- వరవరరావు


అదృష్టవంతులు మీరు
పెట్టి పుట్టారు
మీ భాషలో చెప్పాలంటే
నోట్లో వెండియు బంగారు చెమ్చాతో పుట్టారు

మీ ఆందోళన సృజనాత్మకంగా ఉంటుంది
మా ఆవేదన హింసాత్మకంగా కనిపిస్తుంది


మీరు ప్రతిభాశాలురు
కార్పోరేటు టీవీల్లో
కలర్‌ఫుల్‌గా లాఠీదెబ్బలు తినగలరు
దినపత్రికల మొహాలమీద సూర్యకిరణల్లా
అచ్చయ్యేంత అందంగా
బస్సుల అద్దాలు పగులగొట్టగలరు
ప్రశంసాపూర్వకంగా ముక్కున వేలేసుకొని
చెక్కిలి రైఫిల్‌పై ఆనించి పోలీసులు చూస్తుండగా
టైర్లలో గాలి తియ్యగలరు
రోకళ్లు ఎక్కించే పోలీసుస్టేషన్‌కు వెళ్లి
రాఖీలు కట్టగలరు
పైసలు లేకకాదు గదా మీరు బస్సుల్లో టికెట్లు కొనంది
అది ప్రయోగాత్మక నిరసన

ఈ అందమైన రోడ్లన్నీ రాస్తా రొకాయించినా మీవే
సేవ్ మెరిట్ స్టిక్కర్ల వాహనాలు ప్రవహించినా మీవే
వట్టికాళ్ల డాంబర్ మొహాల చెమట కంపు
రోడ్డురోలర్లం మేం నిర్మిస్తే మాత్రం
ప్లాన్ వేసిన ప్రతిభ మీది
కాంట్రాక్ట్ క్రెడిట్ మీది

మీది ఎంత అందమైన ఆందోళన
మీ ఆడపిల్లలూ తోడయిన మొగపిల్లలూ
అపురూపమైన అల్లరి చేస్తూంటే
తల్లిదండ్రులకూ పెద్దలకూ అన్నలకూ ముద్దే
ప్రదర్శించే మీడియాకు ఒళ్లంతా పులకింతలు
ప్రతిభ సమాధి అయి భవిష్యత్తు అంధకారమైందని
ప్రొటెస్ట్‌గా - చెట్టాపట్టాలేసుకొని యువతీయువకులు
పిక్నిక్‌కి పోవడం
యారో ఎంత హిరాయిక్‌గా ఉందని!
మెరిట్ పందెంలో మరాథన్ రన్నర్‌లు మీరు
తాంబేలుగాళ్లం
మీతో పోటీపడగలమా?

మీరు చాయమ్మినా పల్లీలమ్మినా బూట్‌పాలిష్ చేసినా
చందా ‘మామా’ అంటూ
మారుతీ కారుకో, ప్రియా స్కూటర్‌కో
వయారంగా అడ్డంపడినా
దొడ్డబుద్దుల మీడియా గనుక
వాటి కెమెరాల గుండెలు క్లిక్కుమన్నాయి
స్వరాల్లో కలాల్లో యవ్వన ప్రతిభ కళాత్మకంగా కలవరించి
పరవశించంది
అవును మీరు సమానత్వం కోసం నడుంకట్టిన యువతరం కదా
దేబె మొహాలం
రోజూ చచ్చిన గొడ్డు కౌజు కంపులో కూలబడి
చెప్పులు కుడతాం
మా నెత్తురుతో రంగు పూస్తాం
కుంకుతున్న సూర్యునివంటి
మా కళ్ళలోని కాంతితో పాలిష్ చేస్తాం
అయినా బూట్లు వేసుకున్న వాడు బూటుపాలిష్ చేయడంలో
ఉన్న సృజనాత్మకత వేరు

మీ మనుషుల మలమూత్రాలు
ఎత్తిపోస్తాం నెత్తిమీద బకెట్లతో ఎత్తుకపోతాం
మీ టాయిలెట్ మొదలు డ్రాయింగ్ రూం వరకు
మీ శరీరాలు అరగదీసి కడుగుతాం

ఊడుస్తాం తుడుస్తాం
మా చేతులు చీపుర్లవుతాయి
మా చెమట నీళ్ళవుతుంది
మా నెత్తురు ఫినాయిలవుతుంది
మా ఎముకలు వాషింగ్ పౌడర్లవుతాయి
కానీ ఇదంతా వొట్టి బండచాకిరే
ఇందులో ప్రతిభ ఏముంది నైపుణ్యమేముంది

మీ టక్ చేసుకున్నవాళ్ళు మినీస్కర్ట్సు వేసుకున్నవాళ్ళు
జీన్సూ హైహీల్సూ సిమెంట్ రోడ్డుపై చిరుహాసంతో చిమ్మితే
అది ఆకాశవాణి సందేశమై
ఠీవీ దృశ్యమై మైమరపిస్తుంది
మేం రిక్షావాళ్ళం హమాలీలం తోపుడుబళ్ళవాళ్ళం
చిల్లర దుకాణాల వాళ్ళం గుమాస్తాలం
అస్పృశ్యులం ఆదివాసీలం ఒబిసిలం
ముస్లిం మైనార్టీలం
బిడ్డ పాలనకోసం ఆకలితో కొరికినా
నెత్తురు రాని తల్లులు
ఆస్పత్రి క్యూలలో నిలబడి
కూటికోసం నెత్తురమ్ముకుంటాం

ఆకలీ దరిద్రం చెమట వాసనే తప్ప దానికి
మీ ప్రతిభశాలుర రక్తదానం లోని దేశభక్తి పరిమళమెలా
అబ్బుతుంది

మీరేం చేసినా
ఊడ్చినా బూట్ పాలిష్ చేసినా
రైల్వే స్టేషన్ లలో బస్టాండులలో సామాన్లు మోసినా
తోపుడుబళ్ళలో పళ్లమ్మినా
ఫుట్ పాత్ లపై చాయమ్మినా
షేవ్ మెరిట్ నుంచి సేవ్ మెరిట్ అని
ప్లే కార్డులు పట్టుకొని
క్రికెట్ లోనూ రిజర్వేషన్లుండాలని వెక్కింరించినా
కాన్వెంటు ప్రొనన్సియేషన్ స్లోగన్ల
ప్రొసిషన్లు తీసినా
మా సహస్రవృత్తుల శ్రమైక జీవనం
మీ ప్రతిభకు సాటిరాదని చెప్పడానికేనని మాకు తెలుసు

షిఫాన్ చీరల మీదా పంజాబీ దుస్తుల మీదా
తెల్లకోట్లు వేసుకొని నోటికి నల్లరిబ్బన్లు చుట్టుకొని
స్టెత్ వేళ్లాడే గుండెలమీద
సేవ్ మెరిట్ స్టిక్కర్లు తగిలించుకొని
ఎయిమ్స్ లాన్స్ లో మెరుస్తున్న
సగం కన్నా ఎక్కువే ఉన్న మీ స్వర్గాన్ని చూస్తుంటే
మీలోని క్రీమీలేయర్ దాటినోళ్ళకూ
రిజర్వేషన్ల జీవో
తొలగిన స్వర్గం తొణికిన స్వప్నం మాత్రమే కాదు
విరిగిన ఇంద్రధనస్సు కూడా

మావోడు చెప్పిన మాయమాటలు నమ్మాము గానీ
మాకు మిగిలింది శూన్యాకాశం కనుకనే
మా ఆడోళ్ళెప్పూడూ అందుకోసం నేలవిడిచి ఎగబడలేదు

మీది
భూతలస్వర్గంలో ఊహేహల ఉద్యమం
అందుకే అమృతం హక్కు కోసం
దేవతలే ఎక్కువగా తెగించారు
మీ పంక్తిన కూర్చుంటే మాత్రం
రాహుకేతుగాళ్ళం మాకేం దక్కుతుంది

మాది మరణాంతక జీవన సమరం గానీ
మీ ఉద్యమం నిజంగా గొప్పింటి పెళ్ళిలాగే ఉంది
మీరలిగితే పెళ్ళి అలకలాగుంది
మీరు ఫర్నిచరో పాలకేంద్రమో తగులబెడితే
బాణాసంచా కాల్చినట్టున్నది
మీరు ‘బంద్ ‘ చేస్తే
దొరఇంట్లో పెళ్ళి ఊరికంతా పెళ్ళిలాగున్నది

