international_womensday5.jpg
ఆ వస్తున్న సూర్యోదయం మాదే
ఆ ప్రభావగీతం మాదే
ఇక మీద భూమ్మీదవిస్తరించే
నాగరికత ఖచ్చితంగా మాదే

- మహె జబీన్, ఆకురాలు కాలం, పేజీ 21.

…………………………………………………..

అత్యుత్తమ గుణసంపద మాకు ఆపాదించి
మంచితనం తాలూకు మహత్వలక్షణాలన్నీ పులిమి
పొగడ్తల పొగడపూలదండల్లో
జ్ఞానరస్మినివ్వని సతీధర్మపు చెమ్మటెండల్లో మమ్మల్నింకా ముంచెత్తకండి
స్వేచ్ఛ మనిషి హక్కు – సమత మేం వల్లించే రుక్కు

- ఘంటసాల నిర్మల, నిర్వచనం, పేజీ 5

………………………………………………………

ఓడినా సరే
ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి
నీ కోసం వాళ్ళు యుద్ధం గెలిచారో
నిలువునా మునిగిపోతావు
ఎప్పటికీ ఓడిపోతావు

- సుధ, నీలి మేఘాలు , పేజీ 141

………………………………………………………

“సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉంటుంది గానీ స్వేచ్ఛ లేకుండా సమానత్వానికి అర్థం ఉండదు. అది నిలబడదు కూడా. సమాజంలో అసమానతలను పోగొట్టి సమానత్వం సాధించాలన్నా, సమాన హక్కులూ అవకాశాలూ వున్న మనుషులు సహకరించుకొంటూ బతకాలన్నా, ముందు మనిషి సాధించాల్సింది స్వేచ్ఛ.”

- ఓల్గా, “స్వేచ్ఛ” కు ముందు మాటలో

……………………………………………………….

“దేశానికి దేశాలు కొట్టుకు పోతుంటే, యింకా పసుపు పారాణులకోసం అంటు తప్పాలమీద మెతుకుల కోసం, సిగ్గు బిడియాల కోసం గింజుకులాడే మన అత్తల్నీ,శీల అశ్లీలాలకోసం తెలుగు కథకుల్ని, బడి టీచర్లనీ, పత్రికా విమర్శకులను చూసి నవ్వొస్తుంది, దిగులేస్తుంది”

- చలం

……………………………………………………..

“అత్త అధికారం నుంచి, భర్త అధీనం నుంచి తప్పించుకుంటున్న నవీన స్త్రీ షోకులకి, సంఘగౌరవానికి, ఫాషన్ కీ బానిస ఔతోంది. ఒక పురుషుడినీడకింద నించుని లోకాన్ని ధిక్కరించగలిగే యిల్లాలు, ఈనాడు సంఘగౌరవం పేర, విద్య పేర, ఉద్యోగం పేర, ఫాషన్స్ పేర వెయ్యి మందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి తన చుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు.”

- చలం

……………………………………………………

“భారత స్త్రీ దౌర్భాగ్యాన్ని, పిరికితనాన్ని, దీనత్వాన్ని చూసి చలం ఎంతగానో విలపించాడు. మండి పడ్డాడు. స్త్రీని శాశ్వతంగా బానిసత్వంలోకి నెట్టాలనుకున్న సంఘాన్ని, మతాల్ని, పురుష దురహంకారాన్ని అసహ్యించుకుని, కసి పెంచుకుని, తిట్టి, ముఖంమీద ఉమ్మి, స్త్రీ జాతిని వాళ్ళ వాంఛలకి, ఆశయాలకి, ఆలోచనలకు మేల్కొలిపి ధైర్యాన్నిచ్చి, తిరుగుబాటు చైతన్యాన్నిచ్చి ముందుకు నడపడానికి ప్రయత్నించినవాడు చలం ”

- సి రా

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)