- కౌముది

బిడ్డా!
చానాదినాలయింది
కండ్లల్లో కన్పిత్తానవు
నిన్ను సూడాలని మనసంతా పీకుతంది
ఏ పని చేద్దామన్నా మనసు సుదురాయించడంలేదు
అప్పుడా ఇప్పుడా నాలుగైదేండ్లయింది
నిన్ను సూడకుంట ఒక గడియ కూడా ఎప్పుడుండలే
కూలికిపోయినా నాలికి పోయినా
కొడుకు ఏమయ్యిండోనని ఆదరబాదరగా ఇంటికచ్చేదాన్ని
నిన్ను చూడంగనే చేసినకట్టం మర్సిపొయ్యి మనసంత నిమ్మలమయ్యేది
పాలుపెరుగు పరమాన్నాలు తినిపించి నిన్ను పెంచకపోవచ్చు
నాపానం పోసి కడుపంటకట్టుకోని నిన్ను పెంచుకున్న
పుట్టెడుబుద్ధులున్నోనివి
మా కట్టం సుఖం ఇస్తారిత్తవనుకున్న
మా కాల్లు రెక్కలు దగ్గరవడుతే యింత గంజిపోత్తవనుకున్న
మేం చస్తే
మా బొందలల్ల ఇంత మన్నేసి మా దినవారాలు జేత్తవనుకున్న
మమ్ముల ఆగంజేసి అడివిల కలుస్తవనుకోలే
కొడుకా కొడుకా అని కంటికంటికి పుట్టెడేడుస్తాన్న
తల్లీపిల్లల్ని ఏరుజేసినోల్లకు నా ఉసురుతల్గకపోదు
నువ్ ఇల్లిడిసిన దగ్గర్నుంచి
పోలీసుల దూం ధాం చూడాలే
మీ అయ్యను పట్టుకపోయి చావచావగొట్టిండ్లు
తమ్మున్ని పట్టుకపొయ్యి జైల్లబెట్టిండ్లు
నన్నయితే ముసల్దనైనా చూడకుంట ఎక్కడబడితే అక్కడగొట్టిండ్లు
వాల్లు కొట్టిన దెబ్బలకు సక్కగ ఊపిరి తియనిత్తలేదు
’నీ కొడుకును ఎక్కడకి పంపినవే లంజ’ అని
నోటికి ఎంతత్తె అంత తిట్టిండ్లు
వాల్ల నోల్లల్ల పురుగులు వడ
నా అసొంటి తల్లి వాల్లకు లేదేమో
నీతీని సోపతి జేసినోల్లను పట్టుకపొయ్యి కాల్చిసంపిండ్రు
వొయసొయిసు పోరగాండ్లు ఎవ్వలు ఊర్లుంటలేరు.
ఊరు ఊరంత ఇడిసిపెట్టిన ఇల్లోతుగున్నది
మన ఊరేగాదు ఈడ ఏ వూరు సక్కగలేదు
పండగల్లేవు పబ్బాల్లేవు
పానాలు అరిసేతుల పెట్టుక బరుకుడైతాంది
నీవెట్ల బతుకుతానవో నాకైతే తెల్వదు
అసలు నువ్ చచ్చినవో బతికినవో తెల్వకుంటున్నది
బతికుంటే మాత్రం యాదివెట్టుకో
‘కాన్రాని కొడుకు కోసం
కండ్లల్ల ఊపిరిపోసుకోని
ఈ అవ్వ ఎదురుసూత్తాంద’ని

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)