- డా దార్ల వెంకటేశ్వరరావు

1.0. ప్రస్తావన:

సమాజం వ్యక్తుల సమూహం. వ్యక్తుల మధ్య వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. భారతీయ సమాజంలో వ్యక్తుల మధ్య ఏర్పడే వైరుధ్యాల్లో “కులం” ఒక అనివార్య సందర్భమయిపోయింది. క్రమానుగతి (Hierarchy),వేరుగా ఉండటం (Separation), పరస్పర ఆధారం (Interdependence) వంటి సూత్రాల ఆధారంగా కులం నిర్మితమవుతుంది .

ఒకే మూలపురుషుడు కలిగి, ఒకే ఆనువంశిక వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహాలు చేసుకుంటూ ఒకే పేరుతో చెలామణి అయ్యే కుటుంబాల లేదా బంధుత్వ సమూహాల స్వాధర్మ్యం  “కులం” అని సామాజిక శాస్త్ర వేత్తలు నిర్వచించారు . కులం వ్యక్తులకు శుద్ధి (Purity ), అశుద్ధి (Pollution) అనే గుణాన్ని ఆపాదిస్తుంది. తెగ (Tribe)కీ , కులాని (Caste)కీ కొన్ని సమాన లక్షణాల్లో ఉన్నా, “కులం” లో అశుద్ధి, అపవిత్రత వంశ పారంపర్యంగా మారి, అది వారిని శాశ్వతంగా అస్పృశ్యుల్ని చేస్తుంది. అంతే కాకుండా, అస్పృశ్యత అనేది భౌతిక, మానసికపరమైనది. వివిధ పనులు చేయటం వల్ల అది ఏర్పడుతుంది. దాన్ని “సంస్కారాల” రూపంలో తొలంగించుకునే అవకాశం ఉంది. కానీ, మానసికంగా ఏర్పడిన “భావన” మాత్రం అలాగే ఉండిపోయి ‘అస్పృశ్యత” కొందరికి “అవమానం”గా పరిణమిస్తుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. వంశపారంపర్యంగా వెంటాడుతుంది. కాసుల ప్రతాపరెడ్డిగారు “వెంటాడే అవమానం'’పేరుతో ఓ కథ రాశారు . ఒక సామాజిక వాస్తవాన్ని తెలిపేది ఈ కథ. దళితుడికి జరిగే అవమానాన్ని సామాజిక ఉన్నత అంతస్తు (Ascribed Status)లో ఉన్న వాళ్ళు, సామాజిక నిమ్న అంతస్తు (Lowest Social Status) లో ఉన్న వాళ్ళని తమతో సమానంగా చూడటానికి ప్రయత్నిస్తే కలిగే ఆటంకాలను ఈ కథలో వర్ణించారు. దళితులను, దళితేతరులను ఆలోచింపజేసే అనుభూతి ఐక్యత (Unity of Impression) గల కథగా దీన్ని చెప్పుకోవచ్చు.

1.1. కథా సారాంశం :

ప్రశాంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్. ఉద్యోగరీత్యా తన భార్యతో పాటు ఊరునుండి వచ్చేసి హైదరాబాదులో నివశిస్తుంటారు. వీళ్ళని చూడ్డానికి ప్రశాంత్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ వస్తుంది. ఆ రోజు ఎందుకో తల్లిని తొందరగా తన సొంత ఊరుకి పంపేయాలనుకుంటాడు. అతని అంతరంగం భార్యకే తెలియక అత్తగారిని ఇంకొన్ని రోజులు ఉండమంటుంది. ఆ మాటనే అతన్ని కూడా చెప్పమంటుంది. ఆ మాటని పట్టించుకోకుండా ఆఫీసుకి వెళ్తున్నానీ, ఎండ ముదరకముందే బయలుదేరమనీ తల్లికి చెప్పి ఓ వంద రూపాయలు చేతిలో పెట్టి ఆఫీసుకు వెల్లిపోతాడు. ఆతని తల్లి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేకనో, ప్రేమ లేకనో కాదు. దానికి ఓ కారణం ఉంది.