మీఅహింసా సత్యాగ్రహాలు
ఎరవాడ జైలులో అంబేద్కర్ మీద అలిగిన
గాంధీగారి మహత్మ్యాన్ని మరిపిస్తున్నవి

మీరదృష్టవంతులు
మీ ప్రతిభశవం నగర రాజవీధుల గుండా ఊరేగి
సంస్కృత మంత్రోచ్చాటనలతో
చౌరస్తాలో దహనసంస్కారాలు జరుపుకుంటుంది
ప్రతిభకు చావులేదు గనుక
వీరు సృజనాత్మకంగా శవయాత్ర నిర్వహిస్తారు
దు:ఖాన్ని అభినయిస్తారు

మాకు
చావడానికైనా చంపబడడానికైనా
ప్రతిభ ఉండిచస్తే కదా
కష్టం చేసో నేరం చేసో
ఆకలితోనో రోగంతోనో ( ఆకలి రోగమంటే ప్రతిభాశాలురు ఒప్పుకోరు )

నిరుద్యోగంలోనో ఉద్యమంలోనో
లాకప్ లోనో ఎన్ కౌంటర్ లోనో
( అసమానతే హింసలంటే ప్రతిభాశాలురు ఒప్పుకోరు )
చచ్చిపోతాం
ఏ రోడ్డువారనో ఏ చీకటి గొయ్యిలోనో
ఏ పెంటకుప్పమీదనో ఏమారుమూల అడవిలోనో
విసిరివేయబడుతాం
దాఖలా మిగలకుండా బూడిదవుతాం
కొండకచో బొందలో నుంచి అదృశ్యమవుతాం

అయినా మా చావుపుట్టుకలు
జనాభా లెక్కలకు తప్ప
జాతి పురోగతికేం పనికొస్తాయి
దరిద్రంబాధకి తట్టుకోలేక పుట్టేవాళ్ళం
దరద్రం బాధకి తట్టుకోలేక గిట్టేవాళ్ళం

ధర్మానికి గ్లాని జరిగినప్పుడు అవతారమెత్తి
పనిముగియగానే చాలించే
సూత్రధారులు మీరు
అదృష్టవంతులు ప్రతిభాశాలురుమీరు

( ‘అంతస్సూత్రం’ కవితా సంపుటం, ప్రచురణకాలం 2006 జూన్ )

ఒక్క అభిప్రాయం

  1. mahesh 19 ఏప్రిల్ 2007 , 3:25 pm

    విద్యకి ప్రాతిపదిక ఏమిటి? ప్రతిభ లేదంటే డబ్బా?

    హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో అడ్మషన్లు ఎలా వస్తాయి? లేదంటే సెయింట్ పాట్రిక్స్ , సెయింట్ ఏన్స్ లలో సీట్లు ఎలా వస్తాయి. హార్డ్వర్డు,యేల్ లాంటి ప్రవేట్ యూనివర్సిటీలలో ఎలా చదువుతున్నారు. దీనికంతటికీ డబ్బు యే ప్రాతిపదిక. కాకపోతే అప్పుడప్పుడు “ప్రతిభ” అని భజన చేస్తుంటారు. పేరుకి కొన్ని సీట్లు ప్రతిభపైన ఇస్తారు. అసలు డబ్బుగల ధనిక వర్గాలు, అగ్రవర్ణాలకు ప్రభుత్వం విద్యపైన ఎందుకు సబ్సిడీ ఇవ్వాలి. అంతగా కావలంటే వాళ్ళు ప్రవేటు కాలేజీలలో ఎప్పటిలాగ చదువుకోవచ్చు. సామాజిక దోపిడి గురైన వర్గాలకు (అంటే ఆర్ధిక స్థోమత్తలేని అన్నీ కులాలకు),దళితులకు,వెనకబడిన కులాలకు మాత్రమే ప్రభుత్వ మెడికల్ , ఇంజనీరింగ్. ఐఐటి లలో అవకాశాలు కల్పించాలి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)