- ప్రశాంత్

సాయంత్రం బల్ల అయిపోయింది. జగదీష్‌కు లైఫ్ పడిందన్న వార్త అందరినీ విషాదంలో ముంచింది. జగదీష్ అందరినీ బెదిరించుకు తింటాడన్న పేరున్నా నర్మదా బ్యారక్ మొత్తం చలించిపోయింది.
లాకప్ సమయం దగ్గర పడుతున్నది. బైట చెట్ల దగ్గర నేను, చిచ్చా, రఘునాథ్, డూమోర్ కూర్చున్నాం. రోజూలాగే చిచ్చా ‘అకేలే హై చలే ఆవో జావో హో తుమ్’ లత పాట పాడాడు.

పాత హిందీ పాటలైనా, పూరి జగన్నాథుని జానపద భక్తి పాటలైనా అద్భుతంగా పాడగలడు.
“బాబూ నాయుడు కా కిస్సా క్యాహై'’ అన్నాడు చిచ్చా.

అప్పటికే లాకప్ బెల్ అవడంతో ఆలోచిస్తూ బ్యారక్‌లోకెళ్ళాం. అంతకంటే మమ్మల్ని బాధించే విషయం అందరి దగ్గరా బీడీలు అయిపోయాయి. క్యాంటీన్ రావడం లేదు, ఇంటర్వ్యూలూ లేవు.
భోజనం తర్వాత బీడీలు ఉన్నవాళ్ళ దగ్గర ఎంత ప్రాధేయపడుతున్నారో నాయుడు, ఉప్పరాపల్లి సత్తిబాబు ఇంకా చాలామంది.

లాకప్ తర్వాత ఈభిక్షాటనా ఉండదు. సైగలే తప్ప అరుపులు వినపడవు. బ్యారక్‌ల మధ్య ఎడం ఎక్కువ. కోరుకొండ నాయుడికి ఇంటర్వ్యూలు రాక రెండు నెలలు దాటిపోతున్నది. ఎప్పుడూ నవ్వుతూ బ్యారక్‌లు తిరిగే నాయుడు కొన్నాళ్ళబట్టి అదోలా ఉంటున్నాడు.
బీడీ ముక్కల కోసం ఎంతమందిని ఎన్నిమార్లు ప్రాధేయపడతాడో చూస్తే మనసు వికలమౌతుంది. నాయుడే కాదు ఈ జైల్లో ముక్కల దొంగలందరి స్థితీ ఇదే.

రెడ్డి మాత్రం ముక్కల దొంగలని నానా బూతులూ తిడతాడు. రెడ్డి ఉద్దేశంలో వీళ్ళందరూ నేరాలు చేసేవారనీ, చేయకుండా ఉండలేరని, వాస్తవమేంటో చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినేవాడు కాదు. నిజానికి రెడ్డి జీవితం కూడా అంతే బాధాకరమైంది. ఎక్కడో మహబూబ్‌నగర్ జిల్లా ఆయనది. హత్య కేసుల్లో ఇరుక్కొని ఆ కేసుల నుండి బయటపడడానికి వకీళ్ళకు ఫీజులు కట్టడం కోసం విజయవాడ, విశాఖల్లో మోటార్‌సైకిళ్ళ లిఫ్టింగ్ కేసుల్లో పడ్డాడు.
విశాఖ జైల్లో ఎక్కువమంది ముక్కల దొంగలే ఉంటారు. అట్లాంటి ముక్కల దొంగల్లో నాయుడు కూడా ఒకడు. ఏ కారణం వల్లో కానీ తనకు ఎయిడ్స్ ఉందని ప్రచారం చేసుకొన్నాడు. రోజుల వ్యవధిలోనే గంగా, యమునా, కావేరి, స్నేహ సరోవరం అన్ని బ్లాకుల్లోకి పాకింది. నర్మదా సరేసరి. మధ్యాహ్నంపూట ఒంటరిగా కూర్చున్నపుడు మైకులో ఈ నదుల పేర్లతో బ్యారక్‌లను పిలిచినపుడు ఒకవైపు నవ్వొచ్చేది. బాధా కలిగేది. సజీవ ప్రవాహాల పేర్లు బతుకును స్థాణువు చేసే కారాగారానికి పెట్టడమేంటా అనుకొనేవాణ్ణి.

