- పి. సత్యవతి
![]() |
‘శిశు’ వంటి అత్యుత్తమ కథ వ్రాయలన్నా. ‘హజార్ చౌరాసి కా మా’ ‘అరగ్రేర్ అధికార్’ వంటి గొప్పనవలలు వ్రాయాలన్నా, ద్రోపది, శనీచరి వంటి గొప్ప నవలలు వ్రాయాలన్నా - సంబంధిత ప్రజలతో పరిచయం - వారి పట్ల సానుభూతి వుండడం ఒక్కటే చాలదు. |
వారితో ఆత్మీయ సంబంధం వుండాలి - ఆత్మక సంబంధం వుండాలి.- అటువంటి సంబంధం ఏర్పరుచుకోవడం రచనతో పాటు క్రియాశీలిగా వుండడం రచయితలందరికీ సాధ్యం కాదు. వీటన్నింటినీ సాధ్యం చేసుకోగలిగిన విశిష్ట రచయిత మహాశ్వేతా దేవి. ఆశయాలకీ ఆచరణకీ మధ్య అంతరాన్ని పూడ్చి వేయగల రచయిత్రి. ‘పది, విత్తనాలు’ వంటి కథలో ఆమె నాకు పరిచయం. ఆమె పరిశీలన, అవగాహన, విశ్లేషణ నైపుణ్యానికి నేను అబ్బురపడి ఆమె అభిమానిగా మారింది. ‘శిశు’ అనే కథ చదివాక, ఆ కథ నన్ను వెంటాడి – వేధించి బాధించింది. అక్ష్యరాస్యత లేకపోవడం, అజ్ఞానం, మూఢ నమ్మకాలు, దయలేని ప్రకృతి, నేరస్ధులుగా ముద్రవేయబడడం - ఒకటేమిటి, వారి జీవితం సమస్యల మయం - వారే ఆదివాసులు – ఆదివాసి జీవిత సంక్లిష్టతని మహాశ్వేతాదేవి తెలుసుకున్నట్లు ఎవరూ తెలుసుకోలేదేమో అనిపిస్తుంది.
వ్రాయడమే కాదు – ఆమె వారి అభివృద్ధి కోసం; వారి సంక్షేమం కోసం ఇప్పటికీ పనిచేస్తూన్నారు. వారితో మమేకమైపోయారు. ఎంతగా వారు ఆమెని తమలో కలుపుకున్నారంటే, (మాకీ సాడి) తల్లి చీరె ఆమెకిచ్చి వారు సత్కరించారు. ఈ చీరెని ఆదివాసీ అమ్మాయిల పెళ్ళిళ్ళల్లో వధువు తల్లికి యిస్తారు.
ఇది అందుకోవడం తన బాధ్యతని పెంచిందనీ – వారి అబివృద్ధికి యింకా చాలా చెయ్యాలని ఆవిడ అన్నారు. సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ, మెగసెస్సే – ఈ అవార్డులన్నింటికన్నా ఆమెని ఈ తల్లి చీరె ఎక్కవ సంతోషపెట్టింది.
ఇంతటి రచనా నైపుణ్యం – క్రియాశీలత, ఆమెకి అలవడటానికి కారణం లేకపోలేదు. ఆమె వ్యక్తిగా ఎదుగుతున్న కాలంలో భారతదేశంలో జరిగిన అనేక కీలకమైన సంఘటనలే అందుకు కారణం. 1926లో జన్మించిన మహాశ్వేతా దేవి పట్టభద్రురాలయ్యేనాటికి దేశంలో స్వాతంత్ర సమరం పతాక సన్నివేశంలో వుంది. ‘తేభాగ’ ఉద్యమం ఊపందుకుంటున్నది. మతకలహాలు – బెంగాల్ కరువు – వీటన్నిటినీ చూడడమే కాదు – వాటికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా.
