- జాన్ హైడ్ కనుమూరి

సృజనలోకం, వరంగల్ ప్రచురించిన “కవితా వార్షిక -2006” ను 18 మార్చి 2007 తేదిన, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, హనుమకొండ లో ఆవిష్కారించారు.

అధ్యక్షులు: డాక్టర్ అంపశయ్య నవీన్
ముఖ్య అతిథి, ఆవిష్కర్త: డాక్టర్ పి. వరవరరావు
ప్రధాన సంపాదకుడు: రామా చంద్రమౌళి

kavithavarshika_1.jpg

అంపశయ్య నవీన్:
తెలుగులో విరివిగావస్తున్నది కవిత్వం. కవిత్వానికుండే విస్తృతి కవిత్వానికుంది. 80 కవితలు ఎన్నికచేసి 2004లోను నాందీ ప్రస్తావన చేసాం. 99 కవితలతో 2005, ఇప్పుడు 92 కవితలతో 2006 వచ్చాయి. కవితలు ఎంపికలో ఏ కొలబద్ద చూసారు అనే ప్రశ్న వస్తుంది. కవిత్వాని అంచనావేయటం చాలా కష్టం. అంచనా వేయడం హైల్లీ సబ్జెక్టివ్ ( highly subjective). ఎవరి దృష్టికోణాన్నిబట్టి, లిటరరీ బాగ్ గ్రౌండును బట్టి బేరీజువేయడం జరుగుతుంది.
గీతాంజలి తాగి బతికానంటాడు చలం. డిటెక్టివ్ నవలకంటే చెత్తవుందంటాడు శ్రీశ్రీ. ఎవరి దృష్టికోణంవారిది. ఇవే కచ్చితంగా మంచి కవితలు అనటంలేదు. ఈ సంవత్సరపు కవిత్వంలో సమకాలీన సమస్యలపట్ల కవులు స్పందించారు. స్త్రీవాదం, తెలంగాణా అస్తిత్వం, గ్లోబలైజేషన్ , ముస్లింవాదం, వ్యవసాయరంగం, వలసపోతున్న అంశాలు ఇంత వైవిధ్యం వుంది వస్తుపరంగా, నిజంగా యేది కవిత్వం అనే సమస్యవస్తుంది.

రామా చంద్రమౌళి:
హైస్కూలు జీవితంనుంచి కవిత్వాన్ని సేకరించి పెట్టుకోవడం స్ఫూర్తితో గుచ్చగా అందించాలని ఆలోచన. మొట్టమొదట కవిత్వాన్ని ధారగా అందించాలని ప్రారంభించాం. కవిత్వంతోపాటు, అకడమిక్ అంశాలు, కవితాగోష్టి – అనుబంధం, కవితానేపధ్యం ప్రస్తావించాం. గత సంవత్సరం యూనివర్సిటీలనుండి మంచి స్పందన వచ్చింది. కొన్ని పరిమితులవల్ల చేర్చలేనివివాటిని ఆపి, తిరిగి వెనక్కు చూసుకొని … అందించాం. భారతీయ భాషలతో బేరీజువేసుకొనే క్రమంలో ఇతర భాషలనుండి తెలుగులోకి, తెలుగునుండి ఇతరభాషలలోకి అనువదిస్తూవున్న వారితో గోష్టి చేర్చడం జరిగింది. అనువాద రంగంలో ఆరుగుర్ని ఎన్నుకుని వినిమయం ఎలా జరుగుతుందనే గోష్టి ఏర్పాటు చేసాం. మొత్తం 2116 కవితలు సేకరించి వాటిలో మొదట వడపోతగా 923 ఎన్నిక చేసాము. చివరగా వాటిలో 92 కవితల్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇది సంపూర్ణమూ కాదు, సమగ్రమూ కాదు మా దృష్టి అందినంతమేరకు, అభిరుచిమేరకు అందిస్తున్నాము.
సాహితీ మిత్రులు విజయవాడనుండి కూడా వచ్చారు. వాత్సల్యంతో, ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి ఆవిష్కరణలు వచ్చినవారందరికీ సృజనాలోకం పక్షాన ధన్యవాదాలు.

kavithavarshika_2.jpg

విప్లవకవి వరవరరావు:
కవిత వార్షిక పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఆర్ట్స్ కాలేజీలో మేం చదువుకున్న క్లాసురూము ప్రక్కనే నిర్మాణమైన హాలులో మాట్లాడటం ఉద్విగ్నంగా వుందని, ఇక్కడే రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ జ్ఞాపకం చేసుకున్నారు.
పుస్తకానికి చుట్టిన బట్టవిప్పుతున్నప్పుడు ఎర్రని వెల్ వెట్ బట్ట మృదువుగా తగులుతుంటే ‘ఎర్రశాలువా కప్పుకుని రివాల్వర్ వచ్చిందన్న’ శ్రీశ్రీ కవిత గుర్తొచ్చిందన్నారు. ఎర్రశాలువా కప్పుకున్న ఈ కవితావార్షిక ప్రజలచేతుల్లో రివాల్వర్ అయితే బాగుంటుంది. అది నా ఆశ.