ఆ సాయంత్రం భోజనానికి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తానని రాహుల్ చెపుతాడు. రాహుల్ది అతని ఊరే. వాళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు. ఊరవతల గుట్టల్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే వారు. “ఎల్లయ్య” అనే పేరుని “రాహుల్” గా మార్చుకుంటాడు. బాగా చదువుకొని హైదరాబాదులోనే ఓ ఉద్యమంలో పనిచేస్తూ, ఈ మధ్యకాలంలో తనకి మళ్ళీ దగ్గరవుతాడు. అతడిని ప్రశాంత్ రెడ్డి ఎన్నోసార్లు భోజనానికి పిలిచేవాడు. రాహుల్ మాత్రం తర్వాత వస్తాననేవాడు. అలాంటి రాహుల్ ఆ రోజు భోజనానికి రావడానికి అంగీకరిస్తాడు. అతని తల్లిగానీ, తండ్రిగానీ ప్రశాంత్ రెడ్డికి ఎదురయితే “దండాలు దొరా” అని కాలు మొక్కుతుంటారు.

ప్రశాంత్ రెడ్డి తన భార్య వీణతో మాట్లాడేటప్పుడు , అప్పుడప్పుడూ రాహుల్ ప్రస్తావన వస్తుండేది. ఆమెకి కూడా రాహుల్ పట్ల జాలీ, సానుభూతి ఏర్పడిందని అతనికి అనిపించేది. ఆ ధైర్యంతోనే రాహుల్ని భోజనానికి రమ్మని పిలిచేవాడు. ఆ రోజు రాహుల్ వచ్చేటపటికి తల్లి తన ఇంటి దగ్గర లేకపోతే చాలనుకుంటాడు ప్రశాంత్ రెడ్డి. భార్య తనని అర్థం చేసుకుంటుందనుకుంటాడు. కానీ, “నీకు బుద్ధి లేదు కాబట్టే మాదిగోడికి మంచంలో తిండి పెడతానంటున్నావు” అంటుంది వీణ. “అడ్డమైన వాళ్ళకీ వండి పెట్టనంటుంది. వండి పెడితే ఊరుకోనంటుంది”.
ఇప్పుడేం చేయాలి? తన భార్యతో ఘర్షణ తప్పదా? తప్పలేదు. రాహుల్ వచ్చే టైమవుతుంది. రాత్రి ఏడున్నర తర్వాత వస్తాడు రాహుల్ . వచ్చీ రాగానే “అక్క” కనిపించటం లేదేమిటని అడుగుతాడు. “జ్వరం వచ్చింది. పడుకుంది.” అని ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. “అయ్యో డాక్టర్కి చూపించావా” అంటాడు రాహుల్. తలూపి, ఆ తర్వాత కాసేపటికి “హోటల్ కెళ్దాం పద” అంటాడు ప్రశాంత్ రెడ్డి. “చెప్పటం మరిచాను దారిలో పాత ఫ్రెండ్ ఒకతను కలిసి బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. భోజనం చేసిందాకా ఊరుకోలేదు. అందుకే రావటం ఆలస్యమయింది” అని రాహుల్ సమాధానమిస్తాడు. ప్రశాంత్ రెడ్డికి ఏమి మాట్లాడాలో పాలుపోదు. “సారీ” అని మాత్రం అనగలుగుతాడు. రాహుల్ చేతిని దగ్గరగా తీసుకొని ప్రేమగా నొక్కుతాడు. “ఎందుకింత ఇదయి పోతావు, మరోసారి తప్పకుండా “అక్క” చేతి వంట తింటా కదా!” అంటూ, తనకేమీ జరగనట్లే కాసేపు ఉండి, బయలుదేరతాడు. అతనితో పాటు బయటిదాకా వచ్చి సాగనంపేస్తూ, రాహుల్ ఓ వ్యాసంలో రాసిన వాక్యాల్ని గుర్తుచేసుకుంటూ, అతను వెళ్ళే దారిని చూస్తూ నిలబడిపోతాడు ప్రశాంత్ రెడ్డి.
దీన్ని కింది విధంగా విశ్లేషించుకునే అవకాశం ఉంది.

