండు ముళ్ళు పడ్డాయంటే కోడలు, సంసారంతో ఆనందంగా బతుకుతుంది. ఇది చెప్పుదామనే పిలిపించాను. రేపు భోంచేసి బయలుదేరుతున్నాను'’ అంటూ రామభూపాల్‌రావు కూర్చిలోంచి లేచి వెళ్ళబోయాడు.
“సరే! మీ దయ. వెళ్ళొస్తాను'’ అంటూ రామభూపాల్‌రావు దండం పెట్టకున్నా వెంకటాచారి దండం స్వీకరించినట్టు చేతులు ఆడించి ఇంటికి వెళ్ళాడు.
వెంకటాచారి ఎంతో గొప్పవాడుగా, ఏదో సాధించినట్టుగా ఒళ్ళు మరచి ఇంటికి చేరాడు. ఆ సంగతి తల్లికి చెప్పుదామనుకున్నాడు మొదట. కాని ” ఏమిటి చెప్పేది? చెపితే ఆమె చేసేదేముంది? చిన్నకొడుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చిన కోపం, దుఃఖంలో నా యోగ్యత, గొప్పతనం ఆమెకేమి అర్థమవుతుంది?'’ అనుకున్నాడు. భోజనం చేస్తున్నపుడు “రేపు దొరవారితో కామారెడ్డికి పోతున్నాను'’ ముఖం వంచుకుని అన్నాడు.
దొరవారితో అప్పుడప్పుడు ఆ విధంగా వెళ్ళడం మామూలే. అందువల్ల ఆమె ఏమీ అనలేదు. “తమ్ముని జాడ ఏమైన తెలిసిందా!'’ మెల్లగా అడిగింది తల్లి.
” ఎక్కడ తెలిసే, అప్పుడు పొయ్యి యిప్పుడు వస్తునేవుంటిని. ఇహ నీకు పనేముంది? అన్నం తిని అదే పని చెయ్యి. గారాబాల కొడుకు లేకపోతే నువ్వు వుండలేవుగా!'’ హేళనగా వెంకటాచారి అన్నాడు.
“నీకు మాత్రం ప్రేమ లేదు? ఏదో ఉద్రేకంలో ఆవిధంగా మాట్లాడుతున్నావు కాని ఒక కడుపున పుట్టినవాండ్లకు ప్రేమలుండకపోతే ఇంకెవరికుంటాయి కొడుకా?'’ గుడ్లలో నీరుతీస్తు గద్గద స్వరంతో తల్లి అన్నది.
” ఇవన్నీ చిన్నప్పటినుంచి వాడికి చెప్పితే వాడింతవరకు రాకనే పోవు. వాడికి చిన్నప్పటి నుంచి మంది సహవాసమేనాయె. తురకపంతులు శిక్షణ, శూద్రుల సహవాసం. పెద్ద బుద్ధులు ఎట్లా వస్తాయి?'’ అంటూ లేచి చేతులు కడిగి వంట ఇంటి నుండి బయటికి వచ్చేశాడు.
తల్లి ఆండాళమ్మ వంటింట్లో అన్ని సదిరిపెట్టి, మైలుపడి తుంగచాప పరుచుకొని పండుకొన్నది. పైటకొంగును ముఖంనిండా కప్పుకొని లోలోపల కుమలసాగింది.
వెంకటాచారి ఏదో గొణుగుకొంటూ తాంబూలం వేసికొన్నాడు. హడావిడిగా యిల్లు వదలి ఊళ్ళోకి వెళ్ళాడు.
మరునాడు భోజనం చేసుకొని రామభూపాల్‌రావుతో వెంకటాచారి కామారెడ్డికి బయలుదేరాడు. కచ్చడంలో రామభూపాల్‌రావు కూర్చున్నాడు. కచ్చడం తొట్లో వెంకటాచారి కూర్చొని బండి తోలుతున్నాడు. కచ్చడం ముందట ఒక మనిషి, వెనుక ఒక మనిషి ఉరుకుతున్నారు. కచ్చడపుటెడ్ల మెడకు కట్టిన మూగల గల్లు గల్లు చప్పుడుతో, దుమ్ము రేపుతూ కచ్చడం వడిగా పోతున్నది.
