- ఉషా ఆరి

అమెరికా లో నివసిస్తున్న తెలుగు సమాజంలో గృహహింస ఉంటుందా ! అని చాలామంది నన్ను ప్రశ్నించారు. దానికి సమాధానం అవుననే చెప్పుకోవాలి. వాస్తవానికి గృహహింసకు గురైన స్త్రీల గురించి వినడమో, చూడడమో జరిగిందని మనలో చాలా మంది అంగీకరిస్తారు. కానీ దానిని కుటుంబ అంతర్గత వ్యవహారమని జమకడతారు. 2002 సంవత్సరంలో రాజ్ , సిల్వర్ మెన్ లు బోస్టన్ నగరంలో నివసించే 160 దక్షిణాసియా మహిళలతో గృహహింస పైన ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనములో తేలిందేమంటే; 40.8% శాతం మహిళలు జీవితకాలంలో తమ భర్తల చేతిలో భౌతికంగా, లైంగికంగా హింసలకు గురి అవుతున్నారు.

గత సంవత్సరంలో దాదాపుగా 36.9 % మంది బాధితులయ్యారు. 29% శాతం మహిళలు దాడులలో గాయపడి వైద్యం కోసం హాస్పటల్ కూడా వెళ్ళారు. గృహహింస విషయంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు, ప్రేమ పెళ్ళిళ్ల లో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. 2004 సంవత్సరంలో న్యూ విజన్ సంస్థ చేపట్టిన వెబ్ సర్వే లో మిషిగన్ రాష్ట్రంలో నివసించే దక్షిణాసియా మహిళలలో 67% మంది, గృహహింస మన సమాజంలో జరుగుతున్నదని చెప్పారు. తెలుగు వాళ్ళు దీనికి ఏమాత్రం మినహాయింపు కాదు. గృహహింస, మహిళలపైన అత్యాచారాలను నిర్మూలించడం కోసం పనిచేసే దక్షిణాసియా మహిళా సంఘాలతో చాలా కాలం నేను పనిచేసాను. హింస పెట్టే భర్తలనుండి విడిపోవటానికి ప్రయత్నించిన ఎందరో తెలుగు మహిళలతో పనిచేసాను. రెండు సంవత్సరాల క్రితం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వాళ్ళు తెలుగు వాళ్ళకి గృహహింస కు సంబంధించిన విషయాలలో సలహాలు ఇవ్వటానికి ‘సోషల్ వర్క్ సర్వీసెస్ గ్రూప్ ’ అనే సంస్థను ప్రారంభించారు. గృహహింసకు బాధితులైన నార్త్ అమెరికా తెలుగు మహిళలలో కొందరి అనుభవాలను ఈ వ్యాసంలో ప్రస్తావిసున్నాను. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడడానికి గాను పేర్లు, స్థలాలు మార్పులు చేయడం జరిగింది.

