రింగా రింగా రోజెస్‌ల
వినూత్న ప్రపంచావిష్కరణ జరిగిపోయాక
జేబుల్నిండా రంగు కాగితాల రంగవల్లులు నిండిపోయాక
ఇళ్ళలో కొత్తగా హైబిడ్ తులసిమొక్కలు అంటు కట్టుకున్నాక
తెగిపడిన తాతల నాలుక సాక్షిగా
కార్పొరేట్ కాలేజీలో
పిల్లలకు సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజిగా పెట్టి గర్విస్తున్నాక
విదేశీ ఇజాలకు భుజాలు అప్పగించిన బోయీలై
పెరటిచెట్ల వైద్యాన్ని
కార్పొరేట్ జార్ల పేటెంట్లకు తాకట్టు పెట్టేశాక
మొద్దుబారిన సిలుం కొడవళ్ళతో
ములకులిరిగిన దిగుమతి పెన్నుల్తో
నూత్న ప్రపంచావిష్కరణ కోసం
కోవర్టుల కొత్త వేషం వేసుకున్నాక
నువ్వు లాక్కొచ్చిన బండి రెండు చక్రాలూ
పట్టాలు తీసేసి- ఇరుసులు విరిచేసి
ఎప్పటికీ కలిసి నడవలేని వేరుకుంపట్ల నిప్పుకు
తలా కొంచెం నూనె గానుగాడించి పోసేశాక
-సారీ బాస్! వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేదు!
వాడల్లో జనం వూర్లోకి జరుగుతున్న కొద్దీ
కులషితమైపోతున్న ఊళ్ళన్నీ
గిరిగీసుకున్న గేటెడ్ కమ్యూనిటీలుగా
డూప్లెక్స్ కలోనియల్ కౌంటీలుగా
తలా కాళ్ళూ చేతులూ సంస్కృతి చిప్పలోకి
సప్పున లాగేసుకుంటాయి
నోకియా గాలిపడవల మీద
లోకమంతా తిరిగొస్తున్న సూర్యుడు
కాలము-దూరము-వేగము సూత్రాన్ని
తీగల్లేని తంబురా మీద
కొత్త రింగ్‌టోనై ఆలపిస్తుంటే
- సారీ బాస్! దేబిరింపులూ, జాలికబుర్లూ వినే తీరిక లేదు!
గోడవతల గొడవల గురించీ
చిలుంపట్టిన సంకెళ్ళ గురించీ
అరిగిపోయిన ఆరెల గురించీ- గుర్తు రాదు
మాంశారం జంతులక్షణమనీ
పచ్చికాయలూ- ఆకులూ- అలములే మంచివనీ
మంతెన వంతెనెక్కి ఊళేసే నక్కల జాబితాలో
కొత్తగా పేరు నమోదు చేసుకున్నాక
వాడ గుడిసెల మీద ‘కొక్కొరోకో’లకు కొత్త అర్థాలు పుట్టుకొస్తాయి.
సారీ బాస్! నువ్వేం చేయలేకపోయినావన్నదే ప్రశ్న…
మేం ఏం చేశామో మాత్రం ఎవ్వరూ అడగడానికి వీల్లేదు.
ఏ చెట్టు కర్రల్ని
ఏ రంగు జెండాలకు తొడిగామో
ఏ చేను పంటల్ని
ఏ సంచులకెత్తి పంపామో
ఏ ఇంటి ఉప్పు తిని
ఏ వంతపాట పాడామో
ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు
బానిస సంకెళ్ళ కాలంలోంచి
బయటపడని వాడల గురించి దిగులు లేదు
ఓటమిలో కూరుకుపోయిన
పూట గడవని బతుకుల గురించి బెంగ లేదు
సారీ బాస్! ఇవాళ మేం
పాష్ కాలనీలో
పాలిష్డ్ జీవితంలో
పేరు మార్చుకున్న పేతురులం
సంగదాసు వారసులం
శాంతి కాముకులం
ఓటమి ఎరుగని విజేతలం
… కాకుంటే- ఊళ్ళో కాదు.
ఖాజా గారికి అభినందనలు.
కవిత చాలా బాగుంది.