ఎయిడ్స్ ప్రచారంతో నాయుణ్ణి అందరూ ఒకలా చూడ్డం మొదలుపెట్టారు. ఎస్కార్ట్ పోలీసులకు కోర్టు దగ్గర నాయుడు భార్య, తండ్రి కలిస్తే వాళ్ళకూ విషయం చెప్పడంతో ఇంటర్వ్యూలు పెట్టడం మానేశారు. దీంతో నాయుడు కూడా ఎవరూ పలకరించని బెంగాలీ ఇస్మాయిల్‌లాగా అయిపోయాడు. నాయుడు స్వభావాన్ని ఎరిగి ఉన్న వారెవరైనా ఆ వార్త అబద్ధమని తెలుసుకోవచ్చు కానీ, రోజూ జైలు హాస్పిటల్‌కు వెళ్ళడం మూలాన అందరికీ అనుమానం.
ఒకరోజు సాయంత్రం బల్ల తర్వాత బీడీ కోసం పూలచెట్ల మధ్య హడావుడిగా తిరుగుతున్నాడు. నాయుడుతో పాటు ముక్కల కేసు గోవిందూ ఉన్నాడు.

నాయుడి దగ్గరకెళ్ళి, “ఏంటీ ప్రచారం'’ అన్నాను.
“ముందో సిగరెట్టివ్వండి. లాకప్ కదండీ, రేపు తీరిగ్గా మాట్లాడదాం లెండి,'’ అంటూ సిగరెట్ ముట్టించుకొని వెళ్ళిపోయాడు.
రెండు నెల్ల బట్టి ఇంటర్వ్యూలు లేకపోయినా జైలు చేస్తున్నాడని, మాటకారి మనిషని గోవిందు లాకప్ తర్వాత జైలు కబుర్లలో చాలాసార్లు చెప్పాడు.
ముక్కల కేసు గోవిందుకు పదిహేనేళ్ళ పైనే జైలు అనుభవం ఉంది. పాతా కొత్త జైళ్ళ సంగతులు, వార్డర్లూ, జైలర్లూ, సూపరింటెండంట్‌ల సంగతులు చాలా చెప్పేవాడు.

* * *
సబ్ జైలు మారి సెంట్రల్ జైలుకు వచ్చిన తర్వాత తోటి ఖైదీల పలకరింపుల్లో ఏం కేసు అనడిగితే, ‘ముక్కల కేసండి’ అనేవాళ్ళు. ఈ ముక్కల కేసులేంటో తెలియలేదు. స్నేహ సరోవరం బ్యారక్ మారి నర్మదా వచ్చిన తర్వాత హరికృష్ణ, నాయుడు, గోవిందు ముక్కల దొంగతనం గురించి చాలా చెప్పారు.

ముక్కలంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉండే ఇనుపముక్కలని, ఈ ఇనుప ముక్కల్ని కొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్క్రాప్ కొట్లుంటాయని, ముక్కల దొంగల్ని చాలాసార్లు వాళ్ళే బెయిల్ పెట్టి విడిపిస్తారని చెప్పారు. గాజువాక చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువకులు వందలాదిమంది ఈ ముక్కల దొంగలై పోయారని చెప్పారు.
“నైట్ వెళ్ళామనుకో అనియా పదిహేనొందలు, రెండు వేలు. బరువులు మోస్తే ఇంకా ఎక్కువే అనియా,'’ అన్నాడు హరికృష్ణ.

చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద పరిశ్రమ, పరిశ్రమ అంటేనే అభివృద్ధికి నిదర్శనమైంది. అలాంటిది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని ఎట్లా నేరసామ్రాజ్యంలోకి దించింది. పరిశీలించదగ్గ వైరుధ్యంగా కనిపించింది.
రోజూ లాకప్ తర్వాత చాలా కబుర్లు చెప్పుకొనేవాళ్ళం. వారించినా వినకుండా బూతు, అక్రమ సంబంధాల జోలి చెప్పంది ఉండేవాడుకాదు నాయుడు. ఆజ్యం పోసినట్టు చిరంజీవి బీడీ ఇచ్చి, వాయిదాకు వేసుకోవడానికి షర్టు, చెప్పులు ఇస్తానని చెప్పి మరీ చెప్పించుకొనేవాడు.
ఎంత మాట్లాడినా అలసిపోయేవాడుకాదు నాయుడు. నిద్ర వస్తున్నా, జైలర్ తిట్టినా నవ్వేసి మళ్ళీ బీడీ ముట్టించి సంగతులు చెప్పేవాడు.

బల్ల తర్వాత ఏ పనులూ ఉండవు కాబట్టి మరుసటి మధ్యాహ్నానానికి నాయుడు విషయం మాట్లాడదామనుకొన్నాను. ఉదయం గిన్తీ, టిఫిన్ బల్ల, మేస్త్రీ అరుపులు చికాకైన వ్యవహారం.
మేస్త్రీ నాయుణ్ణి ఎంత తిట్టినా పట్టించుకోకుండా అందర్నీ నవ్విస్తూ, “ఏటి డాడీ నువ్వు తిటేస్తే ఎలగా,'’ అనేవాడు. చీపురు పట్టుకొని అలాగ తిరిగేవాడు.

