
ఉక్కు కార్మికులు: చిత్రకారుడు - ఇవాన్ బెవ్ జంకో.
ప్రతిజ్ఞ
పొలాల నన్నీ, హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ –
జగానికంతా సౌఖ్యం నిండగ –
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
నరాల బిగువూ
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని -
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే,
యంత్ర భూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్ !
నిరపరాధులై దురదృష్టంచే
చెరసాలలలో చిక్కేవాళ్ళూ –
లోహ రాక్షసుల పదఘట్టనచే
కొనప్రాణంతో కనలేవాళ్ళూ –
కష్టం చాలక కడుపుమంటచే
తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ –
శ్రమ నిష్పలమై, జని నిష్టురమై,
నూతిని గోతిని వెదికేవాళ్ళూ –
అనేకులింకా అభాగ్యులంతా,
అనాథులంతా, అశాంతులంతా
దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో
విప్లవశంఖం వినిపిస్తారోయ్ !
కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చేఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ,దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ,
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా -
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ -
వ్యథార్త జీవిత యథార్ధ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు –
నా వినుతించే
నా విరుతించే
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ్యం !
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
- శ్రీ శ్రీ తేదీ: 7 - 5 – 1937