సురేశ్ నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం రెండు వారాల సెలవుపైన ఇండియాకి వెళ్ళాడు. అతని తల్లిదండ్రులు ఎన్నో పెళ్ళిసంబంధాలు వెతికి చివరికి లెక్చరర్గా పని చేస్తున్న సంధ్య అనే అమ్మాయిని ఎంపిక చేసారు. సురేశ్ ఆ అమ్మాయిని చూసి, మాట్లాడి ఒప్పుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులతో పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. అమెరికా తిరిగొచ్చిన తర్వాత తెగ ఫోన్లలో మాట్లాడేవాడు. చాలా మర్యాదగా మాట్లాడుతూ, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునేవాడు. పెళ్ళి తర్వాత భవిష్యత్తు జీవితం గురించి ముచ్చట్లు పెట్టేవాడు. ఉద్యోగాన్ని వదిలి అమెరికా రావటానికి మనస్సు ఒప్పుతుందా అని సంధ్యను అడిగేవాడు. తన అభిప్రాయాలను గౌరవిస్తున్నాడని సంధ్య చాలా ఆనందించింది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత పెళ్ళి చేసుకొని భర్తతో సహా అమెరికా వచ్చింది. పెళ్ళైన కొత్తలో కొంతకాలం బాగానే వున్నాడు. తర్వాత మొదలైంది అసలు కథ. సురేశ్ భార్యను తిడుతూ బాధించేవాడు. చీటికి మాటికి అవమానిస్తూ, ఏమీ చేతకాదని వెక్కిరించేవాడు. అప్పుడు సంధ్య గర్భవతి, మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నది . పరిస్థితి ఉధృతమై తిట్టడం నుండి కొట్టడానికి తెగబడ్డాడు. గోడకేసి విసిరి కొట్టేవాడు. సంధ్యకు పరిచయమున్న స్నేహితులుగాని, బంధువులుగాని ఎవరూ లేరు. చాలా భయపడింది. సంసారజీవితాన్నిసక్కగా పెట్టుకోవటానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నించింది. కానీ మొగుడు కోపం తో ఎప్పుడు రెచ్చిపోతాడో తెలియదు. ఆమె నిరంతరం భయం తో బతికేది. కడుపుతో వున్నప్పుడూ, బిడ్డ పుట్టిన తర్వాత కూడా భౌతిక దాడులకు పాల్పడుతునే వున్నాడు. ఇండియాలో వున్న తన అమ్మకి కూడా తన కష్టాలను చెప్పుకోలేక పోయింది సంధ్య. వాళ్ళ అమ్మ పెళ్ళి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది. కూతురి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది.

మొగుడు పెట్టే బాధలకు పసిబిడ్డ ఏమౌతాడోనని సంధ్య తల్లడిల్లేది. ఒకరోజు స్నేహితులు వాళ్ళింటికి భోజనానికని ఆహ్వానించారు. బయలుదేరడానికి పిల్లవాడిని ఆమె తయారు చేస్తుంటే, ఆలస్యమౌతున్నదని గొణగటం మొదలు పెట్టాడు. నోరు విప్పితే ఇంకే ప్రమాదం ముంచుకొస్తుందోనని, ఆమె మౌనంగా వున్నది. సమాధానం చెప్పలేదనే కోపంతో సురేశ్ మండిపడి సంధ్య ను కొట్టాడు. బాగా దెబ్బలు తగిలి కదలలేకపోయింది. భార్యను, బిడ్డను ఒదిలిపెట్టి సురేశ్ ఒక్కడే విందుకి వెళ్ళాడు. విందుకి ఒంటరిగా వచ్చిన సురేశ్ ని చూసి అతని స్నేహితుడి భార్య శంకించింది. ఎందుకంటే సురేశ్ తన భార్యను తిట్టటం స్వయంగా ఆమె విన్నది. మరునాడు విషయం ఏమిటో కనుక్కుందామని సంధ్యకు ఫోను చేసింది. బాగా దెబ్బలు తగిలి నీరసంగా వుండటంతో సంధ్య ఫోను లేపలేదు. స్పందన లేక పోవటంతో ఆమె కంగారుపడి సంధ్యను చూడటానికి ఇంటికి వెళ్ళింది. భర్త పెడుతున్న హింసకి, ప్రతి నిత్యం భయంతో బతుకుతున్నట్లు సంధ్య చెప్పింది. ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియదు, ఎందుకు కోపంతో ఊగిపోయి కొడతాడో తెలియదు. అంతిమంగా సంధ్య చిత్రహింసలు పెడుతున్న తన భర్తను వదిలివేయటానికి నిర్ణయించుకుంది. ఆమె స్నేహితురాలు దగ్గర వివరాలు తెలుసుకొని, ఒక దక్షిణాసియా మహిళా సంఘం సహాయాన్ని కోరింది. ఆ సంఘం వాళ్ళు ఆమెకి ఆశ్రయం కల్పించి, జీవితాన్ని నిలబెట్టుకోవటానికి సహాయం చేసారు.

