- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మనసు, లేక బుద్ధి అనేదీ, మెదడూ ఒకటి కాదా? ఇది శాస్త్రవేత్తలనూ, తత్వవేత్తలనూ, సామాన్యులనూ కూడా వేధించే సమస్య. పదిహేడో శతాబ్దంలో రేనే దేకార్త్‌ అనే ఫ్రెంచ్‌ తత్వవేత్త దీన్ని గురించిన చర్చ లేవనెత్తాడు. ఈ విషయంలో బౌద్ధమతంలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే మన పంచేంద్రియాలూ, నాడీమండలమూ, మెదడూ వగైరాలన్నీ జీవపరిణామక్రమంలో మనకు యదార్థతను సరిగ్గా వివరించగలిగే స్థాయికి ఎదిగి ఉండకపోవచ్చు.

అవన్నీ కేవలం మన మనుగడ కొనసాగడానికే తోడ్పడుతూ ఉండవచ్చు. ఇంకా ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అది మన జన్యువుల మనుగడ కోసమే జరిగిన ఏర్పాటు కావచ్చు. ప్రాణులకు ఆత్మ పరిరక్షణ కోసమని “అహం” (ఈగో) అవసరమౌతుంది. ఎందుకంటే తనకూ, ఇతర ప్రాణులకూ ఉన్న తేడాను గుర్తించలేని ప్రాణి బతకలేదు. మనకు హాని కలిగే పరిస్థితి ఎదురైనప్పుడు ఇది బాగా ద్యోతకం అవుతుంది. సామాన్యంగా ఇంద్రియాల నుంచి లభించే ప్రేరణలు అవగాహన, లేదా చైతన్యం రూపంలో మనకు ఉపయోగపడే అనుభవాలుగా రూపుదిద్దుకుంటాయి.

ఎటొచ్చీ మన అవగాహనకు పరిమితులుంటాయనేది నిరూపించడం కష్టంకాదు. ఉదాహరణకు సెకండుకు 24 నిశ్చలనమైన బొమ్మలు సినిమా రీలుగా తిరుగుతున్నప్పుడు మన కళ్ళు విడి ఫ్రేములను గుర్తించకుండా నిజంగా జరుగుతున్న దృశ్యంలాగా వీక్షిస్తాయి. ఏ లోయలోకో, విమానం నుంచో తొంగి చూస్తున్నప్పుడు మన కంటికి కనబడే రెండు కొలతల దృశ్యానికి అతీతంగా మనకు “లోతు” గురించిన అవగాహన తీవ్రంగా కలుగుతుంది. అలాగే సంగీతం వింటున్నప్పుడు అనేక వాయిద్యాలు వివిధ స్వరాలను పలికిస్తున్నా మొత్తం ఆర్కెస్ట్రా వాయిస్తున్న”ట్యూన్‌” మనకు తేలికగా పట్టుబడుతుంది. దీనర్థం ఏమిటంటే ఇంద్రియాలనుంచి మనకు నేరుగా అందుతున్న ప్రేరణలను “అర్థం చేసుకోవడానికి” మన అనుభవం చాలా పని చేస్తూ ఉంటుంది. కుక్కలకు వాసనపట్టే శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనకు కనబడే దృశ్యాలతో పోలిస్తే వాటి “ఘ్రాణ”చిత్రాలు వాటికి చాలా వివరంగా అర్థం అవుతాయట.

అనుభవాలన్నిటికీ మూలాధారం “నేను” అనే భావన. అవతలివారు ఎంతటి ఆత్మీయులైనా వారిని గిల్లితే మనకు బాధ కలగదు. నేను, నాది అనే అహంభావన మనకు పుట్టుకతో రాకపోయినా క్రమంగా ఏర్పడుతుంది. కాని ఈ అహంభావన ఎంత యదార్థమైనదో చెప్పడం కష్టం. మనం ఎదుగుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకే మనిషికి బాల్యంలోనూ, నడివయసులోనూ, ముసలితనంలోనూ “నేను” అనే భావన ఒకేలా ఉంటుందా? లేక ఎప్పటికప్పుడు కొత్తగా తయారౌతూ ఉంటుందా? ఎందుకంటే చిన్నప్పుడు “నేను” అనబడే వ్యక్తికి రకరకాల విషయాలూ, వివరాలూ గుర్తుంటాయి. అనేక సంఘటనల గురించి అనేక అభిప్రాయాలు ఏర్పడతాయి. అదే వ్యక్తి పెరిగి, పెద్దవుతున్నకొద్దీ “నేను” అనే భావన మారదుగాని ఎన్నో పాత విషయాలు మరచిపోవడం, వాటి ప్రాధాన్యత తగ్గడం, వాటి స్థానే మరేవో రావడం జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితుల్లో శాశ్వతమైన “నేను” అనేది ఉండడం నిజం కాకపోవచ్చు. మెదడు “సజావుగా” పనిచెయ్యడానికి కారణం ఏమిటంటే ప్రాణి బతికున్నంత కాలమూ దానికి ఎదురయే రకరకాల అనుభూతులను అవగాహన చేసుకుంటూ, శాశ్వతమైన “అహంభావనను” కలిగిస్తూ ఉంచడమే. ఎందుకంటే దాని మనుగడకు అది చాలా అవసరం.

