‘అభివృద్ధి విధ్వంసం - సంస్కృతి రూపాలు’ అంశంపై చివరి సెషన్
రాఘవాచారి అధ్యక్షత వహించగా వేణుగోపాల్ ఉపన్యసించారు.

వేణుగోపాల్ ఉపన్యాసం

‘అభివృద్ధి’ నిర్వచనం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి కైట్ ఫ్లయింగ్ చేయాలి. గాలిపటం ఎగరటంలో నియంత్రణ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే గాలిపటం ప్రాంతీయవాదంలో కొట్టుకుపోతుంది. అభివృద్ధిని కొన్ని ఉదాహరణలు తీసుకొని నిర్వచించడానికి ప్రయత్నిస్తే… 1956లో వ్యవసాయరంగంలో 1600 ట్రాక్టర్లు ఉండేవి. 2000 సంవత్సరం నాటికి రాష్ట్రంలో వినియోగించే ట్రాక్టర్ల సంఖ్య 90,000. సాగు యోగ్యమైన భూమి 1956 నుండి 2000 వరకు ఏమీ పెరగలేదు. మరి ఎంతమంది కూలీలను ఈ ట్రాక్టర్లు రీప్లేస్ చేశాయి. 1985లో కారంచేడు సంఘటన జరిగింది.

1920ల్లోనే ఆ ఊళ్ళో వ్యాపారపంటలు పండించేవారు. ఎంతో అభివృద్ధి, మిగులు కనబడుతుంది. కాని 1985 నాటికి కూడా దళితులు గేదెల్ని కడిగే నీటినే తాగే పరిస్థితి. కోస్తాలో నిర్మించబోయే పారిశ్రామిక కారిడార్ కోసం పోలవరం ప్రాజెక్టు 276 గ్రామాలను ముంచేయబోతోంది. లక్షల మంది ఆదివాసీల సంస్కృతి ధ్వంసం కాబోతోంది. సామ్రాజ్యవాదం ఆటోమొబైల్, చమురు పరిశ్రమ కొరకు ముస్లింల మీద భయంకరమైన దాడి చేస్తోంది.

ఆర్థికంగా స్థితిమంతుడైతే అభివృద్ధి చెందారు అంటారు. కొత్తవి వస్తే అభివృద్ధి అంటారు. భోగలాలసే అభివృద్ధికి చిహ్నం అవుతోంది. ఈ క్రమంలో మనిషితనం అదృశ్యమవుతోంది. విద్యావకాశాలు, పెరుగుదలే అభివృద్ధి అని కూడా అంటారు. తలసరి ఆదాయం, తలసరి వినియోగంతో అభివృద్ధిని నిర్వచించాలని చూస్తే ఆ లెక్క సక్రమంగా ఉండదు. 1990ల్లో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అభివృద్ధికి మూడింటిని ప్రమాణంగా చెప్పింది. ఒకటి ఆయుఃప్రమాణం ఎంత ఉంది, రెండు విద్యావకాశాలు, మూడు కొనుగోలు శక్తి. చివరికి లెక్కించే క్రమంలో కొనుగోలు శక్తి ఎక్కువగా వచ్చింది. అంతిమంగా సరుకుల కొనుగోలు దగ్గరికి వచ్చింది. మరొక నిర్వచనంలో పల్లెలు వెనుకబడినతనానికి, పట్నం అభివృద్ధికి చిహ్నం అయిపోయింది. ప్రాచీన కాలంలో కూడా గుప్తుల స్వర్ణయుగం, రాయల స్వర్ణయుగం అని చెప్తారు కాని ప్రజాజీవనం గురించి ఏమీ ఉండదు. రాయలకాలంలో రత్నాలు రాసులోగా పోశారన్నారు. అవి ఎవరు కొనుగోలు చేశారు. పార్శీలు కొన్నారు. అభివృద్ధి పథకం, అభివృద్ధి రెండింటికీ చాలా తేడా ఉంది. కాస్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ కంటే కాస్ట్ ఆఫ్ అన్‌డెవలప్‌మెంట్ ఎక్కువ కనుక అభివృద్ధికి మూల్యం చెల్లించాలి అని చెబుతారు. మరోమాటలో ముంపువాసులు, నిర్వాసితులు త్యాగాలు చెయ్యాలి అని చెబుతారు.

మానవ ముఖంలో అభివృద్ధి అని కూడా అంటారు. అభివృద్ధి మానవుల కోసమే అయితే దానికి ముఖం తొడగడం ఎందుకు? 1983-84లో అనంతపురం ఎడారిగా మారబోతున్నది అని రిపోర్టు వచ్చింది. అభివృద్ధి నిధులన్నీ అనంతపురంలోకి ప్రవహించాయి. అభివృద్ధి అనేది ఇంటలెక్చువల్ మాఫియా, ఎన్జీవో మాఫియా అవుతోంది. అభివృద్ధిని సంస్కృతి నుండి ఎలా అర్థం చేసుకోవాలి? అభివృద్ధి భావజాలంగా ఉంది. దీనిని ఎలా ఖండించాలి. అభివృద్ధి అంటే ఒక స్థితిలా కోస్తా, పంజాబ్, హైదరాబాద్ సాధించిన స్థితిలా చూసే భావజాలం. ఒక జడత్వరూపంగా చర్చిస్తున్నాము. పాలకవర్గాలు అభివృద్ధిని ఒక కలగా చూపిస్తున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ ఇలా… అభివృద్ధి అనే కలను కొనుక్కోవడానికి మధ్యతరగతి సిద్ధంగా ఉంది.

అభివృద్ధిని ఉత్పత్తి సంబంధాల, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిగా మనం అర్థం చేసుకోవాలి. నానో టెక్నాలజీ, నరబలి పక్కపక్కనే జరిగాయి. ఎందుకంటే ఉత్పత్తి శక్తులలో, ప్రజల్లో అభివృద్ధి జరగలేదు. బాంబేలో అణు విద్యుత్ కేంద్రం, పక్కనే పశుపోషణ దిశలో ఆదివాసీ తెగ ఉన్నాయి. ఇక్కడ మావో చెప్పిన అభివృద్ధిని అర్థం చేసుకోవాలి. ఏంగిల్స్ మనిషి శక్తి ఒక పనిముట్టులోకి ట్రాన్స్‌ఫర్ అయింది అని చెబుతాడు. పెట్టుబడి మనిషి చేతికి, పనిముట్టుకు అడ్డుగోడ. మన అభివృద్ధి అవసరాలు మనమే నిర్ణయించుకోవడమే స్వావలంబన. రాయలసీమలో సజ్జలు, జొన్నలు వంటి తిండిగింజలు పండగలవు. వ్యాపార పంటలు ఎందుకు పండించాలి? అభివృద్ధిని మనిషి వైపు నుండి నిర్వచించాలి. బస్తర్‌లో ఆదివాసులు అలా నిర్వచిస్తున్నారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)