మధ్యాహ్నం బల్ల అయిపోయింది. నా అలవాటు ప్రకారం చిచ్చా బ్యారక్‌కు వెళ్ళాను. బీడీ ముట్టించి ఖైనీ కోసం చిచ్చాకు ఒకటిచ్చాను. పాటందుకొన్నాడు.
“సుహానీ చాంద్‌నీ రాతే! హమే సోనే నహీ దేతె'’ ఇంతలో నాయుడు ఊడిపడ్డాడు.
“ఏటండీ మీరేదో సిగరెట్టిస్తారనుకుంటే మీరూ బీడీయే,'’ అన్నాడు నిరాశగా.
“రెండు రోజులైంది నాయుడు క్యాంటీన్ లేదు, సిగరెట్లూ లేవు,'’ అన్నా.
అప్పటికే చిచ్చా లేచి, “బేటా ఆప్ బాత్ జారీ రఖో మై జరా లేట్ తాహు,'’ అంటూ దిమ్మెపై పడుకొన్నాడు.
చిచ్చా పేరు గౌరిప్రసాద్ పట్నాయక్. ఒరిస్సా. అద్భుతంగా పాడగలడు, ఆర్ద్రమైన మనిషి. పేదరికం వల్ల అత్యాశకు పోయి పంచలోహ విగ్రహాల కేసులో ఇరుక్కొన్నాడు. ఇంటర్వ్యూలు ఉండవు కానీ బల్ల తర్వాత ఇంటర్వ్యూల అనౌన్స్‌మెంట్ వినడానికి అదేపనిగా వెళ్ళి చెట్ల కింద కూర్చునేవాడు.
“ఎందుకు చిచా నీ కోసమైతే ఎవరూ రారు కదా ఎందుకంత శ్రద్ధగా కూర్చుంటావ్,'’ అంటే,
“నై బేటా, మేరాతో కోయి ఆయెగానై. ఓతో పక్కా హై. కోయి ఇన్‌సాన్‌కా తో ఆయేగా, అగర్ ఓ నై సునాతో హమ్ బోలేంగే, ఓ ఖుషీ హోజాయేగా,'’ అనేవాడు. “పర్‌సాంత్ బాబు ఇంత్‌జార్ కా పల్ బహుత్ కఠిన్ హోతా హై,'’ రోజుకు ఎన్నిసార్లు ఈ మాట అనేవాడో.
నాయుడు వచ్చి పిచ్చాపాటి మొదలుపెట్టేసరికి మధ్యాహ్నం ఒంటిగంట, చాయ్ టైమైంది. బందురాజు నాకు, నాయుడికి టీ పట్టి తెచ్చాడు. చాయ్ బీడీ కాంబినేషన్‌తో మాటలు మొదలుపెట్టాం. నేనే అన్నాను, “ఏంటి నాయుడు ఈ ఎయిడ్స్ ప్రచారం,'’ అని.
“అదో పెద్ద స్టోరీలెండి. మరది చెప్పాలంటే చాలా బీడీలౌతాయండి,'’ అన్నాడు.
తప్పదు, “సరే,'’ అన్నాను.
రొమాంటిక్ కట్టుకథలు చెప్పి, బీడీలు సంపాదించుకొని పని గడుపుకొనే మనిషని కొంచెం పరిశీలించినా తెలిసిపోతుంది.
“ఏళ్ళ బట్టి జైలు చేస్తున్నానండి, చేసిన నేరాలు కొన్ని, చేయనివి కొన్ని. ఎప్పుడూ ముక్కల కేసే ఇంకోటేదీ లేదండి. మా గాజువాకలో చాలామందికి ఉన్నామండి ముక్కల దొంగలం. నాకు తెల్దుగాని కొన్ని వేలమంది అనుకుంటానండి. ఈ గోవిందుగోడు మా పెద్ద సీనీరండి. ఆడి పెళ్ళాం కూడా ముక్కల కెళ్తుందండి. పట్టీసుకున్నారనుకోండి. అలాగ పని జరుపుకుని బయటపడుతుందండి గుంటది. గోవిందుగోడు పది, పదిహేనేళ్ళబట్టి పప్పే. రాడం, పోడం ఇదేనండి.
మరదేం చేస్తుందండి. నేనూ పాజ్జెలు చేసానండి. ఏడెనిమిదేళ్ళ బట్టి పప్పు తింటున్నానండి. కొన్నిసార్లు సేట్లుంటారు కదండి. ఆల్లే బేల్ పెట్టీసి వారండి. లేదనుకోండి, ఇలాగ ఉండిపోవడమే.

