- కుంబం అశోక్
ప్రపంచీకరణంటే
సాంకేతిక విప్లవంతో ఉత్తర, ధక్షిణ ధృవాలను కలిపేసి
ప్రపంచాన్ని సమతలం చేసి
భూమికి ఆకాశానికి రోదసి వంతెన వేసి
దూరాన్ని, కాలాన్ని ఖతం చేసి
ప్రపంచం ఒక కుగ్రామమని మాటల గారడీ చేస్తూ
మార్కెట్ మంత్రజాలంతో మానవ మస్తిష్కాలను మభ్యపెట్టి
మనిషిని మనిషి నుండి, మనిషిని సమూహం నుండి వేరుచేసి
మానవ సంబంధాలకు ‘సామాజిక పెట్టుబడి’ అని ముద్దుపేరు పెట్టి
అభివృద్ధి అంటే అన్నింటినీ అంగట్లో అమ్మడం, కొనడమేనని సూత్రీకరిస్తూ
ఆర్థిక వాదాలకు, అస్థిత్వాలకు ఆజ్యం పోస్తూ
చారిత్రిక భౌతికవాద మూలసూత్రాలను వక్రీకరిస్తూ
నాగరిక సమాజ పురోగతిని ప్రశ్నార్థకం చేసిందే
ప్రపంచీకరణ
ప్రపంచీకరణంటే
రాజ్యాలను తోలుబొమ్మలు చేసి
పాలకులను పాలేర్లను చేసి
జాతీయ భూర్జువాలను దళారులను చేసి
బ్యూరోక్రాట్లను బంట్రోతులను చేసి
జాతీయవాదాన్ని, దేశభక్తిని పాతర వేసి
సరుకీకరణే సమాజచలనసూత్రంగా సిద్ధాంతీకరిస్తూ
ప్రకృతిని సహితం వ్యక్తిఆస్థిగా మారుస్తూ వేపచెట్టుపై
తల్లి పాలపై పేటెంట్ ప్రకటిస్తూ పుట్టుకకు
చావుకు మధ్య మార్కెట్ ను వారధిచేసేదీ ప్రపంచీకరణ
ప్రపంచీకరణంటే
తల్లే తన బిడ్డలను అమ్ముకోవడం
నేతన్నలే వాళ్ళ ఉరితాళ్ళు పేనుకోవడం
పురుగులమందే రైతన్నలకు పెరుగన్నం కావడం
ఒక్క మాటలో చెప్పాలంటే …
మనిషి మనిషిమీద యుద్ధం ప్రకటించుకుంటూ
హత్యో, ఆత్మహత్యో మార్గంగా వెతుక్కుంటున
ఒక దుర్మార్గపు సామాజిక స్థితే
ప్రపంచీకరణ.
చాలా బాగున్నది. మీరు రెగ్యులర్ గా రాస్తుండండి.
నేటి ప్రథాన సమస్య ఐన ప్రపంచీకరణ పై అందరికీ అర్ధమయ్యె కవిత వ్రాసినందుకు క్రుతఘ్నతలు మరియు అభినంధనలు.