14.1.2006 - అసమ అభివృద్ధి, రాయలసీమ సాహిత్యం అంశంపై మొదటి సెషన్
దీనికి రవి అధ్యక్షత వహించారు. భార్గవ రాయలసీమ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ మాట్లాడారు. అసమానమైన అభివృద్ధి ఈరోజుది కాకపోయినా, సాహిత్యంలో ఇప్పుడు ప్రతిఫలిస్తోందన్నారు. పీడితులు ఈరోజు సాహిత్య వస్తువును శాసిస్తున్నారు అని చెప్పారు. స్వామి, సింగమనేని నారాయణ వంటి వివిధ రచయితల కథలు, కథా వస్తువులను విశ్లేషించారు.
రెండో సెషన్‌లో నందిని సిధారెడ్డి ఉపన్యాసం
కాశిం అధ్యక్షత వహించగా కవి నందిని సిధారెడ్డి ఉపన్యసించారు.
అభివృద్ధిలో రెండు కోణాలున్నాయి. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి. తెలంగాణలో సారవంతమైన భూమి ఉంది. నీరు పారడం లేదు. రేగడి వితుత్లు నవలలో తెలంగాణ పై దుర్మార్గమైన దాడి జరిగింది. కనీసం నాలుగుసార్లు ప్రస్తావించారు నైజాం నడిగడ్డ అడవి అని. కోస్తావారు చౌకగా భూములు కొనడం, కాలవ పారించుకోవడం క్రమంగా వలసవచ్చిన కోస్తావారితో ఒక ఊరే తయారయ్యే క్రమం రేగడివిత్తులు నవలలో ఉంది. జొన్నలు, రాగులు పండే భూమిలోకి వ్యాపారపంట పత్తిని తీసుకొస్తారు. సంఘాల పంతులు (సురవరం ప్రతాపరెడ్డి) కథలో టైమెంతయ్యిందయ్యా అంటే కుక్కల అరుపుల్ని బట్టి నాలుగయ్యింది అంటారు. కోళ్ళ అరుపుల్ని బట్టి కదా ఎవరైనా టైమ్ చెప్పేది అంటే దొరలు మా కోళ్ళనేమీ మిగిలించలేదు అంటారు. తెలంగాణలో నైజాం కాలంలోని దొరల దోపిడి అట్లా చూపించబడింది. భూమి కోసం పోరాడిన రైతుల గురించి ఎన్నో కథలు వచ్చాయి. భూమి కోసం పోరాడిన రైతులే ఇప్పుడు భూములు అమ్ముకొనేలా చేస్తాంది సామ్రాజ్యవాదం. కాకతీయుల కాలంలో గొలుసు చెరువుల పద్ధతి ఉండింది. 1984లో ఎన్.టి.ఆర్. చెరువుల్ని ధ్వంసం చేసి కోస్తా వాళ్ళకు నీళ్ళు ప్రవహింపజేశారు. నాగార్జునసాగర్ కట్టడం వల్ల తెలంగాణలో పెద్దగా మార్పు రాలేదు. కృష్ణా, గోదావరి 70 శాతం తెలంగాణలోనే పారతాయి. కాని తెలంగాణలో ఎక్కువగా బోర్ల ద్వారానే వ్యవసాయం ఉంది. కాలువల ద్వారా వ్యవసాయం చేస్తే 4 శాతం పెట్టుబడి ఉంటే బోర్ల ద్వారా వ్యవసాయానికి 37 శాతం పెట్టుబడి అవుతుంది. రియల్ ఎస్టేట్ కోసం ఐ.ఐ.టి.ని మెదక్ తీసుకొస్తున్నారు. నేను మెదక్ వాడినే అయినా ఐ.ఐ.టి.ని బాసర్లోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.
మూడో సెషన్‌లో ప్రొ॥ హరగోపాల్ ఉపన్యాసం
రత్నమాలగారు అధ్యక్షత వహించగా, ప్రొ॥ హరగోపాల్‌గారు ఉపన్యసించారు.
ఒక కాలేజీ సావనీర్‌లోని ఒక బయో టెక్నాలజీ వ్యాసం నన్ను ఆశ్చర్యపరచింది. అందులో పొగాకు మొక్కను మందుపాతరలను కనుగొనే విధంగా రూపొందించవచ్చునట జన్యు మార్పిడితో. ఇది నక్సలైట్లను నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది అని రాశారు. అసలు సైన్స్ ఏం ఆలోచిస్తోం? నక్సలైట్లు ఏమిటి? వాళ్ళ ఉద్యమం ఎందుకోసం ఉంది? ఏ ఆలోచనా లేదు. మనిషి ఉన్నతంగా జీవించడం కోసమే కదా సైన్సు ఉపయోగపడవలసింది. ఉత్పత్తి చేసే సైన్సుకే విలువ పెరుగుతోంది. బేసిక్ సైన్స్ కాక అప్లైడ్ సైన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థికి సమాజం పట్ల ఉండాల్సిన దృక్పథం లేదు. విద్యార్థిని సంపూర్ణంగా సమాజంతో విడగొట్టేశారు. 1966-67లో కొఠారి కమీషన్ రిపోర్టు మాత్రమే విద్యపైన వచ్చిన మొదటి, చివరి రిపోర్టు. అది కూడా అప్పుడు జరిగిన ప్రజా ఉద్యమాల ప్రేరణతో వచ్చి ఉండవచ్చు. విద్య అనేది సామాజిక జీవనాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి అంచనా వేసేది అయి ఉండాలి. ఇప్పుడు జ్ఞానం సంపదను ఉత్పత్తి చేయడానికే అన్నట్లు ఉంది. సంపాదన, వినియోగం ఇవే లక్ష్యాలుగా ఉన్నాయి. సమాజాన్ని సాహిత్యం బాగా ప్రతిఫలింపజేస్తుంది. అల్లం రాజయ్యగారి ‘ప్రత్యర్థులు’ కథ చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నరసింహారావుగారి అంతరంగాన్ని, ఆయన జీవితంలోని వివిధ కోణాల్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారా అనిపిస్తుంది.