కవిత తన భర్తను ఇండియాలో కలుసుకుంది. ఆయన అమెరికాలో వున్న తన కంపెనీకి ఇండియాలో ఉద్యోగస్తులను ఎంపిక చేసుకునేవాడు. ఇద్దరూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. మొదట్లో జీవితం బాగానే వుండేది. కొంతకాలం గడిచాక భర్తా అత్తా కట్నం సరిగ్గా తీసుకురాలేదని పోరు పెట్టటం మొదలు పెట్టారు. ఆమెను భర్త తన స్వంత పెట్రోల్ బంకు లో పనిచేయమని అడిగాడు. అందుకు కవిత అంగీకరించి రోజుకి పదహారు గంటలు పనిచేసింది. జీతం డబ్బులు కూడా ఇవ్వలేదు. భర్త చాలాసార్లు తిట్టటం, కొట్టటం చేసేవాడు. కవిత మౌనంగా అంతా భరించింది. భర్త ఆమెను చెంపమీదకొట్టి, తన్ని చావాగొట్టేవాడు. ఇక భరించలేక ఇల్లు ఒదిలివెళ్ళిపోయింది. కవిత బయట ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడాలని ప్రయత్నించింది.

కొంతకాలం తర్వాత కవితను ఆమె మొగుడూ ,అత్తా కలసి మంచిగా మాట్లాడి కలసివుండమన్నారు. కవిత అందుకు అంగీకరించి మొగుడు ఇంటికి తిరిగి వచ్చింది. తర్వాత ఇండియాకు వెళ్ళుదామని అన్నారు. ముందుగా కవితా వాళ్ళ అత్తా బయలుదేరి వెళ్తే, కొన్ని వారాల తర్వాత భర్త వచ్చి కలుస్తానన్నాడు. కవిత తన తల్లిదండ్రులను కలుద్దామనే ఉత్సాహంతో వున్నది. ఆమె ఎప్పుడూ తన కష్టాలను తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ చెప్పుకోలేదు. చెల్లెల్ల పెళ్ళి సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మౌనంగా వున్నది. ఇండియా వస్తున్నట్లు తన తల్లిదండ్రులతో చెప్పవద్దని భర్త కవితను ఆదేశించారు. కవి తా వాళ్ళ అత్తా ఇండియా చేరుకున్న వారం రోజుల తర్వాత, కవిత తల్లిదండ్రులకు వాళ్ళ అత్త మామలనుండి ఒక ఫోను కాల్ వచ్చింది. దానిలో కవిత ఇండియా వచ్చినట్టు, హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్టు తెలియజేసారు. కవిత శరీరాన్ని దహనం చేసేసినట్టు చెప్పారు. కవిత తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. హఠాత్తుగా గుండెపోటుతో మరణించటం ఏమిటి? ఆదరబాదరగా దహనం చేయటం ఏమిటి? అన్నీ అనుమానాలే కానీ, కవిత తల్లిదండ్రులు కానీ అధికారులు కానీ ఏమీ చేయలేక పోయారు. అదేమంటే శవానికి దహన సంస్కారాలు చేసేశారు. అమెరికా లో వున్న కవిత భర్త మటుకు చట్టం నుండి తప్పించుకున్నాడు.

