మస్కమస్కనే ఉన్నది. ఇంకా పూరా తెల్లారలేదు. ఎదురొచ్చే మనిషి నిద్ద కనిపించడం లేదు. ఆడోల్లు వాకిల్లూడ్చి సానిపి జల్లుతున్నరు. మొగోల్లు ఎడ్ల కొట్టాలల్ల హెర్రె… హెర్రె… అని ఎడ్లను అదిలించుకుంట పెండకసువు తీస్తున్నరు. ఇంకొంతమందేమో అరక గట్టనీకె పగ్గాలు, బారల్లు గుంట్కునొగలను సగసేసుకుంటున్నరు. మంచినీల్ల కడ్వలు పట్టుకొని ఆడోల్లు ఒక్కరొక్కరే మంచినీల్ల బాయికి పోవట్టిండ్రు.


బంటు పెంటయ్య బంటులాఠీని పట్టుకొని ఆగమాగం ఉర్కి రావట్టిండు. “ఏం పానం పోయిందని అంతగానం ఉర్కొస్తున్నవ్ సీకట్ల రాల్లు తాకి కిందపడవే పెద్దప్ప,'’ అని మందలించింది మాదిగ దున్న నర్సమ్మ. సర్పంచుకు జప్పున జెప్పి పోవాలమ్మా అనుకుంటనే అదే ఉర్కు మీద నడ్సిండు. సర్పంచు బాలప్ప లేసినాడమ్మ లేవకుంటే జెర లేపు బిడ్డ. ‘బలె జెప్పుతున్నవే. విత్తనాలు ఎదుకువెట్టె దినాలు ఎట్ల పండుకుంటరె,’ అన్నది సర్పంచు పెండ్లం. ‘అవ్వమ్మా… నీ మొగడు ఉర్కిఉర్కి అర్క గొడుతున్నడు…’ అని చెప్పుకుంటనె తాను యిడ్పులలుకుడు పనిలో మునిగిపోయింది. ‘ఇంత నస్కులొచ్చినా మనిషి జిక్కకపాయె గదప్పా,’ అనుకుంట జెర పిల్లల పంపియ్యమ్మా దొర అగెత్రానా రమ్మన్నడని చెప్పు. నేనొచ్చినిలవడిపోయినని జెప్పు కొడుక. ఇంకా పెద్దమాతర్లకు, పనిబాట కులపెద్దలకు సెవు మీదేసేదున్నది?’ అనుకుంట నెత్తికి గట్టిన రుమాలిని సరిజేసుకుంట ఎల్లిపోయిండు బంటు పెంటప్ప.
* * *
ఇంకా పొద్దు కూడా పొడ్వలేదు. బంటు పెంటప్ప ఇట్ల సెవు మీదేసిండో లేదో కులం పెద్దలంతా అట్ల జేరిండ్రు. సర్పంచుతో సహ దొర ఇంటికి. పొద్దు బారెడెక్కింది. నడినెత్తి మీదికొచ్చింది. దొర అడ్డలుంగిని ఒక చేతిలవట్టుకొని బైటికొచ్చిండు. ఈల్లంత ముందే చెప్పుకున్నట్లు కృష్ణరెడ్డి పటేలు, శ్రీనివాస్‌రావ్ పంతులు, నర్సింహ్మారెడ్డి, అనంతరెడ్డి పటేలు, ఒక్క దగ్గర జేరిండ్రు.
ఈల్ల రాకతోని సబ్బండకులాల మ్యాతర్లు నెత్తి రుమాల్లు తీసి సంకల వెట్టుకొన్నరు. చేతులతో పబ్బతివట్టి కొరెంటు ఒకరు దండం దొర… దండం దొర… దండం దొర… అన్నరు. వీల్లకు ఎదురుగా ఐదారడుగుల దూరంలో గాయిదోల్లు ఏసిన కుర్చీలో దొరలు, పటేండ్లు కూసున్నరు.
నరేందర్‌రెడ్డి సెప్పుడు సుర్వు జేసిండు.’అరె సాయిగా, ఎల్లుగా, నాగా జెర బాగా యినుండి. రాతిరి జరిగిన సంగతి జెపుత.’
రాతిరి నాకు ఊరడమ్మ కలలొచ్చి, ‘ఒరే ఊరినె నాశనం జేస్త కొడుకా, ఊరికి గత్తర జేస్త. ఊరు మంచిగుండాలంటే, నేను మంచిగుండాలె లేకుంటే ఊరును అల్లకొల్లాలం జేస్త. నాకు ఆహుతి గావాలె. నా యక్కజెల్లెండ్లు మైసమ్మ, పోషమ్మ, రక్తమైశమ్మ, బంగారమ్మ, ఈదెమ్మ, ఇంతమంది ఆకలిగొని కూసున్నరు. ఈల్లందర్నీ సముదాయించుకోని ఇంతదాక ఓపిక వట్టిపిచ్చిన కొడుకా. ఈ ఏడు ఊరడమ్మ పండుగ ఏడు యాటలతోని జేస్తవా లేదా?’ అని, ‘లేకుంటే నీ ఇంట్ల అందర్నీ తట్టు వోపిచ్చి నర్లి నర్లి సంపిస్త,’ అని రాతిరంత నన్ను అమ్మ నిదురవోనియ్యలేదురా. ఎట్ల జేతం. ఆ ఏర్పులదాన్ని, భైండ్లోన్ని, ఆ పోతురాజు సాయిగాన్ని, పిలిపిచ్చి, అడిగి ఈ ఏడు- ఎట్లనో ఒగల్యాక పండుగజేసి అమ్మగారికి ఆహుతి జేసి ఒప్పిపిత్తం. ముందు ఆ ఏర్పులదాన్ని పిలిపిచ్చి అడుగుదము అది ఏమంటదో- ఎప్పుడు వెట్టుకుందమంటదో. జర విలుసుకరా పోరా జెప్పున వోయి రాపో, అని జీతంగాన్ని పంపించిండు.