మన వేదాంతులు తాడును చూసి పామనుకునే రజ్జు సర్ప భ్రాంతి గురించి చెపుతూ ఉంటారు. వీటిలో ఏది భ్రమ, ఏది నిజం? భౌతికవాదులకు యదార్థత అంటే మెదడు “సహజ”స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలిసే విషయాలు. అదే మెదడు మనిషి ధ్యానంలోనో, మగతగానో ఉన్నప్పుడు ఇతర రకాల భావనలకూ, ప్రేరణలకూ లోనవుతుంది కనక అప్పుడు అనిపించేవన్నీ అవాస్తవాలుగా పరిగణించాలి. దేవుడూ, ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించిన భావాలను “అపస్మారక” స్థితిలో ఉన్న మెదడులో కృత్రిమంగా సృష్టించవచ్చని శాస్త్రపరిశోధనల్లో తేలింది కనక వాటిని భ్రమల కింద జమకట్టాలి. పదే పదే అలా జరుగుతూ ఉంటే దాన్ని మానసిక రుగ్మతగా భావించాలి. బౌద్ధులు ఈ ప్రతిపాదనను తలకిందులు చేసి, “అహం” అనేదే మిథ్య అనీ, దేహాన్ని పరిరక్షించే ప్రయత్నంలో శరీరధర్మాలు ఎప్పటికప్పుడు మనకు ఆ భావనను కలిగిస్తూ ఉంటాయనీ, మారకుండా నిలిచే ఆత్మచైతన్యం ఉండదనీ అంటారు.

కొన్ని రకాల మాదకద్రవ్యాలు సేవించినవారికి “ఆధ్యాత్మిక” భావనలు కలిగినట్టు పరిశోధనల్లో గుర్తించారు. అలాగే లోగడ తమకు భావోద్వేగాన్ని కలిగించిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటున్నవారి మెదడులో దాదాపు అంతటి తీవ్రమైన మార్పులు మళ్ళీ కలుగుతాయని తెలిసింది. కణతల కింద ఉండే మెదడు భాగానికీ, తల మీద ఉండే మెదడు భాగానికీ లంకె చెడిపోయిన రోగులకు తమ శరీర భంగిమకూ, పరిసరాలకూ సంబంధం గుర్తించడం కష్టమైంది. బతికుండగానే శరీరం నుంచి “ఆత్మ” వేరై, మన శరీరాన్ని మనమే దర్శించగలిగినట్టు కొందరు భావించడానికి ఇదే కారణం కావచ్చునని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే ఎపిలెప్సీ రోగులకు మతప్రేరణలు కలుగుతాయని అనేక ప్రయోగాల్లో తెలిసింది.

మనసు అనేదానికి మెదడుతో సంబంధం లేదనీ, అది పరిణామదశలకు అతీతమైనదనీ కొందరు అనుకుంటారు. దీనికి రుజువులేవీ కనబడవు. విశ్వాంతరాళాన్నీ, అందులో జరిగిన, జరుగుతున్న సంఘటనలనీ అంతటినీ చూసినప్పుడు తెలివీ, స్పృహా, అవగాహనా మొదలైన చేతనత్వానికి సంబంధించిన గుణాలు ప్రాణులకు మాత్రమే పరిమితమైనవని తెలుస్తోంది. భూమి మీద తప్ప విశ్వంలో జీవరాశి పెరిగిన దాఖలాలేవీ ఇంతవరకూ లభించలేదు కాని తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడైనా ప్రాణులు ఉద్భవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. అలా జరిగినా కూడా ప్రాణులకి ఉండగలిగిన కొద్దో గొప్పో చైతన్యం వాటి మనుగడకు పనికొచ్చే విధంగానే రూపొందుతుంది. అంతేకాని విశ్వానికి సంబంధించినంత వరకూ అటువంటి చైతన్యం గాని అవగాహన కాని ఎందుకూ “పనికిరావు”. విశ్వమంతా యదార్థమే కావచ్చు గాని అందులో అవగాహన అనేదానికి ఒక స్థానం గాని, అవసరం కాని ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ కనబడవు. ఒక్క భూమినే తీసుకున్నా మనిషివంటి ప్రాణులకు గల సంక్లిష్టమైన నాడీ వ్యవస్థా, మెదడూ, వివేచనా, వివేకమూ తక్కిన జీవాలకు ఉండవు. అందువల్ల వాటికి పెద్ద నష్టం కూడా కలగటం లేదు. మనుషుల కన్నా బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు ఎంతో అభివృద్ధి చెంది, హాయిగా బతుకుతున్నాయి. తక్కిన ప్రాణుల్లాగే వాటిలో అవసరమైనంత వరకూ జీవపరిణామం విజయవంతంగానే జరిగింది. మనలాగా అవి ఏది సత్యం ఏదసత్యం అని మథనపడుతున్న సూచనలేవీ లేవు!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)