విమర్శనాత్మకంగా, చక్కని భావావేశంతో ఆద్యాంతం సాగింది.
కనీసం ఈ కవిత ఎవరి తాకాలో వారికి తాకుతుందని ఆశిస్తున్నాను.
ఏసుపాదం కవితలా కాకుండ మనసులోని ఆగ్రహానికి సరైన రూపమిచ్చారు.
బ్యాలెన్స్ చేయడంలో అవసరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు
ఇక ముందు కూడ ఈ పరంపర కొనసాగిస్తారని మా నమ్మకం.
పసునూరి రవీందర్
పి హెచ్.డి స్కాలర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి
హైదరాబాద్.
ఇది గొప్ప కవిత. క్రిష్ణ సారధ్యం చెయ్యమంటె శల్యసారధ్యం చేసిన యేసుపాదం కంటే దళితోద్యమం గురించి చక్కగా వ్రాసిన ఖాజాగారు అభినందనీయులు.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
భావాన్ని ప్రదర్సించిన విదానము చాల బాగుంది
కవిత చాలా బాగుంది.
ఖాజా గారి కవిత చాలా బాగుంది. దళితీకరణ గురించి ఉద్యమాలు గొంతుచించుకుంటుటే,చదువుకున్న కొందరు బ్రాహ్మణీకరణకు బానిసలుగా మారి పోతున్న వైనాన్ని కవి సరిగ్గా పట్టుకున్నాడు, ఒకరకంగా ఈ కవిత ఏసుపాదం కవితకు సమాధానం అనిపిస్తుంది కూడా.
కె. ఫణి కుమార్
కవిత బాగుంది అని చెప్పడం సులువుకాదేమో?
చాలా చర్చకు పెట్టిన అంశాలు చాలా వున్నాయి.
ఎటు వైపు అనే ప్రశ్న అన్ని విషయాలలొనూ కనిపిస్తుంది.
చర్చ అవసరం ఎంతైనా వుంది.
కవిత బాగుంది. నిజమైన దళిత సమస్య మీద చర్చ ఏ దిశలో సాగాలో ఈ కవిత ఒక వుదాహరన. జాన్ హైడ్ కు “ఎటు వైపు అనే ప్రశ్న ” తలెత్తడంలో అతను ఏవైపున్నాననుకుంటున్నాడో స్పష్టత లోపించినట్లుంది. తను ఎటుఐపో తేల్చుకుంటే కవిత సులువుగా అర్థమవుతుంది. చర్చించేటంత అస్పష్టత ఖాజాగారి కవితలో నాకు ఎక్కడా కనిపించలేదు
శ్రీధర్ నలిమెల
ఎటువైపు అన్నది నావ్యక్తి గతం కాదు.
ఖాజాను వ్యక్తిగా పక్కకు పెట్టి కవిత చదవండి.
ప్రతి పాదంలోని అంశాలను చూడండి.
మీరు చెప్పినట్లే ప్రతి పాదం చదివాను. కాని నాకు ఒక్కాలాగే అర్థమవుతుంది. మీరు చెప్పిన రెండో వైపు గురించి మీరే విశ్లేసిస్తే బాగుంటుందేమో!ఖాజా కవిత ఎటువైపు మొగ్గు చూపిందో మాకూ అర్థ మవుతుంది.
శ్రీధర్ నలిమెల
“విదేశీ ఇజాలకు భుజాలు అప్పగించిన బోయీలై”
ప్రపంచంలో మంచి ఎక్కడున్నా నేర్చుకోవటంలో తప్పులేదు. గుడ్డిగా అనుకరించటం కాకుండా, ఆ భావజాలంలో మంచిచెడులను అంచనావేసి దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చుదిద్దుకోవాలి. అమెరికా లోని బ్లాక్ పాంథర్స్ స్ఫూర్తితో దళిత పాంథర్స్ ఉద్యమం వచ్చింది. మార్క్సిజం-లెనినిజం తో వచ్చిన రష్యా విప్లవం , మావోయిజం ద్వారా సాకారమైన చైనా విప్లవం స్ఫూర్తితో భారతదేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. భారతదేశ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా యీ భావజాలాలలో ఎన్నో మౌళికమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మనం ఒక విసృత దృక్పధం తో ఆలోచించాలి. సంకుచిత ధోరణిని వదిలిపెట్టాలి.