అయితాయే పటేల. పోయొస్త జెర్ర దూరం నడిసి, ఇసంత పెండేలొల్ల ఇంటికాడికి వొచ్చి ఒరేయి పటేలుకు రాతి ఊరడమ్మ నాకు కలలొచ్చి పండుగజేసి జాతర నింపుతవా లేదా అంటాని అన్నదంటరప్ప. ఈ ఏడు ఊరడమ్మ పండుగ జేసెటట్లున్నరు. నన్ను బైండ్ల సాయమ్మ ఇంటికి వోయి తోల్కరమ్మన్నరు. నేనందుకే పోతున్న అని సోపతిగాల్లకు జెప్పిండు సంబంరంగా జీతగాడు.
నన్నెందుకు రమ్మంటున్నడప్పా! ఎన్నల్లేంది? ఎందుకు రమ్మన్నడో నీకు తెల్వది గిట్టనా? పో! ఆనందడువు ఊకెనె ఊగులాడుకుంట వొచ్చినవా? ఎందుకో నీకు ఎర్కుంటది జెర్ర జెప్పు. పటేలేమి నిన్ను నముములకోని మింగడు సెప్తెనే ఒస్త లేకుంటే లేదు. పో నాకు ఇక్కడ పని వున్నది.
నాకేమెర్కమ్మ అని సంగతులు నాకు జెప్తడా? ఏమొ ఊరడమ్మ కలలొచ్చిందంట అతనికి జాతర నింపాలెనంట నిన్ను పిల్సుకరమ్మన్నడు దామ్మ గిదే సంగతో ఇంకేమన్న సంగతో అని జెప్పి వెంటకు మల్లిండు జీతంగాడు.
ఓ అన్ని ఎరుకుండి గూడ నాకేమెర్క అంటున్నావు ఎర్రి పిలగాని లెక్క. గిట్ల పొందజెప్తె అయిపాయె గదా. నడువు పోదం. అరెయి ఎల్లుగా! తమ్మి, రాంసెంద్రి అన్నను దోలుకోని ఆడికి పటేలు ఇంటికి రాండి… ఏమొ మాట్లాడుతరంట.
నమస్తే పటేలా! శాన దినాలకు మతి ఒస్తినా పటేలా మీకు! అన్నది సాయమ్మ.
ఆ… ఏం సాయమ్మ, ఎన్నడు మర్సినము నిన్ను. తాతల నాటి నుంచి మీరు పండుగ జేస్కుంటనే వొస్తున్నరు గదా. మా తాతలున్నపుడు, మీ యవ్వనో ఎవ్వరో జేసిండ్రంట. మా నాయనొల్ల లెక్కల మీ వొల్లే జేసిండ్రు. ఇప్పుడు మనలెక్క నడుస్తనే ఉన్నది. ఇగ ఎప్పుడు మరిసినట్లు నిన్ను? దా కూసో మీ అన్నదమ్ములంత ఒచ్చిండ్రా? పిల్సుకున్నవా? అడిగిండు పటేలు… ఆ పిల్సుకొన్న పటేలా! ఇగో ఒచ్చిండ్రు. తమ్ముడు, అన్న ఒచ్చిండ్రు జెప్పింది సాయమ్మ.
అగో తమ్ముడు. అన్న ఒస్తే సరిపాయెనా? పాల్యోడు, అవతలోడు రాలేరా? పిలవలేవా నీవు? నీ ఎదురువాల్యోడు యాడున్నడు? అడిగిండు పటేలు.
దాందేమి పటేలా పిలిపిచ్చే సంగతి అంతదాక ఉంటే నీవే పిలిపియ్యి, దానికేమి సంశయము లేదు. ఆల్లు గూడ రాని నీవె పిలిపియ్యి పటేలా?
అరేయి! ఆ పాలిబైండ్లోన్ని గూడ రమ్మనుపోరా!
ఆ… వొచ్చిన దొర… అన్నడు ఎనకాల గొంగడి కప్పుకొని నిలవడ్డ బైండ్ల అంతప్ప.
ఏం…రా! అంతిగా… యాడ గనవడవు. మీరంత ఒక్కటే లెక్కలున్నరా? లేక ఎవరి లెక్కవాల్లదా. ముందు అడిగి తెల్సుకునాలె గదా. ఎందుకైన మంచిది. అడిగిండు పటేలు. ఆ… పటేలా నీకు తెల్వంది ఏమున్నది. అందరమొక్కటే. ఏం పండుగ జేస్కున్న ఆల్లిద్దరు మేమిద్దరం సెరిసగం లెక్క దీస్కోని పంచుకుంటన్నం. అప్పొచ్చినా, అందానొచ్చినా ఏమోయి రామయ్య ఏమనవు?
