‘రాయలసీమ రాజకీయార్థిక విశ్లేషణ’ అంశంపై 3వ సెషన్‌లో జి.యస్. రామ్మోహన్ అధ్యక్షోపన్యాసం:

పుట్టపర్తి నారాయణాచార్యులు ‘కపటపు నాయకుల గుంపు, సత్కవీంద్రుల కన్నీటి ముంపు చూడమ్మా,’ అంటాడు మేఘదూతంలో. రాయలసీమకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. 1907లో రాయలసీమ యువక సాంఘిక సభ జరిగింది. 1937లో శ్రీ భాగ్ ఒడంబడిక చేసుకొన్నారు. అప్పటి నుండి రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతున్నారు.

రచయితలు, కళాకారులు మాత్రమే చైతన్యం నిలబెడుతున్నారు. రాజకీయ నాయకులు కాదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటును గురించి రాయలసీమవారు ఆంధ్ర మహాసభలో పాల్గొనకుండా 18 ఏళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడైతే విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండాలో, ఐ.ఐ.టి. ఎక్కడ ఉండాలో రియలెస్టేటు చెప్పాలి. 1907లో సంజీవరెడ్డి రాష్ట్రం విడిపోయే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ మూడురకాల అభిప్రాయాలు వచ్చాయి. ఉత్తరాదిలో వేగలేం కనక సమైక్యంగా ఉండాలి అని ఒకటి, రాయలసీమ విడిపోవాలి అని ఒకటి, రాయలసీమకు అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలి అని ఇంకో అభిప్రాయం. అన్ని రకాలుగా రాయలసీమకు అన్యాయం జరిగింది. కృష్ణ దేవరాయల పాలనలో ఎంత అణచివేత ఉన్నా ఇక్కడి వారు ఆయన పాలనను పొగుడుతారు. కొన్ని చెరువులు తవ్వించారని, నీటి సౌకర్యం కలిగించారని, ఇప్పుడైతే ఆ కనీస సదుపాయాలు కూడా అందివ్వడం లేదు కనుకనే రాయల నాటి పాలనే మంచిదని చెప్పుకొనే దుర్భరమైన స్థితి ఇది. పోతిరెడ్డిపాడు గురించి ఎంతో వివాదం ఉంది. న్యాయంగానైతే రాయలసీమకు కృష్ణా జలాల్లో వాటా ఉంది.

బాలగోపాల్ ఉపన్యాసం:

రాయలసీమలో నీటి లేమి ప్రధానమైన సమస్య. నీరు ఇంకిపోయే నేలలు ఇక్కడ తక్కువ. పెన్నా బేసిన్‌లో మాత్రమే నల్లరేగడి నేల కనిపిస్తుంది. మిగిలినవన్నీ ఎర్ర నేలలు. ఇక్కడ 700 మి.మి. కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. నిజాం నవాబు రాయలసీమను తనే పాలించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదేమో! ఇక్కడి నేల విస్తీర్ణత, జనాభా నిష్పత్తి చూస్తే అది మూడోవంతు తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ నేల చాలామందిని పోషించలేదు కాబట్టి. సాగు యోగ్యమైన భూమి 20 శాతానికంటే తక్కువ. అతి తక్కువ సాగుయోగ్యమైన భూమి కడప జిల్లాలో ఉంది కానీ రాయలసీమలో దానికే ఎక్కువ నీళ్ళు ఇవ్వగలిగారు. అనంతపురంలో సగటు వర్షపాతం 500 మి.మి. కంటే తక్కువ. రాయలసీమలో భూగర్భ జలం వెయ్యి అడుగులకు పోయింది. దీనికి తోడు వ్యవసాయం చాలా అస్థిరంగా ఉంది. క్షామం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 70% తిండిగింజలు పండించరు. తెలంగాణలో పండిస్తారు. మొత్తం రాష్ట్రంలో రాయలసీమ జనాభా 19% ఉంది. ఫ్యాక్టరీలు 11%, కార్మికులు 5% ఉన్నారు. ఇక్కడ ఒక మిత్ ఉంది. రాయలసీమలో అపారమైన ఖనిజసంపద ఉందని, దాన్ని అభివృద్ధి చేయాలని. నిజానికి ఇక్కడ చాలా తక్కువ మినరల్స్ ఉన్నాయి. వనరులు బయట నుండి వస్తేగాని రాయలసీమ బాగుపడదు. రాయలసీమలో కె.సి. కాలువ ఆయకట్టుకు చాలా నీరు తీసుకొంటున్నారు. ఇంకా కావాలని అడుగుతున్నారు. అనంతపురంకు ప్రాధాన్యత ఇవ్వరు. జిల్లాల మధ్య సమదృష్టి లేదు. అనంతపురానికి నీళ్ళిచ్చే తుంగభద్ర కాలువలు పాడయిపోయి ఉన్నాయి. కర్ణాటక వాళ్ళు సమాంతరమైన కాలువ తీద్దామంటున్నారు. ఇది చాలా చిన్న విషయం. కానీ చేయరు. జల రాజకీయాల్లో భారీ కాంట్రాక్టులు ఉంటే కాని పని చేయరు. ఆదిలాబాద్‌కు నీరిచ్చే పెన్‌గంగ కూడా ఇలాగే పక్కన పెట్టారు.

