- డా దార్ల వెంకటేశ్వరరావు
1.3. కథా నేపథ్య చిత్రణ - సమస్య తీవ్రత :
ఒకరోజులో ఈ కథ జరిగినట్లుగా రచయిత వర్ణించారు. కులనిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలన ఒక్కరోజులో జరిగేవి కాదు. పొద్దున్నే ప్రశాంత్ రెడ్డి స్నానం చేయడానికి వెళ్తుండగా ప్రారంభమైన కథ రాత్రికి ముగిసింది. కథలో పగలు అంతా ఉన్నది తానూ, తన భార్య. చీకటిలో వచ్చి, చీకటిలోనే ఒంటరిగా కలిసిపోయినవాడు రాహుల్.
తాను అనుభవిస్తున్న వెలుగుని, తన తోటివారికి పంచాలనో, ఆదుకోవాలనో ఆశించటంవల్లనే “రాహుల్”తో కాసేపయినా చీకటిలో ప్రశాంత్ రెడ్డి నిలబడ్డాడు. వెలుతురు కోసం చీకటిలో కలిసిన వాడికోసం చూస్తూ నిలబడ్డాడు. ఈ కథలో వెలుతురు ఉండగా కనిపించిన పాత్రలు మూడు. చీకటిలో వచ్చి చీకటిలోనే వెళ్ళిపోయిన పాత్ర ఒకటి. మూడింటిలో ఒక వర్గం, ఒంటరివాడి తోడు కావాలంటే, తాను తన వ్యవస్థ నుండి బయటకు వచ్చేయాలి. అప్పుడూ రెండు వేరు వేరు సమాజలవుతాయి తప్ప మూడు + ఒకటి = నాలుగు (3+1=4) పాత్రలూ కలిసిన సమాజం కాదు. రాహుల్లో ఆశావాదంగా “అక్క చేతివంట తప్పకుండా మరోసారి తింటానని” అనుకుంటూనే, తాత్కాలికంగా అవమానం వెంటాడినా దాన్ని జయించి, అందరిలో కలిసే రోజు వస్తుందనే ఆకాంక్ష కనిపిస్తుంది. దానికి ఏమీ చేయాలని ప్రశాంత్ రెడ్డి ఆలోచించటమే ప్రశాంత్ రెడ్డి మనసులో రాహు రాసిన వ్యాసంలో వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ నిలబడటం. కనుక నాలుగు వర్ణాల వాళ్ళు కలిసి మెలిసి బతకడం ఎలాగో పాత్రానుగుణంగా, సంఘర్షణాత్మక సన్నివేశాలతో ఈ కథ నిర్మిత మయిందని స్పష్టమవుతుంది.
1.4. సమస్య తీవ్రతకు కారణం - అస్పృశ్యత :
భారతదేశంలో కులం అస్పృశ్యతలో అంతర్భాగమయిపోయింది. అస్పృశ్యత అనేది భౌతిక, మానసికమైన మైల (Impurity) వల్ల ప్రపంచ దేశాల్లో ఉందని “అస్పృశ్యులెవరు?” అనే గ్రంథంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ పరిశోధనాత్మకంగా చర్చించారు . “అశుచి, మైల, కళంకం, అపవిత్ర్త, అంటు, అపరిశుభ్రత, మురికి అనే భావాలు అస్పృశ్యతకు దారి తీస్తాయనీ, ఈ కళంకం నుండి తప్పించుకుని బయట పడే మార్గాలు కూడా ఈ భావనలో ఇమిడి ఉంటుందని” డా. బి.ఆర్. అంబేడ్కర్ భావించారు “ఆదిమ సమాజం కేవలం మైల (Pullution) పడడం అనే భావన పట్ల నమ్మకం కలిగి ఉండటమే కాదు, నిర్దిష్టమైన కర్మకాండలు, ఆచార వ్యవహారాలు అనుసరించే ఒక జీవన విధానం ఆవిర్భావానికి కూడా ఈ అస్పృశ్యత అనే భావన దారి తీసింది. “వస్తువుల్ని తాకడం ద్వారా ద్వారా సంక్రమించే “మైల” విషయానికొస్తే, ఆదిమ మానవుడు కొన్ని వస్తువుల్ని పవిత్రమైనవిగా, మరికొన్ని అపవిత్రమైనవిగా పరిగణించటం అలవర్చుకున్నాడు. పవిత్రత అనే భావన కేవలం వస్తువులకు మాత్రమే తప్పనిసరిగా పరిమితం కానక్కరలేదు. కొన్ని తరగతుల మనుషులు కూడా పవిత్రులుగా పవిత్రులుగా పరిగణించబడ్డారు.