నన్నడుగతవేమి నీవు లేని మాట గిట్ట అంటున్నవా? అవు పటేలా సమానమే ఉన్నం అన్నడు రామయ్య.
అట్లయితే మునములకు ఒస్తున్న. సూడుండి ఇగో నాకైతే నాతిరీ ఒక కలంపం అయింది. ఆ కలంపం కాయం జెయ్యాలని నేను అనుకున్న.
సూడుండి ఊల్ల పెద్దలు అందరొచ్చిండ్రు మ్యాతర్లందరొచ్చిండ్రు. ఎర్పులది ఒచ్చింది పోతురాజు ఒచ్చిండు అందరం మాట్లాడుకోని ఒగ ఒప్పందానికి రావాలె. ‘రడమ్మ పండగ’ విషయంల జాతర నింపాలనుకున్నం మరి ఎవరి సందేహం, ఎవరి సమాధానం ఎట్లనో అందరు సెప్పాలె ఏమంటరు? అందరు జెప్పేది ఏమున్నది. ఊరి విషయము అందరు మాట్లాడుకునాలె అందరం తలా ఇన్ని పైసలేస్కోని పండుగ మాత్రం బాగా జరిపియ్యాలె. సుట్టు పల్లెలన్ని యాట జేస్తున్నయి. మనం గూడ ఈయేడు తప్పకుండా జరుపుదమని నా ఇష్టపూర్వకంగా జెప్తున్నా. నా బర్లల్లది ఒగ దుడ్డెను ఊరడమ్మ పేరు మీద ఇడుస్తున్నా. అన్నడు పటేలు.
అవు. పంతులన్న మాట మంచిగున్నది నేను గూడ అంతే అనుకున్నా నాత గూడ ఒగ పోతుదుడ్డె ఉన్నది. ఊరడమ్మ పేరు మీదనే నొగటి ఇస్త. అన్నడు పట్వారి.
ఆల్లయి రొండు ఆయే గదప్ప. నాదొగ పోతు ఊరడమ్మ పేరు మీద అన్నడు నర్సింహ్మారెడ్డి.
మాలమాదిగోల్లు, తెలుగోల్లు, గొల్లోల్లు, మంగలోల్లు, సాలోల్లు, ఈడిగోల్లు, సాకలోల్లు, బెస్తోల్లు, ఇంటికి మానెడు బియ్యం, కులం పెద్దలు, యాటనియ్యాలే అనుకున్నరు.
ఆ… సరే మంచి పనికి ఎవ్వరి ఆటెంకము ఉండరాదు. పంతులుది ఒగటి, దొర దొగటి, సబ్బండోల్లయి ఐదు. అన్ని ఏడు యాటలైతున్నయి గదా, రేపు సుక్రారమున్నది. ఊరడమ్మ గుడి ముందలికి తెచ్చి దుడ్డెలనన్ని పట్టుకొచ్చి డప్పుల మీద తెచ్చి బండారు ఏసి ఇడువాలె. అరెయి డప్పులోల్లు, రేపు పొద్దుగాలనే తొమ్మిది గంటలకల్ల ఊరడమ్మ కాడికి రావాలె. అంత అయిపోయి నట్టే గదా. ఇగ ఇంకేమున్నది ఏర్పలమ్మదే కట్నం సంగతి మాట్లాడితే ఆ పని గూడ అయిపోతది. ఏమంటవు చెప్పమ్మా ఏర్పులమ్మ.
ఇంకేమున్నది. ఆ పని గూడ అయిపోని అడుగమ్మ అన్నరు మిగతా పెద్దలు.
సెప్పు. సాయమ్మ ఏమి సంగతి నీ కట్నం జెప్పు- ఏమేమి గావాలె. ఎట్లెట్ల సంగతి నీది తెగినంకా, పోతురాజు సాయిగాన్ని అడుగుతము. సెప్పు సెప్పు అన్నడు పటేలు.
సూడు పటేలా, నేను పూర మొదటి లెక్క అడుగుదునా? లేక అనామతుల అడుగాలెనా? అన్నది ఏర్పుల సాయమ్మ. ఇది పండుగ. ఊరికి పెద్ద పండుగ. అనామతుల ఎందుకడుగుతవు మంచిగనే అడుగు అన్నడు పంతులు. పోయిన ముందటేడు మన ఊర్ల ఊరడమ్మ పండుగ జేస్తె నన్ను పిల్వకుండ పక్కూరు ఏర్పులామె మెనుదెచ్చి పండుగ జేస్తిరి. ఇప్పుడేమొ నన్ను కట్నమడగమంటున్నరు. నా మాన్నెం సంగతి ఎటూ తేల్పకొస్తిరి. అని మొదలుపెట్టింది సాయమ్మ.
