- జాన్ హైడ్ కనుమూరి
ప్రస్తుత దూర ప్రయాణాలు
రాత్రులకు అలవాటు పడ్డాయి
ప్రయాణిస్తూ నిదురోవచ్చు
నిదురోతూ ప్రయాణించొచ్చు
దూర ప్రయాణాన్ని పగటికి మార్చి
నిద్రపోలేని ప్రయాణం
కిటికీలను ఛేదించుకుంటూ వచ్చే
ఎండపొద నుండి
మెలమెల్లగా తప్పుకుంటూ
అప్పుడప్పుడూ
ఎదురయ్యే వాహనాల రొద వింటూ
మేల్కొన్న ఊర్లతో కళ్ళతోనే సంభాషిస్తూ
దాటుకుంటూ
గమన ఆగమనాల మధ్య
ఎక్కే దిగే ప్రయాణికుల్ని గమనిస్తూ
గమ్యం నగరం వైపు
నక్షత్రాల గుంపుల కోసం
జాబిల్లి తలుపు తెరచి చూసే వేళకు
గూటికి చేరాలని
ప్రియసఖితోనో
చిట్టితల్లులతోనో పంచుకోవాలని ప్రయాణం
తిరిగే చక్రం
ప్రగతికి చిహ్నమన్నట్టు
పరుగెడుతున్న బస్సు చక్రానికి
ఆలోచనల్ని బిగించుకొని
ఒకటే చక్రభ్రమణం
నా చుట్టూ నేనే!
నీ చుట్టూ నేనే!!
చింత తోపుల మధ్య పరుగెడుతున్న బస్సు
ఆలోచనల్ని జ్ఞాపకాల్ని
కాయలకో కొమ్మలకో తగిలించి
పరుగెడుతూనే వుంది
ప్రయాణభారమంత
కట్టెలమోపు
కళ్ళల్లోంచి గుండెల్లోకి దింపుకుంటూ… నేను
హఠాత్తుగా ఏర్పడ్డ అల్పపీడన వర్షంలా
మనసంతా ఒకటే చిత్తడి చిత్తడి
ధారలు ధారల కనుల వర్షం
ఏదో తెలియని అలజడి
బహుశ
ఎన్నో ఏండ్లుగా
గుండె లోతుల్లో
‘నిన్ను ప్రేమిస్తున్నాను’ ప్రియుడా!
వొంపులు దేరుతున్న దేహసౌర్యాన్ని
పొగడుతున్న అల్లిమిల్లి మాటలకు
మోహించి పరవశించి
నీ ప్రేమను చీదరించానేమో!
హంసతూలికా తల్పాలను కలగంటూ
కుక్కి మంచాలను కాలతన్నాను
నన్ను ఆరాధిస్తున్న కళ్ళ తడిని
పసిగట్టలేని పొరలేవో కమ్మేస్తూనే వున్నాయి.
అది
ఉదయమో
సాయంత్రమో
గేదె తోకలై వేలాడి పోగుచేసిన
పేడను పిడకలు చేసి
నాల్గునూకల గంజి కోసం
మండటాన్ని చూస్తున్నాను
వెలిగీ వెలగని పిడకల్లోంచి
రేగే పొగలో వర్షిస్తున్న కళ్ళను చూస్తున్నాను
తురతురమంటూ కాల్తున్న చితుకులుగానో
కణకణమండే నిప్పుకణికల కట్టెగానో
కాలిపోయిన సజీవ కట్టెలు చూస్తున్నాను
యెష్షయి మొద్దు నుంచేనా
ఎండిన కట్టెల్లోంచి చిగురు పుట్టదా?
( కత్తి పద్మారావు రాసిన “కట్టెలమోపు” కవిత చదివిన తర్వాత రాసాను. )
300 కి.మి. ప్రయాణం చేస్తూ వ్రాసినట్టున్నారు…పొడవుగా ఉంది. ఐతే దూరంగా వర్షం పడుతుంటే బస్సు కిటికీలో నుంచి చూసినట్టు అక్కడక్కడా మెరుపులు ఉన్నాయి.
కవిత బాగుంది. అంతకు మించి కత్తి పద్మారావు గారి మీద అభిమానాన్ని ప్రకటించినట్లుగా కనిపిస్తున్నది. అయితే జాన్ హైడ్ గారు గతంలో కూడ ప్రయాణాల్లో చాలా కవితలు రాశారు. కవితలు పెద్దగా రాయడం కారణంగా చిక్కదనం తగ్గుతుంది కాబట్టి చిన్నగా రాయడానికి ప్రయత్నిస్తే మంచిది.
అలాగే కవిత్వం వల్లే కలిగే సమిష్టి ప్రయోజనాన్ని కూడ గమనించాలని,ఆశిస్తున్నాను.
భౌతికంగా ప్రయాణం బహుశ నగరం నుంచి నగరానికి.
జీవన ప్రమాణాలు ఎటునుంచి ఎటో పోతున్నాయి.
బ్రతుకు దన్యం నుండి పరుగులు పరుగులు.
కట్టెలు కట్టెలుగా కాలిపోయిన జీవితాలు కళ్ళెదురుగా కనిపింస్తున్నాయి.
బైబిలులో వాడిన యెష్షయి మొద్దునుంచి పుట్టిన చిగురు యెసు.
ఎండిన కట్టెలనుంచి చిగురుకోసం ఎదురు చూడటం విశేషం.
నాకు చాలా బాగుంది.