ప్రపంచంలో ఎదురయే వింతలూ, విచిత్రమైన విషయాల పట్ల మనిషికి ఆదినుంచీ భయాలూ, అపోహలూ, ఆసక్తీ ఉంటూనే ఉన్నాయి. ఈ మూడు భావాలూ అదే క్రమంలో కలిగాయనేది కూడా నిజం. భయం తీరి, అపోహలు కాస్త కాస్తగా తగ్గాక పెరిగే ఆసక్తి వల్ల మనిషి పరిశోధనలూ, పరిశీలనలూ మొదలుపెట్టాడు. మొదట్లో ప్రకృతిని అర్థం చేసుకోవడం, తరవాత దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆరంభించాడు.
మొదటిది విజ్ఞానం అనుకుంటే రెండోది టెక్నాలజీ అనుకోవచ్చునేమో. ఇలాంటి వ్యాసాలను చదివిన కొందరు విద్యాధికులైన మిత్రులు ఏవో కొన్ని విషయాల గురించి తమ అభ్యంతరాలను లేవనెత్తే సందర్భంలో “మీ సైంటిస్టులు…” అంటూ వాక్యాన్ని మొదలెట్టడం చూస్తే ఆశ్చర్యం కలిగింది. సైంటిస్టులు ఏదో ఒక ప్రత్యేకజాతికి చెందినవారని ఈనాటికీ ఎవరైనా అనుకుంటూ ఉంటే అది అజ్ఞానమే అనిపిస్తుంది.
మొదటగా నిప్పు ఉపయోగాన్ని కనిపెట్టిన గుహావాసులు సైంటిస్టులే. ఫలానా చెట్టుకు కాసిన పళ్ళు విషమని తెలుసుకుని ఇతరులకు హెచ్చరించినవాళ్ళూ సైంటిస్టులే. ఎప్పుడూ అశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ, ఇంటి పనులు చేసుకుంటూ ఉన్న స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుంటే క్రిమిసంహారకంగా పని చేస్తుందనీ, ఇంటి గడపలకు పసుపు రాస్తే క్రిములు లోపలికి ప్రవేశించవనీ చెప్పిన మనవాళ్ళు సైంటిస్టులు కారా? అలాగే విత్తులు నాటి వ్యవసాయం మొదలెట్టినవారూ, మబ్బుల కదలికనూ, రుతువుల క్రమాన్నీ అర్థం చేసుకుని “నువ్వులు” జాగర్త చేసినవారూ, రాత్రి పూట నక్షత్రాల సహాయంతో ఓడలు నడిపినవారూ అందరూ తమతమ కాలంలో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వినియోగించుకున్న సైంటిస్టులే. ఇదంతా సైన్స్ కాదనీ నిజమైన సైంటిస్టు తాను సంపాదించిన జ్ఞానాన్ని విశ్లేషణ కూడా చేస్తాడనీ వాదించవచ్చు. శైశవదశలో మొదలైన మానవ సమాజం ఆ దశకు చేరుకోవడానికి సమయం పట్టింది. ఏమైనా కొంత వివేచనా, వివేకమూ ఉండడం వల్లనే మనిషికి ప్రాథమిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చిందనడంలో సందేహం లేదు.
విజ్ఞానం పెరిగిన చోట గుడ్డి నమ్మకం తగ్గుతూపోతుంది. క్రీస్తుకు రెండు మూడువేల ఏళ్ళ క్రితం సుమేరియన్ నాగరికతలో వానలు కురిసినప్పుడు “మార్దుక్” అనే దేవతవల్ల పంటలు పండుతాయనే నమ్మకం ఉండేదట. ఆ తరవాత ఆ నాగరికతకు పరోక్షంగా వారసులైన గ్రీక్ తత్వవేత్తలు క్రీ.పూ. అయిదో శతాబ్దం ప్రాంతంలో మార్దుక్ సంగతి వదిలేసి వానలు కురిసినప్పుడు పంటలు పండుతాయనే ప్రతిపాదన చేశారట. ఇది విజ్ఞాన ప్రగతిలో ఒక మెట్టు. ఈ నాటికీ ఎంత దైవభక్తి ఉన్నా, పొయ్యి మీద పెట్టిన పాలు పొంగకుండా ఉండటానికీ, బైటికి వెళ్ళేటప్పుడు దొంగలు చొరబడకుండా వీధి తలుపుకు తాళం వెయ్యటానికీ ఎవరూ దేవుడి మీద ఆధారపడరు. దీని కర్థం ఒకటే. మనకి తెలియనివీ, “అలవి” కానివీ అయిన విషయాల్లోనే మనం దేవుణ్ణి నమ్ముతాం. దీన్ని బట్టి చూస్తే మనం ఆదిమ మానవులంత వెనకబడి ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అడవుల్లో వాటంతటవే రాజుకునే అగ్నికీలలూ, అకస్మాత్తుగా ఉరిమి, వర్షించే మేఘాలూ అన్నీ అప్పటివారిని భయభ్రాంతులను చెయ్యడంతో వారు అగ్నిదేవుణ్ణీ, వానదేవుణ్ణ్ణీ, వాయుదేవుణ్ణీ ఊహించుకుని వారిని “మంచి” చేసుకోవడానికి పూజలు చేశారు.