కాదు సాయమ్మ నీవు అన్ని మాట్లాడకు మొదలు నీవు ఈ ఊరికి ఏర్పుదానిగ వుంటవా లేదా? చెప్పు గంతె అన్ని పంతులు. ఉంట పంతులు కాని నా భూమి సంగతి చెప్పుండి. ఎనుకటి మా యత్త ఏర్పుల తనం జేసుకుంట మూడెకురాల భూమి సంపాయించిందంట. ఇప్పుడు అందుట్ల మీ కాక కొడుకు కాస్తులున్నడు. మా అత్త భూమిని మీ కాక కొడుకు దగ్గరకెల్లి నా కిప్పియ్యాలె దొర అన్నది సాయమ్మ.
ఇంత ఎదురుగా ముఖం పట్టుకొని భూమి నీ కాక కొడుకు కబ్జల ఉన్నదని ఇంతమంది ముదల అడుగతదనుకోలేదు. దొరకు మస్తు కోపమొచ్చింది. అందరి ముదు జోరు జారి మాట్లాడకూడదని అని నిబాయించిండు దొర. ప్రశాంతాన్ని సూపిస్తూ… ఈమెకు మాట్లాడ సందిస్తె సాలు. ఎనకటియన్ని తొవ్వి తీస్తది. ఏరే మనిషికి మాట్లాడ సందియ్యది సిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. పెద్దోల్లతోని మాట్లడే తరీక కూడ లేకుంటె ఎట్లమ్మా… అన్నడు దొర. మిగితావాల్లకు మీరే జెప్పండి అన్నట్లు చూసిండు. ఏందయ్య నరేందర్ దీనికి ఏమి యిమ్మతు ఈల్ల భూమిల మీవాడుకాస్తున్నడంటుంది ఈ ఏర్పుల దానికి భూమెక్కడిది? ఎవరిచ్చిండ్రు దానికున్న అనుమానాన్ని కూడా ఇంత గట్టిగా మాట్లాడ్తదా?… అయిన ఇంత అలుసునివ్వడం నీదే తప్పు దొర అన్నడు… కృష్ణారెడ్డి పటేల్.
ఈ బయిండ్లోల్లది గింతెనయా… ఎదురుగ నిలవెట్టి మాట్లాడితేనే. నెత్తికెక్కుతరు యాడ వెట్టాలెనో ఆడనె ఉంచాల. ఇంతింత రమ్మంటే ఇల్లంత పర్సుకున్నరంట. ఏదో ఊరడమ్మ పండుగల ఏర్పుతనం జెయ్యమంటె భూముల గూర్చి మాట్లాడుతరు. భూమి ఆగానికొచ్చిందనుకుంటున్నరా, గాలిలోచ్చిందనుకుంటున్నరా… అడ్డమైనోల్లకు భూములు కావాల్సి వస్తున్నది.
ఈ ఏర్పులామెను ఎక్కువ తిరితే పోయినేడురాను అని చెప్పినట్ల ఈ ఏడు కూడా రానన్ని చెప్పగల్ల. సల్లగ మాట్లాడి బుదగరిచ్చి ఈ ఏడు ఊరడమ్మకు చేసి రంగమెక్కియ్యాల… అని ప్రశాంతంగా మాట్లాడడం సురువు జేసిండ్రు.
సాయమ్మ అస్సలు నిజం నీకు జెప్పాలెనా? ఎనుకటికి మీ యత్తకు భూమి లేదు. అది ఎవ్వరి దగ్గర దర జెయ్యలేదు. అట్ల జేస్తె గీస్తె కర్ణం పటేలు దగ్గర ఆ కాయితాలుంటయి. మా తాత, తండ్రి తర్వాత నేనే గద కర్ణంతనంను జూస్తున్న. ఉంటే నేను జెప్పనా నిన్ను కుద్దు పిల్సి జెప్త. ఏందమ్మ నీవు మా ఊరు ఏర్పలదానివి. నీకు జెయ్యమా, ఊరంత జేస్తం. పక్కూర్లకు జేస్తం. నీకు జెయ్యనీకే ఏం బాద నాకు…? ఆనాడు మీ యత్తకు భూమి లేదు… మరిప్పుడు నీకు లేదు. మన ఊరి లెక్కల ఏర్పులతనం జేస్తె భూమి ఇయ్యినికే వీల్లేదు. మీ యత్తకెట్లుంటది అది ఇప్పుడు నీవెట్లడుగుతవు. నీది అసలు తరీకనే కాదు అన్నడు పంతులు. లేదు పంతులు మా యత్త భూమి జెయ్యంగ ఈ ఊరు పెద్దలు జూసిండ్రు, మా యత్త పన్నుగట్టినట్టు రసీదులున్నయి.
మా యత్త ఏర్పులతనం జేసినంక ఇంగ నేనే అయిన. నాకు ఏర్పుల గురువు మా అత్తనె. ఆమె వృత్తికి, ఆస్తికి నేనే వారసురాలును.
నీవు మీ యత్త భూమిగాలంటున్నవు. మల్ల ఏర్పులతనం జేస్త అంటున్నవు. ఈ వూరిదాన్ని గదా అని అడుగుతున్నవు… అట్లెట్లనే అన్నడు… పంతులు.
దొరా నేను ఏర్పులతనం జెయ్యనంట లేను. నా భూమిని నాకిస్తె అందుట్ల పండె నాల్గిత్తులు నా పిల్లల పొట్టకైతయి. మా అత్త బూమిని నాకిస్తె నేను పండుగ జేస్త… అన్నది సాయమ్మ.