ఈమద్ది ఇద్దరు ముగ్గిర్తో డబ్బులడుక్కొని ముక్కలేయలేదండి. ఇదిగో పప్పు తినీస్తున్నానండి. ఆర్నెల్లబట్టి పప్పే. ఎవరూ రాట్లేదండి. మా నాన్న రాడు, నా పెల్లామూ రాదు. ఏటిసేత్తాం సెప్పండి. బెయిలు మాట అలాగొదిలీండి, బీడీలైనా ఇవ్వాలి కదండి అదీ లేదు. ఎవడో సినిమా డైరెక్టర్ వచ్చాడండి. ఆడికలాగా సొల్లు సెప్పీసి బోల్తా కొట్టిస్తే ఆడొచ్చాడండి ఇంటర్వ్యూకి.

ఎలాగుంటాది సెప్పండి. అందుకే మండిపోయి ఎయిడ్స్ ఒచ్చీసిందన్నానండి. అలగైనా బెయిల్ పెట్టీసి తీస్తారేమో అనీసి. ఇదిగో ఇక్కడె సిక్కొచ్చీసిందండి. నా పెళ్ళాముంది కదండి ఆ గుంటది ఆళ్ళమ్మగారింటికెళ్ళిందండి. ఆడు మానాన్న రాలేదండి. జైల్లో ఇంతేసి ప్రచారం మాత్రం జరిగిపోయిందండి. ఏటి సేత్తాం సెప్పండి,'’ అన్నాడు.
“అయినా ఏటుందండీ కేసులూ, జైలు చేయడం, మళ్ళీ ముక్కలు. ఏం సుకం లేదండి. గాజువాక పోలీసులున్నారు కదండి నంజీకొడుకులు నెలలు నెలలు లాకప్పుల్లో పెట్టీసి కొట్టేస్తారండి. ఏం సుకం లేదండి,'’ ఈ మాట అంటున్నపుడు నాయుడు ముఖంలో నిరాశ, కసి కనిపించాయి.

సాయంత్రం బల్ల వరకు చాలా విషయాలు చెప్పాడు. ముక్కల దొంగతనం ఎంత సాహసంతో కూడుకొన్నదో చెప్పాడు.
ప్లాంట్‌లోకి వెళ్ళే రన్నింగ్ గూడ్స్ ఎక్కి భోగీల మధ్య దాక్కొని లోపలికెళ్ళడం, ముక్కలేసుకొని బండి ప్లాంట్ దాటిన తర్వాత బ్రేక్ వాక్యూమ్ తీసి దూకడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పాడు. సిఐఎస్ఎఫ్ పోలీసుల్ని గమనించాలి, లేదంటే కేసులు, ఒళ్ళు హూనం. అట్లా ప్రమాదాల్లో, పోలీసుదాడుల్లో చనిపోయిన వాళ్ళను గుర్తు చేసుకొన్నాడు.
“మీరోసారి రండీ, పాత గాజువాకలోని అయిల్‌గాడెక్కడంటే చెప్పేస్తారండి. నన్ను ఆయిల్‌గాడంటేనే తెలుస్తుంది. మా ముక్కలోళ్ళందర్నీ పరిచయం చేస్తాను. రన్నింగ్ గూడ్స్‌లో ప్లాంట్‌లో కెళ్దాం.'’
“ఈ ముక్కల్తో ఏటొస్తుంది చెప్పండి. వచ్చిందంతా ముండలకీ, మందుకి పోలీసులకే పోతుందండి. మల్లీ వాయిదాలు, వారెంట్లూ. ఈ ఇన్ఫర్మేషన్‌గాళ్ళతో చిక్కు. మా ముక్కలోళ్ళే ఇన్ఫర్మేషన్ గాళ్ళండి. రెండేసినెల్లు, మూడేసి నెల్లు లాకప్పుల్లో ఉంటాం కదండి. అలాగ ఇన్ఫర్మేషనగాళ్ళవుతారండి. ఏటిసేత్తాం పని గడవాలి కదండి. జైల్లోనూ ఇన్ఫర్మేషన్‌గాళ్ళెక్కువేనండి. అందులోని మన నర్మదాలో ఇంకా ఎక్కువండి. ఇన్ఫర్మేషన్ కోసమే కేసులు పెట్టీసి పంపిస్తారండి,'’ ఇలా మాట్లాడుకొంటూనే బయటికెళ్ళాం. అటూ ఇటూ తిరుగుతూ మాటలు కొనసాగించాం. మధ్యలో ఆకులమద్ది వెంకటరమణ కలిస్తే బీడీ కాల్చేసి నేనూ, చిచ్చా, రఘునాథ్ స్నానానికెళ్ళాం.
స్నానమయ్యేసరికి బల్ల వచ్చేసింది.