అరవైయ్యో దశకం చివర్లో జరిగిన రైలు ఉద్యమాల గురించి వ్రాశారు. తరువాత వచ్చిన ‘ వసంత కాల మేఘ గర్జన’ యువమేధావులనెంతమందినో ఆకర్షించింది. అనేకమంది యువతీ యువకులు కళాశాలలు / యూనివర్సిటీలు వదిలి ఉద్యమంలో చేరారు. అయితే ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. అనేక మంది కార్యకర్తలు ఉద్యమంలో ప్రత్యక్ష పరోక్ష సంబంధం వున్నవారు జైలుపాలయారు. ఉత్సహ, ఉద్రిక్త, ఉద్విగ్నభరితమైన ఈ కాలంలోనే ఆమె ‘హజార్ చౌరాసికా మా’ ( 1084 నెంబరు వ్యక్తి తల్లి ) నవల వ్రాశారు.
అయితే ‘అరగ్రేర్ అధికార్ ‘ నవల వ్రాసి సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తరువాతే ఆమె భారతదేశంలో చాలామందికి తెలిశారు. రాంచీకి దక్షిణాన ఉన్న అరణ్య ప్రాంతాలలోని ముండా తెగల ప్రజలు – బిర్సా ముండా నాయకత్వాన బ్రిటిష్ అదికారులతోనూ, మిషనరీస్ తోను, స్ధానిక భూస్వాములతోనూ సల్పిన పోరుని ఈ నవల చాలా శక్తివంతంగా చిత్రించింది. ముండా పేరుతో ఒక అవార్డు నెలకొల్పి, దానిని ‘రాజీవ్ గాంధి’ కి యివ్వడం జరిగింది. మహాశ్వేతా దేవి ముఖ్యదృష్టి అంతా పీడిత ఆదివాసీ, దళిత బహు జనులగురించే – వారి జీవితంలోని భయంకరమైన దోపిడీ గురించే. ఆదివాసీ జీవితాలలో వుండే అన్ని ‘షేడ్స్ ‘ ని ఆవిడ చూపగలిగారు. హజార్ చౌరాసియా ఎంత గొప్ప నవలో ‘ద్రౌపది’ కూడా అంత మంచి కథ. రాజ్యహింస స్త్రీల పట్ల ఎంత వికృతంగా కౄరంగా వుంటుందో చూపించిన కథ. ‘శిశు’ అనే కథ నన్నెందుకు అంతగా వెంటాడుతుందో చెప్పడం అవసరం.
ఇది ‘లోహ్రి’ అనే ప్రదేశంలో జరిగినట్లు చెప్పే కథ. బొత్తిగా ‘చెలమ’ యింకిపోయిన చోటు. చెట్లన్నా ముడుచుకుని కుంచించుకుని పోయాయిక్కడ. మనుషులు చెట్లవలెనే ఎండిపోయి వుంటారు. మట్టి నెత్తురు రంగులో వుంటుంది. క్షమ పీడితులైన ఇక్కడి ప్రజలు అర్థనగ్నంగా, కళ్ళు పీక్కుపోయి, పొట్టలు వుబ్బిపోయి వికృతంగా వుంటారు. అక్కడ పంటలు పండవు. వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం నేల, పనిముట్లు యిచ్చినా, అక్కడి ప్రజలు వాటిని అమ్ముకుంటారే గానీ, వ్యవసాయం జోలికి పోరు. ప్రభుత్వం ఏటా వారికి కరువు రిలీఫ్ క్రింద ఆహార్య ధాన్యాలు వగైరాలు ఒక ఆఫీసర్ ద్వారా పంపిణీ చేస్తుంది. అలాంటి రిలీఫ్ క్యాంప్ కి ఆఫీసర్ గా నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న ‘సింగ్ ‘ వస్తాడు. అక్కడి ప్రజల్ని గురించి, ‘లోహ్రి’ గురించిన కథల్తోనూ, గాధల్తోనూ సింగ్ ని తక్కిన అధికార్లు భయపెడతారు. అసలు నివాస యోగ్యం కాని ప్రదేశం అని చెప్తారు. ఏమైనా అక్కడి వాళ్ళకి మేలు చెయ్యాలని సంకల్పించుకుంటాడతను.