సూడే… అనవోయి… దొక గప్పున ఆగిపోయిండు. సూడమ్మ నోరు తెరిస్తె భూమి, భూమి, భూమి అని పలువరిస్తున్నవు ఇగ నీ ఎదురుగనే జెప్పుతున్న. మీ యత్తది భూమి లేదు. నీకు భూమి లేదు. నీ యిస్టముంటే ఏర్పులతనం జెయ్యి. లేకుంటే లేదు. అంతనుకుంటె కూలిలెక్కల పండుగజెయ్యి. నీవురంగమెక్కితె కూలి లెక్కన జెయ్యి. గంతె. గాని తాకట్లు పెట్టుకొనేది లేదు. నీవు రానంటే పండుగ ఆగుతదా? దేశం గొడ్డుపోయిందా? కోటపల్లి ఏర్పుల్దాన్నో… చింతకుంట ఏర్పులదాన్నో తీసుకొస్తం. అయ్యెటి పండుగ ఎట్లనన్న అయితది. బంగారుకత్తి అంటాని మెడ గోసుకుంటమా…? నీవు మేము ఎదురెదురుగా పంచాదెందుకు. రేపే ఏర్పుల్దాన్ని తోలుకొస్తము అని అన్నరు. నేను కూలి లెక్కన ఎట్ల… నేను కూలిదాన్ని ఎట్ల? ఇన్ని దినాలు ఊరి ఆడ్విల్ల అని నన్ను కూలిదాన్ని అంటరా… హా… కూలిదాన్ని అంటరా… హా… కూలిదాన్ని అంటరా… అదెట్ల…? నేనీ ఊరిదాన్ని గానా? నా మాయిముంత ఇక్కడ లేదా, నేనీడ పుట్టలేనా? కూలిదాన్ని నేనెందుకు గావాలె? మా యత్త భూమి నాది. నాకు గదే గావాలె.
ఈ ఊరంత కలిసే కదా నన్ను జోగికిడిసిండ్రు. తాతల నాటి నుండి మా యింటి ఆడ్విల్లలను ఏర్పులతనంల ఏస్తున్నరు గదా. మా పేరు మీదున్న భూమిని నాకియ్యిమంటె కూలిదాన్ని అంటరు.
ఇన్ని దినాలు కూలిదాన్ని అయి ఈ పండుగలు జేసిన్నా?
అని అన్నదే గాని సాయమ్మకు తన జీవితపు సంఘటనలు మనాదిలకు వచ్చినవి. ఒక్కొక్కటే నిమరేసుకుంటున్నది. తన కన్నబిడ్డలను పెంచుట్ల, సదివించుట్ల, పెద్ద బిడ్డ పెండ్లి జేసుట్ల పడ్డ తిప్పలు పగోల్లకు కూడ రాకూడదనుకున్నది. కడుపులున్న నిప్పుల కాగు పగిలిపోయినంతగా సాయమ్మకు కోపం, ఆవేదన తన్నుకొస్తున్నది. ఇంతకుముందు మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నది.
దొరలు పటేండ్లు మాట్లాడిన మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉంటున్నందుకు, ఎంత హీనమైన మనుషులు వీల్లు అనుకున్నది. ఇంతకుమందు దొరలు అని మర్యాదిచ్చింది. నన్ను జెగినికేసినోల్లు నా బాగోగులు జూడరా… అనుకున్నది అమాయకంగా. ఇప్పుడు వాల్లో పురుగుల్లా కనిపిస్తున్నరు సాయమ్మకు.
ఇంతసేపు మాట్లాడకుండ ఉగ్గుపట్టిన సాయమ్మ… నాలుగడుగులు ముందుకు నడ్సి దొరల మొఖాలనన్నింటిన్ని తేరిపార జూస్తున్నది. కూలి లెక్కల జెస్తదా…? వేరే ఊరు ఏర్పులామెను తీసుకొచ్చుకొండి అంటదా… ఈ రొండిట్ల ఏదో ఒకటి చెపుతది లే… అని అందరూ సప్పుడుదాక ఎదురు చూస్తున్నరు.
పనిబాటోల్లు, దొరలు ఒక దగ్గరున్నపుడు ఆవరించిన నిశ్శబ్దం కారుచీకట్లను కమ్మింది. ఏమయితదో… పని బాటోల్లకు… పాల్లుపోకుండా ఉన్నది. అందరు మాత్రం బైండ్ల సాయమ్మనే జూస్తున్నరు. దొరా… మీరు నాకిచ్చె కూలి మీ బిడ్డకిస్త జోగుకిడ్వుండి. పండుగల రంగమెక్కమనుండ్రి… సూస్త, అని సాయమ్మ దొర ముందున్న బల్లను పిడికిలి బిగించి దన్నుమని గుద్దింది. ఊరును కమ్మేసిన కారుచీకట్లు పగిలి తెప్పున తెల్లారినంత ఎలుగయింది.