రాయలసీమ సామాజిక జీవితం గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ పెత్తందారీ వర్గం, దాని స్వభావం వల్ల మెరుగైన జీవితం రావడంలేదు. వర్షపాతం మహబూబ్‌నగర్‌కు, కడపకు ఒక్కటే. కె.సి. కెనాల్ తయారయింది, జూరాల కాలేదు. నాయకులు తమకు కావలసింది ఎక్కడికైనా తీసుకురాగలరు. ఇక్కడ ప్రజాతంత్ర వాతావరణం చాలా తక్కువ. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ బాగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా ఫ్యాక్షనిస్టుల్లాగా వ్యవహరిస్తారు. ఫ్యాక్షన్ సంస్కృతి ‘60ల నుండి రాజకీయాల్లోకి, సివిల్ కాంట్రాక్టుల్లోకి వచ్చింది. రాజశేఖరరెడ్డి, యం.వి.రవణారెడ్డి పోటీపడ్డారు. ఇక్కడ నాయకుల్లోనే కాదు ప్రజల్లో ఫ్యాక్షన్ సంస్కృతి ఉంది. ప్రజల్లో ప్రజాస్వామిక సంస్కృతి పెంపొందించకపోతే అదే వర్థిల్లుతుంది. జల రాజకీయాలు తెలంగాణ, రాయలసీమ మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. విద్యాసాగర్‌రావు కృష్ణా మిగులు జలాల్లో రాయలసీమకు హక్కులేదు అంటాడు. రాయలసీమ నాయకులేమో మొత్తం రాయలసీమకే అంటారు. ఒక ప్రజాస్వామిక చర్చ అవసరం. వెనకబడిన ప్రాంతాల మధ్య విద్వేషం చాలా నష్టం కలుగజేస్తుంది. జలయజ్ఞంలో రాజశేఖరరెడ్డి మాత్రమే లాభపడుతున్నాడు. కాంట్రాక్టులు ఇచ్చేసి మిగులు జలాల మీద కాలువలు కట్టేస్తున్నాడు. నీళ్ళు మాత్రం రావు.

కడప జిల్లా వాళ్ళు వచ్చినప్పుడే వస్తాయిలే అనుకొంటారు. ప్రజలు ఎంత కోట్లాడుకుంటే అంత మంచిది ఫ్యాక్షన్ రాజకీయాలకు. పులివెందుల రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు తీసుకొస్తున్నాడు. గోదావరి జలాలు 200 టి.ఎం.సి. కృష్ణా బేసిన్‌కు ఇస్తానంటాడు. మహబూబ్‌నగర్, మార్కాపురంకు కూడా ఇస్తాడా? దానిలో 90 టి.ఎం.సి. కర్ణాటకకు వస్తాయి బచావత్ ప్రకారం. గోదావరి నీరు పుష్కలంగా ఏమీలేదు. 680 టి.ఎం.సి. మాత్రమే ఉన్నాయి. పోలవరం ద్వారా 245 టి.ఎం.సి. కృష్ణా డెల్టాకు ఇస్తానంటాడు. తెలంగాణకు రావు. దక్షిణ తెలంగాణ, రాయలసీమ రెండూ కృష్ణా బేసిన్ ప్రాంతాలే. మరి దక్షిణ తెలంగాణకు కూడా నీరివ్వాలి కదా!

జరగవలసింది నికర జలాల్ని పునఃపంపిణీ చేయడం. 3/4 ఏళ్ళు నీరు గ్యారంటీగా ఉంటే దాన్ని నికర జలాలు అంటారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎక్కువగా ఇవ్వాలి. కృష్ణా డెల్టాకు ఇచ్చే నీరు తగ్గించాలి. సుందరయ్యగారు అనేవారు కృష్ణా డెల్టా వాళ్ళు పంట మార్పిడికి సిద్ధపడాలి అని. స్నేహపూర్వక వాతావరణం వెనకబడిన ప్రాంతాలవారిలో పెంపొందించాలి.

* * *

అనంతరం కాశిం, నాగరాజుల నిర్వహణలో కవి సభ జరిగింది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)