‘లోహ్రి’ గురించిన ఒక స్థల పురాణం గూడా అతనికి తెలుస్తుంది. ఇక్కడ ఇనప ఖనిజం బాగా లభించేది. ప్రజలు దాన్ని తవ్వి తీసి ఇనప పనిముట్లు చేసేవారు. వాళ్ళంతా ‘ఆగరియా’ తెగకు చెందినవాళ్ళు. ‘ఆగరియా’ తెగ వాళ్ళంతా ‘అసుర’ జాతికి చెందిన వాళ్ళట. అంటే రాక్షసులన్నా మాట. వాళ్ళు అగ్నిని సేవించి అగ్ని వదిలి స్నానం చేసేవాళ్ళట. వాళ్ళ రాజు ‘లోగుండి’. ఇతనికి పదకొండుమంది సోదరులు. ఈ పన్నెండుమందికీ ఒక భార్య. భూమి లోపల వుండే అసురులు వీళ్ళని మాత్రమే ఇనుప ఖనిజం తవ్వుకోనిచ్చేవారు. ‘లోగుండి’ పరమ అహంభావి. తను సూర్యుడిన్నా శక్తిమంతుడ్నని విర్రవీగే వాడు.
సూర్యుడికి కోపం వచ్చి లోగుండినీ అతని తమ్ముళ్ళనీ రాజ్యాన్నీ కాల్చి బూడిద చేశాడు. ఆ సమయంలో అక్కడ లేనందున రాణి గారు బ్రతికిపోయారు. అయినా సూర్యశక్తి ఆమె శరీరాన్ని దహిస్తుంటే భరించలేక ఒక పశువుల కాపరి యింటికి పరిగెత్తి వాళ్ళ మజ్జిగ కుండలోకి దూకి శరీర తాపాన్ని తగ్గించుకుంది. అక్కడే ఒక చెట్టు క్రింద ‘లోగుండి’ కి వారసున్ని కన్నది. అతడే జ్వాలాముఖి. అతడు నోరు తెరిస్తే అగ్ని కురిసేది. అతడు పెద్దవాడై సూర్యుడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు ఉద్భవించిన వేడి – లోహ్రిభూమిని దగ్ధం చేసింది. జ్వాలాముఖి సూర్యూడికి శాపం పెట్టాడు. నువ్వు నీ భార్యతో నెలకొక్కసారే సుఖంగా వుండగలవని. సూర్యూడు మాత్రం తక్కువ వాడా – వెంటనే జ్వాలాముఖికి కూడా శాపం యిచ్చేశాడు. “ మీ అగరియా తెగవారు గొప్ప నైపుణ్యం కలవారే కావచ్చు. కానీ మీ సంపాదనంతా బూడిదై గాలికెగిరిపోతుంది” అన్నాడు. ఇప్పుడిక వాళ్ళు కులవృత్తిని పోగొట్టుకున్నారు. వాళ్ళిప్పుడు జ్వాలాముఖి ఓటమికి సంతాపం తెలుపుతున్నారు. అందుకోసం వ్యవసాయం చెయ్యరు. ఇనుప గనిని కాపలా కాసే లోహాసురుడు వాళ్ళకి ఇనుము యివ్వడు. బొగ్గుగనికి కాపలాగా వుండే ‘కోయిలాసుర’ వాళ్ళని బొగ్గు తవ్వనివ్వడు. అగ్నికి కాపలాగ వుండే ‘అగియాసుర్ ‘ వాళ్ళకి అగ్ని యివ్వడు. కానీ ఎప్పటికైనా వాళ్ళు శాపవిముక్తులు కాగలరని మంచి రోజులొస్తాయని నమ్ముతారు. సింగ్ అక్కడికి వచ్చే నాటికి పధ్నాలుగేళ్ళ క్రిందట – భారత ప్రభుత్వం ‘లోహ్రి’ లోని ఇనుప గనులను గురించి తెలుసుకోవడానికి ఒక భూగర్భ శాస్త్రజ్ఞులు బృందాన్ని పంపింది. ‘కువ’ గ్రామంలో అగరియా తెగవాళ్ళు ఇందుకు అభ్యంతరం చెప్పాదు. ఈ ప్రాంతపు పవిత్రతని పరాయి వాళ్లొచ్చి చెడగొట్టడాన్ని లోహాసుర, కోయిలాసుర, అగియాసుర్ అంగీకరించరన్నారు. కానీ ఈ బృందం డైనమైట్ తో అక్కడ కొండ ప్రాంతాన్ని పేల్చింది. దాంతో ఉగ్రులయిన కువ గ్రామపు అగరియాలు – ఈ బృంద సభ్యులందరినీ నరికి పారిపోయారు. దాదాపు వంద, నూటయాభై మంది అడవికి అదృశ్యమైపోయారు. ప్రభుత్వం వారి కోసం విపరీతంగా గాలిచింది. నెలరోజుల తర్వాత పోలీసులు ‘కువ’ గ్రామానికి నిప్పు పెట్టారు. అయినా కసి తీరక అక్కడ భూమిలో ఏమీ మొలకెత్తకూడదనే ఉద్దేశ్యంతో భూమిలో ఉప్పు చల్లిపోయారు. మిగిలిన అగరియా జాతుల మీద కూడా కక్ష సాధించారు. కానీ పారిపోయిన వారు దొరకలేదు. ప్రభుత్వం ఏటా పంపుతున్న తిండి గింజలు ఎవరో దొంగలిస్తున్నారు. దొంగిలించే వాళ్ళు పెద్ద వాళ్ళు కారు. వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు మానవసంతతి వాళ్ళు కాదు. ఎంతకాపలా కాసినా దొంగతనం జరుగుతూనే వుంది. ఈ దొంగతనాలు ఏ పిల్లలూ చేయడం లేదనీ, ఇక్కడి ప్రజలే అమ్ముకుంటున్నారని ఒక వాదన. ఈ వివారాలనీ బి.డి.వో సింగ్ కి చెప్పి – ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కోడానికి అతన్ని మానసికంగా సన్నద్దం చేస్తాడు.
ఆదివాసీలంటే వేణువు వూదుకుంటూ చెట్ల వెంటా కొండల వెంటా తిరుగుతారనీ, స్త్రీలు తలలో రంగు రంగుల పూలు తురుముకుని నృత్యం చేస్తూ పాడుతూ వుంటారనీ హిందీ వ్యాపార సినిమాలు చూసి వూహించుకున్న సింగ్ ఇక్కడి ఆదివాసీలని చూసి విస్మయం చెందుతాడు. వాళ్ళు పాడతారు కానీ ఏడుపిల్లా వుంటాయి ఆ పాటలు. ఇంక వాళ్ళ ఏడుపు ఎలా వుంటుందో. ఈసారి రిలీఫ్ క్యాంప్ భారీ ఎత్తున వుంది. ఎప్పటికన్నా ఎక్కువ ఆహార పదార్థాలున్నాయి. వాటిని జాగ్రత్తగా కావలి వేసి అర్హులకి అందించాలి. ఇక్కడి ప్రజల చేత తిరిగి వ్యవసాయం చేయించాలి. ఇట్లు ప్రభుత్వం ఇచ్చే తొరిపెంతో కాక వాళ్ళంతట వాళ్ళు సంపాందించుకునేలా చెయ్యాలని చాలా నిజాయితీతో అనుకుంటాడు సింగ. అతనికి సాయంగా ఓ పదిమంది అగరియా యువకులుంటారు. వాళ్ళు సింగ్ ని అమితంగా గౌరవిస్తూ, సాయం చేస్తూ వుంటారు.