డైనింగ్ హాల్లో గొడవ, అరుపులు. స్పెషల్ బెల్లం కోసమో, చపాతి ముక్కల కోసమో. రొట్టె తినే ప్రాంతాలవాళ్ళు జైలుకొస్తే రోజూ నాలుగేసి చపాతీలిస్తారు.
హిందీవాళ్ళకు చపాతి వస్తుందని మిగతావాళ్ళకు కోపం. అట్లా జైల్లో హిందీవాళ్ళు, తెలుగువాళ్ళ మధ్య విభజన. ఘర్షణ కొనసాగేది. బల్ల దగ్గర బెంగాల్ బబ్లూ శర్మ ఆధిపత్యం ఉండేది. దాంతో ప్రతిరోజూ గొడవ.
చిచ్చాతో ఉంటే, “ఏటండీ హిందీవోల్లతో ఉంటారు?'’ అనేవాడు గోవిందు.
బల్ల అయిపోగానే నేనూ, చిచ్చా, రెడ్డి ముగ్గురం ఆవరణలోకొచ్చాం.
అప్పటికే చిరంజీవి చెట్ల మధ్య కూర్చుని బీడీ కాల్చుతున్నాడు. “ఏంటి చిరంజీవి ఆలోచిస్తున్నావ్,'’ అంటే, “ఏముంటాయండి, జైలు బాధలు. నా లవ్వు రాలేదండి ఇంటర్వ్యూకి. ఈ పూట వస్తుందనుకొన్నా. గోవిందుగోడి పెల్లామురాలేదుటండీ బాధపడిపోతున్నాడు,'’ అన్నాడు.
“వచ్చీటపుడు దాంతో గొడవ పడ్డాడటండీ,'’ అంటూ ముగించాడు.
లాకప్ అయ్యింది. రోజూలాగే హరికృష్ణతో మాట్లాడుతూ కూర్చున్నా. హరికృష్ణ మాటల్లో తాత్వికత ధ్వనించేది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితినైనా చాలా సులభంగా, ఒత్తిడికి గురి కాకుండా పరిష్కరించేవాడు.
నేను బ్యారక్‌లోకెళ్ళిన మొదటిరోజు హరికృష్ణే ఆహ్వానించాడు. “రా కూర్చో అనియా, మేమూ మీలాగే,'’ అన్నాడు మెత్తగా.

అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అన్‌లాకప్ సమయాల్లో నాకు తెలిసిన సంగతుల్ని లాకప్ తర్వాత హరికృష్ణతో రూఢీ చేసుకొనేవాణ్ణి. నాకెందుకో నమ్మదగ్గ మనిషిలా కనిపించాడు. వచ్చిన కొత్తలో తన వ్యక్తిగత విషయాలు కొన్ని అబద్ధం చెప్పినా రానురాను వాటి వెనకాల వాస్తవాలేమిటో చెప్పసాగాడు. మొదట్లో తనకు పెళ్ళి కాలేదన్నాడు, తర్వాత అయ్యిందన్నాడు. ఆ తర్వాత, ‘లేదనియా, జ్యోతి అని గుంటుంది అది మా ఫ్రెండ్ భార్య. అలాగ సంబందం ఏర్పడిందనియా, ఏటిసేత్తాం,’ అన్నాడు.
హరికృష్ణే కాదు ఈ జైల్లో చాలామందికి పెళ్ళిళ్ళు కాలేదు కానీ వాళ్ళతో సంబంధమున్నవాళ్ళు ఇంటర్వ్యూలకోసం వస్తుంటారు.

రెడ్డి ఒకరోజు అన్నాడు, “దొంగ కొడుకులకు గూడ వొస్తరాబై, వీళ్ళకేం ప్రేమలు బై,'’ అనేవాడు.
రానురాను జైల్లోని మనుషులు గొప్ప ప్రేమికులుగా, అద్భుతమైన మనుషులుగా కనిపించారు.
* * *
రాత్రి పదకొండు దాటుతున్నది. జైలర్ రంగనాయకులు రౌండ్‌కు వస్తున్నట్టు బూట్ల చప్పుళ్ళు వినిపించగానే హరికృష్ణ అన్నాడు, “దొంగనాకొడుకనియా, పడుకో.'’
అంతసేపూ ముక్కల దొంగతనం గురించి గోవిందు జీవితం గురించి, తన అక్రమ సంబంధాల గురించి చాలాసేపు మాట్లాడాడు.
జైలుకు వెళ్ళిన కొత్తలోనే నేను గమనించింది జైలులో అసలు గడియారం ఉండదు. ఉదయంపూట అయితే వార్డర్ ద్వారా లేకపోతే నీడ ద్వారా టైమ్ తెలుసుకోవాలి. రాత్రి జైలర్ బూట్ల చప్పుడో, బ్యారక్ ముందు చార్ట్ పెట్టే వార్డర్ ప్రతి గంటకొకసారి సంతకం చేస్తాడు అదైనా తెలుపుతుంది. ఒక్కోసారి ఆ చార్ట్ కూడా కనిపించనంత దూరంలో ఉంచితే సమయం తెలియకపోవడం హింసగా ఉంటుంది. ఒక్కోసారి బాగా ఆలోచిస్తే తెలిసేది సమయం తెలియకపోవడం మాత్రమే మానసిక ఇబ్బందికి కారణం కాదు మనం అనుకొన్నది చేయలేని స్థితి వల్ల అని.