కవిత్వాన్ని గురించి చెబుతూ జార్జి థాంసన్ కవిత్వం మానవసారమంటాడు. కవిత్వంలో చెప్పినదంతా శీర్షికకూడా చెప్పాలి. ఎప్పుడు మానవసారం అవసరమౌతుంది?
జ్ఞానం, కళ ఆదిమ సమాజంయొక్క అవసరం. అహార అన్వేషణలో తెలుసుకుంటున్న నేపథ్యం అవసరం. ఆహార అన్వేషణ క్రమంలోనే వేటాడే దశలో కళలొచ్చాయని అంటారు. ఆహార అన్వేషణలో ఉత్పత్తిలో పాల్గొనటంలో సాహిత్యం పుడ్తుంది. కవిత్వం కళలు, ఉత్పత్తి సంబందాలనుంచి వచ్చే మానవసారం.

రామాయణంలోని వాల్మీకిలో న్యాయమైన కోపంవుండటం, స్త్రీకి ఆశ్రయమివ్వడం ఎక్కడో మానవసారం కన్పిస్తుంది. వరంగల్లుకు చెందిన వాడు పాలకుర్తి సోమనాధుడు. ఆయనలాంటివాడు దేశంలోనే పుట్టలేదు. అయిలమ్మ పాటలు మధ్యకాలంలో ప్రత్యమ్నాయ సంస్కృతిని సృషింపబడింది. కాళోజి వారసత్వం కల్గిన వరంగల్లునుంచి ఈ సంకలనం రావటం అభినందనీయం అన్నారు.

మూడు సూచనలు:
1) కవితాసంకలనంలో క్రోనలాజికల్ కు పాటించవలసింది వరుస తేదీలే. అక్షరక్రమంకాదు
2) ఆరుగురు సంపాదకులు వున్నారు పని పంచుకుని వస్తున్న సాహిత్య పత్రికల్ని చూడవలసిన అవసరమున్నది.
3) తీసుకోలేని కవితల లైన్లువేస్తున్నప్పుడు అనుమతితోనే వేస్తే బాగుంటుంది. సూచనలతో ముగిస్తున్నాను.

కొండేపూడి నిర్మల:
‘మనిషి వస్తువుకింద పడి చచ్చాడు’ ఓ కవి అన్నవాక్యాలను గుర్తుచేస్తూ వస్తువుకున్న ప్రాముఖ్యత సంకలనం ద్వారా యువతరానికి చేరుతుందాయని ప్రశ్నించారు? యువతకోసం చేతులు కాల్చుకోవల్సివుంటుందని చమత్కరించారు. ప్రపంచీకరణమీద ఎలా దాడి చెయ్యాలి అనేది, వక్తీకరణశక్తి మీద ఆధారపడివుంటుంది. నిజమైన కవిత్వానికి, కవికి వేదికలు తక్కువయ్యాయని చెబుతూ ‘చివరి చిరునామా’ తో ముగించారు.

జూలూరి గౌరీశంకర్
వరంగల్ లాంటి చైతన్యనగరంనుంచి ఏకైక కవితాసంకలనం తెస్తున్నందుకు అభినందించారు. ‘అన్నివాదాల, అన్ని ప్రాంతాల కవుల సంకలనం వేస్తున్నప్పుడు వచ్చే ఫలితమేమిటి? అనే ప్రశ్న లేవనెత్తారు. ఎంపికకోసం పరిశీలించిన వారి పేర్లు పట్టికగా యిస్తే రికార్డు అవుతుంది, లేకపోతే మళ్ళీ యే జాషువా మిగిలిపోతున్నాడో! తెలంగాణాలో ప్రత్యేకంగా కవితాసంకలనం ఎందుకు తేకూడదు? అని సూచనలు చేసారు.
రాజ్యంతో పోరాడేవాడే కవి, కలబడేవాడు కవి, అలాంటివారిని యువకుల్లోకి తీసుకురాలేక పోవడం మనందరి వైఫల్యం. ఉద్యమంగా చేసేవైపు అడుగులు వేయాలి.

“జొన్నకంకుల కవిత్వం, తల్లిపాల కవిత్వం, యుగసృహ తెలంగాణా కవిత్వం” అని ముగించారు.
మొదటి సెషన్ పూర్తి అయ్యింది. భోజనానంతరం:
వి.ఆర్ . విద్యార్ధి అధ్యక్షతన నెల్లుట్ల రమాదేవి నిర్వహణలో కవితోత్సవం జరిగింది. 41 మంది తమ కవితల్ని వినిపించారు. ఇందులో యల్ .ఆర్ . స్వామి, వరవరరావు, కొండేపూడి నిర్మల, బన్న అయిలయ్య, శైలజామిత్ర, పెరుడు రామకృష్న, వడ్డెబోయిన శ్రీనివాస్ , అన్వర్, పల్లం మాధవీలత, అపరాజిత, వై.శ్రీరాములు, రామతీర్థ , జగధాత్రి, జాన్ హైడ్ కనుమూరి, వఝల శివకుమార్ , నెల్లుట్ల రమాదేవీ …… కవితా పఠనం చేసినవారిలో వున్నారు.
లంకా శివరామప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)