సృజన ఇండియాలో తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళి చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్తతో కలసి అమెరికాకు వచ్చింది. కలసివున్న రెండు సంవత్సరాలలో భర్త ఆమెను ‘అంత అందంగా వుండదని’, ‘నల్లగా వుంటుందని’, ‘ఆమెతో బయటకు వెళ్ళడం నామోషిగా వున్నదని’ అంటూ గొడవచేస్తూ వుండేవాడు. పెళ్ళి చేసుకునేముందు చూసారు కదాని భర్తకు సృజన గుర్తుచేసింది. రూపం మార్చుకోవటం ఎలా సాధ్యమౌతుంది? పెళ్ళిచేసుకోమని ఎవరూ బలవంతపెట్టలేదు కదా అని అన్నది. సృజన గర్భవతి అయినప్పుడు, ఇండియాలోవున్న ఆమె తల్లిదండ్రుల వద్దకి వెళ్ళి అక్కడే పురుడుపోసుకోమని భర్త చెప్పాడు. ఇద్దరూ ఇండియా వెళ్ళారు. రెండు వారాలు గడిచిన తర్వాత ఆమెను తల్లిదండ్రుల వద్ద దిగబెట్టాడు. ఆమె పాస్ పోర్టు, రిటెన్ టిక్కెటు అడిగితే, ఆయన తల్లిదండ్రుల వద్ద వున్నాయనీ తర్వాత పంపిస్తానీ చెప్పాడు. అలా అని చెప్పి అమెరికా తిరిగి వచ్చాడు. తర్వాత ఎప్పుడూ పెద్దగా సృజనతో మాట్లాడేవాడు కాదు. కొడుకు పుట్టాడని చెప్పినా స్పందన లేదు. తన ఉద్యోగం స్థిరంగా లేదని, అందుకని సృజనను ఇండియాలో వుండమని చెప్పాడు. భార్య ఇండియాలో వుండగానే, అతను అమెరికాలో విడాకులు తీసుకున్నాడు.

సంవత్సరం గడిచిన తర్వాత అతను ఇంకొక అమ్మాయిని పెళ్ళిచేసుకుందామని ఇండియా వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన సృజన తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో పెళ్ళి ఆపారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకొని కొత్త భార్యను వెంటబెట్టుకొని అమెరికాకు వచ్చాడు.
సృజన మళ్ళీ పాసుపోర్టుకు దరఖాస్తు చేసుకొని, కొడుకుని తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి అమెరికా వచ్చి న్యాయపోరాటాన్ని సాగించింది. ఆమె భర్త చాలా రాష్ట్రాలలో తిరిగేవాడు. అతని ఆచూకీ కనిపెట్టటం ఆమెకు కష్టంగా వుండేది. సృజనకు దక్షిణాసియా మహిళా సంఘాలు కొంత మటుకు సహాయం చేసాయి. కానీ ఆ సంఘాల వనరులు చాలా పరిమితం. ఆమె కి కోర్టుల చూట్టూ తిరిగి న్యాయపోరాటం చేయటం కష్టమైపోయింది. చివరికి సృజన భర్త చట్టంనుండి తప్పించుకున్నాడు.

జానకి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకొని, భర్తతో కలసి హెచ్ -4 వీసా మీద అమెరికా వచ్చింది. మొదటనుండి ఆమె భర్త తిట్టడం, కొట్టడం, జుట్టు లాగటం చేసే వాడు. తర్వాత వాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆమె వీసా గడువు ముగిసే ముందు, వన్ -వే టిక్కెట్టు చేతిలో పెట్టి పిల్లవాడితో సహా ఇండియా వెళ్ళమన్నాడు. జానకీ ఇండియాలో వుండగానే, ఆమె భర్త అమెరికాలో విడాకులు తీసుకున్నాడు. కనీసం కోర్టులో వివాహ బంధంలో కొడుకు వున్నాడని కూడా చెప్పలేదు. గత్యంతరం లేక జానకీ విడాకులకు అంగీకరించింది. ఉద్యోగం చేసుకుంటూ కొడుకును పెంచుతోంది, కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని ఇవ్వమంటూ అమెరికా కోర్టులో కేసు పెట్టాడు. భార్య తన కొడుకుని కిడ్నాప్ చేసి ఇండియా తీసుకెళ్ళిందని ఆరోపించాడు. తప్పనిసరి పరిస్థితులలో జానకీ అమెరికా వచ్చి ఆరోపణలను కోర్టులో ఎదుర్కోవలసి వచ్చింది. అతను మంచి లాయర్లను పెట్టుకున్నాడు. మనుగడ కోసం ఆమె ఉద్యోగం చేసుకుంటూ కోర్టులలో తనపై వచ్చిన అరోపణలను ఎదుర్కొంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతూ, కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి ఆమె బిడ్డ ఉమ్మడి సంరక్షణకు ( జాయింట్ కస్టడీ ) ఒప్పుకుంది. ఈ వ్యాసం రాసే సమయానికి జానకీ ఇంకా ఆర్ధిక ఇబ్బందులతో కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