ఒకరి ముఖాలు ఇంకొకరికి స్పష్టంగా కనిపిస్తున్నయి. సాయమ్మది ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నది. దొర నోరు కండ్లు ఎల్లవెట్టండు కర్ణం పంతులు, పటేళ్ళు నోర్లు తెర్సిండ్రు, కండ్లు ఎల్లవెట్టిండ్రు. నోర్ల తడి ఆరిపోయింది. ఎంతసేపయిందో నోటి నుండి మాటరాక వాల్లకే తెల్వకొచ్చింది.
ఇగ సూస్త సూస్త బైండ్ల సాయమ్మ పోయి దొరదో, పటేలుదో, పంతులుదో ఎవరిది గల్లవట్టి గుంజుతదో ఎవరికి తెల్వకొచ్చింది.
ఎక్కడనో ఉప్పెనలో ఇరిగిపడే చేట్లసప్పుడు, గాలిలో నుండి అందరి చెవులకు శరీరాలకు స్పర్శిస్తున్నది. సెవు గూచిలు పగిలె ఉరుములు సప్పుడు.
సాయమ్మ ముందుకు అడుగేసింది పటేండ్లకు ఎదురుగా కదులుతున్నది… పటేండ్లు అక్కడి నుండి పక్కకు జర్గుదం అనే సోయి లేనంతగా బీరిపోయి సూస్తున్నరు.
కడకున్న మ్యాతర్లు, పోయి అమ్మా… అమ్మా… అమ్మా ఇగ ఆగమ్మ సాయమ్మ అని ఆమెను నిలబెట్టడానికి సేతులడ్డం పెట్టిండ్రు. ఒక మ్యాతరిని ఎదల సెయ్యేసి నూకిత ఎల్లొంకల పడ్డడు… సెయ్యెత్తు మనిషిని ఒక చేతితో నూకితె పడ్డడంటే ఈమె మాములు సాయమ్మ గాదు. కచ్చితంగా ఏర్పుల సాయమ్మకు ఊరడమ్మ ఊనింది. ఈ పనంతా ఊరడమ్మ తల్లిదే అని అందరు నిద్ద అయిండ్రు. పటేండ్లు సేతులు జోడించిండ్రు అప్రయత్నంగనే. నరేందర్‌రెడ్డి దొరకు కలలో వచ్చి హెచ్చరించిన ఊరడమ్మ తల్లి గాలి ఇప్పటినుండే సురువయింది అనుకున్నరు. అందరొక్కసారి సాయమ్మ అన్నదమ్ములొంక వేడుకున్నట్లు జూసిండ్రు. పోతురాజు సాయిప్పను ముందటేసిండ్రు. అయిదు మందన్నదమ్ములు తలా ఒకొంక పట్టుకొని ఎంటకు గుంజుకరానికే జూసిండ్రు… ఆల్ల నొక్కసారి ఊరి గుడ్లురిమి సూసింది…
* * *
అందట్ల అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డ సాయమ్మ. ఆడుతపాడుత రాణిలాగ జూసుకున్నది. బైయిండ్లోల్ల కుటుంబం. మాదిగోల్లు, మాలోల్లు, తెలుగోల్లు, ఈడిగొల్లు, కుమ్మరోల్లు, గొల్లోల్లు, కమ్మరోల్లు, సాకలోల్ల పిల్లలతో ఆడుకుంట ఊరంత కలియదిర్గేది. తినవెట్టనికె తల్లికి దొర్కెది కాదు. అన్నదమ్ములు పనిబాటోల్ల కులాల కేరిల్ల దేవులాడి… పట్టితెచ్చి… బుదగరిచ్చి… బుక్కలు వెట్టేది తల్లి. కులం, కుటుంబం ఆడ్విల్లలకొచ్చే వారసత్వంగా జోగుకిడిసిండ్రు. మ్యానమామ ఇడిపించుకున్నడు. జోగుకిడిసిన ఆడిది ‘ఊరుమ్మడి పెండ్లం’ అనేది ఊరులో కుదురలేదు. ఆజానుబావులైన అన్నదమ్ములు, ఎనిమిదెకరాల భూమి ఎవుసం, సెల్లెని అల్లారుముద్దుగా పెంచిన తీరు. పిబాట కులాలోల్లకంతా పనోల్లే ఈ బైండ్లోల్లు. సెల్లె, అక్క వదిన, పెద్దమ్మ, మరదలు అనే వాయివరుసతో నడిసిండ్రు. ‘ఊరు ఆడ్విల్ల’గా కొనసాగుతూ వచ్చింది సాయమ్మ. యసొచ్చి మనసుపడి తెలగొల్ల సెంద్రప్పను ప్రేమించింది. అతనికే పెండ్లి జేసిండ్రు తల్లిదండ్రి. సంసారం, పిల్లలు, ఆల్ల సదువులు సజావుగానే నడ్సినయి. కాలం దీరి ఒకనాడు సెంద్రప్ప కాలం జేసిండు. బైండ్ల్లోల్ల ఇంట్లకెల్లి పీనుగను తీసుకపోయి తెలుగోల్ల ఇంట్ల వండవెట్టిండ్రు. సాయమ్మ, పిల్లలు మొత్తుకుంట ఏడ్చుకుంట తెలుగోల్ల ఇంటికి పోయి పీనుగ మీద పడి ఏడుస్తున్నరు. రెండు మూడుగంటలు ఏడ్సింరు. తెలుగోల్లు కూడా అయ్యో బిడ్డా అని సాయమ్మను పట్టుకొని ఏడ్సిండ్రు. జెర్రసేపటికి ఏమయిందో ఎవరికి తెలువది. బంతనొచ్చి తెలుగోల్లకు ఏదో చెవుల జెప్పిండో లేదో అందరి ముఖాలు మారుతూ వచ్చినయి. దిక్కు తోచని ఇదిలో ఏడుస్తు సాయమ్మ ఇవేవి పట్టించుకుంట లేదు. తల్లి, వదిన ఓదారుస్తున్న ఆగడం లేదు. పిల్లలను కనిపెట్టుకొనుంటున్నరు… అన్నలు, తమ్ముడు.
తెలుగోల్ల కులపెద్దొచ్చి, సాయమ్మ… నీవు ఇంట్లకొచ్చి పీనుగు మీద పడి ఏడ్వకమ్మ బయటపోయి ఏడ్వుపో… అన్నడు. మొగడుపోయిన ఆవేదన అగాదానికి… కుల పెద్ద కొట్టిన పెద్దగోతి పక్కపక్కల జేరినయి. బైండ్ల ఆడామె అయినందుకు అంతవరకు తెలువని అంటరానితనం పీనుగకాడొచ్చేటాల్లకు అతని పెండ్లం అతని దగ్గర కూసోని ఎడ్వకుంటె ఇంకాడ ఏడుస్తది. మీకేమన్న నెత్తి ఉండే మాట్లాడుతున్నరా…? అంత కులం ఎక్కువనుకున్నోడు ఆమెను ప్రేమించి పెండ్లెందుకు జేసుకున్నడు. ముగ్గురు పిల్లల సంతానం అయినంకా సచ్చినప్పుడు పీనుగ ద్గరకే వచ్చిందా అంటు అన్నడు మాదిగ పెద్దమాతరి నాగప్ప. కాదప్పానీవు మ్యాతరివే నేను మా కులం మ్యాతరినే. ఇద్దరం పనోల్లమే. ఇప్పుడు కొత్తగా జెప్పుకునేది ఏమున్నది…? మరి… మరి… అని ఊర్ల కర్ణం పటేలు జెప్పినప్పుడు ఇనాల్సి వస్తది. కుల మాతర్లు మాట్లాడుతునే ఉన్నరు. తెలుగోళ్ళు పోయి సాయమ్మను బయటపోయి ఏడ్వమ్మ అని ఇంక జెర్ర గట్టిగనే జెప్పిండ్రు.
పీనుగ దగ్గర సాయమ్మ ఏడిస్తె అంటయితదని ఊరంతా పాకింది. సాయమ్మను ఏడ్వనియకొచ్చిండ్రని తెల్సి మాదిగ మాల, బైండ్ల పడుసుపోరలంత ఉర్కొచ్చిండ్రు. ‘ఎవ్వడాడు ఏడ్వనియ్యని కొడకు’ అని తెలగొల్ల వాకిట్ల నిండిండ్రు.
పీనుగ కాడ లొల్లులు జెయగూడదని పిల్లలకు నచ్చజెప్పి ఆపిండ్రు కులం మ్యాతర్లు.
‘ఇంట్లకెల్లి ఎల్లిపొండి బయట కూర్చొని ఏడ్వుండి,’ అని జెప్సింతె కూడా అక్కడ పడుండె లత్కోరుతనమెందుకు. నడువు నడువ్ సాయమ్మ పీనుగను తీసుకొని మన కేరీలకు పోదం అన్నరు సాయమ్మకు నచ్చజెప్పుతూ… మాదిగాడోల్లు ‘పట్టు పట్టుండ్రి పీనుగను’ అని మాదిగ బైయిండ్ల మొగోల్లు పంజలు మీదికి ఎగజెక్కి నెత్తి రుమాల్లు గుంజి కట్టుకున్నరు. గట్టెట్ల తీసుకపోతరు. అతని ఈ కులంల పుట్టిండు. ఈ కులం కంపురం కడ్తది. కాడి మోస్తది. బొంద వెడ్తది. బతికున్నప్పుడు ఆయప్ప మాటెన్నడు కులం తీసెయ్యలేదు మరి సచ్చినప్పుడు కులం మన్ను జెయ్యాలే. తండ్రి తలగోరువట్టాలే. అన్నరు… తెలుగొల్ల పెద్దలు. పెండ్ల ముండంగా తండ్రి తలగోరు ఎట్ల వడ్తడప్పా… మీ మాట మీదికెల్లయినా పెండ్లం పిల్లలు ఉండంగా తండ్రి వస్తడా… అని మాదిగోల్లకు తెలుగోల్లకు వాదం పెరుగుతున్నది… ఏందిరా…! వాల్లతో మాట్లాడేది. మనమంత ఎక్కువోల్లం వాల్ల తక్కువోల్లు ఆమె చేసుకున్న పెండ్లం కాదు. ఉంచుకున్నది మాత్రమే. నడువ్ నడువుండ్రి ఇక్కడి నుండి అని ఓ పెద్ద గుపొచ్చింది సైన్యం లెక్కిన. మాదిగ పోరగల్లకు ఎదురుగ నిలవడ్డరు. ఇదంత జూసిన సాయమ్మ నా ఒక్కదానికోసం మావోల్ల నెత్తులు పల్గుడెందుకు….. ‘ఈ పీనుగొద్దు మీ కులమొద్దు. నడువు నడువుండి తమ్మి ఒక్కరు గూడ ఇక్కడ నోరిప్పడానికి ఈల్లేదు. ఆల్లు పీనుగను ఇయ్యకుంటే మనే, నన్ను తలగోరు వట్టియ్యకుంటే మనే. నన్ను ఏడ్వనియ్యకుంటే మనే నడువండి,’ అని సాయమ్మ అందరి నడిమికొచ్చి చేతులు జోడించి మరీ చెప్పింది. చెప్పినవోలె అందరూ సల్లవడ్డరు మాదిగబైండ్ల ఆడోల్లు మాత్రం గొల్లున ఏడ్సిండ్రు. తెలుగోల్ల ఇంటికెల్లి జాతర కదిలినట్లు కదిలి మాలకెరీలకెల్లి, మాదిగ కెరీలకెల్లి బైండ్లొల్ల ఇంటికి జేరిండ్రు.