పొలినేషియన్ తెగల్లో, ‘ఉగాండా’ దేవాలయంలో, దక్షిణాప్రికాలో, న్యూజిలాండ్లో, ఈజిప్టు గ్రీకు రోమన్లలో కూడా మైలపడటం అనే భావన ఉన్నట్లు అంబేడ్కర్ వివరించారు. ఈ మైల భౌతికమైనదిగానూ, భావనాత్మకం (నమ్మకం) గానూ ఉంటుందని మనువు చెప్పిన ఆంశాన్నీ అంబేడ్కర్ పేర్కొన్నారు . అయితే మైల నుండి కొంతమంది మాత్రమే సంస్కారాల రూపంలో తొలగించుకోవచ్చు అనే నిబంధనలను భారతదేశంలో పటిష్టంగా అమలు చేశారు. మరికొంత మందికి మాత్రం సంస్కారాల రూపంలో కూడా అపవిత్రతను తొలగించుకునే అవకాశమే లేకుండా చేశారు.
హిందువులు పాటించే మరొక రకమైన అస్పృశ్యత ఉన్నది. ఇది కొన్ని జాతులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తున్నది. ఇది కొన్ని జాతులకు వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే 9 భాగాలుగా విభజించి, మైల పడే కులాల వాళ్ళుగా 50 నుండి 60 మిలియన్ల ప్రజలు ఉన్నారనీ, సుమారు 429 అస్పృశ్య కులాలు ప్రభావితమవుతున్నాయనీ అంబేడ్కర్ సోదాహరణంగా నిరూపించారు.
వివరణలన్నీ అస్పృశ్యత అనేక దేశాల్లో ఉన్నా, భారత దేశంలో అస్పృశ్యత కులంతో మిళితమైందనీ స్పష్టమవుతుంది. అంతే కాకుండా భౌతిక, మానసిక భావనగా ఇది గాఢమైన ముద్రను వేస్తుంది. కనుకనే, “వెంటాడే అవమానం” కథలో ఊరికి తల్లిని త్వరగా పంపేయటం, తల్లి ఉంటే ఊరిలోనూ తెలిసిపోతుందనీ ప్రశాంత్ రెడ్డి భయపడటం, తన భార్యలో ఆ భావాలు స్పష్టంగా ప్రకటితం కావడం అనే నేపథ్య చిత్రణ కథలో సమస్య తీవ్రతను బాగా చూపగలిగింది. ప్రశాంత్ రెడ్డి స్నానానికి వెళ్ళటం, దళితుల్లో కలిసి పోవాలనుకోవటం, దళితులను తమతో కలిసిపోవమనటానికో, సంస్కరణగానో తరతరాల అస్పృశ్యతను సంస్కరించే ప్రయత్నాన్ని చేశారు రచయిత. అలాగే ప్రశాంత్ రెడ్డి భార్య అంట్లు తోమడం, కడగటంలో కూడా ఆమెలో భౌతికంగా, మానసికంగా రావలిసిన మార్పుని ప్రతీకాత్మకంగా పాత్ర వర్ణన, సన్నివేశ కల్పనలలో సృజనీకరించారు. కథలోని సమస్య సంఘర్షణకు పరిష్కారాన్ని తప్పకుండా చూపించాలనిగానీ లేదా చూపించకూడదని గానీ వాదించటం మొరటువాదంగా విమర్శకులు భావిస్తున్నారు. పరిష్కారం అనేది కథలోనించే సహజంగా రూపొందాలి. పరిష్కారాన్ని బలవంతగా కథ మీద రుద్దటం శిల్ప పరంగా బాధ్యతా రాహిత్యం మాత్రమే అని కథా విమర్శకులు చెప్పారు. అయితే, కథలో ముగింపు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్నే కథాశిల్పం రాసిన విమర్శకుడు వివరిస్తూ ” కథ రాయటం పూర్తి చేశాక ప్రారంభాన్నీ, ముగింపునీ తీసేయాలని అంటే వాటిని అదృశ్యంగా ఉంచాలని వాటిని పాఠకుని ఊహా శక్తికి పదును పెట్టాలని” అన్నారు. దీనికి వెంటాడిన అవమానం కథ సరిగ్గా అతుకుతుంది.