పడుకొనేముందు హరితో అన్నాను, “గోవిందు అడిగితే చెబుతాడా,'’ అని. ఆయన జీవితం గురించి అన్నాను.
“అడుగనియా,'’ అన్నాడు. మరుసటిరోజే వాయిదా కావడం వల్ల తీరుబాటు కాలేదు. రెండురోజుల తర్వాత గోవిందుని పలకరించి ఎప్పుడు కూర్చుందామని అడిగితే కళ్ళలో నీళ్ళు నింపుకొని మళ్ళీ తనే తమాయించుకొని, “లాకప్ అయిపోద్ది కదండి. మాట్టాడదాం లెండి, చాలా ఉన్నాయి లెండి. ఓ పూటతో అయిపోవు కదండి,'’ అన్నాడు.
“నంజీకొడుకు కృష్ణమూర్తిగాణ్ణి చూశారండి ఇళ్ళు దోసేసి నేరాలు సేసీసీ పప్పు తింటూ పిల్లి సచ్చిపోతేనూ పూడ్చేసే పూలేసి ప్రార్థన చేశాడటండీ,'’ అన్నాడు.

దర్జాగా డెక్కన్ క్రానికల్ చదివే కృష్ణమూర్తికి ఇరవై మూడేళ్ళు ఉంటాయి కావచ్చు. సంవత్సరకాలం బట్టి నర్మదాలో ఉంటున్నాడు. పిల్లికి ఆరోగ్యం బాగుండక చెట్ల పొదల్లోనో, బాత్‌రూముల దగ్గరో పడుకొంటున్నప్పటి నుండి దాని ఆలనా పాలనా చూశాడు. అది చనిపోయిన తర్వాత పూడ్చి, పూవులేసి ప్రార్థన చేసొచ్చాడు. జైలులో పూజలు, ప్రార్థనలు, నమాజ్‌లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. జైల్లోని తోటలో రంగు రంగుల పూలు పూసేవి. వాటిని అందంగా అలంకరించి పూజలు చేసేవారు.

సిమెంట్ శివలింగం తయారుచేశారు. బబ్లూ శర్మ పూజ చేస్తే ఇస్మాయిల్ దండ గుచ్చేవాడు. ఇస్మాయిల్ తన దగ్గరున్న పలకపై మసీదు బొమ్మ గీసుకొని దాని ముందు నమాజ్ చేసేవాడు.
మామూలుగా జైల్లో మునిమాపనగా ఇంటర్వ్యూలు అయిపోతాయి. దాదాపు అటూ ఇటుగా లోకల్ కోర్టులు వచ్చేస్తాయి. ఔట్ కోర్టులు లాకప్ తర్వాత వస్తాయి.
ఒకరోజు ఔట్ కోర్టులకు వెళ్ళిన చిత్రసేన్ రెడ్డి, ఎరుకల అబ్బులు వస్తారని ఆ బ్లాకులవాళ్ళు అన్నం పట్టారు. చిత్రసేన్ రెడ్డి వచ్చాడు కానీ, అబ్బులు రాలేదు. అందరిలో గుసగుసలు మొదలయ్యాయి. అబ్బులుకు లైఫ్ పడే ఉంటుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది.

జగదీష్‌కు లైఫ్ పడ్డప్పటి నుండి అబ్బులు అందరికీ దూరంగా, మౌనంగా ఉంటున్నాడు.
ఊచల మధ్య నుంచి బయటకు చూస్తూ, బీడీలు కాలుస్తూ ఇదే విషయం మాట్లాడుతున్నాం నేను, గోవిందు.
“ఏటండీ చీమలమో, పిల్లులమో అయి పుట్టి ఉంటే బెయిల్, శిక్ష ఏవీ ఉండేవి కాదు గదండీ. అలా దూరేసే పారిపోదుము. జంతువుల్లా పుట్టకపోయామా అయినా మనిషిని మనిషి బంధించడం ఎంత దుర్మార్గమండీ,'’ అన్నాడు.
గోవిందు మాటలు దుఃఖపెట్టాయి. ఈ గోడలు దాటాలని ఈ మనుషులు ఎన్ని ఆలోచనలు, ఊహలూ చేస్తారో అనిపించింది. మళ్ళీ అన్నాడు, “పక్షులమైతే ఇంకెంత హాయోనండి.'’
ఇంతలో అడ్మిషన్ అరుపు వినిపించి అటువైపు చూశాడు. ఆయనా ముక్కల దొంగే. ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టి తన జీవితంలోకి వెళ్ళిపోయాడు.