సాయమ్మ ఇంట్ల గూటికెదురుగా పీనుగులెక్క బట్టలతో జేసి ఒక ఆకారాన్ని పండవెట్టిండ్రు. నెత్తి కాడ దీపం ముట్టిచ్చిండ్రు. రాతిరికి కథ జెప్పిపిచ్చిండ్రు. మాదిగోల్లు డప్పులు తెచ్చిండ్రు. బాగరోల్లు బొందదొవ్విండ్రు. పీనుగును మాదిగోల్ల బొందలగడ్డల సమాది జేసిండ్రు. ఉత్త పీనుగును కరాగ సావు జేసిండ్రు బైండ్లోల్లు అనుకుంటరు ఊరంతా.
* * *
‘బిడ్డ’… ఇప్పటికే గండాలల్లున్నవు ఏమంట జోగుకిడ్సినమో నీవు సెరల వడ్తివి. ఇంకా సెరలవడుడెందుకు అని సాయమ్మ తండ్రి అనుకున్నడు. కోలకట్టెవట్టుకొని వణుక్కుంట వణుక్కుంటొచ్చి బిడ్డను నెత్తి మీదికెల్లి నిమిరిండు. ఊసిపోయిన సిఖను ముడేసిండు. ముఖానికి సల్లనీల్లు కొట్టిండు. బండారు బొట్టువెట్టిండు. ‘సెల్లెను తోలుకపొండి కొడుక’ అని కొడుకులకు జెప్పిండు రామప్ప. ఆజానుబావుడైన తమ్ముడు ఎల్లప్ప అక్కను ఎత్తుకొని భుజం మీద మోసుకొని ఇంటికి పోతున్నడు. ముఖం మీద సల్లనీల్లు పడ్డయిగాని మనసు కాలుతూనే ఉన్నది. కడుపు మండుతున్నది. సాయమ్మ కండ్లల్ల ఉరుములు కనిపిస్తున్నయి. ఇంగులం మీద నడుస్తున్న సివంగిలాగ కనిపిస్తున్నది. తల్లికోడి ఎగిరి పొడ్వనీక సిద్దంగున్నట్లున్న వాటం కోసం జూస్తున్నది. మీరు కూలివెట్టి పండుగ నెట్ల జేస్తరో సూస్త. కొడుకుల్లార… నా భూములకెల్లి జరుగకపోతే ఊరి సుట్టు ముమ్ముల పొలివడ్త… అప్పుడే ఈ ఊరికి బర్కతుంటది.
ఒక్కసారి దొర పటేల్ల, పంతులు ప్రాణాలు లేసొచ్చినయి అరిచేతులున్న ప్రాణాలు కుదుటవడ్డయి.
ఇగ ఊరు మాతర్లొంక మల్లిండ్రు.
ఏం… రా… అద్దున బైండ్లది మా ముందు బల్లగుద్ది కానూను మాట్లాడుతదా? అదట్ల మాట్లాడితే మీరంత సూతారం జూస్తున్నర్రా…
మీరు మొగోల్లు కాదురా…? గాజులు తొడుక్కున్నార్రా నీయమ్మ… పెండ్లం… లంజకొడుకుల్లారా… అని కోపంతో ఊగిపోతున్నడు దొర.
అంతట్లనే… రెడ్డిగారు మీరిప్పుడు కోపంజెస్తె ఏం లాభం లేదు. ఇప్పుడాల్లనని ఏం ఫాయిద లేదు. జర్గబోయో పండుగ గూర్చి ఆలోచించాలె అని కర్ణం పంతులు, కోమటి నాయిరామణ సావుకారి చెప్పిండ్రు దొరకు. మీరంత ఎల్లిపొండని మ్యాతర్లను సైగ జేసిండు సావుకారి. అద్దున బయిండ్లది బల్లగుద్దతదా? అని మల్ల మల్ల అంటాడేందోయ్ దొర. బల్ల ఊకెనే గుద్దిందా? మూమడుగనీకెనె కదా అనుకున్నరు, మాదిగోల్లు నలుగురు గల్సినచోట.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)