- నబి కె. ఖాన్

ఆవేశం నిండిన
నా ఆలోచనలోకో
ఆలోచన నిండిన
నా అంతరంగంలోకో
ఒకానొక
ఉల్క రాలుతున్నప్పుడు
నేను చూసిన అనుభవం నుంచి
ఒకానొక
వాల్కనో పేలుతున్నప్పుడు


నేను విన్న అలజడి నుంచి
సమాధానం దొరకని సందిగ్ధం నుంచి
నర్మగర్భమైన నిశ్శబ్దాన్ని
మోసుకొస్తున్నాను
బహుశ…
ఇది నాందీ ప్రస్థానం

రెట్ట వేయడానికి
తెలియని ఓ పిట్ట
మసీదు గుమ్మటం మీద ఎగిరి
ఏ గుడో గోపురానో వాలుతుంది
హరాం హలాల్‌ల గురించి
తెలియకనేమో
హేరాం యా అల్లాహ్‌ల మధ్య
రెక్కలు తెగి రాలిపోయింది
ది హందర్ద్‌పై హత్యా ప్రయత్నం

ఓ మిత్రమా!
ఈ భగ్న సమాజపు
దగ్ధ సంగీతాన్ని మోసుకొచ్చే
ఆ పిట్టకు మనమొకసారి
మనసారా క్షమాపణ చెప్పుకొందాం!

ఆకలి పేగులు అరచే వేళ
అల్లాహ్ అచ్ఛాహో యా నాహో
రాముడి రక్షాహో యా నాహో
అన్నం మెతుకు అరిగి తీరాల్సిందే
ఆకలివేళ
అమ్మ తప్ప
అన్యులూ గుర్తుకు రారు నేస్తం!

మనం అదృశ్య దృశ్యాల్ని చూస్తూ
అస్థిత్వాన్ని అగాధాల పాలు చేసుకోవటానికి
ఒకరినొకరం
వెంటాడుకోటానికి
వేటాడుకోవటానికి
ఒకరు మృగమూ
మరొకరు ఆదిమానవులం కాదుకదా!

ఇదొక ఆరని కాష్టం
పొడుచుకు చచ్చే వాళ్ళ ముందు
పొద్దు పొడిచే దృశ్యం ముందు

ఇదొక తిమిర సమయం
ఇక్కడ వెలుతురు పిట్ట కూయదు
వెలుతురు దృశ్యం పొడవదు

ఈ ద్రోహ కాలంలో
దేహ శకలాలన్నీ సందేహాస్పదాలవుతున్నప్పుడు
మృత్యువొక్కటే మత సామరస్యానికి
ఆఖరు ఆనవాలుగా మిగులుతుంది

రా! మిత్రమా!
మన హృదయాల వైశాల్యాలు పెంచుకొని
ఉదయాల్ని ఆహ్వానిద్దాం
డామిట్
ఇక్కడే ఎక్కడో
కథ అడ్డం తిరుగుతోంది
ఈ హ్యూమన్ బాడీ మైండ్‌సెట్‌లో
ఏదో ప్రాబ్లెం
కన్నీటి చారికల్తో కడిగేసినా
రక్తపు దాహార్తిని తీర్చేసినా
ఈ మనిషి మెదడులో ఏదో మూల
అహం ఆవరించే ఉంది
లేకుంటే
లక్షలాది గాయాలకు బదులు
లక్షణంగా ఉన్నవారికి
సంజాయిషీ చెప్పుకుంటాడు

నేను
గాయాలకు
సౌహార్ద్రాన్ని
ఔషధంగా పూసి
నా ఖురాన్‌లోని ఖిస్సాల్ని
నా భగవద్గీతలోని భావాల్ని
నా బైబిల్ ప్రవచనాల్ని
పవిత్ర సందేశాలుగా వినిపిస్తాను.
శిథిల వనంలో
శిలువ వేయబడ్డ వాళ్ళ గురించో
చిగురించే పూవుల్ని
చిదిమేసిన చీకటి గురించో
కడుపులో బిడ్డను
కసిగా నరికేసిన
కసాయి కాలాల గురించో
నేను కసితీరా కవిత్వమవుతున్నాను
రోడ్లెక్కిన రాతి హృదయాలను
ఖండఖండాలుగా నరికి
ఖబరస్థాన్‌కు తరలించాలనుకొంటాను.

2
సౌహార్ధ్రం సందిగ్ధంలో పడినప్పుడు
స్వేచ్ఛకు మతం రొచ్చు పులిమినప్పుడు
బిందువు బిందువు కలిసి
మహాసింధువైన చోట
పదం పదం కలిసి పాటవుతుంది
కదం కదం కలిసిన జనపథం
గ్దో గల్లీలోనో
అహ్మదాబాద్ నడిరోడ్డులోనో
చార్మినార్ చౌరస్తాలోనో
అంతెందుకు…
మన వీధి మలుపులోని రచ్చబండ కాడ్నో
చెదిరిపోయిన జ్ఞాపకాల్ని
పోగు చేసే ప్రవాహమొకటి
మనముందుకు వస్తుంది
బహుశా…
ఇది సందేశమివ్వడానికో
సాహసయత్నమే కావచ్చు.