ఇవన్నీ ప్రకృతిసిద్ధంగా జరిగే విషయాలేనని అర్థం అయిన దశలో ఈ దేవుళ్ళ ప్రాభవం తగ్గిపోయిందని మనకు తెలుసు. అందుచేత మరింత నాజూకు పద్ధతుల్లో గుడ్డిగా అన్నిటినీ నమ్మే ఆధునికులు ఆటవికదశను దాటారని చెప్పలేం. అంతేకాదు; గ్రామదేవతలకు బలులిచ్చి మొరటుగా పూజలు చేసేవారికీ, తిరపతివంటి “పెద్ద” ఆలయాలకు వెళ్ళి సంస్కృతంలో శ్లోకాలు చదివేవారికీ ఏ మాత్రమూ తేడాలేదు. అలాగే మొక్కుల మీద నమ్మకం ఉన్నవారికీ, బుడబుక్కలవాణ్ణి పిలిపించేవారికీ, చిలక జోస్యంగాళ్ళకూ కూడా పెద్దగా తేడాలేదు.
అజ్ఞానానికి నమ్మకం అనేది ప్రత్యామ్నాయం. వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ గుడ్డినమ్మకాలు కొంత ఊరటనిచ్చి మేలు చేస్తాయని సైకాలజిస్టులు మనకు చెప్పవచ్చు. అదే నిజమైతే నమ్మకాలు ఒక ఊతకర్ర వంటివి మాత్రమే అని గుర్తించడం అవసరం. జీవరాశి అంతా కేవలం జీవరసాయనాల కలయికవల్లనే రూపొందిందని రెండు మూడు తరాలుగా నేర్చుకున్న పాశ్చాత్య సమాజంలో ప్రజలకు వ్యక్తిగత స్థాయిలో దేవుడి మీద మనవారిలాగా గుడ్డినమ్మకం ఉండదు. అందువల్లనే ఆ దేశాల్లో ఫ్లయింగ్ సాసర్ల గురించీ, గ్రహాంతరవాసులు రావడం గురించిన నమ్మకాలు పెరుగుతున్నాయని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. మన దేవతల్లాగా నాలుగు చేతులతో (ఆడదేవతలు అందుకు అనువైన బ్లౌజులు కూడా ధరించినట్టు బొమ్మలు గీస్తారు) ఎవరూ ప్రత్యక్షం కారు గనక పాశ్చాత్యదేశాల్లో గ్రహాంతరవాసుల చిత్రీకరణ ఆకుపచ్చని మొహాలతో, బాగా వెడల్పైన నుదుటితో (ఎక్కువ తెలివితేటలు కదా!), తలమీద రెండు ఏంటెనాలతో జరుగుతుంది. ఇది ఎక్కువ “సహేతుకం” అనిపిస్తుందేమో కాని ఇదీ ఒకరకమైన గుడ్డినమ్మకంతో కూడిన ఆశాభావ దృక్పథం. మనిషిని “మించిన” శక్తి, లేదా వ్యక్తి కోసం వెతుకులాట.
మనకు తెలియని విషయాల గురించి మతం పేరుతో వివరణ ఇచ్చేవారిని నమ్మకుండా ఉండడమే మంచిది. “దేన్నైనా ఎలాగైనా సమర్థించవచ్చు కదా” అన్న వాదం ప్రమాదకరం. సైన్స్‌లో తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి ఎప్పటికప్పుడు ప్రయత్నించి, మరింతగా తెలుసుకోవడమే లక్ష్యం. మూఢనమ్మకాలనూ, అర్థం లేని మతవిశాసాలనూ ప్రోత్సహిస్తూ, పుట్టేది ఆడపిల్ల అయితే అందుకు తల్లే కారణమని నిందించే మూర్ఖులు ఈ నాటికీ మధ్యతరగతి విద్యాధికుల్లో ఎందరో కనిపిస్తారు. వీరి సంగతే ఇలా ఉంటే సగం అక్షరాస్యులైన కోట్ల ప్రజల మాటేమిటి? తన డయాబిటీస్ వ్యాధినే నయం చేసుకోలేని బాబా “శక్తుల” గురించి వైనవైనాలుగా వర్ణించేవారిని ఏమనాలి? ప్రజల అమాయకత్వాన్నీ, అయోమయాన్నీ ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునేవారిని పట్టుకునే దెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. “ఆస్తికులు” ఇలాటి వ్యాసాలు చదవరు.
అయినా బొత్తిగా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అప్పుడప్పుడూ వెనకడుగు వేసినా మానవసమాజం భౌతికవాదం దిశగానే ముందుకు వెళుతుంది. జనాభా పెరిగి, సమస్యల పరిష్కారాలకు టెక్నాలజీ మీద అంతకంతకూ ఎక్కువగా ఆధారపడవలసిన ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పనిసరి అవుతుంది. ఉదాహరణకు మశూచివంటి వాటికి కారణం “అమ్మవారు” కాదని నెమ్మదిగా జనం తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంలో పల్లెపల్లెకూ తిరిగి ఓపికగా ప్రజలకు నచ్చజెప్పి టీకాల ద్వారా రోగవ్యాప్తి నిరోధానికి పాటుపడిన వైద్యులకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. కానీ వాళ్ళని ఎవరూ నాస్తికులని తిట్టలేదు. మనదేశంలోలాగానే ఒకప్పుడు గ్రీక్ తత్వవేత్తలు ప్రయోగాలద్వారా జ్ఞానం పొందడం మానేసి కేవలం “వాదనల” ద్వారా తత్వపరమైన ఆలోచనలు చేసేవారట. అలాకాకుండా ఎవరో కొందరు ప్రతిదాన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలన చెయ్యడం వల్లనే మానవజాతి ఈ మాత్రమైనా ప్రగతిని సాధించిందని చాలామంది గుర్తించరు. మూఢవిశ్వాసాలకు కొత్తరంగులు పులుముకుంటూ, వాటిని బలపరచడం తమ జన్మహక్కయినట్టు ప్రవర్తించే ఆధునిక ఆటవికులకు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు.