![]() |
విలక్షణమైన వస్తువుని అత్యంత స్పష్టతతో కథగా మలచగలిగిన శక్తిగల అతి కొద్దిమంది రచయితలలో సత్యవతి ఒకరు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి - మూడు కథా సంపుటాలు, మర్రినీడ, గొడుగు అనే రెండు నవలలు ప్రచురించారు. ఇవికాక అనేక వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. ఇల్లలకగానే, సూపర్‌మామ్ సిండ్రోమ్ కథలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. |
తెలుగునాట విస్తరించిన స్త్రీవాద ఉద్యమ సాహిత్యానికి అనేక కొత్త కోణాలు అందించిన రచయిత్రిగా సత్యవతి సుపరిచితులు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, విజయవాడలో లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. చాసో అవార్డు, రంగవల్లి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందుకొన్నారు.
* మీ బాల్యం, నేపథ్యం, జీవన యాత్ర గురించి చెప్పండి…
నేను గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో ఒక మధ్యతరగతి సంప్రదాయాలను పాటించే మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. అక్కడ పూజలు, పునస్కారాలు, పండుగలు, పబ్బాలు, చుట్టాలు-పక్కాలు… అట్లా అన్నీ ఆడవాళ్ళ వైపున, కులమతాల కతీతంగా ఉంటూ కాంగ్రెస్ స్నేహితులతో తిరుగుతూ ఊళ్ళో స్కూలు, లైబ్రరీ వంటి వాటికోసం కృషి చేసిన మా నాన్నా ఒకవైపూ… ఒక మిశ్రమ వాతావరణం. మా కుటుంబాల్లో ఆరోజుల్లో (1950-60) ఆడపిల్లలకి చదువు లిమిట్. ఎస్.ఎస్.ఎల్.సి. ఆపైన పెద్దవాళ్ళే ఎవరో ఒకర్ని తెచ్చి వీలైనంత తక్కువ కట్నం ఇచ్చి చేతులు దులిపేసుకొనే ఆచారం. నేను చిన్నప్పుడు చాలా అమాయకంగా, బెదురుబెదురుగా, చాలా సెన్సిటివ్‌గా, ఎవరైనా ఏవన్నా అంటే ఏడ్చేలాగా, సినిమాలుచూసినా అందులో ఎవరైనా ఏడిస్తే నేనూ ఏడుస్తూ, నా కళ్ళ ఎదుట ఎవరైనా వాంతి చేసుకొంటే నేనూ తిన్నదంతా వెళ్ళబోస్తూ అచ్చం ‘ఆడపిల్ల’లాగే ఉండేదాన్ని. మమ్మల్ని చీకట్లో ఒంటరిగా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి ప్రారంభం నాది. అయితే మా అమ్మకి పుస్తకాలుచదివే అలవాటు బాగా ఉండేది. మా ఇంటికి ఇంగ్లీష్ పేపరు వచ్చేది. ఆంధ్రపత్రిక, ప్రభ, భారతి, యువ వంటి పత్రికలొచ్చేవి. ఆ విధంగా నాకు చదవడం బాగా వచ్చింది. అమ్మతో పాటు ఒక విడత చలం, బాపిరాజు, విశ్వనాథలవీ చదివాను. అన్ని పుస్తకాలు చదివినా అమ్మకొచ్చిన కొత్త ఆలోచనలేవీ లేవు, న్జాకు పెరిగిన జ్ఞానమూ లేదు. కానీ ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండకపోతే తోచని స్థితి ఏర్పడింది.
మా ఇంట్లో పెద్దవాళ్ళు చేసే నోములు, పూజలు పిల్లల మీద రుద్దేవాళ్ళు కాదు. అది మాకో పెద్ద ప్లస్ పాయింట్. మా పెద్దవాళ్ళు మాకసలు చనువే ఇచ్చేవాళ్ళుకాదు. మా నాన్నతో మాట్లాడ్డానికే మాకు భయం. నేను ఎస్.ఎస్.ఎల్.సి. కొచ్చేసరికి నాకు మా ఇళ్ళలో ఆడవాళ్ళ జీవన విధానం, వాళ్ళ పరిస్థితులు అర్థమవడం మొదలుపెట్టాయి. భర్తలతో కూడా పగలు ఎదుటపడి మాట్లాడలేని వాళ్ళు, కూరలు కొని, ‘ఆయన ఇంట్లో లేరు. తరువాత రా డబ్బులిస్తారు,’ అనేవాళ్ళు, స్కూలు చదువు అయ్యాక ఇంట్లో ఉండిపోయి వచ్చేపోయే పెళ్ళిచూపుల వాళ్ళ ముందు కూచుని కూచుని ఎవడో ఒకడికి నచ్చేదాకా ఎదురుచూసి… చూసి… ఇదంతా చాలా అవమానకరంగా అనిపించేది. అక్కడ్నుంచే నేను ‘ఆడపిల్ల’గా ఉండకూడదనుకొన్నాను. మా నాన్న నన్ను కాలేజీలో చదువుకోవడానికి హైదరాబాదు పంపించారు. మా కుటుంబాలలో మొదట కాలేజీలో అడుగుపెట్టింది నేనే. అక్కడ మామయ్య వివేకవర్థని కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా (పి.ఎస్. రావు) ఉండేవారు. తరువాత ప్రిన్సిపాల్ అయ్యారు. అసలే ఊరు దాటి వెళ్ళడం. హాస్టల్‌లో ఆడపిల్లని చేరటమే! అందుకని పక్కనున్న తెనాలి, గుంటూరు వదిలేసి మామయ్య దగ్గర ఉంచడం కోసం హైదరాబాదు పంపారన్నమాట… ఆరోజుల్లో ఆడపిల్లలని ఎక్కువగా బై.పి.సి.లో చేర్చేవాళ్ళు. చదివితే ఎం.బి.బి.ఎస్. చదవాలి. అందులో సీటు రాకపోతే ఇంటర్ కాగానే పెళ్ళి చేసెయ్యాలి. ఇట్లా ఉండేవి ఆలోచనలు. మా మాయ్యకి సాహిత్యం అంటే చాలా ప్రేమ. మంచి సినిమాలు చూడ్డం, సాహిత్యం చదవటం, ఆడవాళ్ళని గౌరవంగా చూడటం, అక్కచెల్లెళ్ళని ప్రేమించటం మొదలైన గుణాలన్నీ కల ఒక మగవాణ్ణి నేను చాలా దగ్గరగా చూసింది ఆయనలోనే. ఈరోజు నాకు అబ్బిన కాస్తో కూస్తో సంస్కారం, సాహిత్యం పట్ల మమకారం ఆ అక్క (మా అమ్మ), తమ్ముళ్ళ వల్లే… మా నాన్న దగ్గర మాకు చనువు లేకపోయినా మేము పుస్తకాలు, పత్రికలు కొనుక్కొనేందుకు ఆయన ఎప్పుడూ అభ్యంతరపెట్టలేదు. పైగా ఆయనే నాకు మంచి పుస్తకాలు చాలా కొనిపెట్టారు. నాలో ఉండే ఒక పల్లెటూరి ఆడపిల్లని, ఆలోచనవైపు మళ్ళించింది నా కాలేజి చదువు, హైదరాబాద్ నగరం, సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాక నేను ఏరుకొని చదివిన పుస్తకాలు. ఒకచోట కె.వి.ఆర్.గారు చెప్పినట్లు మంచి పఠితనైన నేను ఒక రచయితని కాగలిగాను.
* మీ రచనలకి స్ఫూర్తినిచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? ఇంతవరకు చేసిన రచనల వివరాలు…
నేను చిన్నప్పట్నుంచీ కనబడ్డ పుస్తకమల్లా చదివేదాన్ని. పఠనీయత (రీడబులిటీ) ఉంటే చాలు పుస్తకం పూర్తయ్యేదాకా అట్లా చదువుకొంటూ పోవడమే… పాపులర్ నవలలు కూడా చదివేదాన్ని. అయితే నన్ను అమితంగా ఆకట్టుకొని, నిలబెట్టి, ఆలోచింపజేసిన మొదటి పుస్తకం కుటుంబరావుగారి ‘కురూపి.’ తరువాత వెతుక్కొని వెతుక్కొని కుటుంబరావుగారు ఏం రాసినా చదవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఆయన మార్క్సిస్ట్ దృక్పథంతో వ్రాస్తారనిగాని, అలాంటి దృక్పథం ఒకటుందనిగాని తెలియదు. ఆయన చాలా ఎనలటికల్‌గా వ్రాస్తారనుకొనేదాన్ని. నేను హైదరాబాద్‌లో ఉండి కోఠీ ఉమెన్స్ కాలేజీలో చదివిన కాలం నా జీవితంలో ఓ గొప్పదశగా నేను భావిస్తాను. మామయ్య దగ్గర ఉండటం వలన తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలను గురించిన జ్ఞానం కొంత వచ్చింది. మామయ్య ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో గోల్డ్ మెడల్స్ తీసుకొన్న వ్యక్తి. మా కాలేజీలో మంచి ఫిక్షన్ లైబ్రరీ ఉండేది. ఆంధ్రప్రభలో మాలతీచందూర్ పరిచయం చేసిన నవలలన్నీ అక్కడ దొరికేవి. నాకొక ప్రాపంచిక తాత్విక దృక్పథం ఏర్పడక ముందే నాకొక విషయం అర్థమైంది. అదేమిటంటే కుటుంబంలోగాని, సమాజంలోగానీ ఉంటున్న పరిస్థితి అట్లా ఉండకూడదు. అది మారాలి. ముఖ్యంగా స్త్రీల పరిస్థితి. నా దృష్టిలో అత్యంత అవమానకరమైనవి, హీనమైనవి పెళ్ళిచూపులు, పెళ్ళి బేరాలు. నా ప్రయాణం అక్కడనుంచే మొదలైంది. సైన్స్, సీరియస్ పాఠాలు నాకు పడక. నేను మా నాన్న ఆశ ప్రకారం డాక్టర్ని కాలేకపోయాను. గ్రాడ్యుయేట్‌ని కాగలిగాను. తరువాత ఇంగ్లీషు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు రచనా స్ఫూర్తినిచ్చింది కుటుంబరావుగారు, రంగనాయకమ్మలు. తెలుగులో నన్ను ప్రభావితం చేసిన అంశాలు చాలా ఉన్నాయి. కథారచన ఒక్కటే ‘మై కప్ ఆఫ్ టీ’ అని తెలుసుకోలేకపోయిన నేను ముందు మూడు, నాలుగు నవలలు వ్రాశాను. అందులో ‘గొడుగు’ స్త్రీల లైంగికాసక్తి, వివాహేతర సంబంధాలు, వాటిని స్త్రీలు ఏ విధంగా తీసుకొంటారు, పురుషులు కొంతమంది ఎట్లా తీసుకొంటారనే అంశం మీద వ్రాశాను. ఆ నవల ఎమెస్కో వాళ్ళు డైరెక్ట్‌గా వేసినప్పుడు రాని స్పందన తిరిగి ఆహ్వానం మాసపత్రికలో వేసినప్పుడు వచ్చింది. ఇంతవరకు మూడు కథా సంపుటాలు ప్రచురించాను. రాసిన కాలం ఎక్కువ. రచనలు తక్కువ. తొంభై తొమ్మిది శాతం స్త్రీ కేంద్రక రచనలే.
* రచనలు చేయడం మీ అభిరుచా, జీవన విధానమా లేక భావోద్వేగమా… రచనలతో సంబంధం లేకుండా ఉండగలరా?
రచన నా అభిరుచి, ఊపిరి పీల్చే కిటికీ… అన్నీ… అయితే అది నా కెరియర్ మాత్రం కాదు. భావోద్వేగం లేనిదే రచన రాదని నేననుకొంటాను. పఠనం, రచన వీటితో సంబంధం తెగిపోతే ఇంక జీవితం ఆగిపోయినట్లే లెక్క.
* మీ కథావస్తువు, శిల్పాల వెనుక ఉండే ఆలోచనా స్రవంతిని వివరిస్తారా.
వస్తువే శిల్పాన్ని ఎంచుకొంటుందని నేననుకొంటాను. ఒక్కొక్క కథని తగ్గ శిల్పంలో చెబితేనీ ప్రతిభావంతం కారాదు. చెప్పదలచిన విషయాన్ని ఎఫెక్టివ్‌గా చెప్పలేం. సాదాగా చెప్పినా, ‘చెక్కి’నా కథనంలో స్పాంటేనిటీ ఉండాలి. కష్టపడి వ్రాసినట్లుకాక ధారలాగా సాగాలి. వస్తుశిల్పాలకి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదీ డామినెంట్‌గా ఉండకూడదు. ఆ సమతౌల్యం మనకి కొందరు రచయితలు వ్రాసిన కొన్ని కథల్లో కనిపిస్తుంది. కథని అర్థం చేసుకోవడానికి మూడు నాలుగుసార్లు చదవాలంటే కష్టం. వస్తువు ప్రయోజనకరమైంది కానప్పుడు శిల్ప చమత్కృతి వ్యర్థ క్రియ. అట్లాగే మంచి వస్తువును ఎక్కువమందికి అర్థంకాని శిల్ప ప్రయోగాలతో పాఠకుల్ని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు… కథ పాఠకులకి అర్థం కావాలనేదే నా అభిమతం.
* నేడు వస్తున్న కథ గురించి, అట్లాగే విప్లవ కథ గురించి మీ అంచనా…
గడచిన రెండు దశాబ్దాలలో మంచి కథలు, కథా సంకలనాలు గణనీయంగా వచ్చాయి. పత్రికలు కొన్ని సీరియస్ కథల్ని ప్రోత్సహించాయి. అన్ని ప్రాంతాల నుంచీ అన్ని మాండలికాలలో ఎన్నదగ్గ కథలొచ్చాయి. ఇప్పుడు కొంచెం వేగం తగ్గిందేమోననిపిస్తోంది. రచనని సీరియస్‌గా తీసుకొని ఇంకా కొంతమంది యువ రచయితలు బాగా వ్రాస్తున్నారు. పెరిగిన జీవనవేగం, తగ్గుతున్న జీవన నాణ్యత, ప్రపంచీకరణ దుష్ఫలితాలు, అంతరించిపోతున్న వృత్తులు, పలచబడుతున్న మానవ సంబంధాలు, అవి కాపాడుకోవడానికి చేస్తున్న వివిధ ప్రయత్నాలు, నానాటికీ పెరుగుతున్న సామాజిక అంతరాలు, కులాలు, మతాలు, అభద్రతా భావాలు… ఇట్లా సంక్లిష్టమైపోతున్న జీవితాన్ని చిత్రిస్తున్న కథలు వస్తున్నాయి. వస్తు శిల్పాలు రెండింటిలోనూ ఎంతో అధిగమనం చూస్తున్నాం. అట్లాగే విప్లవకథ కూడా శిల్పం అవసరాన్నిప్పుడు గుర్తించింది. శిల్పరీత్యా, వస్తువురీత్యా కూడా కడచిన ఇరవై ఏళ్ళుగా చాలా గొప్పగా చెప్పిన కథలు వచ్చాయి. కథల పోటీలు కొన్నింటిలో కూడా మంచి కథ వ్రాయాలనే నిజాయితీతో కూడిన ప్రయత్నం కనబడింది. రచయితల దృష్టి వైశాల్యము, ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపధ్య విశ్లేషణా, లోతూ కూడా పెరిగాయి.
* ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న సాహిత్యంపై మీ అంచనా…
ప్రపంచీకరణ ఒక అనివార్య పరిణామం. దీని మీద ‘అయ్యో అయ్యో’ అనుకోవడం కూడా అనివార్యమే. మొదట్లో అటుగానే స్పందిస్తాం. కానీ ఇప్పుడు ఆ దశని దాటి ప్రపంచీకరణ దుష్ఫలితాలను ఎదుర్కొనే ప్రత్యామ్నాయాలను గురించి ఆలోచించాలి. సంస్కృతులను కాపాడుకోవడం అంటే భోగిమంటలు, గంగిరెద్దులను ప్రవేశపెట్టడం కాదు. కోల్పోతున్న విలువల్ని రక్షించుకోవాలి. పెరుగుతున్న అంతరాలను పూడ్చగలగాలి. వ్యక్తి కేంద్రంగా మారుతున్న సంస్కృతిని సమష్టి వైపు మరల్చ గలగాలి. రచయితలు ఆ వైపు నుంచి ప్రపంచీకరణను చూడాలి. ఇప్పటిదాకా, ‘ఇలా ఉంది,’ అని చెప్పాం. ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుందో సూచించే సాహిత్యం రావాలి. విక్టిమ్ నుంచి సర్వైవర్ దిశగా వెళ్ళే ప్రయత్నానికి రచయిత దారి సూచించాలి. ఉదాహరణకి ఖదీర్‌బాబు న్యూ బాంబే టైలర్స్ కథ, ఇటీవల వచ్చిన సన్నపురెడ్డి నవల తోలుబొమ్మలు అలాంటి రచనలలో కొన్ని.
* అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యం…
అస్తిత్వ ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేశాయనడంలో సందేహం లేదు. స్త్రీవాద సాహిత్యం పురుష కేంద్రంగా సాగుతున్న సంస్కృతిని, శతాబ్దాల తరబడి రాజ్యమేలుతున్న భావజాలాన్నీ నిలదీసి ప్రశ్నించింది. హక్కుల్ని తిరిగి తీసుకొనే సఫల ప్రయత్నం చేసింది. స్త్రీలు స్త్రీలుగా పుట్టినందుకు, శాంతి క్షమ వంటి గుణాలు కలిగి ఉన్నందుకు గర్వపడేలా ఆలోచనలను రేకెత్తించింది. స్త్రీల శరీర ధర్మాల గురించి, స్త్రీత్వం గురించి ప్రచారంలో ఉన్న భ్రాంతి, భావనలను (మిత్స్) చెదగొట్టింది స్త్రీవాద రచన. అందువల్ల సమాజంలో అద్భుతమైన మార్పు వచ్చిందనే భ్రమ అయితే లేదుగానీ, స్త్రీలు మాట్లాడగలుగుతున్నారు. రచయితలు, ఉపన్యాసకులు (సినిమావారు తప్ప) స్త్రీలను కించపరచే తిట్లను, భాషను వాడడానికి పూర్వంలా ముందుకు రావడం లేదు. అలాగే శక్తిమంతమైన దళితవాద రచనలు వచ్చాయి. మైనారిటీ, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో కూడ వచ్చాయి. ఎంత సాహిత్యం వచ్చినా ఉద్యమాలు రాజకీయంగా విజయవంతం అయితే తప్ప ఆశించిన ప్రయోజనాలు రావు. మాట్లాడగల వారికి మాట్లాడే అవకాశాలు లేకుండా చెయ్యడం, మాట్లాడని వాళ్ళకి అలంకార ప్రాతినిధ్యాల్నివ్వడం, వెనక నుంచి కథ నడపడం, యథాశక్తి కొనసాగించడానికి వీలైనంత సహకరించడం స్త్రీల విషయంలో జరుగుతున్నది. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్య్రం కల కొద్దిమంది స్త్రీలను పక్కనపెడితే ఇంకా నిరక్షరాస్యులైన గ్రామీణ స్త్రీలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే స్త్రీలు… వీరికి ఏ వాదమూ దగ్గరకు తీసుకొనే స్తోమత లేదు. కులము, ఆర్థికము, వేళ్ళు పాతుకు పోయిన నమ్మకాలు వీళ్ళ జీవితాలను నిర్దేశిస్తున్నాయి. దళిత, మైనారిటీ మహిళల నుంచి విస్తృతంగా సాహిత్యం రావాలి. రావాలంటే విద్యావకాశాలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ఖరీదు పెరిగి, అది సాంతం వ్యాపారంగా మారింది. లింగ, వర్గ, కుల వివక్షల్ని ఎదుర్కొంటూ జీవన పోరాటం చేసే స్థితి మారలేదు. దళిత, మైనారిటీ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు తగ్గనపుడు ఎంత సాహిత్యం వచ్చినా ప్రయోజనం ఉండదు. ఉద్యమ సాహిత్యాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి.
* గత దశాబ్దంలో వచ్చిన సాహిత్యంలో వస్తుశిల్పాలు పరిణామం పరిణతి…
ఈ ప్రశ్నకీ పైన చెప్పాను.
* ఒకప్పుడు వెయ్యి పేజీల గోదాన్, వార్ అండ్ పీస్ వంటి పుస్తకాలు చదివాం. మారుతున్న కాలంలో జనం చదివే అలవాట్లు
అప్పుడు టి.వి., ఇంటర్నెట్, పిల్లల్ని ఎంసెట్‌కి రుద్దడం, చాలా చాలా కొనుక్కోవడం, మనని మనం విజయవంతంగా అమ్ముకోవడం, నిచ్చెనలెక్కడం ఎలా ఆలోచించడం వంటి కార్యక్రమాలు లేవు. ఇప్పుడున్నంత peer pressure కూడా లేదు. ఇప్పుడు మనం ఈ ముఖ్యమైన పనులతో పాటు వెయ్యేసి పేజీల పుస్తకాలు చదవలేం కదా! ‘వార్ అండ్ పీస్’ దాకా ఎందుకు, ఇప్పుడు విక్రమ్ సేట్ మళ్ళీ ఒక ‘సూటబుల్ బోయ్’ వ్రాస్తే ఏ పబ్లిషరూ వెయ్యడు. మనమూ అంత ఓపిక చూపించలేం… క్లుప్తత కోరుకోవడంలో తప్పు లేదు. అలా అని చెప్పదలచినదంతా చెప్పుకోలేకపోవడమూ ఇబ్బందే. కనుక చెప్పదలుచుకొన్న విషయాన్ని క్లుప్తంగా పఠనీయంగా, అందంగా ఎట్లా చెప్పాలనే అంశం మీద రచయితలు కృషి చెయ్యాలి. ఒకప్పటిలాగా ఇప్పుడు విజ్ఞానం కోసం కాలక్షేపం కోసం పుస్తకాలొక్కటే సాధనం కాదు కదా! సాహిత్యానికి మనోరంజనం ఒక్కటే ధ్యేయం కాదు. సాంఘిక ప్రయోజనం ఉండాలని కోరుకొనేటప్పుడు, ఆ సాహిత్యం క్లుప్తంగా గాఢంగా మనసుని స్పృశించేదిగా ఉండాలి. ఇప్పటి అవగాహనతో తిరిగి పాత పెద్ద పుస్తకాలు చదివితే కొంత superfluity కనబడవచ్చు.
* ప్రశ్నించటం నేరమౌతున్న కాలంలో రచయితల కర్తవ్యం ఏమిటి?
స్వయంగా ప్రశ్నించలేని వాళ్ళు కూడా ప్రశ్నించేవారికి మద్దతు ఇవ్వాలి. ప్రశ్నించకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నించకూడదు.
* రచయితకి సామాజిక చైతన్యం ఎంత అవసరం?
స్వయంగా సామాజిక, రాజకీయ చైతన్యం లేనివాళ్ళు ఎవరికి మాత్రం ఏం చెప్పగలరు? సామాజిక చైతన్యమే మామూలు వ్యక్తిలోని రచయితను వెలికి తీస్తుంది.

తెలుగు నేల పైన ప్రపంచీకరణ దుష్ఫలితాలు చాలానే వున్నాయి. ప్రపంచ బ్యాంకు సంప్రదాయక పంటలనుండి వ్యాపార పంటలకు రైతులను దారి మళ్ళించింది. మోనసాంటో లాంటి కంపెనీలు అధిక ధరలకు టర్మినేటర్ టెక్నాలజీ తో చేసిన పనికిమాలిన విత్తనాలను అట్టగట్టాయి. వడ్డీలకు అప్పులు తెచ్చిన పంటలు వేసిన రైతులు చేతులు కాల్చుకున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ప్రపంచబ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో భూగరిష్ట చట్టాలను తీసి వేయమని బ్లాక్ మెయిల్ రాజకీయాలను కూడా నడుపుతుంది. రామోజీ రావు ఈనాడు కధనాలతో చాలానే వంతపాడారు. కుర్చీ లో కూర్చునది ఎవరైనా ( చంద్రబాబు నాయుడైనా , రాజశేఖర రెడ్డైనా) ఆడిచేది మాత్రం అమెరికా ఏజెంటు ప్రపంచ బ్యాంకే. మనం సాధించిన ప్రగతి ఏదంటే 70,000 కోట్ల రూపాయల అప్పులు.
కథల్లో క్లుప్తత అవసరమును బాగా గుర్తుచేశారు. క్లుప్తమైన కవితల వెనకున్న భావం అందాలంటే ఈ పోటీప్రపంచంలోని మానవుడు ఏంచేయాలి?
ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు.
రెండో భాగం కోసం ఎదురుచూస్తూ..