“సరిగ్గా పదేళ్ళవుతుందండి. నేను మా బామ్మర్ది ఇప్పుడొచ్చాడు కదండి కొత్త అడ్మిషను, ముగ్గురం కలిసి నేరం చేయడానికెళ్ళామండి ప్లాంట్‌కు అటింకా పైకి. పెద్దపెద్ద ముక్కలు తీశామండి. బాడుగ ఆటో మాట్లాడాం. ముక్కలన్నీ ఏసేసాం. చివరి ముక్క ఉండిపోయింది. మా బామ్మర్ది గాడెళ్ళాడండి తేడానికని. ఇంతలో నేవీ వాళ్ళొచ్చి ఫైర్ చేస్సారండి. ఆడు పడిపోయాడు. మమ్మల్ని పట్టేసుకుని సుబ్బరంగా బాదేసి ఎటెమ్ట్ మడ్డర్ కేసు పెట్టీసి పప్పు కోసం పంపించేశారండి. ఇదిగో ఆ కేసేనండి ఇప్పుడు పప్పు తినిపిస్తుంది. పదిహేనేళ్ళ బట్టి చాలా నేరాలు చేశానండి. ముక్కలేననుకోండి. ఇంకేటి లేదు. పాజ్జైలు, కొత్త జైలు అన్నీ చూశానండి. ఏం సుకం లేదండి. మీరేటండీ మేమూ సూసాం ఎన్‌కౌంటర్లూ,'’ అంటూ భోరున ఏడ్చేశాడు.

“ఇదిలాగుంది కదండి, నా పెళ్ళాం ఇంకోడితో సంబందం పెట్టుకుని లెగిసిపోయిందండి. నా బామ్మర్ది ఇంటిది, ఎవడూ నేవీ వోల్లు కాల్చేసారు కదా ఆడు. అది ముండల్లో కలిసిపోయి గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్‌లో తిరగడం మొదలెట్టీసింది. ఏట్రా యిలగైపోయిందనుకుని అలాగా తాగుతూ ఉండిపోయాను. తప్పదు కదండి మళ్ళీ పప్పు కోసం తినీడానికికొచ్చేసీ అలాగ ఎనిమిదేసి నెల్లుండి కేసు కొట్టేస్తే బయటపడ్డానండి. ఇంకేటండీ మళ్ళీ ముక్కలు. ముక్కలు దొంగతనం చేస్తునప్పుడే గాజువాకలోని ఏది నేను సేసుకున్నాను కదండి గుంటది అది తగిలింది. అలా దాన్ని దువ్వేసి ఇంట్లో పెట్టీసుకున్నానండి. దాని భాష నాకు రాదు. నా భాష దానికర్థం కాదు. అదీ ముక్కలకొచ్చేది. భాష రాప్పోయినా పిల్లలకేటండి. పిల్లలయ్యీరండి. ముగ్గురు. ఇంకేటి సేస్తాం దాన్నింట్లో పెట్టీసీ ముక్కలకెళ్ళేవోణ్ణండి. చాలా మంచిదండి. ఇప్పుడు సూడండి నేను పప్పుకొచ్చీసి ఆరేసి నెల్లయిందండి. పిల్లల్ని అదే సూస్తుంది, మళ్ళీ ఇంటర్వ్యూలూ పెడుతుందండి. అదైనా ఎంతకని వొస్తుందండి. రెండు నెల్లబట్టి రాట్లేదు.'’
మనసులో ఇంత వున్నా బయటికేమాత్రం కనిపించనివ్వడు గోవిందు. ఎక్కువ మాట్లాడకుండా ఎప్పుడూ బ్లాకుల మధ్య వరండాలోనో, పూవులచెట్ల దగ్గరో దీర్ఘంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తాడు. గోవిందు, హరికృష్ణ, నాయుడు, పోలయ్యే కాదు ఈ బ్యారక్‌లో ఉన్న దాదాపు వందమందిలో అందరి స్థితీ ఇదే. ఎవరూ బయటికి కనిపించనివ్వరు.