1.2. దళిత వాస్తవిక జీవిత చిత్రణ :

“అంటరానితనం, సాంఘిక అణచివేత, ఆర్థిక పీడన, రాజకీయ అణచివేత, మనుషులుగా పరిగణింప బడకపోవటం, పశువులకన్నా హీనంగా చూడబడటాన్ని ‘దళిత వాస్తవికత’ ” అని డా.ఎస్వీ. సత్యనారాయణగారి అభిప్రాయం . కట్టుబాట్లు, నమ్మకాలు వంటివి దళితేతరుల జీవిత వాస్తవికతగా ఆయనే వివరించారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు కథకు ‘జీవితం ముడి సరుకు’ అవుతుందని అంటారు. కథా వస్తువు రచయిత జీవితంలోనుంచి కానీ లేదా రచయితకు తెలిసిన ఇతరుల జీవితంలోనుంచి కానీ పుట్టవచ్చు అనీ, “కథలోని జీవితానికి ప్రాతినిథ్యం వహించగల పాత్రలని అదే జీవితానికి ప్రాతినిథ్యం వహించగలిగిన సంఘటనల్లో పెట్టి వాటి అంతరంగ, బహిరంగ జీవితాలనూ వాటి మధ్య ఉన్నసంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే వాస్తవిక కథనం  అవుతుందన్నారు. అలాగే ” పాత్ర మానసిక జీవితానికీ, భౌతిక జీవితానికీ మధ్య ఉన్న సంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే నిజమైన వాస్తవికతా వాదం అవుతుందనిచెప్పారు.

ఈ అభిప్రాయాలతో పరిశీలించినా, “వెంటాడే అవమానం” వాస్తవిక దళిత జీవితం ప్రతిఫలించే కథే అవుతుంది. మారుతున్న సామజిక పరిస్థితులు, విద్యాఉద్యోగ అవసరాల వల్ల దళిత, దళితేతరుల మధ్య సంబంధాలు తప్పనిసరవుతున్నాయి. అయితే, ఈ బంధం అవసరార్థం ఏర్పడుతున్నా, యాంత్రిక మానవ సంబంధాలుగా కొనసాగుతున్నాయి. అంతే తప్ప భౌతిక , మానసిక అంతరాల్లో భేదాలు తొలగించుకుని కలిసి పోయే మానవ సంబంధాలు కాలేకపోతున్నాయి. దీని వల్ల దళితుల పట్ల జాలీ, సానుభూతీ, అర్థం చేసుకునే పరిస్థితి ఒక వ్యక్తికి కలిగినా, ఆ వ్యక్తికి కుటుంబంతో, సంఘంతో, సమాజంతో కొనసాగవలసిన పటిష్ట బంధానికి ఆటంకాలుగానే ఉనాయి. ఈ విషయాలను కథలో సృజనీకరించి వాస్తవికతను ప్రతిబింబించేటట్లు రాశారు. అందుకనే ” వెంటాడే అవమానం” కథలో దళిత, దళితేతరుల మధ్య ఉండే సంబంధాలను కథలో పాత్రల మధ్య ఉండే గాఢతను పరిశీలిస్తే “అనుభూతి ఐక్యత” (Unity of Impression) అనే గొప్ప కథకుండే లక్షణం కనిపిస్తుంది. అంతే కాదు, కథా విమర్శకులు ఆశించినట్లు కథలో సంఘర్షణ ఉంది. ” ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒకే వ్యక్తిలోని రెండు వ్యక్తుల మధ్యా, రెండు భావాల మధ్యా, రెండు వర్గాల మధ్యా, రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవిత దృక్పథాల మధ్యా …” ఇలా ఎన్నింటి మధ్యనైనా సంఘర్షణ ఉండాలని వల్లంపాటి అంటారు . ఈ కథలో కింది విధంగా ఆ సంఘర్షణను వింగడించుకోవచ్చు.