1.5. కథకుడిచ్చిన పరిష్కారం:
“వెంటాడిన అవమానం” కథలో పరిష్కారాన్ని ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. అయితే దాన్ని suggestive గా పరిష్కారాన్ని స్ఫురింపజేసి మంచి నైపుణ్యంతో ముగించారు. పాఠుకుని ఊహా శక్తిని బట్టే పరిష్కరాలు వెలువడాలని ఆకాంక్షించారు. అస్పృశ్యతగా పరిణమించి వ్యక్తుల మధ్య భౌతిక, మానసిక అంతరాలకు కారణమవుతున్న ఈ సమస్యను పరిష్కరించుకోవటం దళిత - దళితేతరుల మధ్యే ఉంది. అది ప్రత్యామ్నాయ సంస్కృతి వలన సాధ్యమా? సాంస్కృతికీకరణా వలన సాధ్యమా? లేక ఆ రెండింటినీ మించిన ఉదాత్త జీవన విధానమా? అనేది “అందరూ కలిసి మెలిసి ఉండే ఆలోచనగా” దళిత - దళితేతర మేధావులు చేయగలగాలి. అది భావ, భౌతిక వాదుల కలయికతో ఏర్పడేదై ఉండాలి. అస్పృశ్యత అనే భావన తొలగిపోయిన తర్వాత భావ భౌతిక వాదాల సంఘర్షణలో ఏదో ఒకటి లేదా ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చి మానవులందరినీ కలిసి మెలిసేటట్లు చేయగలుగుతుంది.
1.6. ముగింపు :
“వెంటాడిన అవమానం” కథలో రచయిత కాసుల ప్రతాప రెడ్డి తరతరాలుగా ఉన్న అనేక రకాలైన అస్పృశ్యతలకు సంబంధించిన భౌతిక, మానసిక భావనలను స్పృశించారు. అలాంటి అస్పృశ్యత కొన్ని వందల సంవత్సరాలుగా కులంలో కలిసిపోయింది. అంబేడ్కర్ కూడా భౌతిక, భావవాదాల కలయికగా అస్పృశ్య భావనను చూడగలిగి, భౌతిక దృష్టి వైపు పయనించమనే ఆలోచనను అందించారు. భావవాదం, అదీ భారదేశంలో మతం, కర్మకాండలు, విశ్వాసాలతో ముడి పడి ఉండటం వల్ల ఆ వాదాన్ని నమ్మే, ఆచరించే, ప్రోత్సహించేవాళ్ళ సంఖ్య అధికంగానే ఉంటుంది. అందువల్లనే భావవాదం మాసిపోవడమో, నశించడమో, రూపుమాపటమో సులభమైన మార్గమైతే అంత దగ్గరలో లేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందాలి. శాస్త్రీయ దృక్పథం అలవడాలి. సాంఘికీకరణ ప్రక్రియలు శాస్త్రీయ కోణంలో అమలు జరగాలి. అంతే కాదు, నేటికీ సమాజంలో శాస్త్రీయంగా ఋజువుకానివి ఎన్నో ఉన్నాయి. శాస్త్రానికి అందని వాటిని శాస్త్రీయంగా నిరూపించటానికి కేవలం ఇప్పుడున్న పరిశోధనల మీదనే ఆధారపడితే సరిపోదు. కానీ, శాస్త్రీయ దృక్పథం ఏర్పడాలని మాత్రం “వెంటాడిన అవమానం” కథ ప్రబోధిస్తుంది. దళిత వాస్తవిక జీవితాన్ని విశదీకరిస్తుంది.
ఆధారాలు:
1. సమాజ శాస్త్ర సూత్రాలు, (సం.పా) ఆచార్య వై.సి. సింహాద్రి., ఆచార్య జి. సత్యనారాయణ., డా. బి.ఆర్. సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రచురణ: హైదరాబాదు - 2003
2. కాసుల ప్రతాపరెడ్డి., వెంటాడే అవమానం (కథ), ఈనాటి ఏకలవ్య (దళిత సాహిత్య, సాంస్కృతిక ప్రత్యేక సంచిక), సంపాదకుడు : కె.జి. సత్యమూర్తి., జనవరి - ఫిబ్రవరి, 1997.
3. వల్లంపాటి వెంకట సుబ్బయ్య, కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ : హైదరాబాదు - 2000.
4. డా. ఎస్.వి. సత్యనారాయణ, దళిత సాహిత్య నేపథ్యం (వ్యాసం), ఈనాటి ఏకలవ్య (దళిత సాహిత్య, సాంస్కృతిక ప్రత్యేక సంచిక), సంపాదకుడు : కె.జి. సత్యమూర్తి., జనవరి - ఫిబ్రవరి, 1997.
5. కత్తి పద్మారావు, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి, లోకాయత ప్రచురణ : పొన్నూరు, 1994.
6. డా. బి.ఆర్. అంబేడ్కర్, అస్పృశ్యులెవరు?, అనువాదం, సంపాదకులు : ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఆచార్య ముదిగొండ వీరభద్ర శాస్త్రి, ఆచార్య బి. రామకృష్ణారెడ్డి., బాబా సాహెబ్ అంబేడ్కర్ రచనలు - ప్రసంగాలు., సంపుటి - 7., ఆంధ్రపదేశ్ ప్రభుత్వ ప్రచురణలు : 1992.
[…] “వెంటాడిన అవమానం” కథ : దళిత వాస్తవిక జీవితం -రెండవ భాగం […]