ఒక రాత్రి దొంగలు రానే వచ్చారు. చిన్న చిన్న చేతులు బియ్యం – పప్పు సంచులు ఎత్తుకు పోతున్నాయి. సింగ్ కి మెలుకువ వచ్చి చూస్తే – అగరియా యువకులు టెంట్ ని మళ్ళీ బిగిస్తూ కనిపించారు. “అంటే వీళ్ళేనా దొంగలకి సాయం చేసేది. ఎంత ద్రోహం? అయినా దొంగల్ని పట్టుకు తీరాలనే పట్టుదలతో సింగ్ వాళ్ల వెంట అడవికి పడ్డాడు. పరిగెత్తాడు. దొంగలు కూడా పరిగెత్తి అలసిపోయి దాన్యం సంచులు ఒకచోట వుంచి, వాటి చూట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. సింగ్ వారిని సమీపించాడు. వాళ్ళు దాన్యం సంచులు వదిలి సింగ్ చుట్టూ నిలబడ్డారు, అతని బయటికి పోనీయకుండా. ఇంక అతను వారినించీ తప్పించుకోలేడు. అప్పుడతనికి వాళ్ళ ఆకారాలు స్పష్టంగా కనపడ్డాయి. వాళ్ళంతా నగ్నంగా వున్నారు. వాళ్ళకి పొడవాటి జుత్తు వుంది. అందులో ఒకడి జుత్తు సాంతం నెరిసిపోయింది. ఆడపిల్లలకి ఎండిపోయి వేలాడే రొమ్ములు! జుత్తు నెరిసిన వాడు సింగ్ కి మరింత దగ్గరగా వచ్చాడు. ఎండిపోయి కుంగిపోయి వేలాడే తన అవయువాన్ని సింగ్ కి చూపిస్తున్నాడు.
వీళ్ళెవరూ పిల్లలు కారు. పెద్దవాళ్ళే. వున్నట్టుండి వాళ్ళు “మేం పిల్లలం కాము. మేం కువ గ్రామానికి చెందిన అగరియాలం.” అంటూ పిచ్చిగా అరవడం మొదలు పెట్టారు.
“మేం వాళ్ళని నరికివేసి పారిపోయొచ్చాం. మమ్మల్ని పోలీసులు, సైన్యం – ఎవరూ పట్టుకోలేరు. మాకు మా అగరియాలే సాయం చేస్తారు. పస్తులుండి కృంగి కృశించి చాలా మంది చనిపోయారు. మేం పథ్నాలుగుమందిమే బ్రతికి వున్నాం.”
“దగ్గరకి రాకండి” అని గొణిగాడు సింగ్ . అతని తల తిరిగిపోతోంది.
వాళ్ళు మరింత దగ్గరగా వచ్చి వాళ్ళ అవయవాల్ని సింగ్ కి తాకిస్తున్నారు.
‘మేం పురుషులం. వంద్యులం – మా స్త్రీలు, గొడ్రాళ్ళు, మేం మళ్ళీ మామూలు మనుషుల సైజుకి పెరగాలి. అందుకే ఆహారం దొంగలిస్తున్నాం.’
వాళ్ళు చెప్పిందే నిజమైతే ఇదేం నాగరికత . దేశం బాగు కోసం రచించే ఈ ప్రణాళికల ప్రయోజనం ఏమిటి? అనుకున్నాడు సింగ్ . వాళ్ళు అయిదడుగుల తొమ్మిందంగుళాల దేహాన్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు. తన శరీరపు సహజమైన ఎదుగుదలని వాళ్ళు ద్వేషిస్తున్నారు. సింగ్ కి అర్థం అయింది. తనకి తానే ఇప్పుడు మరణ శిక్ష విధించుకున్నాడు. ఈ అగరియాల క్షీణదశకి కారణమయ్యే వారిలో తానూ ఒకడే. సింగ్ కి గొంతు పెగలలేదు. అతని కన్నీళ్ళు ధారలు కట్టాయి.