1. దళితులు - దళితేతరుల మధ్య సాంఘిక అసమానతల వల్ల సంఘర్షణ.
2. కలిసి మెలిసి జీవించే విషయంలో సాంస్కృతిక సంఘర్షణ.
3. దళితులు - దళితేతరలు కలిసి మెలిసి జీవిస్తే భౌతిక, భావనావాద సిద్ధాంతాల్లో వారు దేన్ని అనుసరించి జీవించటంలో నిర్ణయించుకునే సంఘర్షణ.

పై మూడింటిలో మొదటిది సాంఘిక, ఆర్థిక కోణాలకు చెందిన సంఘర్షణ. మిగిలిన రెండు అన్ని వర్గాలూ కలిసి మెలిసి బతకటంలో కలిగే సంఘర్షణ ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి - కుటుంబంలో తల్లి, భార్యకి మధ్య సైద్ధాంతిక, సాంస్కృతిక ఘర్షణ కనిపిస్తుంది. అది వీణ - ప్రశాంత్ రెడ్డిల సంభాషణల్లో వ్యక్తమయింది. దీనివల్ల “వీణ”లో భావవాదం, గతానుభవాల వల్ల వచ్చింది. రాహుల్ జీవితంలో భౌతికవాదం కనిపించటానికీ గతానుభవాలే కారణమవుతున్నా, పూర్తిగా “భౌతికవాది”గా కనిపించకపోయినా, కత్తి పద్మారావు వంటి వారు అంబేడ్కర్ ఆలోచనా విధానంగా ప్రచారం చేస్తున్న “ప్రత్యామ్నాయ సంస్కృతి” లో భాగంగానే హిందూ కుల సమాజంలో కనిపించే పేరు “ఎల్లయ్య”ను తల్లితండ్రులు పెడితే, అతడు రాహుల్ అని మార్చుకుంటాడు. రాహుల్ అనేది అంబేడ్కర్ నమ్మిన భౌద్దిజానికి సంబంధించింది. కుల నిర్మూలనకు భౌద్ధ దీక్షను తీసుకుంటాడు డా.బి.ఆర్. అంబేడ్కర్. ఇవన్నీ దళితుల ప్రత్యామ్నాయ సంస్కృతికి జరిగే ప్రయత్నాల్లో కొన్ని. “సాధారణంగా నిత్య జీవితానికి పాత్ర ఎంత దగ్గరగా ఉంటే అంతం నమ్మకం కలుగుతుంది. మార్పు లేకుండా ఉండటం కథలోని పాత్రలకు ఉండవలసిన మొదటి లక్షణం (కథాశిల్పం -2000 :28). ఈ కథలో ప్రశాంత్ రెడ్డి - వీణ పాత్రలు నిత్య జీవితానికి దగ్గరలో ఉన్నాయి. సంఘర్షణ కూడా దగ్గరగానే ఉంది.

ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి భయపడో, సర్ది చెప్పటం వల్లనో తన భార్య “వీణ” మనస్తత్వం మారిపోతే కథలో సంఘర్షణ బయటకు రాదు. అప్పుడు కథ పేలవం అయిపోతుంది. “వీణ” మారలేదు. చివరకు ఒకే సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండటం వల్లనే, కథలో రచయిత చెప్పదలచిన “సమస్య” పట్ల, పరిష్కారం పట్ల పాఠకుడు లోతుగా ఆలోచిస్తాడు. ఇదే కథకు ప్రాణం వంటిది. కథలో సాధరణంగా ఒక నేపథ్యం చిత్రితమవుతుంది. స్థలం (Place ), కాలాల (Time) చిత్రణే కథాసాహిత్యంలో నేపథ్య (Setting) చిత్రణ ( కథాశిల్పం - 2000 : 34) అవుతుంది. దీన్ని బట్టే రచయిత చిత్రించవలసిన “సమస్య” తీవ్రత అర్థమవుతుంది.

“వెంటాడిన అవమానం” కథ : దళిత వాస్తవిక జీవితం -రెండవ భాగం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)