కవితా వార్షిక-2006 ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి

‘సృజనలోకం వరంగల్’ ప్రచురణగా అంతర్జాతీయ ప్రమాణాలతో గత మూడు సంవత్సరాల నుండి వెలువడుతూ తెలుగు వచన కవితను ప్రపంచవ్యాప్తం చేస్తున్న నేపథ్యంలో, కవితా వార్షిక-2006ను ప్రముఖ విప్లవకవి డాక్టర్ పెండ్యాల వరవరరావు 18 మార్చి 2007, ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు.

కవితాభిమానులు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కవితా వార్షిక’ ప్రధాన సంపాదకులు రామా చంద్రమౌళితో ఈ ఇంటర్వ్యూను ప్రచురిస్తున్నాం.

ramachandramouli.jpg

* అకవితా వార్షిక కోసం కవితలను ఎంపిక చేస్తున్నప్పుడు ప్రధానంగా మీ సంపాదకవర్గం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది?
ఆ నిర్దేశిత సంవత్సరాకాలంలో వివిధ మాధ్యమాల ద్వారా వెలువడ్డ తెలుగు వచన కవితలను సాధ్యమైనజంత విస్తృతంగా సేకరించి మౌలికంగా కవితాత్మక వ్యక్తీకరణలో వినూత్న వస్తువును ఆలంబనగా చేసుకుని హృదయాన్ని స్పర్శించగలిగే మననశీలమైన కవితలను నిజాయితీగా ఎంపిక చేస్తున్నాం. కవి పేరును అసలు చూడకుండా ఆ కవితలో ప్రదర్శితమౌతున్న వైవిధ్యాన్నీ, కొంగ్రొత్త అభివ్యక్తిని గుర్తించి పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ఎందరో ప్రతిభాశీలురైన అంతగా పేరు లేని కవులు కూడా కేవలం వాళ్ళ ప్రత్యేకత వల్ల వెలుగులోకి వస్తున్నారు.

* ఏ లక్ష్యంతోనైతే మీరు కవితా వార్షికలను నిరంతరాయంగా వెలువరించాలని సంకల్పించి నిబద్ధతతో వెలువరిస్తున్నారో… మీ ఆ లక్ష్యం నెరవేరినట్టుగా భావిస్తున్నారా?
మేము మొదటే చెప్పినట్టు ‘కవితా వార్షిక’ను వెలువరించడంలో ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి- ఒక సంవత్సరకాలంలో వెలువడ్డ ఉత్తమ తెలుగు వచన కవితను ఒక గుచ్ఛంగా, ధారగా కవిత్వాభిమానులకు అందించి మన ఉనికిని మనం శాస్త్రీయంగా దర్శించి అంచనా వేసుకోవడం. మన నడకను మనం సమీక్షించుకుని అధ్యయనం చేయడం. రెండవది- ఇతర భారతీయ భాషలలోగాని, ప్రపంచ భాషలలోగాని సమకాలీనంగా వెలువడుతున్న వచన కవిత స్థాయితో ఈ తెలుగు కవితా వస్తువును పోల్చి మనను మనం బేరీజు వేసుకోవడం, భవిష్యత్తులో మరింత ఉన్నతమైన కవితను వెలురించడానికి ఈ వర్తమాన స్థితిని వికాస దశలో ఇంకా ఉన్మీలింపజేయడం. ఈ దృష్టితో మేము పూర్తిగా మా లక్ష్యాలను చేరుకుంటూనే ఉన్నాం.