మన సమాజంలో గృహహింసకి బాధితులైన తెలుగు మహిళా జీవితాలను తెలియజెప్పే కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. ఒంటరితనంతో నిస్సహాయతతో, సిగ్గుతో తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఎందరో మహిళలున్నారు. ఏమి చేయాలో తెలియదు, సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. స్త్రీలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులతో కష్టాలను చెప్పుకోలేరు. ఒకవేళ చెప్పినా వాళ్ళకి అర్థం కావనుకుంటారు. అమెరికా లోని చట్టాలు, న్యాయాలు, హక్కులు పెద్దగా తెలియవు. న్యాయస్థానాల ద్వారా కేసులు వేస్తే, అమెరికాలో భర్త రెసిడేన్సీ స్టేటస్ కు ఎక్కడ తంటా వస్తుందోనని భయం. అమెరికా లోవున్న దక్షిణాసియా మహిళా సంఘాలను ( South Asian Women’s organizations) మహిళలు సహాయం కోసం కలవవచ్చు. హింస పెట్టే మొగుళ్ళను వదిలిపెట్టిన మహిళలు తమ జీవితంలో నిలదొక్కు కుంటారు. కానీ హింసకు పాల్పడిన మొగుళ్ళు మాత్రం చట్టంనుండి తప్పించుకొని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలను హింసిస్తుంటారు. అంతటా వున్నట్టుగానే, అమెరికా లోని తెలుగు సమాజంలో కూడా గృహహింస సమస్య చాలా తీవ్రంగా వుంది. ఈ సమస్యను నివారించటానికి మనం ఆచరణాత్మక చర్యలు తీసుకొని పోరాటం చేయాలి. అలాగే దక్షిణాసియా మహిళా సంఘాలలో పాల్గొంటూ, వాటికి వీలైనంత సహాయం చేయాలి. ఈ సంఘాల సహాయంతో తెలుగు మహిళలు, భార్యలను హింసించే భర్తలను న్యాయస్థానాల ద్వారా శిక్షించాలి.

(2005 తానా సావనీర్ ” తెలుగు పలుకు” లోని ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం. ఉషా ఆరి గారి స్వస్థలము హైదరాబాదు. మొదట పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత మిచిగన్ యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. మానసిక ఆరోగ్యరంగం లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.)

3 అభిప్రాయాలు

  1. nirmala 06 ఏప్రిల్ 2007 , 11:54 am

    ఊష గారూ,
    మీ వ్యాసం చాలా బావుంది.
    సుప్రభాతం పత్రికలో పని చేసేటప్పుడు దాదాపు 20 కేసులు రిపోర్టు చేసాను.చాలా చాలా దిగులుగా వుంటుంది.తల్చుకుంటే….

    కొండేపూడి నిర్మల

  2. ravindra aitham 26 ఏప్రిల్ 2007 , 12:36 pm

    చాలా చక్కగా వాస్తవాలు వివరించారు ధన్యవాదాలు, ఎంత చదువుకున్నా మనవాల్లు ఎందుకు మారతము లెదొ అర్ధం అవతము లెదు. ఎంత చదువుకుంతె అంత మూర్ఖము గా ప్రవర్థిస్స్తున్నారు. బాధిత మహిలలకు వుచిత న్యాయ సహాయము ఇచీ అవకాసము లెదా.

  3. savithri 18 జూన్ 2007 , 1:41 pm

    చాలా బాగుంది.నాకు చిరునమా కావాలి.నాకు తెలియజెయగల

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)