యుద్ధం అంటే
తలకాయల్ని తెగ నరికేసుకెళ్ళే
టిక సంస్కృతే కాచ్చు
కనికరం చూపని కసాయితనం
కాలానిదే కావచ్చు

ఏ జమీన్ మీద జన్మించడ్డ వాళ్ళ గురించో
ఏ జాగీర్‌లోనో రాజ్యమేలిన వాళ్ళ గురించో
ఏ గోరీలోనో ఖబర్ కాబడ్డ వాళ్ళ గురించో
యాద్ వచ్చినప్పుడల్లా
మన జీవితాల్ని
మనం బర్‌బాద్ చేసుకొంటున్నాం
అరె భాయ్
మైఁ ఏక్‌బాత్ బోల్తాహుఁ సున్‌లో
ఏ బాత్ కిసీకో నహీ బతావో

రెక్కలు తగలబడ్డ రాజ్యంలో
శాంతి
జంగ్-ఏ-జిహాద్ అవుతుంది
జై శ్రీరామ్ అవుతుంది
ప్రకృతి పరిమళాలకు
కందిన నెత్తుటి కమురువాసనలు
పూయబడ్తాయి

చినుకు రాలనిచోట
కన్నీరు వర్షిస్తుంది
కత్తులు దూసేచోట
నెత్తుటి వానై తడిపేస్తోంది

వర్షించని మేఘాలసాక్షిగా
వర్షించే కన్నీటిసాక్షిగా
త్రిశూలాలకో
తల్వార్‌లకో
తెగిపడ్డ తలకాయల సాక్షిగా
నిశ్శబ్దాన్ని నిందించే శబ్దాలమై
బద్మాష్‌గాళ్ళతో
బద్లా తీర్చుకోవటానికి
మేం
కలాల్ని ఎక్కుపెట్టి
గళాల్ని మోసుకొస్తున్నాం

3
ఒకానొక సంధికాలపు
సందిగ్ధావస్థలో
మేం
సర్వమానవ సమానత్వాన్ని
స్వపిస్తున్న వాళ్ళం
లౌకికవాదపు లోగిలిలో
స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన
యోధుల్ని స్మరించుకొంటున్న వాళ్ళం
పంద్రాగస్టు రాతిరి
ప్రకటించబడ్డ స్వాతంత్య్రంలో
పరమత సహనాన్ని
ప్రదర్శించుకొంటున్న వాళ్ళం
ఛిద్రమౌతున్న రాత్రుల్లో కూడా
చుక్కాని చిగురుల్లోంచి
చుక్కల్ని చూస్తున్నవాళ్ళం
సర్వం పోగొట్టుకున్న
స్వరం పెగలనీయని చోట
మేం
ధిక్కార స్వరాల్ని మోసుకొస్తున్నాం

భ్రమ చుట్టూ పరిభ్రమిస్తున్న వాళ్ళను
చలనం లేని దేవుళ్ళ చుట్టూ మూగి
సంచలనాలు సృష్టించుకొంటున్న వాళ్ళను
ఒకడి సింహాసనం కోసం
వేలాది ప్రాణాలను హరించేవాళ్ళను
మనం నిలదీయాల్సిన
నిజమైన సందర్భమిదే

వాడికి…
దేవుడి మీద భక్తి కన్నా
పదవి మీద ప్రేమే ఎక్కువైనప్పుడు
మన ప్రాణాల్ని మన గుమ్మాలకే వేలాడదీస్తాడు

ప్రశ్నిస్తే పరాయివాడు
తిరబడితే తీవ్రవాది

రాజ్యహింసపై పెగిలిన గొంతుల్ని
రాజ్యధిక్కారమని నులిమేస్తాడు

మనం
సర్వస్వతంత్రులమని భ్రమపడుతున్నప్పుడు
తల్లి కడుపు నిలువునా చీల్చబడుతుంది
చెల్లి శీలం బహిరంగంగా చెరచబడుతుంది
భావప్రకటనా స్వేచ్ఛలేని
భయంకర స్వాతంత్య్రాన్ని అనుభవించే చోట
మన చూరులో దీపపు వెలుగు కోసం
ఆ అల్లాహ్ ముందు మోకరిల్లటం కన్నా
అధముడి ముందు అంగలార్చటమే
ఇక్కడ నిజమైన లౌకికత్వమట

వాడొక ఉన్మాది కదా!
ఉషస్సును ప్రేమించలేడు
వాడెప్పుడు మనమధ్య
అగాధాలు సృష్టిస్తూ
అస్థిత్వాన్ని ఛిద్రం చేస్తుంటాడు
అదృశ్య దృశ్యాల్ని చూపిస్తూ
మనల్ని హింస వైపుకు
హిప్నటైజ్ చేస్తుంటాడు

కాసేపు…
మనం కనిపించే దృశ్యాల్ని
చూడ్డం మానేద్దాం
కనిపించకుండా వాడు
కూల్చేసి వెళ్ళిందెటో వెతుక్కుందాం
చెదలు పట్టిన గతంలోంచి తడుముకుంటూ
ధారలు కట్టిన కన్నీళ్ళను తుడుచుకుంటూ
మనం హందర్ద్ ఆలింగనం చేసుకుంటే

ప్రతి వేకువ కోసం
ఓ వెలుతురు పిట్ట కూస్తుంది

మనం మనస్సు పెట్టి చూస్తే
ప్రతి వేకువఝామున
ఓ వెలుతురు దృశ్యం ఉంటుంది

మనం ఆస్వాదించగలిగితే
ప్రతి వేకువజామున
వెలుగుపూల పరిమళాలు
మనల్ని ప్రేమవైపుకు ఆహ్వానిస్తాయి.

ఒక్క అభిప్రాయం

  1. John Hyde 17 మే 2007 , 12:12 am

    నభి కె. ఖాన్ కు
    అభినందనలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)