* * *
ఉగాది పండుగకు ముందో తరువాతో సరిగా గుర్తులేదు లాకప్ అయిన తర్వాత మాట్లాడుతూ కూర్చున్నాం నేనూ, గోవిందూ, హరికృష్ణ. చిరంజీవి బ్యారక్‌లోనే పచార్లు చేస్తున్నాడు. రాత్రి పది దాటింది. బయట వెన్నెల కురుస్తున్నది. జైలు చుట్టూ పచ్చని కొండలు. ఆవరణంతా ఎర్రమట్టి నేల కావడం వల్ల వెన్నెల నేలపై పడి చిత్రమైన కాంతి పులుముకున్నది. అద్భుతమైన దృశ్యం.

హరికృష్ణ అన్నాడు, “అనియా బయట కూర్చుని అలాగ బీడీ కాల్చుకుంటూ అసుకేసు కుంటూ పాటలు పాడుకుంటే బలేగా ఉండేది కదనియా,'’ అని.
ఇంతలో చిరంజీవి, “తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల,'’ పాట పాడితే,
గోవిందు చిరాకు పడుతూ, “ఒరే ఆపరా ఏడుపుగొట్టు పాటలు,'’ అన్నాడు.
చిరంజీవి ఆ పాటలోని “ఏనాడు ఏ జన్మకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో,'’చరణమే ఎక్కువ పాడేవాడు.
“ఏటండీ, ఈ జైలేటి, ఈ ముక్కలేటి ఈ బాదలేటి. మనకూ ప్లాంట్‌లో ఏదో పనిస్తే నేరాలెందుకు సెప్పండి, ఏటో…'’
ప్లాంట్ పెడుతున్నపుడు పోయిన ఊళ్ళలోని వాళ్ళందరికీ ఏ ఉపాధి దొరకలేదు. ప్లాంట్ పడ్డ తర్వాత వాళ్ళంతా దొంగలైపోయారు.
“అనియా సంవత్సరంలో మూడు మాసాలు బయట, తొమ్మిది మాసాలు పప్పు. ఒక నేరం చేస్తే పది పోలీసులు పెట్టేస్తారు. ఏటి సేస్తాం. మా ముక్కల నేరాలన్నీ ఇంతే అనియా,'’ అన్నాడు హరికృష్ణ.
చిచ్చా పాటందుకొన్నాడు.

“బాగ్‌తో జల్‌గయా / ఎక్ కలీ రహెగయీ
యాద్ దిల్ మే కోయీ / అధ్ జలీ రహిగయా'’
పదకొండు దాటింది కావచ్చు. నైట్ రౌండ్ జైలర్ బూట్ల చప్పుడుకు అందరం పడుకుండిపోయాం.

5 అభిప్రాయాలు

  1. Karunakar 11 ఏప్రిల్ 2007 , 1:21 pm

    అభివృధ్ధి వెలుగు ఎక్కడొ దూరంగా ఎవరికొ అందుతూ ఉండగా దాని నీడలొ విధ్వంసంవుతున్న జివితాలను బాగా చిత్రించారు.మనిషిని దొంగని చేసిన అభివృధ్ధిని గురించి చర్చించాల్సింది చాలా ఉంది.-కరుణాకర్

  2. #caMdra# 24 ఏప్రిల్ 2007 , 6:24 pm

    చాలా బావుంది. పెరుగుతున్న పారిశ్రామిక వాడల నీడల్లో పరుచుకుంటున్నమరో ప్రపంచాన్ని చూసి మనసు బరువెక్కింది.
    జైల్లో వాళ్ళతో గడిపిన భావాన్ని కలిగించేలా చక్కగా చిత్రించారు కథ వాతావరణాన్ని.

  3. దిలీప్ 29 మే 2007 , 5:15 am

    కథ చాలా బాగుంది ప్రశాంత్. మామూలుగా ఎక్కువమంది మనుషులకు కనిపించని జైలు జీవితపు మరో కోణం పరిచయం చేశావ్. అదే సమయంలో, కోట్ల రూపాయల కుంభకోణాలు చేసే ఘరానా దొంగలు బయట పదవుల్లో కులుకుతుంటే, బ్రతుకుదెరువు కోసం చిల్లర దొంగతనాలు చేస్తున్న వారు జైళ్లలో ఎలా మగ్గిపోతున్నారో కూడా చక్కగా తెలియజెప్తుంది నీ కథ.

  4. B.Ajay Prasad 16 జూన్ 2007 , 3:18 am

    కథ చాలా బావుంది. ఈ రచయిత మరిన్ని మంచి కథలు రాస్తాడని ఆశిస్తాను.

    అభినందనలతో

  5. ramana 23 ఫిబ్రవరి 2008 , 3:15 pm

    కథ బావుంది.షిల్పమ అద్భుతంగా వుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)