ఈ కథ చదివాక మహాశ్వేత కథలు ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా చదవకపోతే మనలో ఏదో లోపం వున్నట్లే అనిపించింది.
వర్గ కుల అణచివేతలతో పాటు స్త్రీలపై అంతర్లీనంగా సాగే అణచివేతను కూడా ఆమె తన కథల్లో చూపిస్తారు. శనీచరి, గిరిబాల, రుడాలీ వంటి కథలు అలాంటివే. కందమూలాలు లేని - సరైన బట్టలు లేకుండా పల్లెటూళ్ళలో బ్రతికే ఆదివాసీ స్త్రీలని కలకత్తాలో ఇటుక ఆముళ్ళ పని యిప్పించి మంచి జీవితం యిప్పిస్తామని భ్రమపెట్టి వాళ్ళని వేశ్యావృత్తిలో దింపే గోధుమ త్రాచుల్లాంటి వాళ్ళు – వాళ్ళని నమ్మే అమాయక యువతులు – తిరిగి ఇంటికి చేరితే వాళ్ళని ఇంటి వారు వెలివేయడం. ఇది ఒక శనీచరి కథే కాదు. చాలా మంది ‘శనీచరి’ ల కథ.
ఈ కథని ఇలా ముగుస్తుంది రచయిత్రి –
‘ఎంత కాలం అయితే పుట్టిన గడ్డ శనీచరికి తిండీ గుడ్డా యివ్వదో - అంత కాలం దాకా శనీచరి తన చేతిని ఆడిస్తూ చూపుడువేలుని చూపిస్తున్న నిశ్చల చిత్రం మన కళ్ళెదుట వుంటూనే వుంటుంది. ‘
మహాశ్వేతా దేవి సృష్టించిన మరో శనీచరి బ్రతుకు తెరువు కోసం చనిపోయిన వారి కోసం ఏడవడం అలవాటు చేసుకుని ‘రుడాలి’ గా మారిపోయింది.
ఇంకా చాలా మంది స్త్రీలు పురుషులతో పాటు అన్ని రకాల పీడనలని ఎదుర్కొంటూ అదనంగా పురుష పెత్తనాన్ని ఎదుర్కొంటారు. బెంగాలీ భాషలోని అన్ని రకాల యాసల్ని మహాశ్వేత చాలా బాగా తన రచనల్లో ఉపయోగిస్తారు. జీవితంలో అన్ని వర్ణాలనీ అన్ని ఛాయల్ని పట్టుకుంటారు.
వాసిలోనే కాక రాసిలోనూ ఎక్కువైన మహాశ్వేత దాదాపు వంద పుస్తకాలు వ్రాశారు. వాటన్నింటినీ ఉదహరించలేము. కనుక కొన్నింటిని మాత్రమే ప్రస్తావించటం కుదిరింది.
దాదాపు డజనుకు పైగా ఆదివాసీ సంక్షేమ సంఘాలలో సంబంధం వున్న ఈమె, తన డెభై నాలుగో ఏట – ఆరోగ్యం సరిగ్గా లేని పరిస్థితుల్లో కూడా డీనోటిఫైడ్ గిరిజన తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధిని గూర్చి తీవ్రంగా పరిశోధిస్తున్నారు. వెనుకబడిన పురూరియా వంటి ప్రాంత గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
బిర్సాముండా వీరోచిత పోరాటం గురించి నవల వ్రాసినట్లే మన్యం పోరాటం గురించి కూడా నవల వ్రాయాలని అనుకుంటున్నారు.
మాటకీ - చేతకీ; ఆశయానికీ ఆచరణకీ వంతెన కట్టగలిగిన రచయితని అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. ఆమె గురించి మరింత తెలుసుకోలేకపోతేనే ఆశ్చర్యం.
