- రంగనాయకమ్మ
క్లారాజెట్కిన్ వంటి కమ్యూనిష్టులు 1910లో దీన్ని ప్రతిపాదించినప్పుడు, ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ అన్నారు. శ్రామిక మహిళలకు పని పరిస్థితుల్లో హక్కుల గురించీ, సోషలిస్టు పోరాటాల గురుంచీ, స్పృహ కలిగించాలనే దృష్టితో, కానీ క్రమంగా దీన్ని బూర్జువా ప్రభుత్వాలన్నీ, ‘శ్రామిక మహిళా దినం’ లో నించి ‘శ్రామిక’ ని తీసివేసి, ‘అంతర్జాతీయ మహిళా దినం’ గా మార్చాయి. అన్ని ఉత్సవాల్లాగే ఈ ‘ఉత్సవం’ కూడా ఏటా సభలు, సెమినార్లూ, సన్మానాలూ వంటి వాటితో కేవలం ‘తంతు’ లాగా, ‘కర్మకాండ’ లాగా జరిగిపోతూ వుంటుంది. ఎన్ని ఏళ్ళు గడచినా ఈ ‘దినోత్సవాల’ వల్ల మహిళలు నేర్చుకునే జ్ఞానమూ లేదు; సాధించే హక్కులూ లేవు. ఈ మహిళా దినాలు అప్పుడప్పుడూ చిట్టి పొట్టి సంస్కరణల్ని మాత్రమే ప్రతిపాదిస్తూ వుంటాయి.
‘సంస్కరణల్ని’వ్యతిరేకించ నక్కర లేదు. కానీ ఆ సంస్కరణలు అయినా నిజంగా జరగవు. వాటి వల్ల, మహిళలకు నిజంగా ఒరిగేదేమీ వుండదు. ఉదాహరణకి, ‘స్త్రీలకి ఆస్తి హక్కు’ అంటారు. కానీ , ‘ఆస్తి’ ఎంత జనాభాకి వుంది? ఆస్తి హక్కు నిజంగా అమలు జరిగితే, అది, ఆస్తితో పులిసివుండే కుటుంబాల్లో మహిళలకు ఒక హక్కుని ఇస్తే ఇవ్వవచ్చు. దాని వల్ల, శ్రామిక మహిళలకు ఒరిగేదేముంటుంది? శ్రామిక కుటుంబాల్లో పరిశుభ్రమైన మంచి నీళ్ళు తాగగలిగే పరిస్థితి కూడా వుండదు. స్త్రీలకు స్తిరమైన వుద్యోగాలూ స్వంత ఆదాయాలూ వుండవు. అక్షర జ్ఞానమే వుండదు. భార్య భర్తలు కనీసపు సంతోషంతో గడపడానికి కావలసిన ఇంటి సదుపాయాలేవీ వుండవు. ‘అది లేదు ఇది లేదు’ అనే మాట తప్ప, ‘ఉన్నది’ ఏదీ ఉండదు. అలాంటి బికారి మహిళలు ఆస్తి హక్కుల్ని ఏం చేసుకుంటారు?
ఆ మహిళలు, యూనివర్శిటీల్లో చదివే హక్కుల్ని ఏం చేసుకుంటారు? విమానాల్ని ఎక్కే హక్కుల్ని ఏం చేసుకుంటారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్ని ఏం చేసుకుంటారు? బికారి జీవితాలకు ఏది మూలమో, దానితో పోరాడడానికి ఏది మార్గమో చూపించని ఏ దినోత్సవాలైనా జనాలకు ఎంత ఉపయోగమో, ఈ దినోత్సవం కూడా అంత ఉపయోగం!
[ ఆంధ్రప్రభ వార పత్రిక, 8 -3 - 1999]