“కొంచెం మెల్లగా పోనియ్యి'’ రామభూపాల్‌రావు అన్నాడు.
వెంకటాచారి ఎడ్ల తోకలను వదిలాడు. ఎడ్లు ఉరికి ఉరికి వాటంతట అవే మెల్లగా నడవసాగాయి.
“నిన్న నీకు చెప్ప మరచిపోయిన. నీతో ఇంకొక పని ఉంది. అంతా గుట్టుగా వెళ్ళిపోవాలె. నీవు తొందరపడొద్దు. నీవు భయపడాల్సిందేమీ లేదు'’ రామభూపాల్‌రావు సంభాషణ సాగించాడు.
” ఏదో ఆ పని. సెలవివ్వండి'’ అంటూ వెంకటాచారి రామభూపాల్‌రావు వైపు తిరిగి కూర్చున్నాడు.
“కోటయ్య కొడుకు కొమరయ్య తోటబావి ఎరికేగా?'’
“అదే, చెరువు అవతలిది. మామిడి చెట్లు కూడా ఉన్నాయి.'’
” ఆ. అదే. అవును కదు! ఎన్నిసార్లు నీవు మామిడి పిందెలు తెంపుక రాలేదు గడీలోకి. ఆ తోటబావి ఉందే, న్యాయంగా చూస్తే కొమరయ్యది కాదు.'’
“అట్లాగా? తనది కాందే బావికి రాతికట్టం, మామిడి చెట్లు - ఇవన్ని చేయించాడా?'’
” ఎవరూ ఏమీ అనకపోతే తనదేనని మింగేయటానికి అట్లా జరుగుతూంటే, మేము ఇటువంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటామా? అందుకే, ఆ మోటబావి కింది భూమిని నా పేర చేయించుకోవాల్నని అనుకుంటున్నాను.'’
“కొమరయ్య అందుకు ఒప్పుకుంటాడా?'’
” ఆ వెధవను ఎవడు బ్రతిమిలాడుతాడు? ఖానూను ప్రకారం జరుగాలెగాని నీవు కొంచెం తెలివిగా పనిచేశావంటే నేను అనుకున్న పని సులభంగా అయిపోతుంది.'’
” ఇంతకూ ఆ భూమి ఎవరి దంటారు?'’
” అది అసలు అడగాల్సిన ప్రశ్న. మన ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబం కూడా ఉండేది. వాళ్ళది అసలు ఆ భూమి. వాండ్ల అతి గతి ఇప్పుడేమి తెలియడం లేదు. ఆ బ్రాహ్మణుడు చచ్చింతర్వాత అతని భార్య, ఓ చంటి పిల్లవాడు ఊరు వదిలి వెళ్ళిపోయారు. అంతేమరి. పిల్లవాడు చచ్చాడో, బ్రతికాడో ఏమీ తెలియడం లేదు. ఒకవేళ భగవంతుని కృపవల్ల ఆ పిల్లవాడు జీవించి ఉండి ఒకనాడు కాకపోతే ఒకనాడైనా వచ్చి “నా భూమి ఏది?'’ అంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత గ్రామానికి ప్రభువులమైన మాకు ఉంటుంది. కాని ఆ కొమరయ్య కేముంటుంది? పైగా ‘అన్యాయంగా ఒకని భూమి ఇంకొకడు అనుభవిస్తుంటే చూస్తూ ఏం చేస్తున్నారు?’ అని ప్రభుత్వం మమ్ములనే అడుగుతుంది. ఇవన్నీ ఆలోచించి, ఆ భూమిని నాపేర మార్చుకుందామనుకున్నాను. ఎప్పటికైనా ఆబ్రాహ్మణుడు బ్రతికి బాగుపడుతాడు. నాకు ప్రభుత్వంతో మాటరాదు.'’
“అంటే ఆ బ్రాహ్మణుడు వచ్చి అడిగినప్పుడు ఆ భూమి అతనికి ఇచ్చి వేయాల్ననేగా మీ అభిప్రాయం? అవునులేండి, మీకేం భూములు తక్కువ గనకనా, ఇతరుల భూమికి ఆశపడేది?'’
“అవును మరి. ఇప్పుడు నీ భూమి సంగతే చూడరాదూ? ఏదో కారణమనుకో, ఎప్పుడో తీసికున్న భూమిని ఇప్పుడు నీకు తిరిగి ఇస్తున్నానంటున్నానా లేదా? ఇదికూడా అంతే.'’
“అయితే, ఇందులో నన్నేమి చేయమంటారు?'’
” ఏమీలేదు. కచేరీలో ‘వెంకటేశ్వర్లు హాజర్ హై’ అని పిలుస్తారు. అప్పుడు నీవే వెంకటేశ్వర్లునని చెప్పాలె. ఆభూమి నాకు అమ్మివేస్తున్నట్టు, దానికింద మొత్తం పైకం ముట్టినట్టు, మీకు ఇంకా ఎవరు వారసులు లేనట్టు చెప్పాలె.'’
“నా పేరు వెంకటాచారి గదండీ? మరి వాండ్లు ‘వెంకటేశ్వర్లు’ అని ఎందుకంటారు?'’
“అది కాదయ్యా. ఆ బ్రాహ్మణుడు చచ్చినప్పుడు అతనికొక పసి పిల్లవాడున్నాడంటినే అతని పేరు వెంకటేశ్వర్లు. ఆ వెంకటేశ్వర్లు నీవేనని అక్కడ చెప్పాలె. ఈ మాత్రం అర్ధం కాదా? నీవు ఒట్టి మొద్దువని అందరనేది నిజమే.'’ అని రామభూపాల్‌రావు గద్దించాడు.
వెంకటాచారి దేబెముఖం వేశాడు. ఇంకా వివరంగా ఏమేమో అడుగాలని అనుకున్నాడు. కాని రామభూపాల్‌రావు గద్దింపుతో గొంతు నొక్కినట్టయింది. “సరే'’ అని నీళ్ళు మింగాడు.
“బండిని తొందరగా పోనియ్యి'’ రామభూపాల్‌రావు అధికార ధ్వనితో ఆజ్ఞాపించాడు. “అన్నీ అర్థమైనట్టేనా? మళ్ళా అక్కడికి పోయిన తర్వాత ‘దద్దదా’ అంటావా?'’ అని మళ్ళా వెంకటాచారిని కోప పడ్డాడు. కచ్చడంలో వెల్లకిల పడుకొని కాళ్ళు చాపాడు.
వెంకటాచారి ముఖం కందిపోయింది. అంగీకారసూచకంగా తల ఊపాడు. తెల్లముఖం వేసుకొని రామభూపాల్‌రావును చూచాడు.
రామభూపాల్‌రావు తన భావి కార్యక్రమాన్ని ఆలోచించ సాగాడు. కండ్లు మూసి, మీసాలను పైకి దువ్వాడు.
బండిని వడిగా ఉరికించాడు వెంకటాచారి. వెంకటాచారి ఆలోచించాల్సిన అవసరమేమీ లేదనుకున్నాడు. ఆలోచించజాలడు కూడా తండ్రి కాలములో పోయిన భూమిని తిరిగి రామభూపాల్‌రావు యిస్తున్నాడన్న సంతోషం ఒక వైపు, ఏమైనా సందేహాలు అడిగితే రామభూపాల్‌రావు కోపపడ్తాడన్న భయం ఒక వైపు కలిగి ఏమీ మాట్లాడక గంభీరించి ఊరుకున్నాడు.
(తరువాయి వచ్చే సంచికలో)