“మొద్దుబారిన సిలుం కొడవళ్ళతో”
రాజకీయ వైరుధ్యాలుండవచ్చు, నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చు. వెటకారంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఒక భావజాలాన్ని అదే పనిగా వెటకారం చేయటం, వెక్కిరించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
మనం ఒక విసృత దృక్పధం తో ఆలోచించాలి(!)
సంకుచిత ధోరణిని వదిలిపెట్టాలి(!)
వెటకారంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఒక భావజాలాన్ని అదే పనిగా వెటకారం చేయటం, వెక్కిరించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి(!)
ఈ ప్రష్నలన్నీ అంబేద్కరిజాన్ని విమర్షించే వారికి వర్తించవా మహేష్?
నందిగ్రామాల సమూల నాశనం తర్వాత కూడా నీకు కొడవళ్ల పట్ల విమర్శాతీత భక్తి వుంటే నేరం ఖాజాదా చెప్పు?
వెటకారం, వెక్కిరింత, దాడులు, కుత్రలు, కుయుక్తులు ఎవరిసొత్తో నీకు మాత్రమ తెలియదా…
విమర్శకి, వెటకారానికి మధ్య చాలా తేడావుంది. అంబేద్కరిజాన్ని వెటకారం చేయటం సమంజసం కాదు, అలాగే మార్క్సిజాన్ని వెటకారం చేయటం సమంజసం కాదు. ప్రజాస్వామికంగా విమర్శ చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. హేతుబద్ధమైన వాదన చర్చస్థాయిని పెంచి, అవగాహనని కలిగిస్తాయి.
మార్క్సిజం ముసుగుతొడుకొని, అధికారం కోసం అర్రులుచాస్తున్న రివిజనిస్టు పార్టీయే సి.పి.ఎం. నందిగ్రామ్ లో ఆ పార్టీ చేసిన హత్యాకాండను ముమ్మాటికీ ఖండించాలి. అంతేకాదు సి.పి.ఎం సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నందిగ్రామ్ లో మార్క్సిస్టు -లెనిస్టు పార్టీలు సి.పి.ఎం దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ నేపధ్యంలో తప్పు ఎవరిది. సి.పి.ఎం పార్టీదా? లేదంటే మార్క్సిజం భావజాలందా? లేదంటే యం.ఎల్ (ML) భావజాలందా? ముమ్మాటికి సి.పి.ఎం పార్టీదే ఆ నేరం. మావోయిస్టు పార్టీలో దళితులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దళిత - విప్లవశక్తుల ఐక్యతతో, విప్లవ ఉద్యమాలతోనే సామాజిక అణచివేత, ఆర్ధిక దోపిడిని అంతం చేయగలుగుతాం.
బ్రాహ్మణీకరణ - The much-maligned innocuous term.
బ్రాహ్మణులు ఊరికే బ్రాహ్మణులు కాలేదు. బ్రాహ్మణేతరులు అనుభవించిన అనుభవిస్తున్న దశలన్నీ దాటుకుని వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులుగా కనిపిస్తున్నారు. ఆ దశలు దాటుకున్న తరువాత ప్రతివాడూ బ్రాహ్మణుడే అవుతాడు. ఇదో అనివార్య సామాజిక పరిణామం. చదువుకున్న ప్రతివాడూ రిషభాన్ని వృషభంగా పలికితే సహించలేని శంకర శాస్త్రిగా మారిపోతాడు. మాటలో మనసులో ఆహారంలో ఆహార్యంలో చేతల్లో చేతనలో…
the poem answers the question what after postmodernism is and also the criticism that telugu poetry is not aptly responding to globalisation. the poem is certainly having lucidity of expression and clarity of purpose and certanly no confusion. mr. khaja, keep writing on this sense of alienation. mr.balasubrahmanyam, do not try to infuse your coarse, immature theories of evolution of brahminism, which is definitely malignant practice.