* కవిత్వాభిమానులు, కవులు మీ ఈ ప్రయత్నాన్ని ఎలా స్వీకరిస్తున్నారు?
‘కవితా వార్షిక’ క్రమం తప్పకుండా ఒక పరంపరగా వెలువడుతున్న ఈ సందర్భంలో మన పొరుగు రాష్ట్ర పాఠకులైన తమిళ, కన్నడ, మలయాళ కవిత్వాభిమానుల ప్రతిస్పందనలను ప్రత్యేకంగా నేను రికార్డు చేశాను. ప్రతి ఒక్కరూ ఈ ప్రచురణను ఒక అతి ప్రయోజనకరమైన ప్రయత్నంగా ప్రస్తావించి అభినందించారు. ఆయా రాష్ట్రాల్లో ఈ రకంగా ఒక వార్షికగా కవితా సంపుటాలను వెలువరిస్తున్నట్టుగా ఎవరూ చెప్పలేదు. కాగా, ‘తెలుగు కవిత్వా’నికి సంబంధించి ప్రతి సంచికలోనూ మేము ప్రచురిస్తున్న ‘కవితా గోష్ఠి’ ఒక పరిపుష్టమైన విద్యావిషయక (అకడమిక్) విలువలను కలిగి ఉన్న సమాచారంగా, పరిశోధనా స్థాయిగల సాహిత్య అంశాల సమాహారంగా విజ్ఞులు ప్రస్తుతించారు. ‘కవితా నేపథ్యం’ శీర్షిక క్రింద మా సహ సంపాదకులు డా॥ లంకా శివరామప్రసాద్ రాస్తున్న వినూత్న ప్రస్తావనలు కూడా అనేకమంది కవితా ప్ర్రియుల ప్రశంసలను పొందాయి.
ఇక కవుల ప్రతిస్పందనలూ ఉన్నతంగానే ఉన్నాయి. అయితే ‘కవితా వార్షిక’లో స్థానం పొందలేకపోతున్న కొందరు కొద్దిగా నిరుత్సాహ పడడం మా దృష్టికి వస్తోంది. కాని కొన్ని ప్రమాణాలతో రాజీపడకపోవడం మా నిబద్ధతలో ఒక ప్రధానాంశం కావడం వల్ల మేము కవులందర్నీ తృప్తిపరచలేం.

* తెలుగు వచన కవితను అంతర్జాతీయ కవిత్వాభిమానులకు అందించాలనే ప్రయత్నంలో అప్పట్లో ‘మో’ దిస్ టెన్స్ టైమ్ సంపుటిని వెలువరించారు కదా. తర్వాత అటువంటి ప్రయత్నాలు జరగలేదు. ‘కవితా వార్షిక’ల ద్వారా ఉత్తమ తెలుగు వచన కవిత్వాన్ని ఒకచోట ప్రోది పరుస్తున్న మీకు దీన్ని అంతర్జాతీయం చేసే ఆలోచన ఏదైనా ఉందా?

మనం ఉత్తమమైనదని భావించిన మన తెలుగు వచన కవిత యొక్క మూల సౌందర్యం, జీవ పరిమళం ఏమాత్రం ధ్వంసం కాకుండా అతి పదిలంగా ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేయగల ఒక ‘అనువాదకుల బృందాన్ని’ మేము ప్రస్తుతం కూర్చుకొంటున్నాం. ఒక మూడు లేక నాలుగేళ్ళ కాలాన్ని ‘పరిగణన’గా చేసుకొని తెలుగుభాషలోని ప్రాతినిధ్య వచన కవితను ఇంగ్లీష్ భాషలో వరుసగా వెలువరించాలనీ, అంతర్జాతీయ పాఠకులకు తెలుగు కవిత పసిడి వెలుగులను పరిచయం చేయాలనీ ఉంది. ఈ సంకల్పం మున్ముందు కార్యరూపం దాల్చి సాకారమౌతుంది.

* తెలుగు వచన కవులు కవితా వస్తువును ఎంచుకొనే క్రమంలో సామాజిక ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొనే సృజన చేస్తున్నారా?
మిగతా భారతీయ భాషల్లో వెలువడుతున్న కవిత్వంతో పోల్చి చూసినపుడు అనుభూతివాద, మార్మికవాద, నైరూప్య కవిత్వ ధోరణులు మన తెలుగు వచన కవిత్వంలో తక్కువగానే కనిపిస్తాయి. స్పష్టత, సామాజిక రుగ్మతల పట్ల స్పందన, మానవతా విలువలు ధ్వంసమౌతున్నప్పుడు ఆవేశంతో కూడిన ధర్మాగ్రహం- ఇవే మన కవితల్లో ప్రతిఫలించేవి.

ఒక్క అభిప్రాయం

  1. rajeshkhanna 01 ఏప్రిల్ 2007 , 11:41 am

    రామాచంద్రమౌలిగారికి నమస్కారములు. వరంగల్ సాహిత్య లోకానికి మీరు
    చెస్తున్నకృషి చాలా హర్షించదగినది. మీకు ధన్యవాదాలు ,కానీ ఈసందర్భంగా
    మీకు, ఒకవిషయాన్ని గుర్తు చెయదలచాను.వరంగల్ లొచాలామంది యువకులు.
    కొత్తగసాహిత్యాన్నిరాస్తున్నరు. వారినిగుర్తించదంకొసం మీలాంటీ పెద్దలుచొరవ
    తీసుకుంటే బాగుంటూందని మాఅభిప్రాయం.
    ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)